హోమ్ › రోజువారీ బైబిల్ పఠనాలు › నవంబర్ 2027 › 8 నవంబర్
ఆర్థడాక్స్ కాలెండర్ · అక్టోబర్ 26 (పాత శైలి)
ఆర్థడాక్స్ రోజువారీ పఠనాలు — 8 నవంబర్, 2027
సోమవారం · పెంతెకొస్తు తర్వాత 21వ వారం · స్వరం 3
పండుగలు మరియు పరిశుద్ధులు
Great Martyr Demetrius of Thessalonica († c. 306)
ఉపవాసం
ఉపవాసం లేదు
ఇది సన్యాస నియమాన్ని అనుసరిస్తుంది. సంఘంలో ఉపవాస పరిమాణాన్ని ఆరోగ్యం, వయస్సు మరియు పరిస్థితుల ప్రకారం తమ ఆత్మీయ గురువుతో కలిసి నిర్ణయిస్తారు.
ఈరోజు పఠనాలు
సాయంకాల ప్రార్థన: పఠనం
15పరలోకం నుంచి చూడు. నీ దివ్యమైన పవిత్ర నివాసం నుంచి చూడు. నీ ఆసక్తి, నీ గొప్పపనులు ఎక్కడున్నాయి? మా పట్ల నీ కనికరం, నీ వాత్సల్యం, ఆగిపోయాయేమిటి. 16అయితే మా తండ్రివి నువ్వే. అబ్రాహాముకు మేము తెలియక పోయినా ఇశ్రాయేలు మమ్మల్ని అంగీకరించకపోయినా, యెహోవా, నువ్వే మా తండ్రివి. అనాదికాలం నుంచి “మా విమోచకుడు” అని నీకు పేరు గదా. 17యెహోవా, నీ విధానాలనుంచి మమ్మల్ని తప్పిస్తున్నావెందుకు? మాకు నీ పట్ల భయభక్తులు ఉండకుండా మా హృదయాలను ఎందుకు కఠినపరుస్తున్నావు? నీ సేవకుల కోసం నీ సొత్తుగా ఉన్న గోత్రాలకోసం తిరిగి రా. 18నీ పవిత్ర ఆలయం నీ ప్రజల ఆధీనంలో కొద్దికాలమే ఉంది. అయితే మా శత్రువులు దాన్ని తొక్కివేశారు. 19నువ్వెన్నడూ పాలించని వాళ్ళలాగా అయ్యాం. నీ పేరెన్నడూ ధరించని వాళ్ళలాగా అయ్యాం. 64:1ఆకాశాలను చీల్చుకుని నువ్వు దిగివస్తే ఎంత బాగుండు! నీ సన్నిధిలో పర్వతాలు కంపించి పోతాయి. 2మంటలు గచ్చ పొదలను తగలబెట్టేలా నీళ్ళు పొంగేలాగా చేసినట్టు నీ పేరు నీ శత్రువులకు తెలియజేయడానికి నువ్వు దిగి రా! 3మేము ఊహించని ఆశ్చర్యకరమైన విషయాలు నువ్వు మునుపు చేసినప్పుడు, నువ్వు దిగివచ్చావు. పర్వతాలు నీ ఎదుట వణికాయి. 4నీ కోసం ఎదురు చూసేవారి పక్షంగా నువ్వు పనులు చేసే వాడివి. నిన్ను తప్ప తన పని ఇలా జరిగించే వేరే దేవుణ్ణి అనాది కాలం నుంచి ఎవరూ చూడలేదు, వినలేదు, గ్రహించలేదు. 5నీ పద్ధతులను గుర్తుంచుకుని వాటి ప్రకారం చేసే వారికి, సంతోషంతో నీతి ననుసరించే వారికి, నువ్వు సాయం చేయడానికి వస్తావు. మేము పాపం చేసినప్పుడు నువ్వు కోపపడ్డావు. నీ పద్ధతుల్లో మాకు ఎప్పుడూ విడుదల కలుగుతుంది. 8అయినా, యెహోవా, నువ్వే మాకు తండ్రివి. మేము బంకమన్నులాగా ఉన్నాం. నువ్వు మాకు కుమ్మరివి. మేమంతా నీ చేతి పని. 9యెహోవా, ఎక్కువగా కోపపడవద్దు. మా పాపాలను ఎప్పుడూ అదే పనిగా గుర్తు పెట్టుకోవద్దు. ఇదిగో, నీ ప్రజలైన మావైపు దయచేసి చూడు.
