హోమ్ › రోజువారీ బైబిల్ పఠనాలు › నవంబర్ 2027 › 25 నవంబర్
కాథలిక్ కాలెండర్
రోజువారీ బైబిల్ పఠనాలు (కాథలిక్) — 25 నవంబర్, 2027
గురువారం · సామాన్య కాలం 34వ వారం
పండుగలు మరియు పరిశుద్ధులు
సామాన్య కాలం 34వ వారపు గురువారం
ఐచ్ఛిక స్మరణ దినం · ఆరాధన రంగు: ఆకుపచ్చ
అలెగ్జాండ్రియా పునీత కేథరిన్ · ఐచ్ఛిక స్మరణ దినం
ఈరోజు పఠనాలు
మొదటి పఠనం
11ఆ వ్యక్తులు గుంపుగా వచ్చి దానియేలు తన దేవునికి ప్రార్థన చేయడం, ఆయనను వేడుకోవడం చూశారు. 12రాజు సన్నిధికి వచ్చి రాజు నియమించిన శాసనం విషయం ప్రస్తావించారు. “రాజా, 30 రోజుల వరకూ నీకు తప్ప మరి ఏ దేవునికైనా, మానవునికైనా ఎవ్వరూ ప్రార్థన చేయకూడదు. ఎవడైనా అలా చేసినట్టైతే వాడిని సింహాల గుహలో పడవేస్తామని నువ్వు ఆజ్ఞ ఇచ్చావు గదా” అని అడిగారు. రాజు “మాదీయుల, పారసీకుల ఆచారం ప్రకారం అది స్థిరమైన శాసనం. దాన్ని ఎవ్వరూ అతిక్రమించకూడదు” అని చెప్పాడు. 13అప్పుడు వాళ్ళు “బందీలుగా చెరపట్టిన యూదుల్లో ఉన్న ఆ దానియేలు నిన్నూ నువ్వు నియమించిన శాసనాన్నీ నిర్లక్ష్యం చేసి, ప్రతిరోజూ మూడుసార్లు ప్రార్థన చేస్తున్నాడు” అని ఫిర్యాదు చేశారు. 14ఈ మాట విన్న రాజు ఎంతో మధనపడ్డాడు. దానియేలును ఎలాగైనా రక్షించాలని తన మనస్సులో నిర్ణయించుకున్నాడు. పొద్దుపోయే వరకూ అతణ్ణి విడిపించడానికి ప్రయత్నం చేశాడు. 15ఇది గమనించిన ఆ వ్యక్తులు రాజ మందిరానికి గుంపుగా వచ్చి “రాజా, రాజు నియమించిన ఏ శాసనాన్ని గానీ, తీర్మానాన్ని గానీ ఎవ్వరూ రద్దు చేయకూడదు. ఇది మాదీయుల, పారసీకుల ప్రధాన విధి అని మీరు గ్రహించాలి” అని చెప్పారు. 16రాజు ఆజ్ఞ ఇవ్వగా సైనికులు దానియేలును పట్టుకుని సింహాల గుహలో పడవేశారు. అప్పుడు రాజు “నువ్వు ప్రతిరోజూ తప్పకుండా సేవిస్తున్న నీ దేవుడే నిన్ను రక్షిస్తాడు” అని దానియేలుతో చెప్పాడు. 17ఆ వ్యక్తులు ఒక పెద్ద రాయి తీసుకువచ్చి ఆ గుహ ద్వారం ఎదుట వేసి దాన్ని మూసివేశారు. దానియేలు విషయంలో రాజు తన నిర్ణయం మార్చుకుంటాడేమోనని భావించి, గుహ ద్వారానికి రాజముద్రను, అతని రాజ ప్రముఖుల ముద్రలను వేశారు. 18తరువాత రాజు తన భవనానికి వెళ్ళాడు. ఆ రాత్రి ఆహారం తీసుకోకుండా వినోద కాలక్షేపాల్లో పాల్గొనకుండా ఉండిపోయాడు. ఆ రాత్రంతా అతనికి నిద్ర పట్టలేదు. 19తెల్లవారగానే రాజు లేచి త్వర త్వరగా సింహాల గుహ దగ్గరికి వెళ్ళాడు. 20అతడు గుహ దగ్గరికి వచ్చి, దుఃఖ స్వరంతో దానియేలును పిలిచాడు. “జీవం గల దేవుని సేవకుడివైన దానియేలూ, నిత్యం నువ్వు సేవిస్తున్న నీ దేవుడు నిన్ను రక్షించగలిగాడా?” అని అతణ్ణి అడిగాడు. 21అందుకు దానియేలు “రాజు చిరకాలం జీవించు గాక. 22నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడ్డాను. కాబట్టి ఆయన తన దూతను పంపాడు. సింహాలు నాకు ఎలాంటి హానీ చేయకుండ వాటి నోళ్లు మూతపడేలా చేశాడు. రాజా, నీ దృష్టిలో నేను ఎలాంటి నేరం చేయలేదు గదా” అని జవాబిచ్చాడు. 23రాజు చాలా సంతోషించాడు. దానియేలును గుహలో నుండి పైకి తీయమని ఆజ్ఞ ఇచ్చాడు. సైనికులు దానియేలును బయటికి తీశారు. అతడు దేవునిపట్ల భయభక్తులు గలవాడు కావడం వల్ల అతనికి ఎలాంటి ఏ హానీ జరగలేదు. 