హోమ్ › రోజువారీ బైబిల్ పఠనాలు › జులై 2027 › 4 జులై
కాథలిక్ కాలెండర్
రోజువారీ బైబిల్ పఠనాలు (కాథలిక్) — 4 జులై, 2027
ఆదివారం · సామాన్య కాలం 14వ వారం
పండుగలు మరియు పరిశుద్ధులు
సామాన్య కాలం 14వ ఆదివారం
ఆదివారం · ఆరాధన రంగు: ఆకుపచ్చ
ఈరోజు పఠనాలు
మొదటి పఠనం
2ఆయన నాతో మాట్లాడుతూ ఉండగా దేవుని ఆత్మ నన్ను పట్టుకుని నా కాళ్ళపై నిలువబెట్టాడు. అప్పుడు ఆయన స్వరం నేను విన్నాను. 3ఆయన నాతో ఇలా చెప్పాడు. “నరపుత్రుడా, నా మీద తిరుగుబాటు చేసిన జనాల దగ్గరకీ, ఇశ్రాయేలు ప్రజల దగ్గరకీ నిన్ను పంపిస్తున్నాను. వాళ్ళ పితరులూ, వాళ్ళూ ఈ రోజు వరకూ నాకు వ్యతిరేకంగా పాపం చేస్తూనే ఉన్నారు. 4వాళ్ళ వారసులు ఒట్టి మూర్ఖులు. వాళ్ళ హృదయాలు కఠినం. వాళ్ళ దగ్గరకి నిన్ను పంపిస్తున్నాను. నువ్వు ‘ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నాడు’ అని వాళ్ళకి చెప్పాలి. 5వాళ్ళు తిరగబడే జనం. అలా ప్రకటిస్తే వాళ్ళు విన్నా, వినకున్నా కనీసం వాళ్ళ మధ్య ఒక ప్రవక్త ఉన్నాడని తెలుసుకుంటారు.
ప్రతిస్పందన కీర్తన
1యాత్రల కీర్తన పరలోకంలో సింహాసనంపై ఆసీనుడై ఉన్నవాడా, నా కన్నులెత్తి నీ వైపు చూస్తున్నాను. 2సేవకుల కళ్ళు తమ యజమాని చేతి వైపు, దాసి కళ్ళు తన యజమానురాలి చేతి వైపు చూస్తాయి. అలాగే దేవుడైన యెహోవా మనపై కరుణ చూపించేదాకా మన కళ్ళు ఆయనవైపు చూస్తున్నాయి. 3యెహోవా, మమ్మల్ని కరుణించు, మమ్మల్ని కరుణించు. మేము తీవ్ర తిరస్కారానికి గురయ్యాము. 4అలగాజనం వేసే నిందలతో, గర్విష్ఠుల తిరస్కారాలతో మేము నిండిపోయాము.
రెండవ పఠనం
7నాకు కలిగిన ప్రత్యక్షతలు అసాధారణమైనవి కాబట్టి నేను గర్వంతో రెచ్చిపోకుండా దేవుడు నా దేహంలో ఒక ముల్లు పెట్టాడు. అది నన్ను బాధించడానికి, అతిశయించకుండా ఉండటానికి ఉన్న సాతాను దూత. 8అది నా దగ్గర నుండి తొలగిపోవాలని దాని గురించి మూడు సార్లు ప్రభువును బతిమాలాను. 9అప్పుడాయన నాతో ఇలా అన్నాడు, “నా కృప నీకు చాలు. బలహీనతలోనే బలం పరిపూర్ణమవుతుంది.” కాగా క్రీస్తు బలం నా మీద నిలిచి ఉండేలా, నేను నా బలహీనతల్లోనే అతిశయిస్తాను. 10బలహీనంగా నేనెప్పుడున్నానో అప్పుడే బలవంతుడిని. అందుచేత క్రీస్తు కోసం నా బలహీనతల్లో అవమానాల్లో ఇబ్బందుల్లో హింసల్లో ఉపద్రవాల్లో నేను సంతృప్తిగా ఉన్నాను.
సువార్త
1యేసు అక్కడ నుండి తన శిష్యులతో కలసి తన స్వగ్రామానికి వచ్చాడు 2విశ్రాంతి దినాన సమాజ మందిరంలో ఉపదేశించడం మొదలు పెట్టాడు. చాలామంది ఆయన ఉపదేశం విని ఎంతో ఆశ్చర్యపడ్డారు. “ఈ సంగతులన్నీ ఇతనికెలా తెలుసు? దేవుడు ఇతనికి ఎంతటి జ్ఞానం ఇచ్చాడు! ఇతని చేతుల ద్వారా ఇన్ని మహత్కార్యాలు ఎలా జరుగుతున్నాయి? 3ఇతడు వడ్రంగి కదూ! మరియ కొడుకు కదూ! యాకోబు, యోసే, యూదా, సీమోనులకు ఇతడు అన్న కదూ! ఇతడి చెల్లెళ్ళు అందరూ ఇక్కడ మనతోనే ఉన్నారు కదా!” అని చెప్పుకుంటూ ఆయన విషయంలో చాలా అభ్యంతరపడ్డారు. 4యేసు వారితో, “ప్రవక్తకు తన సొంత ఊరిలో, సొంత వారి మధ్య, సొంత ఇంట్లో తప్ప అన్ని చోట్లా గౌరవం లభిస్తుంది” అని అన్నాడు. 5అక్కడ యేసు కొద్దిమంది రోగుల మీద తన చేతులుంచి వారిని బాగుచేయడం తప్ప ఏ మహత్కార్యాలూ చేయలేకపోయాడు. 6వారి అపనమ్మకానికి ఆయన ఆశ్చర్యపడ్డాడు. ఆ తరువాత యేసు చుట్టుపక్కల గ్రామాలు తిరుగుతూ ఉపదేశం చేశాడు.
ఈరోజు పరిశుద్ధులు
- పోర్చుగల్ పునీత ఎలిజబెత్
సాధారణ రోమన్ కాలెండర్; ఒక బిషప్‌ల సమావేశం కొన్ని పండుగలను (దివ్యదర్శనం, పరలోకారోహణం, క్రీస్తు శరీర రక్తాల పండుగ) ఒక ఆదివారానికి మార్చవచ్చు లేదా తన సొంత పండుగలను జోడించవచ్చు. పఠన గ్రంథం: ఆదివారపు చక్రం B, వారపు రోజుల సంవత్సరం I.
మూలాలు: ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు · © 2017, 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings, the editors' parts and stage directions in the Song of Songs and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · మూలాలు మరియు హక్కులు