సాయంకాల ప్రార్థన: పఠనం
2“యెరూషలేము నివాసులకు ఇలా ప్రకటించు. యెహోవా చెప్పేదేమిటంటే, నువ్వు అరణ్యంలో, పంటలు పండని ప్రాంతాల్లో నా వెంట నడుస్తూ నీ యవ్వనకాలంలో నీవు నాపై చూపిన నిబంధన నమ్మకత్వం, నీ వైవాహిక ప్రేమ, నేను గుర్తు చేసుకుంటున్నాను. 3అప్పుడు ఇశ్రాయేలు యెహోవాకు ప్రతిష్ఠిత జనంగా, ఆయన పంటలో ప్రథమ ఫలంగా ఉంది. వారిని బాధించే వారందరూ శిక్షకు పాత్రులు. వారిపైకి కీడు దిగి వస్తుంది.” ఇదే యెహోవా వాక్కు. 4యాకోబు సంతానమా, ఇశ్రాయేలు ప్రజలారా, మీరంతా యెహోవా మాట వినండి. 5యెహోవా ఇలా సెలవిస్తున్నాడు. “నాలో ఏ తప్పిదం చూసి మీ పూర్వికులు నాకు దూరమై వ్యర్థమైన విగ్రహాలను పూజించి వారూ వ్యర్థులుగా మారిపోయారు? 6‘ఐగుప్తు దేశంలో నుండి మమ్మల్ని తెచ్చిన యెహోవా ఏడీ’ అని అడగలేదు. అంటే ‘అరణ్యంలో, చవిటి నేలలతో, గోతులతో నిండిన ప్రదేశంలో, అనావృష్టీ చీకటీ నిండిన, ఎవరూ తిరగని, నివసించని దేశంలో మమ్మల్ని నడిపించిన యెహోవా ఎక్కడ ఉన్నాడు?’ అని ప్రజలు అడగడం లేదు. 7ఫలవంతమైన దేశంలోకి మిమ్మల్ని తీసుకువచ్చి దాని పంటను, దానిలోని శ్రేష్ఠమైన పదార్థాలను తినేలా చేశాను. అయితే మీరు నా దేశాన్ని అపవిత్రం చేసి నా వారసత్వాన్ని హేయపరిచారు.” 8“యెహోవా ఎక్కడ ఉన్నాడు?” అని యాజకులు వెతకడం లేదు. ధర్మశాస్త్ర బోధకులకు నేనెవరో తెలియదు. ప్రజల నాయకులు నా మీద తిరుగుబాటు చేశారు. ప్రవక్తలు బయలు దేవుడి పేరట ప్రవచించి, వ్యర్ధమైన వాటిని అనుసరించారు. 9కాబట్టి నేనికనుండి మీపైనా మీ పిల్లల పైనా వారి పిల్లల పైనా నేరం మోపుతాను. ఇది యెహోవా వాక్కు. 10కిత్తీయుల ద్వీపాలకు వెళ్లి చూడండి, కేదారుకు దూతలను పంపి విచారించండి. మీలో జరుగుతున్న ప్రకారం ఇంకెక్కడైనా జరుగుతున్నదా? 11దేవుళ్ళు కాని వారితో తమ దేవుళ్ళను ఏ ప్రజలైనా ఎప్పుడైనా మార్చుకున్నారా? కానీ నా ప్రజలు ప్రయోజనం లేని దాని కోసం తమ మహిమను మార్చుకున్నారు. 12ఆకాశమా, దీని గురించి విస్మయం చెందు. భయపడి వణుకు. ఇదే యెహోవా వాక్కు.
