Bible Explorer యాప్ పొందండి

హోమ్ › రోజువారీ బైబిల్ పఠనాలు › ఆగస్టు 2027 › 26 ఆగస్టు

ఆర్థడాక్స్ కాలెండర్ · ఆగస్టు 13 (పాత శైలి)

ఆర్థడాక్స్ రోజువారీ పఠనాలు — 26 ఆగస్టు, 2027

గురువారం · పెంతెకొస్తు తర్వాత 10వ వారం · స్వరం 8

పండుగలు మరియు పరిశుద్ధులు

Apodosis of the Transfiguration of the Lord

మరియ నిద్ర ఉపవాసం

ఉపవాసం: నూనె లేకుండా వండిన ఆహారం

ఇది సన్యాస నియమాన్ని అనుసరిస్తుంది. సంఘంలో ఉపవాస పరిమాణాన్ని ఆరోగ్యం, వయస్సు మరియు పరిస్థితుల ప్రకారం తమ ఆత్మీయ గురువుతో కలిసి నిర్ణయిస్తారు.

ఈరోజు పఠనాలు

సాయంకాల ప్రార్థన: పఠనం

సామె 10; సామె 3; సామె 8 (ఎంచుకున్న వచనాలు)

సాయంకాల ప్రార్థన: పఠనం

సామె 10:31–11:12

31ఉత్తముడు జ్ఞానాన్ని, ఉపదేశాన్ని బోధిస్తాడు. మూర్ఖపు మాటలు మాట్లాడే నాలుకను తెగ గొడతారు. 32ఉత్తముడు అనుకూలమైన మాటలు పలుకుతాడు. భక్తిహీనుల నోటి నుండి మూర్ఖపు మాటలు వస్తాయి. 11:1దొంగ త్రాసు యెహోవాకు అసహ్యం. న్యాయమైన తూకం ఆయనకు ఇష్టం. 2గర్వం వెనకాలే అవమానం బయలు దేరుతుంది. జ్ఞానం గలవారు వినయ విధేయతలు కలిగి ఉంటారు. 3నిజాయితీ గల వారిని వారి న్యాయబుద్ధి నడిపిస్తుంది. దుర్మార్గుల మూర్ఖత్వం వారిని చెడగొడుతుంది. 4దేవుని ఉగ్రత దినం వచ్చినప్పుడు ఆస్తిపాస్తులు ఉపయోగపడవు. నీతిమంతులు మరణం నుండి తప్పించు కుంటారు. 5యథార్థవంతుల న్యాయ ప్రవర్తన వారి మార్గాన్ని సరళం చేస్తుంది. దుష్టులు తమ దుర్మార్గ క్రియలవల్ల కూలిపోతారు. 6నిజాయితీపరుల మంచితనం వారికి విడుదల కలిగిస్తుంది. ద్రోహులు తమ దురాశ చేత చిక్కుల్లో పడతారు. 7దుష్టుడు చనిపోయినప్పుడు వాడి ఆశాభావం అంతరించిపోతుంది. బలవంతుడి కోరికలు భగ్నమైపోతాయి. 8ఉత్తముడు కష్టాల నుండి విడుదల పొందుతాడు. మూర్ఖులు కష్టాలు కొనితెచ్చుకుంటారు. 9మూర్ఖుడు తన నోటి మాటచేత తన పొరుగువారికి నాశనం కలిగిస్తాడు. నీతిమంతులు తమ తెలివి ఉపయోగించి తప్పించుకుంటారు. 10నీతిమంతులు దీవెన పొందడం పట్టణానికి శుభదాయకం. దుర్మార్గులు నాశనమైతే ఆనంద ధ్వనులు మోగుతాయి. 11నీతిమంతులు దీవెనలు పొందితే పట్టణం ఉన్నత స్థితికి చేరుతుంది. దుష్టుల మాటలు దాన్ని కూలిపోయేలా చేస్తాయి. 12తన పొరుగువాణ్ణి కించపరిచేవాడు జ్ఞానహీనుడు. వివేకం గల వాడు మౌనం వహిస్తాడు.

