Bible Explorer యాప్ పొందండి

హోమ్ › రోజువారీ బైబిల్ పఠనాలు › మే 2027 › 30 మే

ఆర్థడాక్స్ కాలెండర్ · మే 17 (పాత శైలి)

ఆర్థడాక్స్ రోజువారీ పఠనాలు — 30 మే, 2027

ఆదివారం · స్వరం 4

పండుగలు మరియు పరిశుద్ధులు

పాస్కా ఐదవ ఆదివారం

సమరయ స్త్రీ ఆదివారం

ఉపవాసం

ఉపవాసం లేదు

ఇది సన్యాస నియమాన్ని అనుసరిస్తుంది. సంఘంలో ఉపవాస పరిమాణాన్ని ఆరోగ్యం, వయస్సు మరియు పరిస్థితుల ప్రకారం తమ ఆత్మీయ గురువుతో కలిసి నిర్ణయిస్తారు.

ఈరోజు పఠనాలు

ఉదయ ప్రార్థన ఏడవ సువార్త

యోహా 20:1–10

1ఆదివారం ఉదయాన్నే ఇంకా చీకటిగా ఉండగానే మగ్దలేనే మరియ సమాధి దగ్గరికి వచ్చింది. అక్కడ సమాధిపై ఉంచిన రాయి తీసి ఉండడం చూసింది. 2కాబట్టి ఆమె సీమోను పేతురు దగ్గరకూ, యేసు ప్రేమించిన మరో శిష్యుడి దగ్గరకూ పరుగెత్తుకుని వెళ్ళింది. వారితో, “ప్రభువును ఎవరో సమాధిలో నుండి తీసుకు పోయారు. ఆయనను ఎక్కడ ఉంచారో తెలియడం లేదు” అని చెప్పింది. 3కాబట్టి పేతురూ, ఆ మరో శిష్యుడూ వెంటనే బయలుదేరి సమాధి దగ్గరికి వచ్చారు. 4వారిద్దరూ కలసి వెళుతుండగా ఆ మరో శిష్యుడు పేతురు కంటే వేగంగా పరుగెత్తి మొదటగా సమాధి దగ్గరికి వచ్చాడు. 5అతడు ఆ సమాధిలోకి తొంగి చూశాడు. నార బట్టలు అతనికి కనిపించాయి. కానీ అతడు సమాధిలోకి ప్రవేశించలేదు. 6ఆ తరువాత సీమోను పేతురు అతని వెనకాలే వచ్చి నేరుగా సమాధిలోకి ప్రవేశించాడు. 7అక్కడ నారబట్టలు పడి ఉండడమూ, ఆయన తలకు కట్టిన రుమాలు నార బట్టలతో కాకుండా వేరే చోట చక్కగా చుట్టి పెట్టి ఉండడమూ చూశాడు. 8ఆ తరువాత మొదట సమాధిని చేరుకున్న శిష్యుడు కూడా లోపలి వెళ్ళి చూసి విశ్వసించాడు. 9అయితే ‘ఆయన చనిపోయిన వారి నుండి బతికి లేవడం తప్పనిసరి’ అన్న లేఖనం వారింకా గ్రహించలేదు. 10అప్పుడు ఆ శిష్యులు తిరిగి తమ ఇళ్ళకు వెళ్ళిపోయారు.

