హోమ్ › రోజువారీ బైబిల్ పఠనాలు › జులై 2027 › 5 జులై
కాథలిక్ కాలెండర్
రోజువారీ బైబిల్ పఠనాలు (కాథలిక్) — 5 జులై, 2027
సోమవారం · సామాన్య కాలం 14వ వారం
పండుగలు మరియు పరిశుద్ధులు
సామాన్య కాలం 14వ వారపు సోమవారం
ఐచ్ఛిక స్మరణ దినం · ఆరాధన రంగు: ఆకుపచ్చ
పునీత అంతోని జక్కారియా, గురువు · ఐచ్ఛిక స్మరణ దినం
ఈరోజు పఠనాలు
మొదటి పఠనం
10యాకోబు బెయేర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెళ్తూ 11ఒకచోట పొద్దుగుంకడంతో అక్కడ ఆ రాత్రి ఆగిపోయి, అక్కడి రాళ్ళలో ఒక దాన్ని తనకు తలగడగా చేసుకుని, పడుకున్నాడు. 12అప్పుడతనికి ఒక కల వచ్చింది. అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలిపి ఉంది. దాని కొన ఆకాశాన్ని అంటింది. దానిమీద దేవుని దూతలు ఎక్కుతూ దిగుతూ ఉన్నారు. 13యెహోవా దానికి పైగా నిలబడి “నేను నీ తండ్రి అయిన అబ్రాహాము దేవుడు, ఇస్సాకు దేవుడు అయిన యెహోవాని. నువ్వు పండుకున్న ఈ భూమిని నీకూ నీ సంతానానికీ ఇస్తాను. 14నీ సంతానం భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల్లాగా అసంఖ్యాకంగా పెరిగిపోతుంది. నువ్వు పడమర, తూర్పు, ఉత్తరం, దక్షిణం దిక్కులకు వ్యాపిస్తావు. భూమి మీద వంశాలన్నీ నీ మూలంగా, నీ సంతానం మూలంగా ఆశీర్వాదం పొందుతాయి. 15ఇదిగో నేను నీకు తోడై ఉండి, నువ్వు వెళ్ళే ప్రతి చోటా నిన్ను కాపాడి ఈ దేశానికి నిన్ను మళ్ళీ రప్పిస్తాను. నేను నీతో చెప్పింది నెరవేర్చే వరకూ నిన్ను విడిచిపెట్టను” అని చెప్పాడు. 16యాకోబు నిద్ర మేలుకుని “నిశ్చయంగా యెహోవా ఈ స్థలం లో ఉన్నాడు. అది నాకు తెలియలేదు” అనుకున్నాడు. 17అతడు భయపడి “ఈ స్థలం ఎంతో భయం గొలిపేది. ఇది దేవుని మందిరమే గాని వేరొకటి కాదు. 18పరలోకద్వారం ఇదే” అనుకున్నాడు. తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా చేసుకున్న రాయి తీసి దాన్ని స్తంభంగా నిలబెట్టి, దాని కొనమీద నూనె పోశాడు. 19అతడు ఆ స్థలానికి బేతేలు అనే పేరు పెట్టాడు. మొదట ఆ ఊరి పేరు లూజు. 20అప్పుడు యాకోబు “నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమంగా వచ్చేలా దేవుడు నాకు తోడై ఉండి, నేను వెళ్తున్న ఈ మార్గంలో నన్ను కాపాడి, 21తినడానికి ఆహారమూ ధరించడానికి వస్త్రాలూ నాకు దయ చేసినట్లైతే యెహోవా నాకు దేవుడై ఉంటాడు. 22అంతేకాదు, స్తంభంగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరం అవుతుంది. నువ్వు నాకిచ్చే సమస్తంలో పదవ వంతు నీకు తప్పక చెల్లిస్తాను” అని మొక్కుకున్నాడు.
