Bible Explorer యాప్ పొందండి

హోమ్ › రోజువారీ బైబిల్ పఠనాలు › డిసెంబర్ 2027 › 22 డిసెంబర్

ఆర్థడాక్స్ కాలెండర్ · డిసెంబర్ 9 (పాత శైలి)

ఆర్థడాక్స్ రోజువారీ పఠనాలు — 22 డిసెంబర్, 2027

బుధవారం · పెంతెకొస్తు తర్వాత 27వ వారం · స్వరం 1

పండుగలు మరియు పరిశుద్ధులు

Conception by Righteous Anna, of the Most Holy Mother of God

క్రీస్తు జనన ఉపవాసం

ఉపవాసం: నూనెతో

ఇది సన్యాస నియమాన్ని అనుసరిస్తుంది. సంఘంలో ఉపవాస పరిమాణాన్ని ఆరోగ్యం, వయస్సు మరియు పరిస్థితుల ప్రకారం తమ ఆత్మీయ గురువుతో కలిసి నిర్ణయిస్తారు.

ఈరోజు పఠనాలు

పత్రిక

1 తిమో 5:22–6:11

22ఎవరి మీదా త్వరపడి చేతులుంచవద్దు. ఇతరుల పాపాల్లో భాగం పంచుకోవద్దు. నిన్ను నీవు పవిత్రునిగా ఉండేలా చూసుకో. 23ఇక నుండి నీళ్ళు మాత్రమే గాక నీ కడుపులో తరచుగా వచ్చే వ్యాధి కోసం కొద్దిగా ద్రాక్షారసం తాగు. 24కొందరి పాపాలు స్పష్టంగా తెలుస్తున్నాయి. అవి వారి తీర్పుకు ముందే నడుస్తున్నాయి. మరి కొంతమంది పాపాలు వారి వెంటే వెళుతున్నాయి. 25అలాగే కొన్ని మంచి పనులు స్పష్టంగా కనిపిస్తాయి. మిగిలిన వాటిని సైతం దాచి ఉంచడం సాధ్యం కాదు. 6:1బానిసలుగా పని చేస్తున్న విశ్వాసులు వారి యజమానులను పూర్తి గౌరవానికి తగినవారుగా ఎంచాలి. ఆ విధంగా చేయడం వలన దేవుని నామమూ ఆయన బోధా దూషణకు గురి కాకుండా ఉంటాయి. 2విశ్వాసులైన యజమానులు గల బానిసలైతే ఆ యజమానులు తమ సోదరులే కదా అని వారిని చిన్న చూపు చూడక, తాము సేవించేది తమ ప్రేమ పాత్రులైన విశ్వాసులనే అని ఇంకా బాగా వారికి సేవ చేయాలి. ఈ సంగతులు బోధిస్తూ వారిని హెచ్చరించు. 3ఎవరైనా మన ప్రభువైన యేసు క్రీస్తు ఆరోగ్యకరమైన ఉపదేశానికీ, దైవభక్తికి అనుగుణమైన బోధకూ సమ్మతించకుండా, దానికి భిన్నంగా బోధిస్తే 4వాడు గర్విష్టి. వాడికి ఏమీ తెలియదన్నమాట. వాడు తర్కాల్లో వాగ్వాదాల్లో నిమగ్నమై ఉంటాడు. ఫలితంగా అసూయ, కలహం, దూషణలు, అపోహలు కలుగుతాయి. 5ఇంకా చెడిపోయిన మనసుతో అలాటి వారు సత్యం నుండి తొలగిపోయి దైవభక్తి ధనసంపాదన మార్గం అనుకుంటారు. 6అయితే సంతృప్తితో కూడిన దైవభక్తి ఎంతో లాభకరం. 7మనం ఈ లోకంలోకి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకు పోలేము. 8కాబట్టి అవసరమైన అన్నవస్త్రాలు కలిగి వాటితో తృప్తిగా ఉందాం. 9ధనవంతులు కావాలని ఆశించేవారు శోధనలో, ఉచ్చులో, బుద్ధిహీనమైన, హానికరమైన అనేక దురాశల్లో పడిపోతారు. అలాంటివి మనుషులను సంపూర్ణ పతనానికి నాశనానికీ గురిచేస్తాయి. 10ఎందుకంటే ధనాశ అన్ని కీడులకూ మూలం. కొందరు డబ్బునాశించి విశ్వాసం నుండి తొలగిపోయి తమపైకి తామే నానాబాధలు కుని తెచ్చుకున్నారు. 11దేవుని మనిషీ, నువ్వు మాత్రం వీటి నుండి పారిపో. నీతినీ, భక్తినీ, విశ్వాసాన్నీ, ప్రేమనూ, ఓర్పునూ, సాత్వీకాన్నీ సంపాదించుకోడానికి ప్రయాసపడు.

