Bible Explorer యాప్ పొందండి

హోమ్ › రోజువారీ బైబిల్ పఠనాలు › అక్టోబర్ 2026 › 9 అక్టోబర్

కాథలిక్ కాలెండర్

రోజువారీ బైబిల్ పఠనాలు (కాథలిక్) — 9 అక్టోబర్, 2026

శుక్రవారం · సామాన్య కాలం 27వ వారం

పండుగలు మరియు పరిశుద్ధులు

సామాన్య కాలం 27వ వారపు శుక్రవారం

ఐచ్ఛిక స్మరణ దినం · ఆరాధన రంగు: ఆకుపచ్చ

పునీత డెనిస్, సహచరులు, హతసాక్షులు · ఐచ్ఛిక స్మరణ దినం

పునీత జాన్ లెయొనార్డి, గురువు · ఐచ్ఛిక స్మరణ దినం

పునీత జాన్ హెన్రీ న్యూమన్, గురువు, సంఘ పండితుడు · ఐచ్ఛిక స్మరణ దినం

ఉపవాసం మరియు పశ్చాత్తాపం

పశ్చాత్తాప దినం

ప్రతి శుక్రవారం పశ్చాత్తాప దినం; దాన్ని ఎలా పాటించాలో ప్రతి బిషప్‌ల సమావేశం నిర్ణయిస్తుంది: మాంసం మానడం లేదా మరో పశ్చాత్తాప క్రియ. ఉపవాసం 18 నుండి 59 ఏళ్ల వరకు, మాంస విరమణ 14 ఏళ్ల నుండి వర్తిస్తుంది.

ఈరోజు పఠనాలు

మొదటి పఠనం

గలతీ 3:7–17

7కాబట్టి, నమ్మకముంచే వారే అబ్రాహాము సంతానమని మీరు తెలుసుకోవాలి. 8విశ్వాసం ద్వారా దేవుడు యూదేతరులను నీతిమంతులుగా తీరుస్తాడని లేఖనం ముందుగానే ప్రవచించింది. “ప్రపంచంలోని ప్రజా సమూహాలన్నీ నీలో దీవెనలు పొందుతాయి.” అని అబ్రాహాముకు సువార్త ముందుగానే ప్రకటించడం జరిగింది. 9కాబట్టి విశ్వాసముంచిన అబ్రాహాముతో బాటు విశ్వాస సంబంధులనే దేవుడు దీవిస్తాడు. 10ధర్మశాస్త్రం విధించిన క్రియలపై ఆధారపడి జీవించే వాడు శాపగ్రస్తుడు. ఎందుకంటే, “ధర్మశాస్త్ర గ్రంథంలో రాసి ఉన్న విధులన్నిటినీ చేయడంలో నిలకడగా ఉండని ప్రతివాడూ శాపగ్రస్తుడు” అని రాసి ఉంది. 11ధర్మశాస్త్రం వలన దేవుడు ఎవరినీ నీతిమంతునిగా తీర్చడు అనే విషయం స్పష్టం. ఎందుకంటే, “నీతిమంతుడు విశ్వాసం వలన జీవిస్తాడు.” 12ధర్మశాస్త్రం విశ్వాస సంబంధమైనది కాదు, “దాని విధులను ఆచరించే వాడు వాటి వల్లనే జీవిస్తాడు.” 13ఆత్మను గురించిన వాగ్దానం విశ్వాసం ద్వారా మనకు లభించేలా, అబ్రాహాము పొందిన దీవెన క్రీస్తు యేసు ద్వారా యూదేతరులకు కలగడానికి, క్రీస్తు మన కోసం శాపగ్రస్తుడై మనలను ధర్మశాస్త్ర శిక్ష నుంచి విమోచించాడు. 14అందుకే, “మాను మీద వేలాడిన ప్రతివాడూ శాపగ్రస్తుడు” అని రాసి ఉంది. 15సోదరులారా, మానవరీతిగా మాట్లాడుతున్నాను. మనుషుల ఒడంబడికే అయినా అది స్థిరపడిన తరువాత దానినెవరూ కొట్టివేయరు, దానికి ఇంకేమీ కలపరు. 16అబ్రాహాముకూ అతని సంతానానికీ దేవుడు వాగ్దానాలు చేశాడు. ఆయన అనేకులను గురించి అన్నట్టు, “నీ సంతానాలకు” అని అనలేదు గానీ ఒకడి గురించి అన్నట్టుగా, “నీ సంతానానికి” అన్నాడు. ఆ సంతానం క్రీస్తే. 17నేను చెప్పేది ఏంటంటే, 430 సంవత్సరాలైన తరువాత వచ్చిన ధర్మశాస్త్రం, దేవుడు ముందుగానే స్థిరపరచిన నిబంధనను కొట్టివేయదు. దాని వాగ్దానాన్ని వ్యర్థం చేయదు.

