హోమ్ › రోజువారీ బైబిల్ పఠనాలు › మార్చి 2027 › 3 మార్చి
ఆర్థడాక్స్ కాలెండర్ · ఫిబ్రవరి 18 (పాత శైలి)
ఆర్థడాక్స్ రోజువారీ పఠనాలు — 3 మార్చి, 2027
బుధవారం · మాంస విరమణ వారం · స్వరం 6
పండుగలు మరియు పరిశుద్ధులు
మాంస విరమణ వారపు బుధవారం
ఉపవాస దినం
చేపలు అనుమతి
ఇది సన్యాస నియమాన్ని అనుసరిస్తుంది. సంఘంలో ఉపవాస పరిమాణాన్ని ఆరోగ్యం, వయస్సు మరియు పరిస్థితుల ప్రకారం తమ ఆత్మీయ గురువుతో కలిసి నిర్ణయిస్తారు.
ఈరోజు పఠనాలు
పత్రిక
21ప్రియులారా, మన హృదయం మనపై నింద మోపకపోతే, దేవుని దగ్గర ధైర్యంగా ఉంటాం. 22అప్పుడు, ఆయన ఆజ్ఞలు పాటిస్తూ, ఆయన దృష్టికి ఇష్టమైనవి చేస్తూ ఉండడం వల్ల, మనం ఏది అడిగినా, అది ఆయన దగ్గర నుండి పొందుతాం. 23ఇదే ఆయన ఆజ్ఞ: ఆయన కుమారుడు యేసు క్రీస్తు నామంలో విశ్వాసం ఉంచాలి. ఆయన ఆజ్ఞ ప్రకారం ఒకరిని ఒకరు ప్రేమించుకోవాలి. 24దేవుని ఆజ్ఞలు పాటించే వాడు ఆయనలో నిలిచి ఉంటాడు. దేవుడు అతనిలో నిలిచి ఉంటాడు. ఆయన మనకిచ్చిన ఆత్మ ద్వారా ఆయన మనలో నిలిచి ఉన్నాడని మనకు తెలుసు. 4:1ప్రియులారా, లోకంలో చాలామంది అబద్ధ ప్రవక్తలు బయలుదేరారు. ప్రతి ఆత్మనూ నమ్మకండి. ఆ ఆత్మలు దేవునికి సంబంధించినవో, కావో, పరీక్షించి చూడండి. 2ఏ ఆత్మైనా దేవునికి చెందినదా లేదా అన్న విషయాన్ని ఈ విధంగా గుర్తించగలుగుతాము. యేసు క్రీస్తు మానవునిగా వచ్చాడు అని అంగీకరించే ప్రతి ఆత్మా దేవునికి చెందినది. 3యేసును అంగీకరించని ప్రతి ఆత్మా దేవుని నుండి వచ్చింది కాదు. అది క్రీస్తు విరోధికి చెందిన ఆత్మ. అది రాబోతున్నదని మీరు విన్నారు. కానీ అది ఇప్పటికే ఈ లోకంలో ఉంది. 4పిల్లలూ, మీరు దేవుని సంబంధులు. మీరు ఆ ఆత్మలను జయించారు. ఎందుకంటే, మీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడికన్నా గొప్పవాడు. 5ఆ ఆత్మలు లోకానికి చెందినవారు కాబట్టి వారు చెప్పేది లోక సంబంధంగా ఉంటుంది. లోకం వారి మాట వింటుంది. 6మనం దేవుని సంబంధులం. దేవుణ్ణి తెలుసుకున్నవాడు మన మాట వింటాడు. దేవుని సంబంధి కానివాడు మన మాట వినడు. దీన్ని బట్టి ఏ ఆత్మ సత్యమైనదో, ఏ ఆత్మ అసత్యమైనదో మనం తెలుసుకుంటాం.
