హోమ్ › రోజువారీ బైబిల్ పఠనాలు › జులై 2027 › 16 జులై
కాథలిక్ కాలెండర్
రోజువారీ బైబిల్ పఠనాలు (కాథలిక్) — 16 జులై, 2027
శుక్రవారం · సామాన్య కాలం 15వ వారం
పండుగలు మరియు పరిశుద్ధులు
సామాన్య కాలం 15వ వారపు శుక్రవారం
ఐచ్ఛిక స్మరణ దినం · ఆరాధన రంగు: ఆకుపచ్చ
కర్మెలు పర్వత మాత · ఐచ్ఛిక స్మరణ దినం
ఉపవాసం మరియు పశ్చాత్తాపం
పశ్చాత్తాప దినం
ప్రతి శుక్రవారం పశ్చాత్తాప దినం; దాన్ని ఎలా పాటించాలో ప్రతి బిషప్‌ల సమావేశం నిర్ణయిస్తుంది: మాంసం మానడం లేదా మరో పశ్చాత్తాప క్రియ. ఉపవాసం 18 నుండి 59 ఏళ్ల వరకు, మాంస విరమణ 14 ఏళ్ల నుండి వర్తిస్తుంది.
ఈరోజు పఠనాలు
మొదటి పఠనం
10మోషే అహరోనులు ఫరో సమక్షంలో ఈ అద్భుతాలు చేశారు. అయినప్పటికీ యెహోవా ఫరో హృదయాన్ని కఠినం చేశాడు. అతడు ఇశ్రాయేలు ప్రజలను తన దేశం నుండి వెళ్ళనియ్యలేదు. 12:1మోషే అహరోనులతో ఐగుప్తు దేశంలో యెహోవా ఇలా చెప్పాడు. 2“నెలల్లో ఈ నెల మీకు మొదటిది. ఇది మీ సంవత్సరానికి మొదటి నెలన్న మాట. 3ఇశ్రాయేలు సమాజంతో ఇలా చెప్పు. మీరు ఇశ్రాయేలు ప్రజల సమాజమంతటితో కలసి ఈ నెల పదవ రోజున తమ కుటుంబాల ప్రకారం ప్రతి ఒక్కడూ, అంటే ప్రతి ఇంటి లెక్క చొప్పున ఒక గొర్రెపిల్లను గానీ, మేకపిల్లను గానీ తీసుకోవాలి. 4ఒక కుటుంబం ఆ గొర్రెపిల్లను తినడానికి చిన్నదైతే ఆ కుటుంబ పెద్ద ఒక గొర్రె పిల్ల, లేక మేక పిల్ల సరిగ్గా సరిపోయే విధంగా తన పొరుగింటి కుటుంబ సభ్యులను కలుపుకుని ఆ ప్రకారం వారిని లెక్కగట్టాలి. 5మీరు ఎన్నుకొనే గొర్రె లేదా మేక పిల్ల ఒక సంవత్సరం వయసు గల మగదై ఉండాలి. అది ఎలాంటి లోపం లేకుండా ఉండాలి. 6ఈ నెల 14 వ రోజు వరకూ దాన్ని ఉంచాలి. తరువాత ఇశ్రాయేలు ప్రజలంతా సాయంకాల సమయంలో దాన్ని చంపాలి. 7కొంచెం రక్తం తీసుకుని ఆ మాంసం ఏ ఇంట్లో తింటారో ఈ ఇంటి గుమ్మం రెండు నిలువు కమ్ముల మీద, పై కమ్మీ మీద చల్లాలి. 8ఆ రాత్రివేళ నిప్పులతో మాంసాన్ని కాల్చి తినాలి. పొంగకుండా చేసిన రొట్టెలతో, చేదు కూరలతో కలిపి దాన్ని తినాలి. 9దాన్ని పచ్చిగా గానీ ఉడికించిగానీ తినకూడదు. దాని తల, కాళ్ళు, లోపలి భాగాలను నిప్పుతో కాల్చి తినాలి. 10తెల్లవారే పాటికి దానిలో ఏమీ మిగల్చకూడదు. ఒకవేళ ఏమైనా మిగిలితే దాన్ని పూర్తిగా కాల్చివెయ్యాలి. 11మీరు దాన్ని తినవలసిన విధానం ఇది. మీ నడుముకు నడికట్టు కట్టుకుని, కాళ్ళకు చెప్పులు వేసుకుని, మీ కర్రలు చేతబట్టుకుని త్వరత్వరగా తినాలి. ఎందుకంటే అది యెహోవాకు పస్కా బలి. 12నేను ఆ రాత్రి వేళ ఐగుప్తు దేశమంతా తిరుగుతూ ఆ దేశంలోని మనుషుల్లో, జంతువుల్లో మొదటి సంతానం మొత్తాన్ని చంపివేస్తాను. ఐగుప్తు దేవుళ్ళ విషయంలో తీర్పు తీరుస్తాను. నేను యెహోవాను. 13మీరు నివసించే ఇళ్ళపై ఉన్న ఆ రక్తం యెహోవా రాక విషయంలో మీకు ఆనవాలుగా ఉంటుంది. నేను ఐగుప్తు జాతి మొదటి సంతానాన్ని నాశనం చేస్తూ ఉన్న సమయంలో ఆ రక్తాన్ని చూసి మిమ్మల్ని చంపకుండా దాటి వెళ్ళిపోతాను. ఈ విపత్తు మీ మీదికి వచ్చి మిమ్మల్ని నాశనం చేయదు. 14కాబట్టి ఈ రోజు మీకు స్మారక దినంగా ఉంటుంది. ఈ రోజును యెహోవా పండగ దినంగా తరతరాలుగా మీరు ఆచరించాలి. ఎందుకంటే ఇది యెహోవా నియమించిన శాశ్వతమైన కట్టుబాటు.