పత్రిక (పరిశుద్ధ అన్నా కోసం)

గలతీ 4:22–31

22దాసి వలన ఒకడు, స్వతంత్రురాలి వలన ఒకడు, ఇద్దరు కొడుకులు అబ్రాహాముకు కలిగారని రాసి ఉంది గదా? 23అయినా దాసి వలన పుట్టినవాడు శరీర రీతిగా పుట్టాడు. స్వతంత్రురాలి వలన పుట్టినవాడు వాగ్దాన మూలంగా పుట్టాడు. 24ఈ విషయాలను అలంకార రూపంలో చెప్పవచ్చు. ఈ స్త్రీలు రెండు నిబంధనలు. వాటిలో ఒకటి సీనాయి పర్వతానికి సంబంధించి బానిసత్వంలో ఉండడానికి పిల్లలను కంటుంది. ఇది హాగరు. 25ఈ హాగరు అరేబియా ప్రాంతంలో ఉన్న సీనాయి కొండ. ప్రస్తుతం ఉన్న యెరూషలేము దాని పిల్లలతో కూడ బానిసత్వంలో ఉంది. 26అయితే పైనున్న యెరూషలేము స్వతంత్రంగా ఉంది. ఆమె మనకు తల్లి. 27“గొడ్రాలా, పిల్లలను కననిదానా, ఆనందించు. ప్రసవ వేదన పడనిదానా, ఆనందంతో కేకలు పెట్టు. ఎందుకంటే, భర్త ఉన్న ఆమె పిల్లల కంటే భర్త లేని దాని పిల్లలు ఎక్కువమంది ఉన్నారు” అని రాసి ఉంది. 28సోదరులారా, మీరు కూడా ఇస్సాకు లాగా వాగ్దానం ప్రకారం పుట్టిన కొడుకులుగా ఉన్నారు. 29అప్పుడు శరీరాన్ని బట్టి పుట్టినవాడు ఆత్మను బట్టి పుట్టిన వాణ్ణి ఎలా హింస పెట్టాడో ఇప్పుడు కూడా ఆలాగే జరుగుతున్నది. 30అయితే లేఖనం ఏమి చెబుతున్నది? “దాసిని, ఆమె కొడుకుని వెళ్ళగొట్టు. దాసి కొడుకు స్వతంత్రురాలి కొడుకుతో పాటు వారసుడుగా ఉండడు.” 31అందుచేత, సోదరులారా, మనం స్వతంత్రురాలి కొడుకులమే గాని దాసి కొడుకులం కాదు.