సువార్త
43ఆయన ఇంకా మాట్లాడుతూ ఉండగానే పన్నెండు మందిలో ఒకడైన యూదా వచ్చాడు. ప్రధాన యాజకులూ ధర్మశాస్త్ర పండితులూ పెద్దలూ పంపిన పెద్ద గుంపు అతనితో ఉంది. వారి దగ్గర కత్తులూ దుడ్డు కర్రలూ ఉన్నాయి. 44ఆయనను అప్పగించేవాడు ముందుగానే వారికి ఒక గుర్తు చెప్పి, “నేనెవరిని ముద్దు పెట్టుకుంటానో ఆయనే యేసు. ఆయనను బంధించి తీసుకు వెళ్ళండి” అన్నాడు. 45అతడు అక్కడికి చేరిన వెంటనే యేసు దగ్గరికి వచ్చి, “రబ్బీ!” అంటూ ఆయనను ముద్దుపెట్టుకున్నాడు. 46అప్పుడు వారు యేసు మీద పడి గట్టిగా పట్టుకున్నారు. 47అక్కడ నిలుచున్న వారిలో ఒకడు తన కత్తి తీసి ప్రధాన యాజకుని సేవకుని కొట్టి అతని చెవి నరికి వేశాడు. 48యేసు వారితో ఇలా అన్నాడు, “మీరు కత్తులతో గదలతో వచ్చి బంధించడానికి నేను దోపిడీ దొంగనా? 49నేను ప్రతి రోజూ దేవాలయంలో ఉపదేశం చేస్తూ మీతో ఉన్నవాడినే కదా! అప్పుడు నన్ను ఎందుకు పట్టుకోలేదు? లేఖనాల్లో రాసి ఉన్నది నెరవేరడం కోసమే ఈ విధంగా జరిగింది.” 50అప్పుడు యేసు శిష్యులందరూ ఆయనను విడిచి పారిపోయారు. 51ఒక యువకుడు యేసును వెంబడిస్తున్నాడు. అతని శరీరం మీద నారబట్ట తప్ప ఇంకేమీ లేదు. వారు అతనిని కూడా పట్టుకున్నారు. 52కాని అతడు ఆ నారబట్ట విడిచిపెట్టి నగ్నంగా పారిపోయాడు. 53వారు యేసుని ప్రధాన యాజకుని దగ్గరికి తీసుకు వెళ్ళారు. అక్కడ ముఖ్య యాజకులు, పెద్దలు, ధర్మశాస్త్ర పండితులు అందరూ సమావేశమయ్యారు. 54పేతురు యేసుకు దూరంగా ఉండి వెంబడిస్తూ ప్రధాన యాజకుని ఇంటి ఆవరణలోకి వచ్చాడు. భటులతో పాటు తాను కూడా కూర్చుని మంట దగ్గర చలి కాచుకుంటూ ఉన్నాడు. 55ముఖ్య యాజకులు, యూదుల మహా సభలోని సభ్యులంతా యేసుకు మరణశిక్ష విధించడానికి తగిన సాక్ష్యం కోసం చూస్తూ ఉన్నారు గానీ అది వారికి దొరకలేదు. 56చాలామంది యేసుకు వ్యతిరేకంగా అబద్ధ సాక్ష్యం చెప్పారు. కాని, వారి సాక్షాలు ఒకదానితో ఒకటి పొసగలేదు. 57అప్పుడు కొందరు లేచి ఆయనకు వ్యతిరేకంగా అబద్ధ సాక్ష్యం చెబుతూ, 58“ఇతడు ‘మనుషులు కట్టిన ఈ దేవాలయాన్ని పడగొట్టి మూడు రోజుల్లో మనుషులు కట్టని మరో దేవాలయాన్ని నిర్మిస్తాను’ అని చెప్పడం మేము విన్నాం” అన్నారు. 59కాని, వారి సాక్ష్యం కూడా ఒకరితో ఒకరికి పొసగలేదు. 60అప్పుడు ప్రధాన యాజకుడు లేచి అందరి సమక్షంలో యేసుతో, “నీవేమీ మాట్లాడవేంటి? వీరు నీకు వ్యతిరేకంగా సాక్ష్యం చెబుతున్నారు కదా!” అని యేసును ప్రశ్నించాడు. 61కాని యేసు మౌనం వహించాడు. ప్రధాన యాజకుడు, “నీవు దేవుని కుమారుడివైన క్రీస్తువా?” అని మళ్ళీ యేసును ప్రశ్నించాడు. 