హోమ్ › రోజువారీ బైబిల్ పఠనాలు › ఏప్రిల్ 2027 › 4 ఏప్రిల్
ఆర్థడాక్స్ కాలెండర్ · మార్చి 22 (పాత శైలి)
ఆర్థడాక్స్ రోజువారీ పఠనాలు — 4 ఏప్రిల్, 2027
ఆదివారం · స్వరం 3
పండుగలు మరియు పరిశుద్ధులు
మహా ఉపవాస కాలం మూడవ ఆదివారం
అమూల్యమైన సిలువ వందనం
మహా ఉపవాస కాలం
ఉపవాసం: నూనెతో
ఇది సన్యాస నియమాన్ని అనుసరిస్తుంది. సంఘంలో ఉపవాస పరిమాణాన్ని ఆరోగ్యం, వయస్సు మరియు పరిస్థితుల ప్రకారం తమ ఆత్మీయ గురువుతో కలిసి నిర్ణయిస్తారు.
ఈరోజు పఠనాలు
ఉదయ ప్రార్థన 11వ సువార్త
15వారంతా భోజనం చేసిన తరువాత యేసు సీమోను పేతురును చూసి, “యోహాను కొడుకువైన సీమోనూ, వీళ్ళకంటే నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా?” అని ప్రశ్నించాడు. అతడు, “అవును ప్రభూ, నేను నిన్ను ప్రేమిస్తున్నానని నీకే తెలుసు” అన్నాడు. దానికి యేసు, “నా గొర్రెలను మేపు” అని అతనితో చెప్పాడు. 16మరోసారి ఆయన, “యోహాను కొడుకువైన సీమోనూ, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా?” అని అతణ్ణి అడిగాడు. అతడు, “అవును ప్రభూ, నేను నిన్ను ప్రేమిస్తున్నానని నీకే తెలుసు” అన్నాడు. దానికి యేసు, “నా గొర్రెలకు కాపరిగా ఉండు” అన్నాడు. 17ఆయన మూడోసారి, “యోహాను కొడుకువైన సీమోనూ, నన్ను ప్రేమిస్తున్నావా?” అని అడిగాడు. ఇలా ‘నన్ను ప్రేమిస్తున్నావా’ అని మూడోసారి తనను అడిగినందుకు పేతురు ఇబ్బంది పడి, “ప్రభూ నీకు అన్నీ తెలుసు. నిన్ను ప్రేమిస్తున్నానని నీకు బాగా తెలుసు” అన్నాడు. అప్పుడు యేసు, “నా గొర్రెలను మేపు. 18నువ్వు యువకుడిగా ఉన్నప్పుడు నీ అంతట నువ్వే నీ నడుం కట్టుకుని నీకిష్టమైన స్థలాలకు తిరిగే వాడివి. కచ్చితంగా నీకు చెబుతున్నాను. నువ్వు ముసలి వాడివి అయినప్పుడు నువ్వు నీ చేతులు చాపుతావు. వేరొకడు నీ నడుము కట్టి నీకిష్టం లేని చోటికి నిన్ను మోసుకు పోతాడు” అని అతనితో చెప్పాడు. 19దేవుని మహిమ కోసం అతడు ఎలాంటి మరణం పొందుతాడో దాన్ని సూచిస్తూ ఆయన ఈ మాటలు చెప్పాడు. ఇలా చెప్పి ఆయన, “నన్ను అనుసరించు” అని అతనితో అన్నాడు. 20పేతురు వెనక్కి తిరిగి యేసు ప్రేమించిన వాడూ, పస్కా పండగ సందర్భంలో భోజన సమయంలో ఆయన పక్కనే కూర్చుని ఆయన ఛాతీని ఆనుకుంటూ, “ప్రభూ నిన్ను పట్టిచ్చేది ఎవరు” అని అడిగిన శిష్యుడు తమ వెనకే రావడం చూశాడు. 21పేతురు అతణ్ణి చూసి, “ప్రభూ, మరి ఇతడి విషయం ఏమవుతుంది?” అని ఆయనను అడిగాడు. 22దానికి యేసు, “నేను వచ్చే వరకూ అతడు జీవించి ఉండడం నాకిష్టమైతే నీకేమిటి? నువ్వు నన్ను అనుసరించు” అన్నాడు. 23దాంతో ఆ శిష్యుడు మరణించడు అనే మాట శిష్యుల్లో పాకి పోయింది. అయితే అతడు మరణించడు అని యేసు చెప్పలేదు గానీ నేను వచ్చే వరకూ అతడు ఉండడం నాకిష్టమైతే నీకేంటి, అని మాత్రమే అన్నాడు. 24ఈ సంగతులను గురించి సాక్షమిస్తూ ఇవన్నీ రాసింది ఈ శిష్యుడే. ఇతని సాక్ష్యం సత్యమని మనకు తెలుసు. 25యేసు చేసిన పనులు ఇంకా చాలా ఉన్నాయి. అవన్నీ వివరించి రాసే గ్రంథాలకు ఈ భూలోకం సరిపోదని నాకు అనిపిస్తుంది.