పత్రిక

అపొ.కా 11:19–26, 29–30

19స్తెఫను విషయంలో కలిగిన హింస వలన చెదరిపోయిన వారు యూదులకు తప్ప మరి ఎవరికీ వాక్కు బోధించకుండా ఫేనీకే, సైప్రస్, అంతియొకయ వరకూ సంచరించారు. 20వారిలో కొంతమంది సైప్రస్ వారూ, కురేనీ వారూ అంతియొకయ వచ్చి గ్రీకు వారితో మాట్లాడుతూ యేసు ప్రభువును ప్రకటించారు. 21ప్రభువు హస్తం వారికి తోడై ఉంది. అనేక మంది నమ్మి ప్రభువు వైపు తిరిగారు. 22వారిని గూర్చిన సమాచారం యెరూషలేములో ఉన్న సంఘం విని బర్నబాను అంతియొకయకు పంపింది. 23అతడు వచ్చి దైవానుగ్రహాన్ని చూసి సంతోషించి, ప్రభువులో పూర్ణ హృదయంతో నిలిచి ఉండాలని అందరినీ ప్రోత్సాహపరిచాడు. 24అతడు పరిశుద్ధాత్మతో విశ్వాసంతో నిండిన మంచి వ్యక్తి గనుక చాలామంది ప్రభువును నమ్మారు. 25బర్నబా సౌలును వెదకడానికి తార్సు ఊరు వెళ్ళి, అతనిని వెదికి కనుగొని అంతియొకయ తోడుకుని వచ్చాడు. 26వారు కలిసి ఒక సంవత్సరమంతా సంఘంతో ఉండి చాలామందికి బోధించారు. అంతియొకయలోని శిష్యులను మొట్టమొదటి సారిగా ‘క్రైస్తవులు’ అన్నారు. 29అప్పుడు శిష్యుల్లో ప్రతివారూ తమ శక్తి కొద్దీ యూదయలోని సోదరులకు సహయం పంపడానికి నిశ్చయించుకున్నారు. 30వారు అలా చేసి, బర్నబా, సౌలుల ద్వారా పెద్దలకు డబ్బు పంపించారు.