సాయంకాల ప్రార్థన: పఠనం
ఈ అనువాదంలో లేదు
ఉదయ ప్రార్థన: సువార్త
16“తోడేళ్ళ మధ్యకు గొర్రెలను పంపినట్టు నేను మిమ్మల్ని పంపుతున్నాను. కాబట్టి పాముల్లాగా వివేకంగా, పావురాల్లాగా కపటం లేకుండా ఉండండి. 17మనుషుల గురించి జాగ్రత్తగా ఉండండి. వారు మిమ్మల్ని న్యాయస్థానాలకు అప్పగించి, తమ సమాజ మందిరాల్లో మిమ్మల్ని కొరడాలతో కొట్టిస్తారు. 18వీరికీ యూదేతరులకూ సాక్షార్థంగా నాకోసం మిమ్మల్ని అధిపతుల దగ్గరకీ రాజుల దగ్గరకీ తెస్తారు. 19వారు మిమ్మల్ని అప్పగించేటపుడు, ‘ఎలా మాట్లాడాలి? ఏమి చెప్పాలి?’ అని ఆందోళన పడవద్దు. మీరేమి చెప్పాలో అది ఆ సమయంలోనే దేవుడు మీకు తెలియజేస్తాడు. 20మాట్లాడేది మీరు కాదు, మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడతాడు. 21సోదరుడు సోదరుణ్ణి, తండ్రి కొడుకునూ చావుకు అప్పగిస్తారు. పిల్లలు తల్లిదండ్రుల మీద లేచి వారిని చంపిస్తారు. 22నా నామాన్ని బట్టి అందరూ మిమ్మల్ని ద్వేషిస్తారు. చివరి వరకూ సహించే వారిని దేవుడు రక్షిస్తాడు.
పత్రిక
10నా గురించి మీరు ఇప్పటికైనా మళ్ళీ శ్రద్ధ వహించారని ప్రభువులో చాలా సంతోషించాను. గతంలో మీరు నా గురించి ఆలోచించారు గానీ మీకు సరైన అవకాశం దొరకలేదు. 11నాకేదో అవసరం ఉందని నేనిలా చెప్పడం లేదు. నేను ఏ పరిస్థితిలో ఉన్నా సరే, ఆ పరిస్థితిలో సంతృప్తి కలిగి ఉండడం నేర్చుకున్నాను. 12అవసరంలో బతకడం తెలుసు, సంపన్న స్థితిలో బతకడం తెలుసు. ప్రతి విషయంలో అన్ని పరిస్థితుల్లో కడుపు నిండి ఉండడానికీ ఆకలితో ఉండడానికీ సమృద్ధి కలిగి ఉండడం, లేమిలో ఉండడం నేర్చుకున్నాను. 13నన్ను బలపరచే వాడి ద్వారా నేను సమస్తాన్నీ చేయగలను. 14అయినా నా కష్టాలు పంచుకోవడంలో మీరు మంచి పని చేశారు. 15ఫిలిప్పీయులారా, నేను సువార్త బోధించడం మొదలుపెట్టి మాసిదోనియ నుంచి బయలుదేరినప్పుడు మీ సంఘమొక్కటే నాకు సహాయం చేసి నన్ను ఆదుకున్నది. ఈ సంగతి మీకే తెలుసు. 16ఎందుకంటే తెస్సలోనికలో కూడా మీరు మాటిమాటికీ నా అవసరం తీర్చడానికి సహాయం చేశారు. 17నేను బహుమానాన్ని ఆశించి ఇలా చెప్పడం లేదు, మీకు ప్రతిఫలం అధికం కావాలని ఆశిస్తూ చెబుతున్నాను. 18నాకు అన్నీ సమృద్ధిగా ఉన్నాయి. మీరు పంపిన వస్తువులు ఎపఫ్రొదితు ద్వారా అందాయి. నాకు ఏమీ కొదువ లేదు. అవి ఇంపైన సువాసనగా, దేవునికి ఇష్టమైన అర్పణగా ఉన్నాయి. 19కాగా నా దేవుడు తన ఐశ్వర్యంతో క్రీస్తు యేసు మహిమలో మీ ప్రతి అవసరాన్నీ తీరుస్తాడు. 20ఇప్పుడు మన తండ్రి అయిన దేవునికి ఎప్పటికీ మహిమ కలుగు గాక. ఆమేన్. 21పవిత్రులందరికీ క్రీస్తు యేసులో అభివందనాలు చెప్పండి. నాతో పాటు ఉన్న సోదరులంతా మీకు అభివందనాలు చెబుతున్నారు. 22పవిత్రులంతా, ముఖ్యంగా సీజర్ చక్రవర్తి ఇంట్లో ఉన్న పవిత్రులు మీకు అభివందనాలు చెబుతున్నారు. 23ప్రభువైన యేసు క్రీస్తు కృప మీ ఆత్మతో ఉండు గాక.
