Bible Explorer యాప్ పొందండి

హోమ్ › రోజువారీ బైబిల్ పఠనాలు › ఆగస్టు 2027 › 26 ఆగస్టు

కాథలిక్ కాలెండర్

రోజువారీ బైబిల్ పఠనాలు (కాథలిక్) — 26 ఆగస్టు, 2027

గురువారం · సామాన్య కాలం 21వ వారం

పండుగలు మరియు పరిశుద్ధులు

సామాన్య కాలం 21వ వారపు గురువారం

వారపు రోజు · ఆరాధన రంగు: ఆకుపచ్చ

ఈరోజు పఠనాలు

మొదటి పఠనం

1 తెస్స 3:7–13

7అందుచేత సోదరులారా, మీ విశ్వాసం చూసి మా ఇబ్బందులన్నిటిలో హింసలన్నిటిలో ఆదరణ పొందాం. 8ఎందుకంటే మీరు ప్రభువులో నిలకడగా ఉంటే మా జీవితం సార్థకం అయినట్టే. 9మీ గురించీ, దేవుని ఎదుట మీ విషయంలో మాకు కలిగే ఆనందం గురించి దేవునికి మేము ఏమని కృతజ్ఞతలు చెల్లించగలం? 10మీ ముఖాలు చూడాలనీ, మీ విశ్వాసంలో కొరతగా ఉన్నవాటిని సరిచేయాలనీ రాత్రింబగళ్ళు తీవ్రంగా ప్రార్థనలో వేడుకుంటున్నాం 11మన తండ్రి అయిన దేవుడూ, మన ప్రభు యేసూ మమ్మల్ని మీ దగ్గరికి ఎలాంటి ఆటంకం లేకుండా తీసుకువస్తాడు గాక! 12మీ పట్ల మా ప్రేమ ఎలా అభివృద్ధి చెందుతూ వర్ధిల్లుతూ ఉన్నదో అలాగే మీరు కూడా ఒకరిపట్ల ఒకరు, ఇంకా, అందరి పట్ల కూడా ప్రేమలో అభివృద్ధి చెంది వర్ధిల్లేలా ప్రభువు అనుగ్రహించు గాక. 13మన ప్రభువైన యేసు తన పరిశుద్ధులందరితో కలిసి వచ్చినప్పుడు మన తండ్రి అయిన దేవుని ఎదుట మీ హృదయాలు పరిశుద్ధత విషయంలో నిందారహితంగా ఉండేలా ఆయన స్థిరపరచు గాక!

ప్రతిస్పందన కీర్తన

కీర్త 90:3–4, 12–14, 17

3నువ్వు మనుషులను తిరిగి మట్టిగా మారుస్తావు. మనుషులారా, తిరిగి రండి, అంటావు. 4నీ దృష్టిలో వెయ్యేళ్ళు గడిచిపోయిన నిన్నలాగా ఒక రాత్రిపూటలాగా ఉన్నాయి. 12కాబట్టి మేము జ్ఞానంగా బ్రతికేలా మా బ్రతుకును గురించి ఆలోచించడం మాకు నేర్పు. 13యెహోవా, తిరిగి రా! ఎంతకాలం పడుతుంది? నీ సేవకుల పట్ల జాలి పడు. 14ఉదయాన నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచు. అప్పుడు మేము మా రోజులన్నీ ఉల్లాసంగా ఆనందంగా గడుపుతాం. 17మా యెహోవా దేవుని ప్రసన్నత మా మీద ఉండు గాక. మా చేతి పనిని మాకు సుస్థిరం చెయ్యి. నిజంగా, మా చేతి పనిని మాకు సుస్థిరం చెయ్యి.

సువార్త

మత్తయి 24:42–51

42ఏ రోజున మీ ప్రభువు వస్తాడో మీకు తెలియదు కాబట్టి మెలకువగా ఉండండి. 43దొంగ ఏ గంటలో వస్తాడో ఇంటి యజమానికి ముందే తెలిస్తే అతడు మేలుకుని ఉండి దొంగతనం చేయనివ్వడు కదా! 44మీరు ఎదురు చూడని గంటలో మనుష్య కుమారుడు వస్తాడు కాబట్టి మీరు కూడా సిద్ధంగా ఉండండి. 45“ఒక యజమాని తన ఇంట్లో పనివారికి వేళకు భోజనం పెట్టడానికి నియమించిన నమ్మకమైన, తెలివైన దాసుడు ఎవరు? 46యజమాని ఇంటికి వచ్చినప్పుడు ఏ దాసుడు ఆ విధంగా చేస్తుండడం గమనిస్తాడో ఆ దాసుడు ధన్యుడు. 47ఆ యజమాని తన యావదాస్తి మీదా ఆ దాసుని నియమిస్తాడని నేను మీతో కచ్చితంగా చెబుతున్నాను. 48కానీ ఆ దాసుడు చెడ్డవాడైతే, ‘నా యజమాని ఆలస్యంగా వస్తాడులే’ అని తన మనసులో అనుకుని 49తన సాటి సేవకులను కొడుతూ, తాగుబోతులతో కలిసి తింటూ, తాగుతూ ఉంటే, 50అతడు ఎదురు చూడని రోజున, అనుకోని గంటలో వాని యజమాని వస్తాడు. 51వాణ్ణి రెండు ముక్కలుగా నరికించి కపట వేషధారులతో బాటు వాడిని శిక్షిస్తాడు. అక్కడ ఏడుపూ పండ్లు కొరకడమూ ఉంటాయి.”

సాధారణ రోమన్ కాలెండర్; ఒక బిషప్‌ల సమావేశం కొన్ని పండుగలను (దివ్యదర్శనం, పరలోకారోహణం, క్రీస్తు శరీర రక్తాల పండుగ) ఒక ఆదివారానికి మార్చవచ్చు లేదా తన సొంత పండుగలను జోడించవచ్చు. పఠన గ్రంథం: ఆదివారపు చక్రం B, వారపు రోజుల సంవత్సరం I.

మూలాలు: ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు · © 2017, 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings, the editors' parts and stage directions in the Song of Songs and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · మూలాలు మరియు హక్కులు