సువార్త

యోహా 4:5–42

5అలా ఆయన సమరయలో ఉన్న సుఖారు అనే ఊరికి వచ్చాడు. ఈ ఊరి దగ్గరే యాకోబు తన కొడుకు యోసేపుకు కొంత భూమిని ఇచ్చాడు. 6యాకోబు బావి అక్కడ ఉంది. యేసు ప్రయాణంలో అలిసిపోయి ఆ బావి దగ్గర కూర్చున్నాడు. అది మిట్ట మధ్యాహ్నం. 7ఒక సమరయ స్త్రీ నీళ్ళు తోడుకోవడానికి ఆ బావి దగ్గరికి వచ్చింది. యేసు ఆమెతో, “తాగడానికి నీళ్ళు ఇస్తావా?” అని అడిగాడు. 8ఆయన శిష్యులు ఆహారం కొనడానికి ఊరిలోకి వెళ్ళారు. 9ఆ సమరయ స్త్రీ యేసుతో ఇలా అంది, “నువ్వు యూదుడివి. సమరయ స్త్రీ అయిన నన్ను నీళ్ళు ఎలా అడుగుతున్నావు?” ఎందుకంటే యూదులు సమరయులతో ఎలాంటి సంబంధాలూ పెట్టుకోరు. 10దానికి యేసు, “నువ్వు దేవుని బహుమానాన్నీ, తాగడానికి నీళ్ళు కావాలని నిన్ను అడుగుతున్న వ్యక్తినీ తెలుసుకుంటే నువ్వే ఆయనను అడిగేదానివి. ఆయన నీకు జీవజలం ఇచ్చి ఉండేవాడు” అన్నాడు. 11అప్పుడా స్త్రీ, “అయ్యా, ఈ బావి చాలా లోతు. తోడుకోడానికి నీ దగ్గర చేద లేదు. ఆ జీవజలం నీకెలా దొరుకుతుంది? 12మన తండ్రి అయిన యాకోబు ఈ బావి నీళ్ళు తాగాడు. తన సంతానానికీ, తన పశువులకూ తాగడానికి ఈ నీళ్ళే ఇచ్చాడు. మాకూ తాగడానికి ఈ బావిని ఇచ్చాడు. నువ్వు ఆయన కంటే గొప్పవాడివా?” అంది. 13దానికి యేసు, “ఈ నీళ్ళు తాగే ప్రతి ఒక్కరికీ మళ్ళీ దాహం వేస్తుంది. 14కానీ నేను ఇచ్చే నీళ్ళు తాగే వారికి ఇక ఎప్పటికీ దాహం వేయదు. నేను వారికిచ్చే నీళ్ళు అయితే వారిలో నిత్య జీవానికి ఊరుతూ ఉండే ఊట అవుతాయి” అన్నాడు. 15అప్పుడు ఆమె ఆయనతో, “అయ్యా, నీళ్ళు చేదుకోడానికి నేను ఇంత దూరం రానవసరం లేకుండా ఆ నీళ్ళు నాకివ్వు” అంది. 16యేసు ఆమెతో, “నువ్వు వెళ్ళి నీ భర్తను ఇక్కడికి తీసుకురా” అన్నాడు. 17దానికి ఆ స్త్రీ, “నాకు భర్త లేడు” అంది. యేసు ఆమెతో, “‘భర్త లేడని సరిగ్గానే చెప్పావు. 18ఎందుకంటే నీకు ఐదుగురు భర్తలున్నారు. ఇప్పుడు నీతో ఉన్నవాడు నీ భర్త కాడు. ఈ విషయంలో నువ్వు బాగానే చెప్పావు” అన్నాడు. 19అప్పుడా స్త్రీ, “అయ్యా, నువ్వు ఒక ప్రవక్తవి అని నాకు అర్థమౌతున్నది. 20మా పూర్వీకులు ఈ కొండ పైన ఆరాధించారు. కానీ ఆరాధించే స్థలం యెరూషలేములో ఉందనీ అందరూ అక్కడికే వెళ్ళి ఆరాధించాలనీ మీరు అంటారు” అంది. అందుకు యేసు ఇలా చెప్పాడు. 21“అమ్మా, తండ్రిని ఈ కొండ మీదో, యెరూషలేములోనో ఆరాధించని కాలం వస్తుంది. నా మాట నమ్ము. 22మీరు మీకు తెలియని దాన్ని ఆరాధిస్తారు. మేము మాకు తెలిసిన దాన్ని ఆరాధిస్తాము. ఎందుకంటే రక్షణ యూదుల్లో నుండే వస్తుంది. 23నిజమైన ఆరాధికులు తండ్రిని హృదయ పూర్వకంగా ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించే కాలం వస్తుంది. ఇప్పటికే వచ్చేసింది. తనను ఆరాధించేవారు అలాటివారే కావాలని తండ్రి చూస్తున్నాడు. 24దేవుడు ఆత్మ కాబట్టి ఆయనను ఆరాధించే వారు ఆత్మతో, సత్యంతో ఆరాధించాలి.” 25అప్పుడు ఆ స్త్రీ ఆయనతో, “క్రీస్తు అని పిలిచే మెస్సీయ వస్తున్నాడని నాకు తెలుసు. ఆయన వచ్చినప్పుడు మాకు అంతా వివరిస్తాడు” అంది. 