Bible Explorer యాప్ పొందండి

హోమ్ › రోజువారీ బైబిల్ పఠనాలు › జూన్ 2027 › 10 జూన్

ఆర్థడాక్స్ కాలెండర్ · మే 28 (పాత శైలి)

ఆర్థడాక్స్ రోజువారీ పఠనాలు — 10 జూన్, 2027

గురువారం · పాస్కా ఆరవ వారం · స్వరం 5

పండుగలు మరియు పరిశుద్ధులు

ప్రభువు ఆరోహణం

ఉపవాసం

ఉపవాసం లేదు

ఇది సన్యాస నియమాన్ని అనుసరిస్తుంది. సంఘంలో ఉపవాస పరిమాణాన్ని ఆరోగ్యం, వయస్సు మరియు పరిస్థితుల ప్రకారం తమ ఆత్మీయ గురువుతో కలిసి నిర్ణయిస్తారు.

ఈరోజు పఠనాలు

సాయంకాల ప్రార్థన: పఠనం

యెష 2:2–3

2రాబోయే భవిష్యత్తులో పర్వతాలన్నిటికన్నా యెహోవా మందిర పర్వతం ఉన్నతంగా సుస్థిరమౌతుంది. అన్ని కొండల కంటే ఘనత పొందుతుంది. జాతులన్నీ దానిలోకి ప్రవాహంలా వస్తారు. 3అనేక మంది వచ్చి ఇలా అంటారు. “ఆయన మార్గాల్లో మనం నడిచేందుకు, ఆయన మనకు తన త్రోవలు నేర్పించేలా, యాకోబు దేవుని మందిరం ఉన్న యెహోవా పర్వతానికి ఎక్కి వెళ్దాం రండి.” ఎందుకంటే, సీయోనులో నుంచి ధర్మశాస్త్రం, యెరూషలేములో నుంచి యెహోవా వాక్కు బయలు వెళ్తుంది.

సాయంకాల ప్రార్థన: పఠనం

యెష 62:10–63:3, 7–9

10ద్వారాల గుండా రండి! రండి! ప్రజలకు దారి సిద్ధం చేయండి! జాతీయ మార్గాన్ని కట్టండి! రాళ్ళు ఏరి పారవేయండి! రాజ్యాల కోసం జండా సూచన ఎత్తండి! 11వినండి. ప్రపంచమంతటికీ యెహోవా తెలియచేశాడు. “సీయోను ఆడపడుచుతో ఇలా చెప్పండి. ఇదిగో, నీ రక్షకుడు వస్తున్నాడు! ఇదిగో, ఆయన బహుమానం ఆయన దగ్గర ఉంది. తానిచ్చే జీతం ఆయన తీసుకు వస్తున్నాడు.” 12“పరిశుద్ధప్రజలు” “యెహోవా విమోచించిన వారు” అని వీళ్ళు మిమ్మల్ని పిలుస్తారు. “కోరతగినది” అనీ “తిరస్కారానికి గురి కాని పట్టణం” అనీ నిన్ను పిలుస్తారు. 63:1ఎర్రటి బట్టలు కట్టుకుని ఎదోములోని బొస్రా నుంచి వస్తున్న ఈయనెవరు? రాజ వస్త్రాలతో తన మహా బలంతో గంభీరంగా వస్తున్న ఈయనెవరు? నీతితో మాట్లాడే నేనే. రక్షించడానికి సమర్ధుణ్ణి. 2నీ బట్టలు ఎందుకు ఎర్రగా ఉన్నాయి? నీ బట్టలు ద్రాక్షగానుగ తొక్కేవాడి బట్టల్లాగా ఎందుకున్నాయి? 3ఒంటరిగా ద్రాక్షగానుగ తొక్కాను. రాజ్యాల్లో ఎవడూ నాతో చేరలేదు. కోపంతో వారిని తొక్కాను. ఆగ్రహంతో వారిని అణగదొక్కాను. వారి రక్తం నా బట్టల మీద చిందింది. నా బట్టలన్నీ మరకలే. 7యెహోవా మనకు చేసినవాటన్నిటినిబట్టి యెహోవా కృపాతిశయాన్ని, యెహోవా స్తుతి పాత్రమైన పనులను వర్ణిస్తాను. యెహోవా మనకు చేసిన వాటన్నిటిని గురించి నేను చెబుతాను. తన వాత్సల్యాన్ని బట్టి, కృపాతిశయాన్ని బట్టి, ఇశ్రాయేలు వంశం వారికి ఆయన చూపిన మహాకనికరాన్ని నేను ప్రకటన చేస్తాను. 8అయితే ఆయన ఇలా అన్నాడు. “కచ్చితంగా వారు నా ప్రజలు. అవిధేయులు కాని పిల్లలు.” ఆయన వారికి రక్షకుడయ్యాడు. 9వారి బాధలన్నిటిలో ఆయన బాధ అనుభవించాడు. ఆయన సన్నిధి దూత వారిని రక్షించాడు. ఆయన ప్రేమతో, కనికరంతో వారిని రక్షించాడు. పురాతన దినాలన్నిటిలో ఆయన వారిని ఎత్తుకుంటూ మోస్తూ వచ్చాడు.

