Bible Explorer యాప్ పొందండి

హోమ్ › రోజువారీ బైబిల్ పఠనాలు › సెప్టెంబర్ 2027 › 19 సెప్టెంబర్

ఆర్థడాక్స్ కాలెండర్ · సెప్టెంబర్ 6 (పాత శైలి)

ఆర్థడాక్స్ రోజువారీ పఠనాలు — 19 సెప్టెంబర్, 2027

ఆదివారం · స్వరం 4

పండుగలు మరియు పరిశుద్ధులు

పెంతెకొస్తు తర్వాత 13వ ఆదివారం

ఉపవాసం

ఉపవాసం లేదు

ఇది సన్యాస నియమాన్ని అనుసరిస్తుంది. సంఘంలో ఉపవాస పరిమాణాన్ని ఆరోగ్యం, వయస్సు మరియు పరిస్థితుల ప్రకారం తమ ఆత్మీయ గురువుతో కలిసి నిర్ణయిస్తారు.

ఈరోజు పఠనాలు

ఉదయ ప్రార్థన రెండవ సువార్త

మార్కు 16:1–8

1విశ్రాంతి దినం అయిపోగానే, మగ్దలేనే మరియ, యాకోబు తల్లి మరియ, సలోమి కలిసి వెళ్ళి యేసు దేహానికి పూయడానికి సుగంధ ద్రవ్యాలు కొన్నారు. 2ఆదివారం ఉదయం తెల్లవారుతూ ఉండగా వారు యేసు సమాధి దగ్గరికి వస్తూ, 3“మన కోసం సమాధిని మూసిన ఆ రాయిని ఎవరు దొర్లిస్తారు?” అని ఒకరితో ఒకరు చెప్పుకున్నారు. 4వారు వచ్చి సమాధికేసి చూడగా ఆ పెద్ద రాయి పక్కకి దొర్లించి ఉంది. 5వారు ఆ సమాధిలోకి వెళ్ళి తెల్లటి దుస్తులు ధరించిన ఒక యువకుడు కుడి పక్కన కూర్చుని ఉండడం చూశారు. అది చూసి వారు నిర్ఘాంతపోయారు. 6అతడు వారితో ఇలా అన్నాడు, “భయపడకండి! మీరు వెతుకుతున్నది సిలువ మరణం పొందిన నజరేతువాడైన యేసును. ఆయన తిరిగి బతికాడు. ఇక్కడ లేడు. ఇదిగో ఆయనను ఉంచిన స్థలం ఇదే. 7మీరు వెళ్ళి ఆయన శిష్యులతో, పేతురుతో ఇలా చెప్పండి. “యేసు మీకంటే ముందుగా గలిలయకి వెళ్తున్నాడు. ఆయన ముందుగానే చెప్పినట్టు మీరు ఆయనను అక్కడ చూస్తారు.” 8ఆ స్త్రీలు భయపడుతూ, వణుకుతూ, ఆ సమాధి నుండి పరుగెత్తి వెళ్ళిపోయారు. వారు భయం వల్ల తమలో తాము ఏమీ మాట్లాడుకోలేదు.

పత్రిక

1 కొరింతీ 16:13–24

13మెలకువగా ఉండండి, విశ్వాసంలో నిలకడగా ఉండండి, ధైర్యం గలిగి, బలవంతులై ఉండండి. 14మీరు చేసే పనులన్నీ ప్రేమతో చేయండి. 15స్తెఫను ఇంటివారు అకయ ప్రాంతానికి ప్రథమ ఫలమనీ, వారు పరిశుద్ధులకు సేవ చేయడానికి తమను అంకితం చేసుకున్నారనీ మీకు తెలుసు. 16కాబట్టి సోదరులారా, అలాటి వారికి, పనిలో సహాయం చేసే వారికి, కష్టపడే వారికందరికీ లోబడి ఉండమని మిమ్మల్ని బతిమాలుతూ ఉన్నాను. 17స్తెఫను, ఫొర్మూనాతు, అకాయికు అనే వారు రావడం సంతోషంగా ఉంది. మీరు లేని కొరత నాకు వీరి వల్ల తీరింది. 18నా ఆత్మకు, మీ ఆత్మకు వీరు ఆదరణ కలిగించారు. అలాటి వారిని గుర్తించి గౌరవించండి. 19ఆసియలోని సంఘాల వారు మీకు అభివందనాలు చెబుతున్నారు. అకుల, ప్రిస్కిల్ల, వారి ఇంట్లో ఉన్న సంఘమూ ప్రభువులో మీకు అనేక అభివందనాలు చెబుతున్నారు. 20ఇక్కడి సోదరులంతా మీకు అభివందనాలు చెబుతున్నారు. పవిత్రమైన ముద్దుపెట్టుకుని, మీరు ఒకరికి ఒకరు అభివందనాలు చెప్పుకోండి. 21పౌలు అనే నేను నా స్వహస్తంతో ఈ అభివందనం రాస్తున్నాను. 22ఎవరైనా ప్రభువును ప్రేమించకుండా ఉంటే వారికి శాపం కలుగు గాక. ప్రభువు వస్తున్నాడు. 23ప్రభు యేసు క్రీస్తు కృప మీకు తోడుగా ఉండుగాక. 24క్రీస్తు యేసులో ఉన్న నా ప్రేమ మీ అందరితో ఉంటుంది. ఆమేన్‌.