పత్రిక (భూకంప సమయంలో)
6ప్రభువు తాను ప్రేమించేవాణ్ణి క్రమశిక్షణలో పెడతాడు. తాను స్వీకరించే ప్రతి కుమారుణ్ణి శిక్షిస్తాడు. 7హింసలను క్రమశిక్షణగా భావించి సహించండి. తండ్రి క్రమశిక్షణలో పెట్టని కుమారుడు ఎవరు? దేవుడు మిమ్మల్ని కుమారులుగా భావించి మీతో వ్యవహరిస్తాడు. 8కుమారులు అయిన వారందరినీ దేవుడు క్రమశిక్షణలో పెడతాడు. ఒకవేళ మీకు క్రమశిక్షణ లేదంటే దాని అర్థం మీరు నిజమైన కుమారులు కాదు, అక్రమ సంతానంలాంటి వారన్న మాట. 9ఇంకా చెప్పాలంటే మనకు ఈ లోకంలో తండ్రులు శిక్షణ ఇచ్చేవారుగా ఉన్నారు. మనం వారిని గౌరవిస్తాం. అంతకంటే ఎక్కువగా మనం ఆత్మలకు తండ్రి అయిన వాడికి విధేయులంగా జీవించనక్కర్లేదా? 10మన తండ్రులు వాళ్లకి సరి అని తోచినట్టు కొన్ని సంవత్సరాలు మనకు నేర్పించారు. కాని మనం ఆయన పరిశుద్ధతను పంచుకోడానికి దేవుడు మన మంచి కోసం మనకు శిక్షణనిస్తున్నాడు. 11అయితే ప్రతి క్రమశిక్షణా ప్రస్తుతం మనకు బాధాకరంగానే ఉంటుంది కానీ సంతోషంగా ఏమీ ఉండదు. అయితే ఆ శిక్షణ పొందిన వారికి అది తరువాత నీతి అనే శాంతికరమైన ఫలితాన్ని ఇస్తుంది. 12కాబట్టి సడలి పోయిన మీ చేతులను పైకెత్తండి. బలహీనంగా మారిన మోకాళ్ళను తిరిగి బలపరచండి. 13మీ కుంటికాలు బెణకక బాగుపడేలా మీ మార్గాలు తిన్ననివిగా చేసుకోండి 25మీతో మాట్లాడే వాణ్ణి నిరాకరించకుండా చూసుకోండి. భూమి మీద తమను హెచ్చరించిన వాణ్ణి తిరస్కరించి వారు తప్పించుకోలేకపోతే, పరలోకం నుండి హెచ్చరించేవాణ్ణి తిరస్కరించి మనం ఎలా తప్పించుకుంటాం? 26ఆ సమయంలో ఆయన స్వరం భూమిని కదిలించింది. కానీ ఇప్పుడు ఆయన ఇలా వాగ్దానం చేశాడు. “మరోసారి నేను భూమిని మాత్రమే కాదు, ఆకాశాన్ని కూడా కదిలిస్తాను.” 27“మరోసారి” అనే మాట కదలనివి నిలిచి ఉండడం కోసం కదిలేవాటిని అంటే దేవుడు సృష్టించిన వాటిని తీసివేయడం జరుగుతుందని సూచిస్తుంది.