సాయంకాల ప్రార్థన: పఠనం

జెక 14:1, 4, 8–11

1ఇదిగో వినండి. యెహోవా తీర్పు దినం వచ్చేస్తోంది. ఆ రోజు మీ నుండి దోచుకున్న సొమ్ము మీ పట్టణాల్లోనే పంచిపెడతారు. 4ఆ రోజున ఆయన యెరూషలేము ఎదురుగా తూర్పు దిక్కున ఉన్న ఒలీవ కొండపై ఆయన పాదాలు మోపుతాడు. అప్పుడు ఒలీవ కొండ తూర్పుకు, పడమరకు మధ్యకు చీలిపోయి సగం కొండ ఉత్తరం వైపుకు, సగం కొండ దక్షిణం వైపుకు జరుగుతుంది. వాటి మధ్య ఒక విశాలమైన లోయ ఏర్పడుతుంది. 8ఆ రోజున జల ప్రవాహాలు యెరూషలేము నుండి ప్రవహిస్తాయి. వాటిలో సగం తూర్పు సముద్రంలోకి, సగం పడమర సముద్రంలోకి ప్రవహిస్తాయి. వేసవికాలంలో, చలికాలంలో కూడా అలాగే జరుగుతుంది. 9ఆ కాలంలో యెహోవా ఒక్కడే సర్వలోకానికీ రాజుగా, ప్రభువుగా ఉంటాడు. ఆయనకు పేరు ఒక్కటే నిలిచి ఉంటుంది. 10అప్పుడు దేశం యెరూషలేము దక్షిణ దిక్కున ఉన్న గెబ నుండి రిమ్మోను వరకు ఉన్న ప్రదేశంగా అవుతుంది. యెరూషలేము మెరక స్థలంలో బెన్యామీను ద్వారం నుండి మూల ద్వారం వరకు, అంటే మొదటి ద్వారం అంచు వరకు, హనన్యేలు ద్వారం నుండి రాజు ద్రాక్ష గానుగుల వరకు వ్యాపిస్తుంది. 11ప్రజలు దానిలో నివసిస్తారు. ఇకపై శాపం వారి పైకి రాదు. యెరూషలేము నివాసులు సురక్షితంగా నివసిస్తారు.

