Bible Explorer యాప్ పొందండి

అన్వేషించండి › రాజులు మరియు దినవృత్తాంతాలు పక్కపక్కనే › సౌలు, దావీదు

రాజులు మరియు దినవృత్తాంతాలు పక్కపక్కనే · సౌలు, దావీదు

సౌలు మరణం

1 సమూ 31:1–13 · 1 దిన 10:1–14

1 సమూయేలు

1 సమూ 31:1–13

1ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయులతో యుద్ధం చేసినప్పుడు ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయులను ఎదుర్కోలేక పారిపోయారు. ఫిలిష్తీయులు వారిని గిల్బోవ కొండ వరకూ వెంటాడి హతం చేస్తూ,

2సౌలును అతని కొడుకులనూ తరిమి యోనాతాను, అబీనాదాబు, మెల్కీషూవ అనే సౌలు ముగ్గురు కొడుకులను చంపేశారు.

3యుద్ధంలో సౌలు ఓడిపోతున్నప్పుడు విలుకాళ్ళు గురి చూసి బాణాలతో అతణ్ణి కొట్టారు. అతడు భయపడి,

4“సున్నతి లేని వీరు వచ్చి నన్ను చంపి ఎగతాళి చేయకుండా నీ కత్తితో నన్ను పొడువు” అని తన ఆయుధాలు మోసేవాడితో చెబితే, అతడు భయపడి అలా చేయడానికి వెనుకాడాడు. సౌలు తన కత్తి నిలబెట్టి దానిమీద బలంగా ఒరిగాడు.

5సౌలు చనిపోయాడని అతని ఆయుధాలు మోసేవాడు కూడా తన కత్తి మీద పడి సౌలుతో పాటు చనిపోయాడు.

6ఈ విధంగా సౌలు, అతని ముగ్గురు కొడుకులు, సౌలు ఆయుధాలు మోసేవాడు, సౌలు మనుషులంతా ఒకే రోజున చనిపోయారు.

7లోయ అవతల ఉన్న ఇశ్రాయేలీయులు, యొర్దాను అవతల ఉన్నవారు, ఇశ్రాయేలీయులు పారిపోవడం, సౌలు, అతని కొడుకులు చనిపోయి ఉండడం చూసి తాము కాపురం ఉంటున్న ఊళ్ళు విడిచిపెట్టి పారిపోయారు. ఫిలిష్తీయులు వచ్చి వాటిలో నివసించారు.

8తరువాతి రోజు ఫిలిష్తీయులు చనిపోయిన వారిని దోచుకోవడానికి వచ్చి గిల్బోవ కొండమీద పడి ఉన్న సౌలును, అతని ముగ్గురు కొడుకులను చూసి,

9అతని తల నరికి అతని ఆయుధాలు తీసుకు తమ విగ్రహాల గుళ్లలో, ప్రజల్లో ఈ విజయ వార్త తెలియజేయడానికి ఫిలిష్తీయ దేశంలో నాలుగు దిక్కులకూ మనుషులను పంపారు.

10వారు సౌలు ఆయుధాలను అష్తారోతు దేవి గుడిలో ఉంచారు. అతని శవాన్ని బేత్షాను పట్టణపు గోడకు తగిలించారు.

11ఫిలిష్తీయులు సౌలుకు చేసిన దాని గురించిన వార్త విన్న యాబేష్గిలాదులోని

12బలిష్టులందరు రాత్రి అంతా నడిచి సౌలు మృతదేహాన్ని, అతని కొడుకుల మృతదేహాలను బేత్షాను పట్టణం గోడ మీద నుంచి దించి యాబేషుకు తీసుకువచ్చి దహనం చేశారు.

13ఎముకలను వేరుచేసి యాబేషులోని కర్పూర తైల వృక్షం కింద పాతిపెట్టి ఏడు రోజులపాటు ఉపవాసం ఉన్నారు.

1 దినవృత్తాంతాలు

1 దిన 10:1–14

1ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయులతో యుద్ధం చేశారు. ఇశ్రాయేలీయులందరూ పారిపోయారు. ఫిలిష్తీయులు వాళ్ళను గిల్బోవ పర్వతం మీద హతమార్చారు.

2ఫిలిష్తీయులు సౌలునీ అతని కొడుకులనూ వెంటపడి తరిమారు. వాళ్ళు సౌలు కొడుకులు యోనాతానునీ, అబీనాదాబునీ, మల్కీషూవనీ చంపేశారు.