పత్రిక
14ఆకాశాలగుండా వెళ్ళిన దేవుని కుమారుడు యేసు అనే ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు కాబట్టి మనం విశ్వసించినదాన్ని గట్టిగా పట్టుకుందాం. 15మన ప్రధాన యాజకుడు మన బలహీనతల పట్ల సానుభూతి లేని వాడు కాడు. ఎందుకంటే ఆయన కూడా మనలాగే శోధన ఎదుర్కొన్నాడు. అయితే ఆయన పాపం లేని వాడుగా ఉన్నాడు. 16కాబట్టి మన అవసరాల్లో ఆయన కృపా కనికరాలకై ధైర్యంతో కృపా సింహాసనం దగ్గరికి వెళ్దాం. 5:1దేవునికి సంబంధించిన పనులు చేయడానికీ, ప్రజల పక్షంగా వారి పాపాల కోసం అర్పణలనూ, బలులనూ అర్పించడానికీ, ప్రతి ప్రధాన యాజకుడి నియామకమూ ప్రజల్లో నుండే జరుగుతుంది. 2అతడు అజ్ఞానుల విషయంలోనూ, దారి తప్పిన వారి విషయంలోనూ సానుభూతి చూపుతాడు. ఎందుకంటే అతణ్ణి కూడా అలాంటి బలహీనతలు చుట్టుముట్టి ఉంటాయి గనక 3ఆ బలహీనతల కారణంగా ప్రజల పాపాల కోసం ఎలా అర్పణలు అర్పిస్తున్నాడో అలాగే తన కోసం కూడా అర్పించాల్సి ఉంటుంది. 4ఈ గొప్పదనాన్ని ఎవరూ తమకు తామే ఆపాదించుకునే వీలు లేదు. అహరోనుకు ఉన్నట్టుగా దీనికి దేవుని ప్రత్యేక పిలుపు ఉండాలి. 5అలానే క్రీస్తు కూడా ప్రధాన యాజకుని స్థానానికి తనను తానే హెచ్చించుకోలేదు గానీ దేవుడే ఆయనతో ఇలా అన్నాడు. “నువ్వు నా కుమారుడివి. ఈ రోజు నేను నీకు తండ్రినయ్యాను.” 6అలాగే మరొక చోట ఆయన, “నువ్వు మెల్కీసెదెకు క్రమంలో కలకాలం ఉండే యాజకుడివి” అన్నాడు.
సువార్త
34తరువాత యేసు తన శిష్యులను, ప్రజలను దగ్గరికి పిలిచి వారితో ఇలా అన్నాడు. “ఎవరైనా నా వెంట రావాలనుకుంటే తనను తాను కాదనుకుని, తన సిలువను మోసుకుంటూ నాతో నడవాలి. 35ఎందుకంటే తన ప్రాణాన్ని దక్కించుకోవాలని చూసేవాడు దాన్ని పోగొట్టుకుంటాడు. కాని నా కోసం, సువార్త కోసం తన ప్రాణాన్ని కోల్పోయేవాడు దాన్ని దక్కించుకుంటాడు. 36ఒక మనిషి ప్రపంచమంతా సంపాదించి, తన ప్రాణాన్నే పోగొట్టుకుంటే ఆ వ్యక్తికి ఏం లాభం? 37ఒకడు తన ప్రాణాన్ని తిరిగి పొందడానికి ఏమి ఇవ్వగలడు? 38వ్యభిచారం, పాపం జరిగించే ఈ తరంలో ఎవరైనా నా గురించీ నా మాటల గురించీ సిగ్గుపడితే మనుష్య కుమారుడు తన తండ్రి మహిమతో, పవిత్ర దేవదూతలతో కలసి వచ్చేటప్పుడు ఆ వ్యక్తి విషయంలో సిగ్గుపడతాడు.” 9:1ఆయన వారితో, “నేను మీతో కచ్చితంగా చెప్తున్నాను. ఇక్కడ నిలుచున్న వారిలో కొంతమంది దేవుని రాజ్యం శక్తితో రావడం చూస్తారు. దానికంటే ముందు వారు మరణించరు” అని అన్నాడు.
తేదీలు రష్యన్ సంఘపు జూలియన్ కాలెండర్ను అనుసరిస్తాయి (సెర్బియన్, జార్జియన్ సంఘాలు, ఆథోస్ పర్వతం లాగే): సంఘ కాలెండర్లోని 22 మార్చి పౌర కాలెండర్లో 4 ఏప్రిల్. కొత్త కాలెండర్ను అనుసరించే సంఘాలు (గ్రీసు, రొమేనియా, బల్గేరియా, ఉక్రెయిన్…) స్థిర పండుగలనూ పరిశుద్ధులనూ పౌర తేదీనే, 13 రోజులు ముందుగా జరుపుకుంటాయి, వాటి కొన్ని పఠనాలు వేరుగా ఉంటాయి; ఈస్టర్, దానిపై ఆధారపడిన రోజులు ఒకటే.
మూలాలు: ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు · © 2017, 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings, the editors' parts and stage directions in the Song of Songs and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · మూలాలు మరియు హక్కులు