సువార్త

లూకా 21:5–7, 10–11, 20–24

5దేవాలయాన్ని అందమైన రాళ్ళతోనూ, కానుకలతోనూ అలంకరించారని కొందరు మాట్లాడుకుంటూ ఉన్నారు. 6అప్పుడు ఆయన, “ఈ కట్టడాలను మీరు చూస్తున్నారు గదా, వీటిలో రాయి మీద రాయి నిలవకుండా పడదోసే రోజు వస్తుంది” అన్నాడు. 7అప్పుడు వారు, “బోధకా, ఇవి ఎప్పుడు జరుగుతాయి. ఇవి జరిగే ముందు ఏ సూచన కనిపిస్తుంది?” అని ఆయనను అడిగారు. 10ఆయన వారితో ఇంకా ఇలా అన్నాడు, “ఒక జాతి పైకి మరో జాతీ ఒక రాజ్యం పైకి మరో రాజ్యమూ దాడి చేస్తుంది. 11కొన్ని చోట్ల గొప్ప భూకంపాలూ కరువులూ ఈతిబాధలూ కలుగుతాయి. ఆకాశంలో భయంకరమైన ఉత్పాతాలూ గొప్ప సూచనలూ కనిపిస్తాయి. 20యెరూషలేమును సైన్యాలు ముట్టడించడం మీరు చూసినప్పుడు దాని నాశనం దగ్గర పడిందని తెలుసుకోండి. 21అప్పుడు యూదయలో ఉన్న వారు కొండలకు పారిపోవాలి. పట్టణంలో ఉన్నవారు బయటకు పోవాలి. గ్రామవాసులు దానిలో ప్రవేశించ కూడదు. 22ఎందుకంటే అవి పగ తీర్చుకునే రోజులు. రాసి ఉన్నవన్నీ నెరవేరేలా ఆ రోజులు వస్తాయి. 23ఆ రోజుల్లో గర్భవతులకూ బాలింతలకూ ఎంతో యాతన కలుగుతుంది. దేశంలో చాలా దురవస్థ కలుగుతుంది. ఈ ప్రజల పైకి ఉగ్రత దిగి వస్తుంది. 24వారు కత్తిపాలై చనిపోతారు. శత్రువులు వారిని చెరపట్టి యూదులు కాని అన్యజనాల్లోకి తీసుకువెళ్తారు. యూదేతర జాతులు తమ కాలాలు పూర్తి అయ్యేవరకూ యెరూషలేమును కాళ్ళ కింద తొక్కుతారు.

సువార్త (పరిశుద్ధ అన్నా కోసం)

లూకా 8:16–21

16“ఎవరూ దీపాన్ని వెలిగించి బుట్టతో కప్పివేయడు, మంచం కింద పెట్టడు. ఇంట్లోకి వచ్చే వారికి వెలుగు కనిపించేలా దీపస్తంభంపై ఉంచుతాడు. 17తేటతెల్లం కాని రహస్యమేదీ లేదు. తెలియకుండా, బయట పడకుండా, దాగి ఉండిపోయేది ఏదీ లేదు. 18కలిగిన వ్యక్తికే ఇస్తారు, లేని వ్యక్తి నుండి తనకు ఉంది అనుకున్నది కూడా తీసివేస్తారు. కాబట్టి మీరు ఎలా వింటున్నారో చూసుకోండి” అన్నాడు. 19ఆయన తల్లీ సోదరులూ అక్కడికి వచ్చారు గానీ అంతా గుంపుగా ఉండడం వల్ల ఆయనకు దగ్గరగా రాలేకపోయారు. 20అప్పుడు, “నిన్ను చూడ్డానికి నీ తల్లీ నీ సోదరులూ వచ్చి బయట నిలుచున్నారు” అని ఎవరో ఆయనతో అన్నారు. 21అందుకు ఆయన, “దేవుని వాక్యాన్ని విని దాని ప్రకారం జరిగించే వారే నా తల్లీ నా తమ్ముళ్ళూ” అన్నాడు.

తేదీలు రష్యన్ సంఘపు జూలియన్ కాలెండర్‌ను అనుసరిస్తాయి (సెర్బియన్, జార్జియన్ సంఘాలు, ఆథోస్ పర్వతం లాగే): సంఘ కాలెండర్‌లోని 9 డిసెంబర్ పౌర కాలెండర్‌లో 22 డిసెంబర్. కొత్త కాలెండర్‌ను అనుసరించే సంఘాలు (గ్రీసు, రొమేనియా, బల్గేరియా, ఉక్రెయిన్…) స్థిర పండుగలనూ పరిశుద్ధులనూ పౌర తేదీనే, 13 రోజులు ముందుగా జరుపుకుంటాయి, వాటి కొన్ని పఠనాలు వేరుగా ఉంటాయి; ఈస్టర్, దానిపై ఆధారపడిన రోజులు ఒకటే.

మూలాలు: ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు · © 2017, 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings, the editors' parts and stage directions in the Song of Songs and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · మూలాలు మరియు హక్కులు