హోమ్ › రోజువారీ బైబిల్ పఠనాలు › అక్టోబర్ 2026 › 18 అక్టోబర్
కాథలిక్ కాలెండర్
రోజువారీ బైబిల్ పఠనాలు (కాథలిక్) — 18 అక్టోబర్, 2026
ఆదివారం · సామాన్య కాలం 29వ వారం
పండుగలు మరియు పరిశుద్ధులు
సామాన్య కాలం 29వ ఆదివారం
ఆదివారం · ఆరాధన రంగు: ఆకుపచ్చ
ఈరోజు పఠనాలు
మొదటి పఠనం
1యెహోవా తాను అభిషేకించిన కోరెషును గురించి ఈ విధంగా చెబుతున్నాడు. “అతని పక్షంగా రాజ్యాలను జయించడానికి నేను అతని కుడిచేతిని పట్టుకున్నాను. నేను రాజుల నడికట్లు విప్పుతాను. ద్వారాలు అతని ఎదుట తెరచి ఉండేలా తలుపులు తీస్తాను. 4నేను నీకు తెలియకపోయినా నా సేవకుడు యాకోబు కోసం, నేను ఎన్నుకున్న ఇశ్రాయేలు కోసం నేను నిన్ను పేరుతో పిలిచాను. నీకు బిరుదులిచ్చాను. 5నేను యెహోవాను, మరి ఏ దేవుడూ లేడు. నేను తప్ప ఏ దేవుడూ లేడు. 6తూర్పు నుండి పడమటి వరకూ నేను తప్ప ఏ దేవుడూ లేడని మనుషులు తెలుసుకోనేలా నువ్వు నన్ను ఎరుగకపోయినా నిన్ను సిద్ధం చేశాను. నేనే యెహోవాను. నేను తప్ప మరి ఏ దేవుడూ లేడు.
ప్రతిస్పందన కీర్తన
1యెహోవాకు ఒక కొత్త పాట పాడండి, ప్రపంచమంతా యెహోవాకు పాడండి. 3రాజ్యాల్లో ఆయన గొప్పదనాన్ని తెలియచేయండి, ప్రపంచ దేశాల్లో ఆయన అద్భుతాలను వివరించండి. 4యెహోవా గొప్పవాడు. ఆయన్ని మెండుగా ప్రస్తుతించాలి. దేవుళ్ళందరికంటె ఎక్కువగా ఆయనపై భయభక్తులు నిలపాలి. 5జాతుల దేవుళ్ళంతా వట్టి విగ్రహాలే. అయితే ఆకాశాలను చేసింది యెహోవా. 7ప్రపంచంలోని ప్రజా సమూహాలన్నీ యెహోవాకు చెల్లించండి. మహిమ, బలం యెహోవాకు చెల్లించండి. 8యెహోవా నామానికి తగిన గొప్పదనం ఆయనకు చెల్లించండి. అర్పణతో ఆయన ఆవరణాల్లోకి రండి. 9పవిత్రాలంకారాలతో యెహోవా ఎదుట సాగిలపడి మొక్కండి. ప్రపంచమంతా ఆయన ఎదుట వణకండి. 10యెహోవా పరిపాలిస్తున్నాడు. లోకం స్థిరంగా ఉంది. అది కదలదు. ఆయన ప్రజలకు న్యాయంగా తీర్పు తీరుస్తాడు అని రాజ్యాల్లో చెప్పండి.