26అది విని యేసు, “నీతో మాట్లాడుతున్న నేనే ఆయన్ని” అని చెప్పాడు. 27ఇదే సమయానికి ఆయన శిష్యులు తిరిగి వచ్చారు. ఆ స్త్రీతో ఆయన మాట్లాడుతూ ఉండడం చూసి ‘ఎందుకు మాట్లాడుతున్నాడా’ అని ఆశ్చర్యపడ్డారు. కానీ ‘నీకేం కావాలని’ గానీ ‘ఆమెతో ఎందుకు మాట్లాడుతున్నావు’ అని గానీ ఎవరూ అడగలేదు. 28ఇక ఆ స్త్రీ తన నీళ్ళ కుండ అక్కడే వదిలిపెట్టి ఊరిలోకి వెళ్ళింది. 29ఆ ఊరి వారితో, “మీరు నాతో వచ్చి నేను చేసిన పనులన్నిటినీ నాతో చెప్పిన వ్యక్తిని చూడండి. ఈయన క్రీస్తు కాడా?” అంది. 30వారంతా ఊరి నుండి బయలు దేరి ఆయన దగ్గరికి వచ్చారు. 31ఆలోగా శిష్యులు, “బోధకా, భోజనం చెయ్యి” అని ఆయనను బతిమాలారు. 32దానికి ఆయన, “తినడానికి మీకు తెలియని ఆహారం నాకుంది” అని వారితో చెప్పాడు. 33“ఆయన తినడానికి ఎవరైనా భోజనం ఏదైనా తెచ్చారా ఏమిటి?” అని శిష్యులు ఒకరితో ఒకరు చెప్పుకున్నారు. 34యేసు వారిని చూసి, “నన్ను పంపించిన వాని ఇష్టాన్ని చేయడం, ఆయన పని చేసి ముగించడమే నా ఆహారం. 35పంట కోయడానికి కోతకాలం రావాలంటే ఇంకా నాలుగు నెలలు ఉన్నాయని మీరు చెబుతారు కదా! మీ తలలెత్తి పొలాలను చూడండి. అవి ఇప్పటికే పక్వానికి వచ్చి కోతకు సిద్ధంగా ఉన్నాయని మీతో చెబుతున్నాను. 36విత్తనాలు చల్లేవాడూ పంట కోసేవాడూ కలసి సంతోషించేలా కోసేవాడు జీతం తీసుకుని శాశ్వత జీవం కోసం ఫలాన్ని సమకూర్చుకుంటున్నాడు. 37ఈ విషయంలో “విత్తనాలు చల్లేది ఒకరు, పంట కోసేది మరొకరు, అనే మాట నిజమే. 38మీరు దేని కోసం ప్రయాస పడలేదో దాన్ని కోయడానికి మిమ్మల్ని పంపాను. ఇతరులు చాకిరీ చేశారు. వారి కష్టఫలాన్ని మీరు అనుభవిస్తున్నారు” అన్నాడు. 39‘నేను చేసినవన్నీ ఆయన నాతో చెప్పాడు’ అంటూ సాక్ష్యం ఇచ్చిన స్త్రీ మాటను బట్టి ఆ పట్టణంలోని అనేక మంది సమరయులు ఆయనలో విశ్వాసముంచారు. 40ఆ సమరయ వారు ఆయన దగ్గరికి వచ్చి తమతో ఉండమని ఆయనను వేడుకున్నారు. కాబట్టి ఆయన అక్కడ రెండు రోజులు ఉన్నాడు. 41ఆయన మాటలు విని ఇంకా చాలా మంది ఆయనలో విశ్వాసముంచారు. వారు ఆ స్త్రీతో, “మేము విశ్వసించింది కేవలం నీ మాట మీదే కాదు. 42మేము కూడా ఆయన మాటలు విన్నాం. ఇప్పుడు ఈయన నిజంగా ఈ లోక రక్షకుడని తెలుసుకున్నాం” అన్నారు.

తేదీలు రష్యన్ సంఘపు జూలియన్ కాలెండర్‌ను అనుసరిస్తాయి (సెర్బియన్, జార్జియన్ సంఘాలు, ఆథోస్ పర్వతం లాగే): సంఘ కాలెండర్‌లోని 17 మే పౌర కాలెండర్‌లో 30 మే. కొత్త కాలెండర్‌ను అనుసరించే సంఘాలు (గ్రీసు, రొమేనియా, బల్గేరియా, ఉక్రెయిన్…) స్థిర పండుగలనూ పరిశుద్ధులనూ పౌర తేదీనే, 13 రోజులు ముందుగా జరుపుకుంటాయి, వాటి కొన్ని పఠనాలు వేరుగా ఉంటాయి; ఈస్టర్, దానిపై ఆధారపడిన రోజులు ఒకటే.

మూలాలు: ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు · © 2017, 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings, the editors' parts and stage directions in the Song of Songs and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · మూలాలు మరియు హక్కులు