సాయంకాల ప్రార్థన: పఠనం

ఈ అనువాదంలో లేదు

ఉదయ ప్రార్థన: సువార్త

యోహా 10:9–16

9నేనే ప్రవేశ ద్వారం, నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశిస్తే వాడికి రక్షణ దొరుకుతుంది. వాడు లోపలికి వస్తూ బయటకి వెళ్తూ పచ్చికను కనుగొంటాడు. 10దొంగ కేవలం దొంగతనం, హత్య, నాశనం చెయ్యడానికి మాత్రమే వస్తాడు. గొర్రెలకు జీవం కలగాలని, ఆ జీవం సమృద్ధిగా కలగాలని నేను వచ్చాను. 11నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి గొర్రెల కోసం తన ప్రాణం ఇస్తాడు. 12జీతం కోసం పని చేసేవాడు కాపరిలాంటి వాడు కాదు. గొర్రెలు తనవి కావు కాబట్టి తోడేలు రావడం చూసి గొర్రెలను వదిలిపెట్టి పారిపోతాడు. తోడేలు ఆ గొర్రెలను పట్టుకుని చెదరగొడుతుంది. 13జీతగాడు జీతం మాత్రమే కోరుకుంటాడు కాబట్టి గొర్రెలను పట్టించుకోకుండా పారిపోతాడు. 14నేను గొర్రెలకు మంచి కాపరిని. నా గొర్రెలు నాకు తెలుసు. నా సొంత గొర్రెలకు నేను తెలుసు. 15నా తండ్రికి నేను తెలుసు. నాకు నా తండ్రి తెలుసు. నా గొర్రెల కోసం ప్రాణం పెడతాను. 16ఈ గొర్రెలశాలకు చెందని ఇతర గొర్రెలు నాకు ఉన్నాయి. వాటిని కూడా నేను తీసుకురావాలి. అవి నా స్వరం వింటాయి. అప్పుడు ఉండేది ఒక్క మంద, ఒక్క కాపరి.

పత్రిక

2 కొరింతీ 1:1–7

1కొరింతులోని దేవుని సంఘానికీ అకయ ప్రాంతమంతటా ఉన్న పరిశుద్ధులందరికీ దేవుని సంకల్పం వలన క్రీస్తు యేసు అపొస్తలుడు అయిన పౌలు, మన సోదరుడు తిమోతి రాస్తున్న విషయాలు. 2మన తండ్రి అయిన దేవుని నుండీ యేసు క్రీస్తు ప్రభువు నుండీ మీకు కృప, శాంతి కలుగు గాక. 3మన ప్రభువైన యేసు క్రీస్తు తండ్రి అయిన దేవునికి స్తుతి కలుగు గాక. ఆయన దయగల తండ్రి, అన్ని విధాలా ఆదరించే దేవుడు. 4ఆయన మా కష్టాలన్నిటిలో మమ్మల్ని ఆదరిస్తున్నాడు. దేవుడు మాకు చూపిన ఆ ఆదరణ మేమూ చూపి ఎలాంటి కష్టాల్లో ఉన్నవారినైనా ఆదరించగలిగేలా ఆయన మమ్మల్ని ఆదరిస్తున్నాడు. 5క్రీస్తు పడిన బాధలు మాలో అధికమయ్యే కొద్దీ, క్రీస్తు ఆదరణ కూడా మాలో అంతకంతకూ అధికం అవుతూ ఉంది. 6మాకు కష్టాలు వస్తే అవి మీ విమోచన కోసం, మీ ఆదరణ కోసం. మాకు ఆదరణ కలిగితే అది కూడా మీ ఆదరణ కోసమే. మాలాగే మీరూ పడుతున్న కష్టాలను సహించడానికి కావలసిన ఓర్పును ఈ ఆదరణ కలిగిస్తున్నది. 7మీరు మా కష్టాలను ఎలా పంచుకుంటున్నారో అలాగే మా ఆదరణ కూడా పంచుకుంటున్నారని మాకు తెలుసు. అందుచేత మీ గురించి మాకు దృఢమైన ఆశాభావం ఉంది.

పత్రిక (పరిశుద్ధ తిఖోన్ కోసం)

హెబ్రీ 7:26–8:2

26ఆయన కల్మషం అంటని వాడు, నిందా రహితుడు, పవిత్రుడు, పాపులకు వేరుగా ఉన్నవాడు, ఆకాశాల కంటే ఉన్నతంగా ఉన్నాడు. ఇలాటి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. 27ఇతర ప్రధాన యాజకుల్లాగా ప్రతిదినం ముందుగా తన సొంత పాపాల కోసం అర్పణలు అర్పించి తరువాత ప్రజల కోసం అర్పించాల్సిన అవసరం ఈయనకు లేదు. ఈయన తనను తానే అర్పణగా ఒక్కసారే అర్పించి ముగించాడు. 28ధర్మశాస్త్రం బలహీనతలున్న వారిని ముఖ్య యాజకులుగా నియమిస్తుంది. కాని ధర్మశాస్త్రం తరువాత వచ్చిన ప్రమాణ వాక్కు కుమారుణ్ణి ప్రధాన యాజకుడిగా నియమించింది. ఈయన శాశ్వతకాలం నిలిచే పరిపూర్ణత పొందినవాడు. 8:1ఇప్పుడు మేం చెబుతున్న విషయంలో ముఖ్యాంశం ఇది. మనకు ఒక ప్రధాన యాజకుడున్నాడు. ఆయన పరలోకంలో మహా ఘనత వహించిన దేవుని సింహాసనానికి కుడివైపున ఆసీనుడై ఉన్నాడు. 2మానవ నిర్మితం కాకుండా ప్రభువే నెలకొల్పిన ప్రత్యక్ష గుడారం అయిన పరిశుద్ధ గర్భాలయంలో ఆయన సేవకుడుగా ఉన్నాడు.