పత్రిక (పరిశుద్ధ దిమిత్రియస్ కోసం)
1నా కుమారా, క్రీస్తు యేసులో ఉన్న కృపచేత బలవంతుడవుగా ఉండు. 2అనేకుల ముందు నేను నీకు నేర్పిన సంగతులను ఇతరులకు బోధించగలిగిన, నమ్మకమైన వ్యక్తులకు అప్పగించు. 3క్రీస్తు యేసు కోసం మంచి సైనికుడిలా కష్టాలు భరించు. 4సైనికుడు యుద్ధానికి వెళ్ళేటప్పుడు తన జీవితంలో ఇతర వ్యాపకాల్లో చిక్కుకోకుండా తనను సైన్యంలో చేర్చుకున్నవాణ్ణి సంతోషపెట్టాలని ప్రయత్నిస్తాడు. 5ఒక క్రీడాకారుడు నియమాల ప్రకారం పూర్తిచేయకపోతే అతనికి బహుమానం దొరకదు. 6కష్టపడిన వ్యవసాయదారుడే రాబడిలో మొదటి భాగం పొందడానికి అర్హుడు. 7నేను చెప్పే మాటలు ఆలోచించు. అన్ని విషయాల్లో ప్రభువు నీకు జ్ఞానం అనుగ్రహిస్తాడు. 8నా సువార్త ప్రకారం, దావీదు సంతానంలో పుట్టి చనిపోయినవారిలో నుండి లేచిన యేసు క్రీస్తును జ్ఞాపకం చేసుకో. 9ఆ సువార్త విషయంలో నేను ఒక నేరస్థుడిలా సంకెళ్ళపాలై కష్టాలు అనుభవిస్తున్నాను. అయితే దేవుని వాక్యానికి మాత్రం సంకెళ్ళు లేవు. 10అందుచేత ఎన్నికైనవారు నిత్యమైన మహిమతో క్రీస్తు యేసులోని రక్షణ పొందాలని నేను వారి కోసం అన్నీ ఓర్చుకుంటున్నాను.
సువార్త
22“నా తండ్రి నాకు అన్నిటినీ అప్పగించాడు. కుమారుణ్ణి తండ్రి తప్ప మరెవరూ ఎరగరు. అలాగే తండ్రి ఎవరో కుమారుడూ, ఆ కుమారుడు ఎవరికి ఆయనను వెల్లడి చేయడానికి ఇష్టపడతాడో అతడూ తప్ప ఇంకెవరూ ఎరగరు.” 23అప్పుడు ఆయన తన శిష్యుల వైపు తిరిగి ఏకాంతంగా వారితో, “మీరు చూస్తున్న వాటిని చూసే కళ్ళు ధన్యమైనాయి. 24అనేకమంది ప్రవక్తలూ, రాజులూ మీరు చూస్తున్న వాటిని చూడాలని కోరుకున్నా చూడలేకపోయారు, వినాలని కోరుకున్నా వినలేక పోయారని మీతో చెబుతున్నాను” అని అన్నాడు.
సువార్త (భూకంప సమయంలో)
23ఆయన పడవ ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయనతో వెళ్ళారు. 24అప్పుడు సముద్రం మీద తీవ్రమైన తుఫాను చెలరేగి, పడవ మీదికి అలలు ముంచుకు వచ్చాయి. అయితే యేసు నిద్రపోతూ ఉన్నాడు. 25శిష్యులు ఆయనను నిద్ర లేపి, “ప్రభూ, చచ్చిపోతున్నాం. మమ్మల్ని రక్షించండి” అంటూ కేకలు వేశారు. 26యేసు వారితో, “అల్ప విశ్వాసులారా, మీరెందుకు భయపడుతున్నారు?” అని చెప్పి, లేచి గాలినీ సముద్రాన్నీ గద్దించాడు. అప్పుడు అంతా చాలా ప్రశాంతమై పోయింది. 27శిష్యులు ఆశ్చర్యపడి, “ఈయన ఎలాంటివాడో! గాలీ సముద్రం ఈయన మాట వింటున్నాయే” అని చెప్పుకున్నారు.