ఉదయ ప్రార్థన: సువార్త

మార్కు 16:9–20

9వారం మొదటి రోజు ఆదివారం తెల్లవారుతూ ఉండగా యేసు లేచి, తాను ఏడు దయ్యాలను వదిలించిన మగ్దలేనే మరియకు మొట్టమొదట కనిపించాడు. 10ఆమె, యేసుతో కలిసి ఉన్న వారి దగ్గరికి వెళ్ళింది. వారు దుఃఖిస్తూ, విలపిస్తూ ఉన్నారు. అప్పుడు ఆమె యేసు తిరిగి లేచిన సంగతి వారికి చెప్పింది. 11యేసు మళ్ళీ బతికాడనీ, తాను ఆయనను చూశాననీ చెప్పింది. కాని, వారు ఆమె మాటలు నమ్మలేదు. 12ఆ తరువాత వారిలో ఇద్దరు శిష్యులు వారి గ్రామానికి నడిచి వెళ్తూ ఉండగా ఆయన వారికి వేరే రూపంలో కనిపించాడు. 13వారు తిరిగి వెళ్ళి మిగిలిన వారికి ఆ సంగతి చెప్పారు గానీ వారు నమ్మలేదు. 14ఆ తరువాత పదకొండు మంది శిష్యులు భోజనం చేస్తూ ఉండగా యేసు వారికి కనిపించాడు. తాను తిరిగి బతికిన విషయం కొందరు చెప్పినా శిష్యులు నమ్మలేదు కాబట్టి వారి అపనమ్మకం, హృదయ కాఠిన్యం బట్టి వారిని గద్దించాడు. 15యేసు వారితో ఇలా అన్నాడు, “మీరు సర్వ లోకానికీ వెళ్ళి సృష్టిలో అందరికీ సువార్త ప్రకటించండి. 16దాన్ని నమ్మి బాప్తిసం పొందిన వారు రక్షణ పొందుతారు. నమ్మని వారు శిక్ష అనుభవిస్తారు. 17“నమ్మిన వారి ద్వారా ఈ సూచక క్రియలు జరుగుతాయి, వారు నా పేరిట దయ్యాలను వెళ్ళగొడతారు. కొత్త భాషలు మాట్లాడతారు. 18తమ చేతులతో విషసర్పాలను పట్టుకుంటారు. విషం తాగినా వారికి ఏ హానీ కలగదు. వారు రోగుల మీద తమ చేతులు ఉంచినప్పుడు రోగులు బాగుపడతారు.” 19ప్రభు యేసు వారితో మాట్లాడిన తరవాత దేవుడు ఆయనను పరలోకంలోకి స్వీకరించాడు. అక్కడ యేసు దేవుని కుడి చేతి వైపున కూర్చున్నాడు. 20ఆ తరువాత శిష్యులు బయలుదేరి అన్ని ప్రాంతాలకూ వెళ్ళి యేసును ప్రకటించారు. ప్రభువు వారికి తోడై, వారు ప్రకటించిన సందేశం సత్యమని సూచనల ద్వారా, అద్భుతాల ద్వారా స్థిరపరిచాడు.

పత్రిక

అపొ.కా 1:1–12

1తియొఫిలా, యేసు తాను ఏర్పరచుకున్న అపొస్తలులకు పరిశుద్ధాత్మ ద్వారా ఆజ్ఞాపించిన తరువాత 2ఆయన పరలోకానికి ఆరోహణమైన రోజు వరకూ ఆయన చేసిన, బోధించిన వాటన్నిటిని గూర్చి నా మొదటి గ్రంథాన్ని రచించాను. 3ఆయన హింసలు పొందిన తరువాత నలభై రోజులపాటు వారికి కనబడుతూ, దేవుని రాజ్య విషయాలను బోధిస్తూ, అనేక రుజువులను చూపించి వారికి తనను తాను సజీవునిగా కనపరచుకున్నాడు. 4ఆయన వారిని కలుసుకుని ఈ విధంగా ఆజ్ఞాపించాడు, “మీరు యెరూషలేమును విడిచి పోవద్దు. నా ద్వారా విన్న తండ్రి వాగ్దానం కోసం కనిపెట్టండి. 5యోహాను నీళ్లతో బాప్తిసం ఇచ్చాడు గానీ కొద్ది రోజుల్లో మీరు పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందుతారు.” 6వారు సమకూడినప్పుడు, “ప్రభూ, ఇప్పుడు ఇశ్రాయేలు రాజ్యాన్ని పునరుద్ధరిస్తావా?” అని శిష్యులు అడగగా ఆయన, 7“కాలాలూ సమయాలూ తండ్రి తన స్వాధీనంలో ఉంచుకున్నాడు. వాటిని తెలుసుకోవడం మీ పని కాదు. 8“అయితే పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుతారు. కాబట్టి, మీరు యెరూషలేములో, యూదయ సమరయ దేశాల్లో, ప్రపంచమంతటా నాకు సాక్షులుగా ఉంటారు” అన్నాడు. 9ఈ మాటలు చెప్పి, వారు చూస్తూ ఉండగా ఆయన ఆరోహణమయ్యాడు. అప్పుడు ఒక మేఘం వచ్చి వారికి కనబడకుండా ఆయనను తీసుకు వెళ్ళిపోయింది. 10ఆయన వెళుతూ ఉండగా వారు ఆకాశం వైపు అదే పనిగా చూస్తున్నారు. అప్పుడు తెల్లని బట్టలు ధరించిన ఇద్దరు వ్యక్తులు వారి దగ్గర నిలబడి, 11“గలిలయ నివాసులారా, మీరెందుకు ఆకాశం వైపు చూస్తున్నారు? మీ దగ్గర్నుండి పరలోకానికి ఆరోహణమైన ఈ యేసు ఏ విధంగా పరలోకానికి వెళ్ళడం మీరు చూశారో ఆ విధంగానే తిరిగి వస్తాడు” అని వారితో చెప్పారు. 12అప్పుడు వారు ఒలీవ కొండ నుండి యెరూషలేముకు తిరిగి వెళ్ళారు. ఆ కొండ యెరూషలేముకు విశ్రాంతి దినాన నడవదగినంత దూరంలో ఉంది.