రెండవ పఠనం
1తండ్రి అయిన దేవునిలోనూ ప్రభు యేసు క్రీస్తులోనూ ఉన్న తెస్సలోనిక సంఘానికి పౌలు, సిల్వాను, తిమోతి రాస్తున్న సంగతులు. కృపా శాంతీ మీకు కలుగు గాక! 2మీ అందరి కోసం దేవునికి ఎప్పుడూ మా ప్రార్థనల్లో కృతజ్ఞతలు చెబుతూ మీ కోసం ప్రార్ధిస్తూ ఉన్నాం. 3విశ్వాసంతో కూడిన మీ పనినీ, ప్రేమతో కూడిన మీ ప్రయాసనూ, మన ప్రభు యేసు క్రీస్తులో ఆశాభావం వల్ల కలిగిన మీ సహనాన్నీ మన తండ్రి అయిన దేవుని సమక్షంలో మేము ఎప్పుడూ జ్ఞాపకం చేసుకుంటున్నాం. 4దేవుడు ప్రేమించిన సోదరులారా, దేవుడు మిమ్మల్ని తన ప్రజలుగా ఎంపిక చేసుకున్నాడని మాకు తెలుసు గనక ఆయనకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. 5ఎందుకంటే మీకు మేము సువార్త ప్రకటించినప్పుడు అది కేవలం మాటతో మాత్రమే కాదు, పరిశుద్ధాత్మ మీ మధ్య శక్తివంతంగా పని చేశాడు కాబట్టి ఆయన మిమ్మల్ని ఎంపిక చేసుకున్నాడని మాకు తెలిసింది. తాను అలా చేస్తున్నానని మాకు పూర్తి నిశ్చయత కలిగించాడు. అదే విధంగా మీకు సహాయంగా ఉండాలని మేము మీ మధ్య ఎలా మాట్లాడామో, ఎలా ప్రవర్తించామో మీకు తెలుసు.
సువార్త
15అప్పుడు పరిసయ్యులు వెళ్ళి, ఆయనను ఆయన మాటల్లోనే ఏ విధంగా ఇరికించాలా అని ఆలోచించారు. 16వారు తమ అనుచరులను కొందరు హేరోదు మనుషులతో పాటు ఆయన దగ్గరికి పంపించారు. వారు ఆయనతో, “బోధకా, నీవు యథార్ధవంతుడివనీ, దేవుని మార్గం ఉన్నది ఉన్నట్టు బోధించేవాడివనీ, ఎవరినీ లెక్క చేయవనీ, ఎలాటి పక్షపాతం చూపవనీ మాకు తెలుసు. 17సీజరు చక్రవర్తికి పన్ను కట్టడం న్యాయమా? కాదా? ఈ విషయంలో నీ అభిప్రాయం మాతో చెప్పు” అని అడిగారు. 18యేసు వెంటనే వారి దుష్ట తలంపులు కనిపెట్టి, “కపటులారా, నన్నెందుకు పరిశోధిస్తున్నారు? 19ఏదీ, సుంకం నాణెం ఒకటి నాకు చూపించండి” అన్నాడు. వారు ఆయన దగ్గరికి ఒక దేనారం తీసుకొచ్చారు. 20ఆయన, “దీనిపై ఉన్న బొమ్మ, అక్షరాలు ఎవరివి?” అని వారినడిగాడు. వారు, “అవి సీజరు చక్రవర్తివి” అన్నారు. 21ఆయన వెంటనే, “అలాగైతే సీజరువి సీజరుకూ, దేవునివి దేవునికీ చెల్లించండి” అని వారితో చెప్పాడు.
ఈరోజు పరిశుద్ధులు
- సువార్తికుడైన పునీత లూకా
సాధారణ రోమన్ కాలెండర్; ఒక బిషప్‌ల సమావేశం కొన్ని పండుగలను (దివ్యదర్శనం, పరలోకారోహణం, క్రీస్తు శరీర రక్తాల పండుగ) ఒక ఆదివారానికి మార్చవచ్చు లేదా తన సొంత పండుగలను జోడించవచ్చు. పఠన గ్రంథం: ఆదివారపు చక్రం A, వారపు రోజుల సంవత్సరం II.
మూలాలు: ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు · © 2017, 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings, the editors' parts and stage directions in the Song of Songs and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · మూలాలు మరియు హక్కులు