సువార్త (పరిశుద్ధ దిమిత్రియస్ కోసం)
17మీరు ఒకరినొకరు ప్రేమించాలని ఈ సంగతులు మీకు ఆజ్ఞాపిస్తున్నాను. 18“ఈ లోకం మిమ్మల్ని ద్వేషిస్తే, మీకన్నా ముందు అది నన్ను ద్వేషించిందని తెలుసుకోండి. 19మీరు ఈ లోకానికి చెందిన వారైతే ఈ లోకం దాని సొంతవాళ్ళలా మిమ్మల్ని ప్రేమిస్తుంది. కాని, మీరు లోకానికి చెందిన వారు కాదు. ఎందుకంటే, నేను మిమ్మల్ని ఈ లోకంలోనుంచి వేరు చేశాను. అందుకే ఈ లోకం మిమ్మల్ని ద్వేషిస్తుంది. 20“‘దాసుడు తన యజమానికంటే గొప్పవాడు కాదు’ అని నేను మీతో చెప్పిన మాట గుర్తు చేసుకోండి. వారు నన్ను హింసిస్తే, మిమ్మల్ని కూడా హింసిస్తారు. వారు నా మాట ప్రకారం చేస్తే, మీ మాట ప్రకారం కూడా చేస్తారు. 21వారికి నన్ను పంపిన వాడు తెలియదు కాబట్టి, నా పేరిట ఇవన్నీ మీకు చేస్తారు. 22నేను వచ్చి వారితో మాట్లాడి ఉండకపోతే, వారికి పాపం ఉండేది కాదు. కాని, ఇప్పుడు వారి పాపం నుండి తప్పించుకునే అవకాశం వారికి లేదు. 23“నన్ను ద్వేషించేవాడు నా తండ్రిని కూడా ద్వేషిస్తున్నాడు. 24ఎవ్వరూ చెయ్యని క్రియలు నేను వారి మధ్య చేయకపోతే వారికి పాపం ఉండేది కాదు. కాని, వారు నా కార్యాలు చూసినా నన్నూ, నా తండ్రినీ ద్వేషిస్తున్నారు. 25‘కారణం లేకుండా నన్ను ద్వేషించారు’ అని వారి ధర్మశాస్త్రంలో ఉన్న వాక్కు నెరవేరేలా ఇది జరుగుతూ ఉంది. 26“తండ్రి దగ్గర నుంచి మీ దగ్గరికి నేను పంపబోయే ఆదరణకర్త, సత్యమైన ఆత్మ వచ్చినపుడు, ఆయన నన్ను గురించి సాక్ష్యం ఇస్తాడు. 27మీరు మొదటి నుంచి నాతో ఉన్నవాళ్ళే కాబట్టి మీరు కూడా సాక్షులుగా ఉంటారు. 16:1“మీరు తడబడకుండా ఉండాలని ఈ సంగతులు మీతో మాట్లాడాను. 2వారు మిమ్మల్ని సమాజ మందిరాల్లో నుండి బహిష్కరిస్తారు. మిమ్మల్ని చంపినవారు, దేవుని కోసం మంచి పని చేస్తున్నామని అనుకునే సమయం వస్తుంది.
తేదీలు రష్యన్ సంఘపు జూలియన్ కాలెండర్ను అనుసరిస్తాయి (సెర్బియన్, జార్జియన్ సంఘాలు, ఆథోస్ పర్వతం లాగే): సంఘ కాలెండర్లోని 26 అక్టోబర్ పౌర కాలెండర్లో 8 నవంబర్. కొత్త కాలెండర్ను అనుసరించే సంఘాలు (గ్రీసు, రొమేనియా, బల్గేరియా, ఉక్రెయిన్…) స్థిర పండుగలనూ పరిశుద్ధులనూ పౌర తేదీనే, 13 రోజులు ముందుగా జరుపుకుంటాయి, వాటి కొన్ని పఠనాలు వేరుగా ఉంటాయి; ఈస్టర్, దానిపై ఆధారపడిన రోజులు ఒకటే.
మూలాలు: ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు · © 2017, 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings, the editors' parts and stage directions in the Song of Songs and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · మూలాలు మరియు హక్కులు