3సౌలుకి వ్యతిరేకంగా యుద్ధం తీవ్రమైంది. బాణాలు వేసే వాళ్ళు అతణ్ణి చూశారు. అతనిపై గురిపెట్టి బాణాలు వేసారు. సౌలుకు తీవ్ర గాయాలయ్యాడు.

4అప్పుడు సౌలు తన ఆయుధాలు మోసేవాడితో “నీ కత్తితో నన్ను పొడిచెయ్యి. లేకుంటే ఈ సున్నతి లేని వాళ్ళు వచ్చి నన్ను అవమానిస్తారు” అన్నాడు. వాడు అలా చేయడానికి ఒప్పుకోలేదు. ఎందుకంటే వాడు చాలా భయపడ్డాడు. దాంతో సౌలు తన కత్తి నేలకు ఆనించి దాని మీద పడ్డాడు.

5సౌలు చనిపోయాడని ఆయుధాలు మోసేవాడికి అర్థం అయింది. దాంతో వాడు కూడా తన కత్తి పట్టుకుని దానిపైన పడ్డాడు. వాడూ చనిపోయాడు.

6ఈ విధంగా సౌలూ, అతని ముగ్గురు కొడుకులతో పాటు అతని కుటుంబ సభ్యులందరూ చనిపోయారు.

7తమ వాళ్ళు యుద్ధంలో నుండి పారిపోయారనీ, సౌలూ అతని కొడుకులూ చనిపోయారనీ లోయలో ఉన్న ఇశ్రాయేలు ప్రజలకు తెలిసింది. అప్పుడు వాళ్ళంతా తమ పట్టణాలు వదిలి పారిపోయారు.

8తరువాత రోజు చనిపోయిన వారి బట్టలనూ ఇతర వస్తువులనూ దోచుకోడానికి ఫిలిష్తీయులు వచ్చారు. అప్పుడే వాళ్ళు సౌలు, అతని కుమారులూ గిల్బోవ పర్వతంపై చనిపోయి పడి ఉండటం చూశారు.

9వాళ్ళు సౌలు కవచాన్నితీసుకున్నారు. అతని తలనూ, ఆయుధాలనూ తీసుకువెళ్ళారు. తమ విగ్రహాల మధ్యా, ప్రజల మధ్యా ఈ వార్తను చాటించడానికి మనుషులను పంపారు.

10తమ దేవుని గుడిలో అతని ఆయుధాలను ఉంచారు. అతని తలను దాగోను గుడికి వేలాడదీశారు.

11ఫిలిష్తీయులు సౌలుకి చేసింది యాబేష్గిలాదు నివాసులకు తెలిసింది.

12అప్పుడు వాళ్ళలో శూరులైన వాళ్ళంతా అక్కడికి వెళ్ళి సౌలు శరీరాన్నీ, అతని కొడుకుల శరీరాలనూ యాబేషుకి తీసుకు వచ్చారు. వాళ్ళ ఎముకలను యాబేషులోనే ఉన్న సింధూరం చెట్టు కింద పాతిపెట్టారు. ఏడు రోజులు వాళ్ళ కోసం ఉపవాసం ఉన్నారు.

13సౌలు యెహోవాకు విరోధంగా ద్రోహం చేసాడు కాబట్టి ఈ విధంగా చనిపోయాడు. అతడు యెహోవా ఆజ్ఞలు పాటించలేదు. ఆత్మలతో సంభాషించే మనిషి దగ్గరికి సలహా కోసం వెళ్ళాడు.

14మార్గనిర్దేశం కోసం అతడు యెహోవా దగ్గరికి వెళ్ళలేదు. అందుకే యెహోవా అతన్ని చంపి రాజ్యాన్ని యెష్షయి కొడుకైన దావీదు వశం చేశాడు.

గుర్తించబడినవి: మీరు చదివే అనువాదంలో ప్రతి వృత్తాంతంలో ఉన్న పదాలు. అత్యంత తరచుగా వచ్చే పదాలు (“మరియు”, “అతడు”) గుర్తించబడవు; వేరే రూపంలోని పదం గుర్తించబడకపోవచ్చు.

మూలాలు: OpenBible.info, CC BY 4.0 · ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు · © 2017, 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings, the editors' parts and stage directions in the Song of Songs and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · మూలాలు మరియు హక్కులు