62అప్పుడు యేసు, “నేనే. మనుష్య కుమారుడు సర్వశక్తుని కుడి వైపున కూర్చుని ఉండటం, పరలోకం నుండి మేఘాలపై రావడం మీరు చూస్తారు” అన్నాడు. 63ప్రధాన యాజకుడు తన బట్టలు చింపుకుని, “ఇంకా మనకు సాక్షాలతో ఏం పని? 64ఇతడు దేవ దూషణ చేయడం మీరు విన్నారు కదా! మీరేమంటారు?” అన్నాడు. ఆయన మరణశిక్షకు తగిన వాడని అందరూ తీర్పు చెప్పారు. 65అప్పుడు కొందరు యేసు మీద ఉమ్మివేసి, ఆయన కళ్ళకు గంతలు కట్టి, ఆయనను గుద్ది, “ఎవరో ప్రవచించు” అన్నారు. భటులు కూడా ఆయనను కొట్టారు. 66పేతురు ఇంటి లోగిట్లో ఉన్నాడు. ప్రధాన యాజకుని పనిపిల్ల అక్కడకు వచ్చింది. 67పేతురు చలి కాచుకుంటూ అక్కడ ఉండడం చూసి, “నజరేతు వాడైన యేసుతో నువ్వు కూడా ఉన్నావుగదా!” అని అతనితో అంది. 68పేతురు కాదన్నాడు. “నేను ఆయనను ఎరగను. నీవేం అంటున్నావో నాకు అర్థం కావడం లేదు” అని అన్నాడు. ఆ వెంటనే లేచి ఆవరణలోకి వెళ్ళాడు. వెంటనే కోడి కూసింది. 69ఆ పనిపిల్ల పేతురును చూసి, చుట్టూ ఉన్న వారితో, “ఇతడు వారిలో ఒకడు” అంది. 70పేతురు మళ్ళీ కాదన్నాడు. కాసేపటికి పక్కన నిలుచున్నవారు అతనితో, “నిజమే! నువ్వు వాళ్ళలో ఒకడివే. ఎందుకంటే నువ్వు కూడా గలిలయ వాడివే కదా!” అన్నారు. 71అయితే పేతురు, “మీరు మాట్లాడుతున్న మనిషి ఎవరో తెలియదు” అంటూ తనను తాను శపించుకోవడం, ఒట్టు పెట్టుకోవడం మొదలుపెట్టాడు. 72వెంటనే రెండోసారి కోడి కూసింది. ‘కోడి రెండు సార్లు కూసే ముందే నన్నెరుగనని మూడు సార్లు బొంకుతావు’ అని యేసు తనతో చెప్పిన మాటలు పేతురుకు జ్ఞాపకం వచ్చాయి. అతడు దుఃఖం ఆపుకోలేక ఏడ్చాడు. 15:1తెల్లవారు జామున ముఖ్య యాజకులు, పెద్దలు, ధర్మశాస్త్ర పండితులు, యూదుల మహాసభకు చెందిన సభ్యులు కలసి సమాలోచన చేశారు. తరువాత వారు యేసును బంధించి తీసుకువెళ్ళి రోమా గవర్నర్ పిలాతుకు అప్పగించారు.
తేదీలు రష్యన్ సంఘపు జూలియన్ కాలెండర్‌ను అనుసరిస్తాయి (సెర్బియన్, జార్జియన్ సంఘాలు, ఆథోస్ పర్వతం లాగే): సంఘ కాలెండర్‌లోని 18 ఫిబ్రవరి పౌర కాలెండర్‌లో 3 మార్చి. కొత్త కాలెండర్‌ను అనుసరించే సంఘాలు (గ్రీసు, రొమేనియా, బల్గేరియా, ఉక్రెయిన్…) స్థిర పండుగలనూ పరిశుద్ధులనూ పౌర తేదీనే, 13 రోజులు ముందుగా జరుపుకుంటాయి, వాటి కొన్ని పఠనాలు వేరుగా ఉంటాయి; ఈస్టర్, దానిపై ఆధారపడిన రోజులు ఒకటే.
మూలాలు: ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు · © 2017, 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings, the editors' parts and stage directions in the Song of Songs and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · మూలాలు మరియు హక్కులు