ప్రతిస్పందన కీర్తన

కీర్త 111:1–6

1యెహోవాను స్తుతించండి. యథార్థవంతుల సభలో, సమాజంలో పూర్ణ హృదయంతో నేను యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. 2యెహోవా క్రియలు గొప్పవి. వాటిని ఇష్టపడేవారంతా వాటిని తలపోస్తారు. 3ఆయన పనులు మహిమా ప్రభావాలు గలవి. ఆయన నీతి నిత్యం నిలకడగా ఉంటుంది. 4ఆయన తన ఆశ్చర్యకార్యాలకు జ్ఞాపకార్థ సూచన నియమించాడు. యెహోవా దయాదాక్షిణ్యపూర్ణుడు. 5తన పట్ల భయభక్తులు గలవారికి ఆయన ఆహారమిచ్చాడు. ఆయన నిత్యం తన నిబంధన జ్ఞాపకం చేసుకుంటాడు. 6ఆయన తన ప్రజలకు అన్యజాతుల ఆస్తిపాస్తులను అప్పగించాడు. తన క్రియల మహాత్మ్యాన్ని వారికి వెల్లడి చేశాడు.

సువార్త

లూకా 11:15–26

15అయితే వారిలో కొందరు, “వీడు దయ్యాలకు నాయకుడైన బయెల్జెబూలు సహాయంతో దయ్యాలను వెళ్ళగొడుతున్నాడు” అని చెప్పుకున్నారు. 16మరి కొందరు ఆయనను పరీక్షిస్తూ పరలోకం నుండి ఒక సూచన చూపించమని ఆయనను అడిగారు. 17ఆయనకు వారి ఆలోచనలన్నీ తెలుసు. ఆయన వారితో ఇలా అన్నాడు, “తనకు తానే వ్యతిరేకంగా వేరైపోయిన ఏ రాజ్యమైనా నశించి పోతుంది. తనకు తానే విరోధమైన ఇల్లు కూలిపోతుంది. 18సాతాను కూడా తనకు తానే వ్యతిరేకంగా వేరైపోతే వాడి రాజ్యం ఎలా నిలుస్తుంది? 19నేను బయెల్జెబూలు సహాయంతో దయ్యాలను వెళ్ళగొడుతున్నానని మీరు అంటున్నారే, మరి మీ అనుచరులు వాటిని ఎవరి సహాయంతో వెళ్ళగొడుతున్నారు? దీని వలన మీ సంతానమే మీకు తీర్పు తీరుస్తారు. 20అయితే నేను దేవుని వేలితో దయ్యాలను వెళ్ళగొడుతుంటే దాని అర్థం, దేవుని రాజ్యం కచ్చితంగా మీ దగ్గరికి వచ్చిందనే. 21బలవంతుడు ఆయుధాలు ధరించుకుని, తన ఆవరణలో కాపలా కాస్తే అతని సొత్తు భద్రంగా ఉంటుంది. 22అయితే అతని కంటే బలవంతుడైన వాడు అతణ్ణి ఎదిరించి ఓడించినప్పుడు అతడు నమ్ముకున్న ఆయుధాలన్నిటినీ బలవంతంగా తీసుకుని అతని ఆస్తినంతా దోచుకుంటాడు. 23నా వైపు ఉండని వాడు నాకు విరోధి. నాతో కలసి పోగుచెయ్యని వాడు చెదరగొట్టే వాడే. 24“అపవిత్రాత్మ ఒక వ్యక్తిని వదిలిపోయిన తరవాత విశ్రాంతి కోసం వెతుకుతూ నీరు లేని చోట్ల తిరుగుతూ ఉంటుంది. దానికెక్కడా విశ్రాంతి దొరకదు. అందుకని అది ‘నా పాత ఇంటికే మళ్ళీ వెళతాను’ అనుకుంటుంది. 25అది వచ్చి, ఆ ఇల్లు ఊడ్చి, అమర్చి ఉండడం చూసి 26తిరిగి వెళ్ళి, తన కంటే చెడ్డవైన మరో ఏడు అపవిత్రాత్మలను వెంటబెట్టుకువస్తుంది. అవి ఆ ఇంట్లో చొరబడి ఇక అక్కడే నివాసముంటాయి. కాబట్టి ఆ వ్యక్తి చివరి దశ మొదటి దశ కంటే అధ్వాన్నంగా ఉంటుంది” అని చెప్పాడు.

ఈరోజు పరిశుద్ధులు

సాధారణ రోమన్ కాలెండర్; ఒక బిషప్‌ల సమావేశం కొన్ని పండుగలను (దివ్యదర్శనం, పరలోకారోహణం, క్రీస్తు శరీర రక్తాల పండుగ) ఒక ఆదివారానికి మార్చవచ్చు లేదా తన సొంత పండుగలను జోడించవచ్చు. పఠన గ్రంథం: ఆదివారపు చక్రం A, వారపు రోజుల సంవత్సరం II.

మూలాలు: ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు · © 2017, 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings, the editors' parts and stage directions in the Song of Songs and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · మూలాలు మరియు హక్కులు