హోమ్ › రోజువారీ బైబిల్ పఠనాలు › జూన్ 2027 › 4 జూన్
ఆర్థడాక్స్ కాలెండర్ · మే 22 (పాత శైలి)
ఆర్థడాక్స్ రోజువారీ పఠనాలు — 4 జూన్, 2027
శుక్రవారం · పాస్కా ఐదవ వారం · స్వరం 4
పండుగలు మరియు పరిశుద్ధులు
Martyr Basiliscus the Bishop of Comana († c. 308)
ఉపవాస దినం
చేపలు అనుమతి
ఇది సన్యాస నియమాన్ని అనుసరిస్తుంది. సంఘంలో ఉపవాస పరిమాణాన్ని ఆరోగ్యం, వయస్సు మరియు పరిస్థితుల ప్రకారం తమ ఆత్మీయ గురువుతో కలిసి నిర్ణయిస్తారు.
ఈరోజు పఠనాలు
పత్రిక
5కానీ పరిసయ్యుల తెగలో విశ్వాసులైన కొందరు లేచి, యూదేతరులకు సున్నతి చేయించాలనీ, మోషే ధర్మశాస్త్రాన్ని పాటించేలా వారికి ఆజ్ఞాపించాలనీ చెప్పారు. 6అప్పుడు అపొస్తలులూ పెద్దలూ ఈ సంగతి గూర్చి ఆలోచించడానికి సమావేశమయ్యారు. చాలా చర్చ జరిగిన తరువాత పేతురు లేచి వారితో ఇలా అన్నాడు. 7“సోదరులారా, యూదేతరులు నా నోట సువార్త విని విశ్వసించేలా మీలో నుండి నన్ను ఆరంభ దినాల్లో దేవుడు ఎన్నుకున్నాడని మీకు తెలుసు. 8హృదయాలను ఎరిగిన దేవుడు పరిశుద్ధాత్మను మనకు ఇచ్చినట్టే, వారికీ ఇచ్చి, తాను వారిని స్వీకరించినట్టుగా వెల్లడి పరిచాడు. 9మనకీ వారికీ ఏ తేడా చూపకుండా వారి హృదయాలను విశ్వాసంతో పవిత్రపరచాడు. 10కాబట్టి మన పూర్వీకులు గానీ మనం గానీ మోయలేని కాడిని శిష్యుల మెడ మీద పెట్టి మీరెందుకు దేవుణ్ణి పరీక్షిస్తున్నారు? 11ప్రభువైన యేసు కృప ద్వారా మనం రక్షణ పొందుతామని మనం నమ్ముతున్నాం గదా? అలాగే వారూ రక్షణ పొందుతారు.” 12అప్పుడు బర్నబా, పౌలు తమ ద్వారా దేవుడు యూదేతరుల్లో చేసిన సూచకక్రియలనూ మహత్కార్యాలనూ వివరిస్తుంటే సభ అంతా నిశ్శబ్దంగా ఆలకించింది. 13వారు చెప్పడం ముగించిన తరువాత యాకోబు లేచి ఇలా అన్నాడు, “సోదరులారా, నా మాట వినండి. 14యూదేతరుల్లో నుండి దేవుడు తన నామం కోసం ఒక జనాన్ని ఏర్పరచుకోడానికి వారిని మొదట ఎలా కటాక్షించాడో సీమోను తెలియజేశాడు. 15ఇందుకు ప్రవక్తల మాటలు సరిపోతున్నాయి. ఎలాగంటే, 16‘ఆ తరువాత నేను తిరిగి వస్తాను. మనుషుల్లో మిగిలినవారూ, నా నామం ఎవరైతే ధరించారో ఆ యూదేతరులందరూ, ప్రభువును వెదకేలా 17పడిపోయిన దావీదు గుడారాన్ని తిరిగి నిర్మిస్తాననీ పాడైన వాటిని తిరిగి కట్టి వాటిని నిలబెడతాననీ 18అనాదికాలం నుండి ఈ సంగతులను తెలియజేసిన ప్రభువు సెలవిస్తున్నాడు’ అని రాసి ఉంది. 19“కాబట్టి యూదేతరుల్లో నుండి దేవుని వైపు తిరిగే వారిని మనం కష్టపెట్టకుండా 20విగ్రహ సంబంధమైన అపవిత్రతనూ జారత్వాన్నీ విసర్జించాలనీ, గొంతు నులిమి చంపిన దాన్ని, రక్తాన్నీ తినకూడదనీ, వారికి ఉత్తరం రాసి పంపాలని నా అభిప్రాయం. 21ఎందుకంటే, సమాజ మందిరాల్లో ప్రతి విశ్రాంతిదినాన మోషే లేఖనాలను చదువుతూ తరతరాల నుండి దాన్ని ప్రకటించే వారు ప్రతి పట్టణంలో ఉన్నారు” అని చెప్పాడు. 22అప్పుడు సోదరుల్లో ముఖ్యులైన బర్సబ్బా అనే పేరున్న యూదానూ సీలనూ ఎన్నుకుని, వారిని పౌలు, బర్నబాలతో అంతియొకయ పంపడం మంచిదని అపొస్తలులకూ పెద్దలకూ సంఘమంతటికీ తోచింది. 23వారు ఇలా రాసి పంపారు. “అపొస్తలులూ పెద్దలూ సోదరులూ అయిన మేము అంతియొకయ, సిరియా, కిలికియలోని యూదేతరులైన సోదరులకు, శుభాకాంక్షలతో చెప్పి రాస్తున్నది, 24కొందరు మా దగ్గర నుండి వెళ్ళి తమ బోధతో మిమ్మల్ని గాబరా పెట్టి, మీ మనసులను చెరుపుతున్నారని విన్నాం. వారికి మేము ఏ అధికారమూ ఇవ్వలేదు. 