సువార్త

మత్తయి 21:43–46

43“కాబట్టి దేవుని రాజ్యాన్ని మీ నుండి తీసివేసి, దాని ఫలాలను తిరిగి ఇచ్చే ప్రజలకు ఇస్తారు అని మీతో చెబుతున్నాను. 44ఈ బండ మీద పడేవాడు ముక్కలై పోతాడు గానీ అది ఎవరి మీద పడుతుందో వాణ్ణి అది నలిపి పొడి చేస్తుంది” అన్నాడు. 45ఆయన చెప్పిన ఉదాహరణలన్నీ తమ గురించే చెప్పాడని ముఖ్య యాజకులు, పరిసయ్యులు గ్రహించారు. 46వారు ఆయనను పట్టుకోడానికి తగిన సమయం కోసం చూశారుగానీ ప్రజలకు భయపడ్దారు. ఎందుకంటే ప్రజలంతా ఆయనను ఒక ప్రవక్తగా భావిస్తున్నారు.

సువార్త (పరిశుద్ధ తిఖోన్ కోసం)

మత్తయి 5:14–19

14ప్రపంచానికి మీరు వెలుగుగా ఉన్నారు. కొండ మీద ఉండే ఊరు కనబడకుండా ఉండదు. 15ఎవరూ దీపం వెలిగించి బుట్ట కింద పెట్టరు. దీపస్తంభం మీదే పెడతారు. అప్పుడు ఆ దీపం ఇంట్లో అందరికీ వెలుగు ఇస్తుంది. 16మీ వెలుగు మనుషుల ముందు ప్రకాశించనీయండి. అప్పుడు వారు మీ మంచి పనులు చూసి పరలోకంలో ఉన్న మీ తండ్రిని కీర్తిస్తారు. 17“నేను ధర్మశాస్త్రాన్ని గానీ ప్రవక్తల మాటలను గానీ రద్దు చేయడానికి వచ్చాననుకోవద్దు. వాటిని నెరవేర్చడానికే వచ్చాను గానీ రద్దు చేయడానికి కాదు. 18నేను కచ్చితంగా చెబుతున్నాను. ఆకాశం, భూమి నశించే వరకూ ధర్మశాస్త్రమంతా నెరవేరే వరకూ ధర్మశాస్త్రం నుంచి ఒక్క పొల్లు అయినా, ఒక సున్నా అయినా తప్పిపోదు. 19కాబట్టి ఈ ఆజ్ఞల్లో ఎంత చిన్న దానినైనా సరే అతిక్రమించి, ఇతరులకు కూడా అలా చేయమని బోధించేవాణ్ణి పరలోకరాజ్యంలో అతి తక్కువ వాడుగా ఎంచుతారు. కానీ ఈ ఆజ్ఞల ప్రకారం చేస్తూ, వాటిని బోధించేవాణ్ణి పరలోక రాజ్యంలో గొప్పవాడుగా లెక్కిస్తారు.

తేదీలు రష్యన్ సంఘపు జూలియన్ కాలెండర్‌ను అనుసరిస్తాయి (సెర్బియన్, జార్జియన్ సంఘాలు, ఆథోస్ పర్వతం లాగే): సంఘ కాలెండర్‌లోని 13 ఆగస్టు పౌర కాలెండర్‌లో 26 ఆగస్టు. కొత్త కాలెండర్‌ను అనుసరించే సంఘాలు (గ్రీసు, రొమేనియా, బల్గేరియా, ఉక్రెయిన్…) స్థిర పండుగలనూ పరిశుద్ధులనూ పౌర తేదీనే, 13 రోజులు ముందుగా జరుపుకుంటాయి, వాటి కొన్ని పఠనాలు వేరుగా ఉంటాయి; ఈస్టర్, దానిపై ఆధారపడిన రోజులు ఒకటే.

మూలాలు: ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు · © 2017, 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings, the editors' parts and stage directions in the Song of Songs and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · మూలాలు మరియు హక్కులు