24దానియేలు మీద నింద మోపిన ఆ వ్యక్తులను, వాళ్ళ భార్య పిల్లలను సింహాల గుహలో పడవేయమని రాజు ఆజ్ఞ ఇచ్చాడు. సైనికులు వాళ్ళను తీసుకువచ్చి సింహాల గుహలో పడవేశారు. వాళ్ళు ఇంకా గుహ అడుగు భాగానికి చేరక ముందే సింహాలు వాళ్ళను పట్టుకున్నాయి. ఎముకలు కూడా మిగలకుండా వాళ్ళను చీల్చిచెండాడాయి. 25అప్పుడు రాజైన దర్యావేషు లోకమంతటా నివసించే ప్రజలకూ జాతులకూ వివిధ భాషలు మాట్లాడే వాళ్ళకూ ఈ విధంగా ప్రకటన రాయించాడు. “మీకందరికీ క్షేమం కలుగు గాక. 26నా సమక్షంలో నిర్ణయం జరిగినట్టుగా, నా రాజ్యంలో ఉన్న సమస్త ప్రాంతాల్లో నివసించే ప్రజలంతా దానియేలు సేవించే దేవునికి భయపడుతూ ఆయన సన్నిధిలో వణకుతూ ఉండాలి. ఆయనే సజీవుడైన దేవుడు, ఆయన యుగయుగాలకు ఉండే దేవుడు. ఆయన రాజ్యం నిరంతరం ఉంటుంది. ఆయన పరిపాలనకు అంతం అంటూ ఉండదు. 27ఆయన మనుషులను విడిపించేవాడు, రక్షించేవాడు. ఆకాశంలో, భూమి మీదా ఆయన సూచకక్రియలు, ఆశ్చర్యకార్యాలు చేసేవాడు. ఆయనే సింహాల బారి నుండి ఈ దానియేలును రక్షించాడు” అని రాయించాడు.
ప్రతిస్పందన కీర్తన
ఈ అనువాదంలో లేదు
సువార్త
20యెరూషలేమును సైన్యాలు ముట్టడించడం మీరు చూసినప్పుడు దాని నాశనం దగ్గర పడిందని తెలుసుకోండి. 21అప్పుడు యూదయలో ఉన్న వారు కొండలకు పారిపోవాలి. పట్టణంలో ఉన్నవారు బయటకు పోవాలి. గ్రామవాసులు దానిలో ప్రవేశించ కూడదు. 22ఎందుకంటే అవి పగ తీర్చుకునే రోజులు. రాసి ఉన్నవన్నీ నెరవేరేలా ఆ రోజులు వస్తాయి. 23ఆ రోజుల్లో గర్భవతులకూ బాలింతలకూ ఎంతో యాతన కలుగుతుంది. దేశంలో చాలా దురవస్థ కలుగుతుంది. ఈ ప్రజల పైకి ఉగ్రత దిగి వస్తుంది. 24వారు కత్తిపాలై చనిపోతారు. శత్రువులు వారిని చెరపట్టి యూదులు కాని అన్యజనాల్లోకి తీసుకువెళ్తారు. యూదేతర జాతులు తమ కాలాలు పూర్తి అయ్యేవరకూ యెరూషలేమును కాళ్ళ కింద తొక్కుతారు. 25“ఇంకా సూర్య చంద్ర నక్షత్రాల్లో సూచనలు కలుగుతాయి. సముద్రం, దాని అలల హోరు శబ్దానికి భూమి మీద ప్రజలు భయకంపితులై యాతన పడతారు. 26ఆకాశంలోని శక్తులు కదిలిపోతాయి. కాబట్టి లోకం పైకి రాబోయే వాటిని గురించిన భయం ప్రజలకి కలుగుతుంది. వారు గుండెలవిసి పోయి కూలిపోతారు. 27అప్పుడు మనుష్య కుమారుడు బల ప్రభావంతో, గొప్ప యశస్సు కలిగి మేఘాలపై రావడం చూస్తారు. 28ఇవి జరగడం ఆరంభమైనప్పుడు ధైర్యం తెచ్చుకోండి. తలలు పైకెత్తి చూడండి. మీ విముక్తి దగ్గరవుతూ ఉంటుంది” అన్నాడు.
ఈరోజు పరిశుద్ధులు
- అలెగ్జాండ్రియా పునీత కేథరిన్
సాధారణ రోమన్ కాలెండర్; ఒక బిషప్‌ల సమావేశం కొన్ని పండుగలను (దివ్యదర్శనం, పరలోకారోహణం, క్రీస్తు శరీర రక్తాల పండుగ) ఒక ఆదివారానికి మార్చవచ్చు లేదా తన సొంత పండుగలను జోడించవచ్చు. పఠన గ్రంథం: ఆదివారపు చక్రం B, వారపు రోజుల సంవత్సరం I.
మూలాలు: ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు · © 2017, 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings, the editors' parts and stage directions in the Song of Songs and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · మూలాలు మరియు హక్కులు