Bible Explorer యాప్ పొందండి

హోమ్ › రోజువారీ బైబిల్ పఠనాలు › జూన్ 2027 › 15 జూన్

కాథలిక్ కాలెండర్

రోజువారీ బైబిల్ పఠనాలు (కాథలిక్) — 15 జూన్, 2027

మంగళవారం · సామాన్య కాలం 11వ వారం

పండుగలు మరియు పరిశుద్ధులు

సామాన్య కాలం 11వ వారపు మంగళవారం

వారపు రోజు · ఆరాధన రంగు: ఆకుపచ్చ

ఈరోజు పఠనాలు

మొదటి పఠనం

2 కొరింతీ 8:1–9

1సోదరీ సోదరులారా, మాసిదోనియ ప్రాంతంలోని సంఘాలపై దేవుడు చూపిన కృపను గూర్చి మీకు తెలియజేస్తున్నాం. 2విపరీతమైన బాధలు వారిని పరీక్షిస్తున్నప్పుడు సైతం, వారు అత్యధికంగా సంతోషించారు. వారు నిరుపేదలైనా వారి దాతృత్వం చాలా గొప్పది. 3వారిని గురించి నా సాక్ష్యం ఏమిటంటే, పరిశుద్ధులకు సేవ చేయడానికి తమకు కూడా భాగం ఇవ్వాలని ఎంతో బతిమాలారు. 4వారు స్వయంగానే ఇవ్వగలిగినంతా ఇచ్చారు. వాస్తవానికి, దానికంటే ఎక్కువే ఇచ్చారు. 5అంతేకాక వారు మొదట ప్రభువుకూ, తరువాత దేవుని సంకల్పం వలన మాకూ తమను తామే అప్పగించుకున్నారు. ఇలా చేస్తారని మేమెన్నడూ తలంచలేదు. 6కాబట్టి మీ దగ్గర తీతు ఇప్పటికే మొదలు పెట్టిన ఈ కృపా పరిచర్యను పూర్తి చేయమని మేము అతన్ని ప్రోత్సహించాము. 7మీరు ప్రతి విషయంలో అంటే విశ్వాసంలో ఉపదేశంలో జ్ఞానంలో శ్రద్ధ అంతటిలో మీకు మా పట్ల ఉన్న ప్రేమలో ఎలా రాణిస్తున్నారో అలానే మీరు ఈ కృపా పరిచర్యలో కూడా తప్పక రాణించండి. 8ఆజ్ఞలా మీతో చెప్పడం లేదు. ఇతరుల శ్రద్ధాసక్తులు మీకు తెలియజేసి మీ ప్రేమ ఎంత యథార్థమైనదో పరీక్షిస్తున్నాను. 9మీకు మన ప్రభు యేసు క్రీస్తు కృప తెలుసు గదా? ఆయన ధనవంతుడై ఉండీ తన పేదరికం వలన మీరు ధనవంతులు కావాలని, మీ కోసం పేదవాడయ్యాడు.

ప్రతిస్పందన కీర్తన

కీర్త 146:1–2, 5–9

1యెహోవాను స్తుతించండి. నా ప్రాణమా, యెహోవాను కీర్తించు. 2నా జీవితకాలమంతా నేను యెహోవాను స్తుతిస్తాను. నేను ప్రాణంతో ఉన్న కాలమంతా నా దేవునికి కీర్తనలు పాడతాను. 5యాకోబు దేవుడు ఎవరికి సహాయంగా ఉంటాడో, తమ దేవుడైన యెహోవా మీద ఎవరు ఆశాభావం పెట్టుకుని ఉంటారో వాళ్ళు ధన్యులు. 6ఆయన భూమినీ, ఆకాశాలనూ, సముద్రాలనూ, వాటిలో ఉన్న సమస్తాన్నీ సృష్టి చేసినవాడు. ఆయన ఇచ్చిన మాట ఎన్నడూ తప్పడు. 7దోపిడీకి గురైన వాళ్లకు ఆయన న్యాయం చేకూరుస్తాడు. ఆకలిగొన్న వాళ్లకు ఆహారం అనుగ్రహిస్తాడు. ఖైదీలకు విడుదల కలిగిస్తాడు. 8యెహోవా గుడ్డివాళ్ళ కళ్ళు తెరిపిస్తాడు. అణగారిపోయిన వాళ్ళను ఆదరించి లేవనెత్తుతాడు. యెహోవా నీతిమంతులను ప్రేమిస్తాడు. 9ఇతర జాతుల ప్రజలను యెహోవా కాపాడతాడు. తండ్రిలేని అనాథలను, విధవరాళ్ళను ఆదరించేవాడు ఆయనే. దుష్టులను ఆయన వ్యతిరేకిస్తాడు.

సువార్త

మత్తయి 5:43–48

43“‘నీ పొరుగువాణ్ణి ప్రేమించి, నీ శత్రువును ద్వేషించు’ అని చెప్పింది మీరు విన్నారు గదా. 44నేను మీతో చెప్పేదేమంటే, మీ శత్రువులను ప్రేమించండి. మిమ్మల్ని హింసించే వారి కోసం ప్రార్థించండి. 45ఆ విధంగా మీరు పరలోకంలో ఉన్న మీ తండ్రికి కుమారులవుతారు. ఎందుకంటే ఆయన చెడ్డవారిపైనా మంచివారిపైనా తన సూర్యుణ్ణి ఉదయింపజేసి, నీతిమంతులపైనా దుర్మార్గులపైనా వాన కురిపిస్తున్నాడు. 46మిమ్మల్ని ప్రేమించే వారినే ప్రేమిస్తే మీకు ఏం లాభం? పన్నులు వసూలు చేసేవారు కూడా అలాగే చేస్తారు గదా. 47మీరు మీ సోదరులనే గౌరవిస్తుంటే ఇతరులకంటే ఎక్కువేం చేస్తున్నారు? యూదేతరులూ అలాగే చేస్తున్నారు గదా. 48మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు. అందుచేత మీరూ పరిపూర్ణులై ఉండండి.

సాధారణ రోమన్ కాలెండర్; ఒక బిషప్‌ల సమావేశం కొన్ని పండుగలను (దివ్యదర్శనం, పరలోకారోహణం, క్రీస్తు శరీర రక్తాల పండుగ) ఒక ఆదివారానికి మార్చవచ్చు లేదా తన సొంత పండుగలను జోడించవచ్చు. పఠన గ్రంథం: ఆదివారపు చక్రం B, వారపు రోజుల సంవత్సరం I.

మూలాలు: ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు · © 2017, 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings, the editors' parts and stage directions in the Song of Songs and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · మూలాలు మరియు హక్కులు