Bible Explorer యాప్ పొందండి

హోమ్ › రోజువారీ బైబిల్ పఠనాలు › మే 2027 › 12 మే

కాథలిక్ కాలెండర్

రోజువారీ బైబిల్ పఠనాలు (కాథలిక్) — 12 మే, 2027

బుధవారం · పాస్కా కాలం ఏడవ వారం

పండుగలు మరియు పరిశుద్ధులు

పాస్కా కాలం ఏడవ వారపు బుధవారం

ఐచ్ఛిక స్మరణ దినం · ఆరాధన రంగు: తెలుపు

పునీత పాంక్రాస్, హతసాక్షి · ఐచ్ఛిక స్మరణ దినం

పునీత నెరియస్, అకిలియస్, హతసాక్షులు · ఐచ్ఛిక స్మరణ దినం

ఈరోజు పఠనాలు

మొదటి పఠనం

అపొ.కా 20:28–38

28“ప్రభువు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘాన్ని కాయడం కోసం పరిశుద్ధాత్మ మిమ్మల్ని దేనికి అధ్యక్షులుగా నియమించాడో ఆ మంద అంతటిని గురించీ, మీ మట్టుకు మిమ్మల్ని గురించీ జాగ్రత్తగా ఉండండి. 29నాకు తెలుసు, నేను వెళ్ళిపోయిన వెంటనే క్రూరమైన తోడేళ్ళు వంటివారు మీలో ప్రవేశిస్తారు. వారు మందపై జాలి చూపరు. 30అంతేకాక శిష్యులను తమతో ఈడ్చుకుపోవడం కోసం దారి మళ్ళించే మాటలు పలికే వ్యక్తులు మీలో నుండే బయలుదేరుతారు. 31కాబట్టి మూడు సంవత్సరాలుగా నేను రాత్రింబగళ్ళు కన్నీళ్ళతో మీలో ప్రతి ఒక్కరికీ ఎడతెగక బుద్ధి నేర్పడం మానలేదని గుర్తుంచుకుని మెలకువగా ఉండండి. 32ఇప్పుడు దేవునికీ, ఆయన కృపావాక్యానికీ మిమ్మల్ని అప్పగిస్తున్నాను. ఆయన మీకు క్షేమాభివృద్ధి కలగజేయటానికీ పరిశుద్ధులందరితో వారసత్వం అనుగ్రహించడానికీ శక్తిశాలి. 33నేను ఎవరి వెండినిగానీ, బంగారాన్నిగానీ, వస్త్రాలుగానీ ఆశించలేదు. 34నా అవసరాల నిమిత్తం, నాతో ఉన్నవారి నిమిత్తం ఈ నా చేతులు కష్టపడ్డాయని మీకు తెలుసు. 35మీరు కూడా అదే విధంగా ప్రయాసపడి బలహీనులను సంరక్షించాలనీ, ‘పుచ్చు కోవడం కంటే ఇవ్వడం ధన్యకరమైనది’ అని ప్రభువైన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకోవాలనీ, నేను అన్ని విషయాల్లో మీకు ఆదర్శంగా నిలిచాను.” 36అతడు ఈ విధంగా చెప్పి మోకరించి వారందరితో కలిసి ప్రార్థన చేశాడు. 37అప్పుడు వారంతా చాలా ఏడ్చి పౌలును కౌగలించుకుని ముద్దుపెట్టుకున్నారు. 38మరి ముఖ్యంగా, “మీరు ఇక మీదట నా ముఖం చూడరు” అని అతడు చెప్పిన మాటను బట్టి వారు ఎంతో దుఃఖిస్తూ ఓడ వరకూ అతనిని సాగనంపారు.

