Bible Explorer యాప్ పొందండి

హోమ్ › రోజువారీ బైబిల్ పఠనాలు › జూన్ 2027 › 28 జూన్

కాథలిక్ కాలెండర్

రోజువారీ బైబిల్ పఠనాలు (కాథలిక్) — 28 జూన్, 2027

సోమవారం · సామాన్య కాలం 13వ వారం

పండుగలు మరియు పరిశుద్ధులు

సామాన్య కాలం 13వ వారపు సోమవారం

స్మరణ దినం · ఆరాధన రంగు: ఎరుపు

పునీత ఇరేనియస్, పీఠాధిపతి, హతసాక్షి, సంఘ పండితుడు · స్మరణ దినం

ఈరోజు పఠనాలు

మొదటి పఠనం

ఆది 18:16–33

16అప్పుడు ఆ మనుషులు అక్కడనుండి వెళ్ళడానికి లేచారు. లేచి సొదొమ పట్టణం వైపు చూసారు. వారిని సాగనంపడానికి అబ్రాహాము వారితో కలిసి వెళ్ళాడు. 17కానీ యెహోవా ఇలా అనుకున్నాడు. “అబ్రాహాము కచ్చితంగా ఒక బలమైన గొప్ప జాతి అవుతాడు. 18అతని మూలంగా భూమిపై అన్ని జాతులూ ఆశీర్వాదం పొందుతాయి. నేను చేయబోతున్న పనులను అబ్రాహాముకు తెలియకుండా ఎలా దాచగలను? 19అతని తరువాత అతని వారసులు నీతి న్యాయాలను జరిగించేలా వారికి యెహోవా మార్గాన్ని బోధించడానికీ తద్వారా అబ్రాహాముకు ఆయన చెప్పిన విషయాలన్నీ జరిగించడానికీ నేను అబ్రాహామును ఎన్నుకున్నాను.” 20అప్పుడు యెహోవా ఇలా అన్నాడు. “సొదొమ గొమొర్రాలను గూర్చిన విన్నపాలు కుప్పలు తెప్పలుగా ఉన్నాయి. అలాగే వాటి పాపం కూడా చాలా ఘోరం. కనుక 21నేను దిగి వెళ్ళి నాకు చేరిన ఆ విన్నపం ప్రకారం వాళ్ళు అంత దుర్మార్గులా కాదా అన్నది చూస్తాను. లేకపోతే నాకు తెలుస్తుంది.” 22ఆ మనుషులు అక్కడనుండి వెళ్ళడానికి తిరిగి సొదొమ వైపుగా వెళ్ళారు. కానీ అబ్రాహాము ఇంకా యెహోవా సముఖంలోనే నిలబడి ఉన్నాడు. 23అప్పడు అబ్రాహాము వారిని సమీపించి ఇలా అడిగాడు. “దుర్మార్గులతో పాటు నీతిమంతులను కూడా నాశనం చేస్తావా? 24ఆ పట్టణంలో ఒకవేళ యాభైమంది నీతిమంతులు ఉంటే ఆ యాభైమంది నీతిమంతుల కోసం పట్టణాన్ని నాశనం చేయకుండా రక్షించలేవా? 25నీతిమంతులకూ దుర్మార్గులకూ ఒకే రకంగా తీర్పు తీర్చడం నీకు దూరమౌతుంది గాక. అలాగే దుర్మార్గులతో పాటుగా నీతిమంతులను నాశనం చేయడం నీకు దూరమౌతుంది గాక! సర్వలోకానికీ తీర్పు తీర్చేవాడు న్యాయం చెయ్యడా?” 26దానికి యెహోవా “సొదొమ పట్టణంలో యాభైమంది నీతిమంతులు నాకు కనిపిస్తే వాళ్ళ కోసం ఆ ప్రదేశాన్నంతా కాపాడతాను” అన్నాడు. 27అందుకు అబ్రాహాము “అయ్యా చూడు, నేను దుమ్ముతో, బూడిదతో సమానం. అయినా నేను ప్రభువుతో మాట్లాడే సాహసం చేస్తున్నాను. 28యాభై మంది నీతిమంతుల్లో ఒకవేళ ఐదుగురు తక్కువయ్యారనుకోండి. ఐదుగురు తక్కువయ్యారని ఆ పట్టణమంతటినీ నాశనం చేస్తావా?” అని మళ్ళీ అడిగాడు. అందుకాయన “అక్కడ నలభై ఐదుగురు కనిపిస్తే నాశనం చేయను” అన్నాడు. 29అతడు మళ్ళీ ఆయనతో మాట్లాడుతూ “ఒకవేళ అక్కడ నలభై మందే కనిపిస్తారేమో” అన్నాడు. దానికి ఆయన “ఆ నలభై మంది కోసం నాశనం చేయను” అని చెప్పాడు. 30అతడు మళ్ళీ “ప్రభూ, నాపై కోప్పడనంటే నేను మాట్లాడతాను. ఒకవేళ ముప్ఫై మందే అక్కడ కనిపిస్తారేమో” అన్నాడు. అప్పుడాయన “ముప్ఫై మంది కనిపించినా నేను పట్టణాన్ని నాశనం చేయను” అన్నాడు. 31అందుకు అతడు “నా ప్రభువుతో మాట్లాడే సాహసం చేస్తున్నాను. ఒకవేళ ఇరవైమందే ఉంటారేమో” అన్నాడు. అప్పుడు ప్రభువు “ఆ ఇరవైమంది కోసం నాశనం చేయను” అన్నాడు. 32చివరిగా అతడు “ప్రభూ, నాపై కోపగించకు. నేనింకా ఒక్కసారే మాట్లాడతాను. ఒకవేళ పదిమందే అక్కడ ఉన్నారేమో” అన్నాడు. అప్పుడు ప్రభువు “పదిమంది కోసం నేను ఆ పట్టణాన్ని నాశనం చేయను” అన్నాడు. 33అబ్రాహాముతో మాటలు ముగిసిన వెంటనే యెహోవా వెళ్ళిపోయాడు. అబ్రాహాము తన ఇంటికి తిరిగి వెళ్ళాడు.

