Bible Explorer యాప్ పొందండి

హోమ్ › రోజువారీ బైబిల్ పఠనాలు › జూన్ 2027 › 23 జూన్

కాథలిక్ కాలెండర్

రోజువారీ బైబిల్ పఠనాలు (కాథలిక్) — 23 జూన్, 2027

బుధవారం · సామాన్య కాలం 12వ వారం

పండుగలు మరియు పరిశుద్ధులు

సామాన్య కాలం 12వ వారపు బుధవారం

వారపు రోజు · ఆరాధన రంగు: ఆకుపచ్చ

ఈరోజు పఠనాలు

మొదటి పఠనం

ఆది 15:1–12, 17–18

1ఈ సంగతులు జరిగిన తరువాత యెహోవా దూత అబ్రాముకు దర్శనమిచ్చాడు. “అబ్రామూ, భయపడకు! నేనే నీకు డాలును, గొప్ప బహుమానాన్ని” అన్నాడు. 2అబ్రాము “ప్రభూ యెహోవా, నాకేం ఇస్తావు? నేను సంతానం లేనివాడిగా ఉండిపోతున్నాను కదా. దమస్కు వాడైన ఎలీయెజెరే నా ఆస్తికి వారసుడు అవుతాడు కదా! 3నువ్వు నాకు సంతానం ఇవ్వలేదు గనుక, చూడు, నా సేవకుల్లో ఒకడు నాకు వారసుడు అవుతాడు” అన్నాడు. 4యెహోవా వాక్కు అతని దగ్గరికి వచ్చి “ఇతడు నీ వారసుడు కాడు. నీ ద్వారా నీకు పుట్టబోయేవాడే నీ వారసుడు అవుతాడు” అన్నాడు. 5ఆయన అతణ్ణి బయటకు తీసుకువచ్చి “నువ్వు ఆకాశం వైపు చూసి, ఆ నక్షత్రాలు లెక్కపెట్టడం నీకు చేతనైతే లెక్కపెట్టు” అని చెప్పి “నీ సంతానం కూడా అలా అవుతుంది” అని చెప్పాడు. 6అతడు యెహోవాను నమ్మాడు. ఆ నమ్మకాన్నే ఆయన అతనికి నీతిగా పరిగణించాడు. 7యెహోవా “నీకు ఈ ప్రదేశాన్ని వారసత్వంగా ఇవ్వడానికి కల్దీయుల ఊర్ అనే పట్టణంలో నుంచి నిన్ను ఇవతలకు తీసుకువచ్చిన యెహోవాను నేనే” అని చెప్పినప్పుడు 8అతడు “ప్రభూ యెహోవా, ఇది నాకు సొంతం అవుతుందని నాకు ఎలా తెలుస్తుంది?” అన్నాడు. 9ఆయన “మూడేళ్ళ వయసు ఉన్న ఒక దూడ, ఒక మేక, ఒక పొట్టేలు, ఒక తెల్ల గువ్వ, ఒక పావురం పిల్లను నా దగ్గరికి తీసుకురా” అని అతనితో చెప్పాడు. 10అతడు వాటిని తీసుకుని వాటిని సగానికి రెండు ముక్కలుగా నరికి, రెండు సగాలను ఎదురెదురుగా పెట్టాడు. పక్షులను మాత్రం ఖండించలేదు. 11ఆ మృతదేహాల మీద గద్దలు వాలగా అబ్రాము వాటిని తోలివేశాడు. 12చీకటి పడుతున్నప్పుడు అబ్రాముకు గాఢ నిద్ర పట్టింది. భయం కలిగించే చిమ్మచీకటి అతణ్ణి ఆవరించింది. 17సూర్యుడు అస్తమించి చీకటి పడినప్పుడు, పొగ లేస్తున్న కొలిమి, మండుతున్న కాగడా దిగివచ్చి పేర్చిన మాంస ఖండాల మధ్యగా దాటుకుంటూ వెళ్ళాయి. 18ఆ రోజున యెహోవా “ఐగుప్తు నది నుంచి, పేరుగాంచిన యూఫ్రటీసు నది వరకూ ఉన్న ఈ ప్రదేశాన్ని నీ వారసులకు ఇస్తాను.

ప్రతిస్పందన కీర్తన

కీర్త 105:1–4, 6–9

1యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఆయన నామాన్ని ప్రకటన చేయండి. జాతుల్లో ఆయన కార్యాలను తెలియచేయండి. 2ఆయనను గూర్చి పాడండి. ఆయనను కీర్తించండి. ఆయన ఆశ్చర్య కార్యాలన్నిటిని గూర్చి సంభాషణ చేయండి. 3ఆయన పరిశుద్ధ నామాన్నిబట్టి అతిశయించండి. యెహోవాను వెతికేవారు హృదయంలో సంతోషించుదురు గాక. 4యెహోవాను వెదకండి. ఆయన బలాన్ని వెదకండి. ఆయన సన్నిధిని నిత్యం అన్వేషించండి. 6ఆయన చేసిన సూచక క్రియలను, ఆయన నోటి తీర్పులను జ్ఞాపకం చేసుకోండి. 7ఆయన మన దేవుడైన యెహోవా. ఆయన తీర్పులు భూమి అంతటా అమలు అవుతున్నాయి. 8తాను సెలవిచ్చిన మాటను వెయ్యి తరాల వరకూ ఆయన గుర్తుంచుకుంటాడు. అబ్రాహాముతో తాను చేసిన నిబంధనను, 9ఇస్సాకుతో తాను చేసిన ప్రమాణాన్ని, నిత్యం ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు.

సువార్త

మత్తయి 7:15–20

15“అబద్ధ ప్రవక్తల గురించి జాగ్రత్తగా ఉండండి. వారు గొర్రె తోలు కప్పుకుని మీ దగ్గరికి వస్తారు. కాని లోలోపల వారు క్రూరమైన తోడేళ్ళు. 16వారి ఫలాలను బట్టి వారిని తెలుసు కోవచ్చు. ముళ్ళ పొదల్లో ద్రాక్షపండ్లు గానీ పల్లేరు మొక్కల్లో అంజూరపండ్లు గానీ కోస్తారా? 17అలాగే ప్రతి మంచి చెట్టు మంచి పండ్లు కాస్తుంది. పనికిమాలిన చెట్టు పనికిమాలిన పండ్లు కాస్తుంది. 18మంచి చెట్టు పనికిమాలిన పండ్లు కాయదు. పనికిమాలిన చెట్టు మంచి పండ్లు కాయదు. 19మంచి పండ్లు కాయని ప్రతి చెట్టునూ నరికి మంటల్లో వేస్తారు. 20ఈ విధంగా మీరు వారి ఫలం వలన వారిని తెలుసుకుంటారు.

సాధారణ రోమన్ కాలెండర్; ఒక బిషప్‌ల సమావేశం కొన్ని పండుగలను (దివ్యదర్శనం, పరలోకారోహణం, క్రీస్తు శరీర రక్తాల పండుగ) ఒక ఆదివారానికి మార్చవచ్చు లేదా తన సొంత పండుగలను జోడించవచ్చు. పఠన గ్రంథం: ఆదివారపు చక్రం B, వారపు రోజుల సంవత్సరం I.

మూలాలు: ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు · © 2017, 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings, the editors' parts and stage directions in the Song of Songs and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · మూలాలు మరియు హక్కులు