Bible Explorer యాప్ పొందండి

హోమ్ › రోజువారీ బైబిల్ పఠనాలు › ఫిబ్రవరి 2027 › 17 ఫిబ్రవరి

కాథలిక్ కాలెండర్

రోజువారీ బైబిల్ పఠనాలు (కాథలిక్) — 17 ఫిబ్రవరి, 2027

బుధవారం · తపస్సు కాలం మొదటి వారం

పండుగలు మరియు పరిశుద్ధులు

తపస్సు కాలం మొదటి వారపు బుధవారం

ఐచ్ఛిక స్మరణ దినం · ఆరాధన రంగు: ఊదా

సర్వైట్ సభ ఏడుగురు పవిత్ర స్థాపకులు · స్మరణ

ఈరోజు పఠనాలు

మొదటి పఠనం

యోనా 3:1–10

1యెహోవా వాక్కు రెండో సారి యోనాకు ప్రత్యక్షమై చెప్పినదేమిటంటే 2“నువ్వు లేచి, నీనెవె మహాపట్టణానికి వెళ్లి నేను నీకు ఆజ్ఞాపించిన సందేశాన్ని దానికి చాటించు.” 3కాబట్టి యోనా లేచి యెహోవా మాటకు లోబడి నీనెవె పట్టణానికి నడచుకుంటూ వెళ్ళాడు. నీనెవె నగరం చాలా పెద్దది. అది మూడు రోజుల ప్రయాణమంత పెద్దది. 4యోనా ఆ పట్టణంలో ఒక రోజు ప్రయాణమంత దూరం వెళ్లి, యింకా 40 రోజుల్లో నీనెవె పట్టణం నాశనమవుతుందని ప్రకటన చేశాడు. 5నీనెవె పట్టణం వాళ్ళు దేవునిలో విశ్వాసం ఉంచి ఉపవాసం ప్రకటించారు. గొప్పవాళ్ళూ, సామాన్యులూ అందరూ గోనె పట్ట కట్టుకున్నారు. 6ఆ సంగతి త్వరలోనే నీనెవె రాజుకు చేరింది. అతడు తన సింహాసనం దిగి, తన రాజవస్త్రాలను తీసివేసి, గోనెపట్ట కట్టుకుని బూడిదెలో కూర్చున్నాడు. 7అతడు ఇలా ప్రకటన చేయించాడు “రాజూ ఆయన మంత్రులూ ఆజ్ఞాపించేదేమంటే, మనుషులు ఏమీ తినకూడదు. పశువులు మేత మేయకూడదు, నీళ్లు తాగకూడదు.” 8“మనుషులు, పశువులు గోనెపట్ట కట్టుకుని దేవునికి బిగ్గరగా మొర్రపెట్టాలి. అందరూ తమ దుర్మార్గాన్ని విడిచిపెట్టి తాము చేస్తున్న దౌర్జన్యం మానాలి. 9ఒకవేళ దేవుడు తన మనస్సు మార్చుకుని తన కోపాగ్ని చల్లార్చుకుని మనం నాశనం కాకుండా చేస్తాడేమో ఎవరికి తెలుసు?” 10నీనెవె వాళ్ళు తమ చెడు ప్రవర్తన వదిలిపెట్టడం దేవుడు చూసి తన మనస్సు మార్చుకుని వాళ్లకు వేస్తానన్న శిక్ష వెయ్యలేదు.

ప్రతిస్పందన కీర్తన

కీర్త 51:1–2, 10–11, 16–17

1ప్రధాన సంగీతకారుడి కోసం. బత్షెబతో పాపం చేసిన తర్వాత దావీదు దగ్గరకు నాతాను వచ్చినప్పుడు దావీదు రాసిన కీర్తన. దేవా, నీ నిబంధన కృప కారణంగా నన్ను కనికరించు. నీ అధికమైన కరుణను బట్టి నా దోషాలను తుడిచివెయ్యి. 2నా అతిక్రమం పోయేలా నన్ను శుభ్రంగా కడుగు. నా పాపం నుండి నన్ను పవిత్రపరచు. 10దేవా, నాలో పవిత్రమైన హృదయం సృష్టించు. నాలో సరైన మనస్సును పునరుద్దరించు. 11నీ సన్నిధిలో నుండి నన్ను తోసివేయవద్దు. నీ పరిశుద్ధాత్మను నా నుండి తీసివేయవద్దు. 16నీకు బలుల్లో సంతోషం ఉండదు. ఒకవేళ నువ్వు బలినే కోరుకుంటే నేను అర్పిస్తాను. దహన బలుల్లో నీకు సంతోషం ఉండదు. 17విరిగిన మనస్సే దేవునికి సమర్పించే నిజమైన బలి. దేవా, విరిగి పరితాపం చెందిన హృదయాన్ని నువ్వు తిరస్కరించవు.

సువార్త

లూకా 11:29–32

29ప్రజలంతా గుంపులుగా ఉన్నప్పుడు ఆయన వారికి ఇలా చెప్పాడు, “ఈ తరం చెడ్డది. వీరు సూచన అడుగుతున్నారు. అయితే యోనా సూచన తప్పించి మరి ఏ సూచనా వీరికి చూపడం జరగదు. 30యోనా నీనెవె పట్టణ వాసులకు ఎలా సూచనగా ఉన్నాడో ఆలాగే మనుష్య కుమారుడు ఈ తరానికి సూచనగా ఉంటాడు. 31దక్షిణ దేశం రాణి తీర్పు రోజున ఈ తరం వారితో నిలబడి వీరి మీద నేరం మోపుతుంది. ఆమె సొలొమోను జ్ఞాన వాక్కులు వినడానికి సుదూర దేశం నుండి వచ్చింది. సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. 32నీనెవె ప్రజలు తీర్పు రోజున ఈ తరం వారితో నిలబడి వారి మీద నేరం మోపుతారు. ఎందుకంటే వారు యోనా బోధ విని మారుమనస్సు పొందారు. యోనా కంటే ఘనుడు ఇక్కడ ఉన్నాడు.

సాధారణ రోమన్ కాలెండర్; ఒక బిషప్‌ల సమావేశం కొన్ని పండుగలను (దివ్యదర్శనం, పరలోకారోహణం, క్రీస్తు శరీర రక్తాల పండుగ) ఒక ఆదివారానికి మార్చవచ్చు లేదా తన సొంత పండుగలను జోడించవచ్చు. పఠన గ్రంథం: ఆదివారపు చక్రం B, వారపు రోజుల సంవత్సరం I.

మూలాలు: ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు · © 2017, 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings, the editors' parts and stage directions in the Song of Songs and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · మూలాలు మరియు హక్కులు