ప్రతిస్పందన కీర్తన
1సర్వోన్నతుడి చాటున నివసించే వాడు సర్వశక్తిశాలి నీడలో నిలిచి ఉంటాడు. 2ఆయనే నాకు ఆశ్రయం, నా కోట, నేను నమ్ముకునే నా దేవుడు, అని నేను యెహోవాను గురించి చెబుతాను. 3వేటగాడు పన్నిన ఉచ్చు నుంచి ప్రాణాంతకవ్యాధి నుంచి ఆయన నిన్ను విడిపిస్తాడు. 4ఆయన తన రెక్కలతో నిన్ను కప్పుతాడు. ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం దొరుకుతుంది. ఆయన నమ్మకత్వం నిన్ను కాపాడే కవచంగా ఉంటుంది. 14అతనికి నా మీద భక్తి విశ్వాసాలున్నాయి గనక నేనతన్ని రక్షిస్తాను. అతడు నా పట్ల స్వామిభక్తి గలవాడు గనక నేనతన్ని కాపాడతాను. 15అతడు నాకు మొరపెడితే నేనతనికి జవాబిస్తాను. కష్టాల్లో నేను అతనితో ఉంటాను, అతనికి విజయమిచ్చి అతన్ని సత్కరిస్తాను.
సువార్త
18ఆయన ఈ మాటలు వారితో చెబుతూ ఉండగానే ఒక అధికారి వచ్చి ఆయనకు మొక్కి, “నా కూతురు ఇప్పుడే చనిపోయింది. అయినా నీవు వచ్చి ఆమె మీద నీ చెయ్యి ఉంచితే ఆమె బతుకుతుంది” అన్నాడు. 19అప్పుడు యేసు లేచి అతని వెంట వెళ్ళాడు. ఆయన శిష్యులు కూడా వెళ్ళారు. 20అప్పుడే పన్నెండేళ్ళ నుండి ఆగని రక్త స్రావంతో ఉన్న ఒక స్త్రీ ఆయన వెనకగా వచ్చి, “నేను ఆయన వస్త్రం అంచును తాకితే బాగుపడతాను” అని తనలో తాను అనుకుని, ఆయన పైవస్త్రం కొనను తాకింది. 22యేసు వెనక్కి తిరిగి ఆమెను చూసి, “అమ్మాయ్, ధైర్యంగా ఉండు. నీ నమ్మకం నిన్ను బాగుచేసింది” అన్నాడు. అదే క్షణంలో ఆ స్త్రీ బాగుపడింది. 23అంతలో యేసు ఆ అధికారి ఇంటికి వచ్చినపుడు అక్కడ వాయిద్యాలు వాయించే వారినీ గోల చేస్తున్న గుంపునూ చూశాడు. 24“వెళ్ళిపోండి. ఈ అమ్మాయి చనిపోలేదు. నిద్రపోతూ ఉంది” అన్నాడు. అయితే వారు నవ్వి ఆయనను హేళన చేశారు. 25ఆయన ఆ గుంపును బయటకు పంపివేసి, లోపలికి వెళ్ళి ఆమె చెయ్యి పట్టుకోగానే ఆ పాప లేచింది. 26ఈ వార్త ఆ ప్రాంతమంతా పాకిపోయింది.
ఈరోజు పరిశుద్ధులు
- పునీత అంతోని జక్కారియా, గురువు
సాధారణ రోమన్ కాలెండర్; ఒక బిషప్‌ల సమావేశం కొన్ని పండుగలను (దివ్యదర్శనం, పరలోకారోహణం, క్రీస్తు శరీర రక్తాల పండుగ) ఒక ఆదివారానికి మార్చవచ్చు లేదా తన సొంత పండుగలను జోడించవచ్చు. పఠన గ్రంథం: ఆదివారపు చక్రం B, వారపు రోజుల సంవత్సరం I.
మూలాలు: ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు · © 2017, 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings, the editors' parts and stage directions in the Song of Songs and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · మూలాలు మరియు హక్కులు