ప్రతిస్పందన కీర్తన

కీర్త 103:1–4, 8–11

1దావీదు కీర్తన. నా ప్రాణమా, యెహోవాను స్తుతించు. నా అంతరంగమా, ఆయన పవిత్ర నామాన్ని స్తుతించు. 2నా ప్రాణమా, యెహోవాను స్తుతించు, ఆయన చేసిన ఉపకారాలన్నీ మరచిపోవద్దు. 3ఆయన నీ పాపాలన్నీ క్షమిస్తాడు. నీ జబ్బులన్నీ బాగుచేస్తాడు. 4నాశనాన్నుంచి నీ ప్రాణాన్ని విడుదల చేస్తాడు. కృప, వాత్సల్యం నీకు కిరీటంగా ఉంచాడు. 8యెహోవా దయాళువు, కృపాభరితుడు. ఆయన సహనశీలి, నిబంధన సంబంధమైన నమ్మకత్వం ఆయనలో ఉంది. 9ఆయన ఎప్పుడూ అదుపులో పెట్టేవాడు కాదు. ఆయన అస్తమానం కోపంగా ఉండడు. 10మన పాపాలకు తగినట్టు ఆయన మనతో వ్యవహరించలేదు. మన పాపాలకు సరిపోయినంతగా మనకు ప్రతీకారం చేయలేదు. 11భూమికంటే ఆకాశం ఎంత ఉన్నతమో తనను గౌరవించేవారి పట్ల ఆయన కృప అంత ఉన్నతం.

సువార్త

మత్తయి 8:18–22

18యేసు తన చుట్టూ ఉన్న పెద్ద గుంపులను చూసి గలిలయ సరస్సు అవతలికి వెళ్దామని ఆదేశించాడు. 19అప్పుడు ధర్మశాస్త్ర పండితుడు ఒకడు వచ్చి, “బోధకా! నీవు ఎక్కడికి వెళ్ళినా సరే, నేను నీ వెంటే వస్తాను” అన్నాడు. 20అందుకు యేసు అతనితో, “నక్కలకు గుంటలున్నాయి. పక్షులకు గూళ్ళు ఉన్నాయి, మనుష్య కుమారుడికి మాత్రం తల వాల్చుకునే స్థలం కూడా లేదు” అన్నాడు. 21ఆయన శిష్యుల్లో మరొకడు, “ప్రభూ, మొదట నేను వెళ్ళి నా తండ్రిని పాతిపెట్టడానికి నాకు అనుమతి ఇవ్వండి” అని ఆయనను అడిగాడు. 22అయితే యేసు అతనితో, “నాతో రా. చనిపోయిన వారిని పాతి పెట్టడానికి చనిపోయిన వారు ఉన్నారులే!” అన్నాడు.

ఈరోజు పరిశుద్ధులు

సాధారణ రోమన్ కాలెండర్; ఒక బిషప్‌ల సమావేశం కొన్ని పండుగలను (దివ్యదర్శనం, పరలోకారోహణం, క్రీస్తు శరీర రక్తాల పండుగ) ఒక ఆదివారానికి మార్చవచ్చు లేదా తన సొంత పండుగలను జోడించవచ్చు. పఠన గ్రంథం: ఆదివారపు చక్రం B, వారపు రోజుల సంవత్సరం I.

మూలాలు: ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు · © 2017, 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings, the editors' parts and stage directions in the Song of Songs and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · మూలాలు మరియు హక్కులు