సువార్త

మత్తయి 21:33–42

33“ఇంకో ఉపమానం వినండి, ఒక యజమాని తన పెద్ద స్థలంలో ద్రాక్షతోట నాటించి, దాని చుట్టూ ప్రహరీ గోడ కట్టించాడు. అందులో ద్రాక్షగానుగ ఏర్పాటు చేసి, కావలికి ఎత్తుగా ఒక గోపురం కట్టించి, దాన్ని కౌలుకిచ్చి దూరదేశం వెళ్ళాడు. 34కోతకాలం వచ్చినప్పుడు పంటలో తన వంతు తీసుకు రమ్మని ఆ కౌలు రైతుల దగ్గరికి తన దాసులను పంపాడు. 35ఆ రైతులు అతని దాసులను పట్టుకుని, ఒకణ్ణి కొట్టారు, ఒకణ్ణి చంపారు. ఇంకొకణ్ణి రాళ్ళతో కొట్టి చంపారు. 36అప్పుడు అతడు ముందుకంటే ఎక్కువమంది ఇతర దాసులను పంపాడు. కానీ వారు వీరిని కూడా ముందు వారికి చేసినట్టే చేశారు. 37చివరికి ఆ యజమాని ‘నా కుమారుణ్ణి అయితే వారు గౌరవిస్తారు’ అనుకుని, తన కుమారుణ్ణి వారి దగ్గరికి పంపాడు. 38అయితే ఆ కౌలుదారులు అతణ్ణి చూసి, ‘అడుగో, అతడే వారసుడు. అతణ్ణి చంపివేసి అతని వారసత్వం లాగేసుకుందాం, రండి’ అని తమలో తాము చెప్పుకున్నారు. 39వారు అతణ్ణి పట్టుకుని ద్రాక్షతోట బయటికి తోసి చంపేశారు. 40ఇప్పుడు ఆ ద్రాక్షతోట యజమాని వచ్చి ఆ రైతులను ఏం చేస్తాడు?” అని వారిని అడిగాడు. 41వారు “అతడు ఆ దుర్మార్గులను నిర్దాక్షిణ్యంగా వధిస్తాడు. కోతకాలంలో తనకు రావలసిన కౌలు పండ్లను సక్రమంగా చెల్లించే ఇతర రైతులకు ఆ ద్రాక్షతోటను కౌలుకిస్తాడు” అని ఆయనకు జవాబిచ్చారు. 42అప్పుడు యేసు వారితో, “‘ఇల్లు కట్టేవారు తిరస్కరించిన రాయి చివరికి ముఖ్యమైన పునాది రాయి అయ్యింది. దీన్ని ప్రభువే చేశాడు. ఇది మనకు ఆశ్చర్యకరం,’ అనే మాట మీరు లేఖనాల్లో ఎప్పుడూ చదవలేదా?

తేదీలు రష్యన్ సంఘపు జూలియన్ కాలెండర్‌ను అనుసరిస్తాయి (సెర్బియన్, జార్జియన్ సంఘాలు, ఆథోస్ పర్వతం లాగే): సంఘ కాలెండర్‌లోని 6 సెప్టెంబర్ పౌర కాలెండర్‌లో 19 సెప్టెంబర్. కొత్త కాలెండర్‌ను అనుసరించే సంఘాలు (గ్రీసు, రొమేనియా, బల్గేరియా, ఉక్రెయిన్…) స్థిర పండుగలనూ పరిశుద్ధులనూ పౌర తేదీనే, 13 రోజులు ముందుగా జరుపుకుంటాయి, వాటి కొన్ని పఠనాలు వేరుగా ఉంటాయి; ఈస్టర్, దానిపై ఆధారపడిన రోజులు ఒకటే.

మూలాలు: ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు · © 2017, 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings, the editors' parts and stage directions in the Song of Songs and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · మూలాలు మరియు హక్కులు