25కాబట్టి కొందరిని ఎన్నుకుని, మన ప్రభువైన యేసు క్రీస్తు కోసం ప్రాణాలకు తెగించిన బర్నబా, పౌలు అనే 26మన ప్రియ మిత్రులతో కూడా వారిని మీ దగ్గరికి పంపడం మంచిదని మాకందరికీ ఏకాభిప్రాయం కలిగింది. 27అందువలన మన ప్రియమైన యూదానూ సీలనూ పంపుతున్నాం. వారు కూడా నోటిమాటతో ఈ విషయాలు మీకు తెలియజేస్తారు. 28‘విగ్రహాలకు అర్పించిన వాటినీ, రక్తాన్నీ, గొంతు నులిమి చంపిన దానినీ తినకూడదు. జారత్వానికి దూరంగా ఉండాలి’ 29అనే తప్పనిసరైన వీటి కంటే ఎక్కువైన ఏ భారాన్నీ మీ మీద మోపకూడదని, పరిశుద్ధాత్మకూ మాకూ అనిపించింది. వీటికి దూరంగా ఉండి జాగ్రత్త పడితే అది మీకు మేలు. సెలవు.” 30ఆ పైన వారు వీడ్కోలు పలికి అంతియొకయ వచ్చి శిష్యులను సమకూర్చి ఆ ఉత్తరం ఇచ్చారు. 31వారు దాన్ని చదువుకుని ప్రోత్సాహం పొంది సంతోషించారు. 32యూదా, సీల కూడా ప్రవక్తలైనందున వారు చాలా మాటలతో సోదరులను ఆదరించి బలపరిచారు. 33వారు అక్కడ కొంతకాలం గడిపిన తరువాత, వారిని పంపిన 34వారి దగ్గరికి తిరిగి వెళ్ళడానికి, సోదరులు వారిని ప్రశాంతంగా సాగనంపారు.
సువార్త
17నా ప్రాణం మళ్ళీ పొందడానికి దాన్ని పెడుతున్నాను. అందుకే నా తండ్రి నన్ను ప్రేమిస్తున్నాడు. 18నా ప్రాణాన్ని నానుంచి ఎవ్వరూ తీసివేయలేరు. నేను స్వయంగా నా ప్రాణం పెడుతున్నాను. దాన్ని పెట్టడానికి, తిరిగి తీసుకోవడానికి నాకు అధికారం ఉంది. ఈ ఆజ్ఞ నా తండ్రి నుంచి నేను పొందాను.” 19ఈ మాటలవల్ల యూదుల్లో మళ్ళీ విభేదాలు వచ్చాయి. 20వారిలో చాలా మంది, “ఇతనికి దయ్యం పట్టింది. ఇతను పిచ్చివాడు. ఇతని మాటలు మీరు ఎందుకు వింటున్నారు?” అన్నారు. 21ఇంకొంతమంది, “ఇవి దయ్యం పట్టినవాడి మాటలు కాదు. దయ్యం గుడ్డివారి కళ్ళు తెరవగలదా?” అన్నారు. 22ఆ తరువాత యెరూషలేములో ప్రతిష్ట పండగ వచ్చింది. అది చలికాలం. 23అప్పుడు యేసు దేవాలయ ప్రాంగణంలో ఉన్న సొలొమోను మంటపంలో నడుస్తూ ఉండగా 24యూదులు ఆయన చుట్టూ చేరి ఆయనతో. “ఎంతకాలం మమ్మల్ని ఇలా సందేహంలో ఉంచుతావు? నువ్వు క్రీస్తువైతే మాతో స్పష్టంగా చెప్పు” అన్నారు. 25అందుకు యేసు వారితో ఇలా అన్నాడు, “నేను మీకు చెప్పాను గాని మీరు నమ్మడం లేదు. నా తండ్రి పేరిట నేను చేస్తున్న క్రియలు నా గురించి సాక్ష్యం ఇస్తున్నాయి. 26అయినా, మీరు నా గొర్రెలు కానందువల్ల మీరు నమ్మడం లేదు. 27నా గొర్రెలు నా స్వరం వింటాయి, అవి నాకు తెలుసు, అవి నా వెంట వస్తాయి. 28నేను వాటికి శాశ్వత జీవం ఇస్తాను కాబట్టి అవి ఎప్పటికీ నశించిపోవు. వాటిని ఎవరూ నా చేతిలోనుంచి లాగేసుకోలేరు.
తేదీలు రష్యన్ సంఘపు జూలియన్ కాలెండర్ను అనుసరిస్తాయి (సెర్బియన్, జార్జియన్ సంఘాలు, ఆథోస్ పర్వతం లాగే): సంఘ కాలెండర్లోని 22 మే పౌర కాలెండర్లో 4 జూన్. కొత్త కాలెండర్ను అనుసరించే సంఘాలు (గ్రీసు, రొమేనియా, బల్గేరియా, ఉక్రెయిన్…) స్థిర పండుగలనూ పరిశుద్ధులనూ పౌర తేదీనే, 13 రోజులు ముందుగా జరుపుకుంటాయి, వాటి కొన్ని పఠనాలు వేరుగా ఉంటాయి; ఈస్టర్, దానిపై ఆధారపడిన రోజులు ఒకటే.
మూలాలు: ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు · © 2017, 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings, the editors' parts and stage directions in the Song of Songs and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · మూలాలు మరియు హక్కులు