ప్రతిస్పందన కీర్తన
12యెహోవా నాకు చేసిన ఉపకారాలన్నిటికీ నేనాయనకేమి చెల్లిస్తాను? 13రక్షణపాత్రను ఎత్తి పట్టుకుని యెహోవా నామంలో ప్రార్థన చేస్తాను. 15యెహోవా భక్తుల మరణం ఆయన దృష్టికి విలువ గలది. 16యెహోవా, నేను నిజంగా నీ సేవకుణ్ణి. నీ సేవకుణ్ణి, నీ సేవకురాలి కుమారుణ్ణి. నీవు నా కట్లు విప్పావు. 17నేను నీకు కృతజ్ఞత అర్పణలు అర్పిస్తాను. యెహోవా నామంలో ప్రార్థన చేస్తాను 18ఆయన ప్రజలందరి ఎదుటా యెహోవాకు నా మొక్కుబడులు తీరుస్తాను.
సువార్త
1ఆ రోజుల్లో యేసు ఒక విశ్రాంతి దినాన పంటచేలో పడి వెళ్తూ ఉంటే ఆయన శిష్యులకు ఆకలి వేసి కంకులు తుంచి తింటున్నారు. 2పరిసయ్యులు అది చూసి, “చూడు, విశ్రాంతి దినాన చేయకూడనిది నీ శిష్యులు చేస్తున్నారు” అని ఆయనతో అన్నారు. 3ఆయన వారితో, “దావీదుకూ అతనితో ఉన్న వారికీ ఆకలి వేస్తే అతడు చేసిన దాని గురించి మీరు చదవలేదా? 4అతడు దేవుని మందిరంలో ప్రవేశించి, యాజకులే తప్ప తాను గానీ తనతో ఉన్నవారు గానీ తినకూడని సముఖపు రొట్టెలు తిన్నాడు. 5విశ్రాంతి దినాన దేవాలయంలోని యాజకులు విశ్రాంతి దినాన్ని అతిక్రమించినా కూడా నిర్దోషులుగానే ఉన్నారని మీరు ధర్మశాస్త్రంలో చదవలేదా? 6దేవాలయం కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడని మీతో చెబుతున్నాను. 7‘కనికరాన్నే కోరుతున్నాను, బలిని కోరను’ అనే వాక్యభావం మీకు తెలిసి ఉంటే నిర్దోషులను దోషులుగా తీర్పు తీర్చరు. 8కాగా మనుష్యకుమారుడు విశ్రాంతి దినానికి ప్రభువు” అన్నాడు.
సాధారణ రోమన్ కాలెండర్; ఒక బిషప్‌ల సమావేశం కొన్ని పండుగలను (దివ్యదర్శనం, పరలోకారోహణం, క్రీస్తు శరీర రక్తాల పండుగ) ఒక ఆదివారానికి మార్చవచ్చు లేదా తన సొంత పండుగలను జోడించవచ్చు. పఠన గ్రంథం: ఆదివారపు చక్రం B, వారపు రోజుల సంవత్సరం I.
మూలాలు: ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు · © 2017, 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings, the editors' parts and stage directions in the Song of Songs and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · మూలాలు మరియు హక్కులు