సువార్త

లూకా 24:36–53

36వారు ఇలా మాట్లాడుకుంటూ ఉండగా యేసే వారి మధ్య నిలబడి, “మీకు శాంతి కలుగు గాక” అన్నాడు. 37అయితే వారు తమకేదో ఆత్మ కనిపించిందనుకుని భయంతో హడలిపోయారు. 38అప్పుడాయన, “మీరు ఎందుకు భయపడుతున్నారు? మీ హృదయాల్లో ఎందుకు సందేహపడుతున్నారు? 39నేనే ఆయనను అనడానికి రుజువుగా నా చేతులూ, నా పాదాలూ చూడండి. నన్ను ముట్టుకుని చూడండి. నాకు ఉన్నట్టుగా ఆత్మకు ఎముకలూ మాంసమూ ఉండవు” అని చెప్పాడు. 40అలా చెప్పి తన చేతులనూ, కాళ్ళనూ వారికి చూపించాడు. 41అయితే వారు సంతోషంతో తబ్బిబ్బులై పోతూ ఇంకా నమ్మకుండా ఆశ్చర్యపోతూ ఉన్నారు. అప్పుడు ఆయన, “మీ దగ్గర ఏదైనా ఆహారం ఉందా?” అని అడిగాడు. 42వారు కాల్చిన చేప ముక్కను ఆయనకు ఇచ్చారు. 43ఆయన దాన్ని తీసుకుని వారి కళ్ళ ముందే తిన్నాడు. 44తరువాత ఆయన, “మోషే ధర్మశాస్త్రంలోనూ, ప్రవక్తల గ్రంథాల్లోనూ, కీర్తనల్లోనూ నా గురించి రాసినవన్నీ నెరవేరాలని నేను మీతో ఉన్నప్పుడు చెప్పాను గదా” అన్నాడు. 45అప్పుడు లేఖనాలను గ్రహించగలిగేలా ఆయన వారి మనసులను తెరిచాడు. 46“క్రీస్తు హింసల పాలై చనిపోయి మూడవ రోజున చనిపోయిన వారిలో నుండి లేస్తాడనీ, 47యెరూషలేములో ప్రారంభమై సమస్త జాతులకూ ఆయన పేర పశ్చాత్తాపం, పాప క్షమాపణ ప్రకటన జరుగుతుందనీ రాసి ఉంది. 48మీరు ఈ విషయాలన్నిటికీ సాక్షులు. 49“వినండి, నా తండ్రి చేసిన వాగ్దానాన్ని మీ మీదికి పంపుతున్నాను. మీరు పైనుండి శక్తి పొందే వరకూ పట్టణంలోనే ఉండండి” అని వారికి చెప్పాడు. 50ఆయన బేతనియ వరకూ వారిని తీసుకు పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించాడు. 51అలా వారిని ఆశీర్వదిస్తూ ఉండగానే ఆయన వారిలో నుండి వేరై పరలోకానికి ఆరోహణం అయ్యాడు. 52వారు ఆయనను ఆరాధించి గొప్ప ఆనందంతో యెరూషలేముకు తిరిగి వెళ్ళారు. 53దేవాలయంలో నిరంతరం ఉంటూ దేవుణ్ణి కీర్తిస్తూ, ఆరాధిస్తూ ఉన్నారు.

తేదీలు రష్యన్ సంఘపు జూలియన్ కాలెండర్‌ను అనుసరిస్తాయి (సెర్బియన్, జార్జియన్ సంఘాలు, ఆథోస్ పర్వతం లాగే): సంఘ కాలెండర్‌లోని 28 మే పౌర కాలెండర్‌లో 10 జూన్. కొత్త కాలెండర్‌ను అనుసరించే సంఘాలు (గ్రీసు, రొమేనియా, బల్గేరియా, ఉక్రెయిన్…) స్థిర పండుగలనూ పరిశుద్ధులనూ పౌర తేదీనే, 13 రోజులు ముందుగా జరుపుకుంటాయి, వాటి కొన్ని పఠనాలు వేరుగా ఉంటాయి; ఈస్టర్, దానిపై ఆధారపడిన రోజులు ఒకటే.

మూలాలు: ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు · © 2017, 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings, the editors' parts and stage directions in the Song of Songs and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · మూలాలు మరియు హక్కులు