ప్రతిస్పందన కీర్తన

కీర్త 68:28–29, 32–35

28నీ దేవుడు నీకు బలం ఇచ్చాడు. దేవా, గతంలో చేసినట్టు నీ శక్తిని మాకు కనపరచు. 29యెరూషలేములోని నీ ఆలయాన్నిబట్టి రాజులు నీ దగ్గరికి కానుకలు తెస్తారు. 32భూరాజ్యాలన్నీ దేవుని గూర్చి పాడండి. ప్రభువును కీర్తించండి. 33అనాది కాలం నుండి ఆకాశాలపై స్వారీ చేసే ఆయనను కీర్తించండి. ఆయన తన స్వరం వినిపిస్తాడు. అది బలమైన స్వరం. 34దేవునికి బలాతిశయం ఆపాదించండి. ఆయన మహిమ ఇశ్రాయేలు మీద ఉంది. ఆయన బలం అంతరిక్షంలో ఉంది. 35దేవా, నీ పరిశుద్ధ స్థలాల్లో నువ్వు భీకరుడివి. ఇశ్రాయేలు దేవుడే తన ప్రజలకు బల ప్రభావాలను అనుగ్రహిస్తున్నాడు. దేవునికి స్తుతి కలుగు గాక.

సువార్త

యోహా 17:11–19

11నేనింక ఈ లోకంలో ఉండను గాని ఈ ప్రజలు లోకంలో ఉన్నారు. నేను నీ దగ్గరికి వస్తున్నాను. పవిత్రుడవైన తండ్రీ, నువ్వు నాకిచ్చిన నీ నామాన్ని బట్టి, మనం ఏకంగా ఉన్నట్టే వారూ ఏకంగా ఉండేలా వారిని కాపాడు. 12నేను వారితో ఉన్నప్పుడు నువ్వు నాకు ఇచ్చిన నీ నామాన్ని బట్టి వారిని కాపాడాను. లేఖనం నెరవేరేలా, నాశనానికి తగినవాడు తప్ప ఏ ఒక్కరూ నశించకుండా, వారిని సంరక్షించాను. 13ఇప్పుడు నేను నీ దగ్గరికి వస్తున్నాను. నా ఆనందం వారిలో సంపూర్తి కావాలని లోకంలో ఉండగానే ఈ సంగతులు చెబుతున్నాను. 14వారికి నీ వాక్కు ఇచ్చాను. నేను ఈ లోకానికి చెందినవాణ్ణి కానట్టే, వారు కూడా ఈ లోకానికి చెందినవారు కాదు కాబట్టి ఈ లోకం వారిని ద్వేషించింది. 15నువ్వు ఈ లోకంలో నుంచి వారిని తీసుకు వెళ్ళమని నేను ప్రార్థన చేయడం లేదు గాని, దుర్మార్గుని నుంచి వారిని కాపాడమని ప్రార్థన చేస్తున్నాను. 16నేను ఈ లోకానికి చెందినవాణ్ణి కానట్టే వారు కూడా ఈ లోకానికి చెందినవారు కాదు. 17సత్యం ద్వారా వారిని పవిత్రం చెయ్యి. నీ వాక్యమే సత్యం. 18“నువ్వు నన్ను ఈ లోకంలోకి పంపినట్టే, నేను వారిని ఈ లోకంలోకి పంపించాను. 19వారు సత్యం ద్వారా పవిత్రులు కావాలని వారి కోసం నన్ను నేను పవిత్రం చేసుకుంటున్నాను.

ఈరోజు పరిశుద్ధులు

సాధారణ రోమన్ కాలెండర్; ఒక బిషప్‌ల సమావేశం కొన్ని పండుగలను (దివ్యదర్శనం, పరలోకారోహణం, క్రీస్తు శరీర రక్తాల పండుగ) ఒక ఆదివారానికి మార్చవచ్చు లేదా తన సొంత పండుగలను జోడించవచ్చు. పఠన గ్రంథం: ఆదివారపు చక్రం B, వారపు రోజుల సంవత్సరం I.

మూలాలు: ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు · © 2017, 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings, the editors' parts and stage directions in the Song of Songs and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · మూలాలు మరియు హక్కులు