Bible Explorer యాప్ పొందండి

హోమ్ › రోజువారీ బైబిల్ పఠనాలు › ఫిబ్రవరి 2027 › 15 ఫిబ్రవరి

కాథలిక్ కాలెండర్

రోజువారీ బైబిల్ పఠనాలు (కాథలిక్) — 15 ఫిబ్రవరి, 2027

సోమవారం · తపస్సు కాలం మొదటి వారం

పండుగలు మరియు పరిశుద్ధులు

తపస్సు కాలం మొదటి వారపు సోమవారం

వారపు రోజు · ఆరాధన రంగు: ఊదా

ఈరోజు పఠనాలు

మొదటి పఠనం

లేవీ 19:1–2, 11–18

1యెహోవా మోషేకు ఇంకా ఇలా ఆజ్ఞాపించాడు. ఇశ్రాయేలీయుల సమాజమంతటితో ఇలా చెప్పు. 2“మీరు పరిశుద్ధంగా ఉండాలి. ఎందుకంటే మీ దేవుడైన యెహోవా అనే నేను పరిశుద్ధుడిని. 11నేను మీ దేవుడైన యెహోవాను. మీరు దొంగతనం చేయకూడదు. అబద్ధం ఆడకూడదు. ఒకడినొకడు దగా చెయ్యకూడదు. 12నా నామం పేరిట అబద్ధంగా ఒట్టు పెట్టుకోకూడదు. నీ దేవుని పేరును అపవిత్ర పరచకూడదు. నేను యెహోవాను. 13నీ పొరుగు వాణ్ణి పీడించకూడదు. అతణ్ణి దోచుకోకూడదు. కూలివాడి కూలీ డబ్బు మరునాటి వరకూ నీ దగ్గర ఉంచుకోకూడదు. 14చెవిటివాణ్ణి తిట్ట కూడదు. గుడ్డివాడి దారిలో అడ్డంకులు వేయకూడదు. నీ దేవునికి భయపడాలి. నేను యెహోవాను. 15అన్యాయ తీర్పు తీర్చకూడదు. బీదవాడని పక్షపాతం చూపకూడదు. గొప్పవాడని అభిమానం చూపకూడదు. నీ పొరుగువాడి పట్ల న్యాయంగా ప్రవర్తించాలి. 16నీ ప్రజల మధ్య కొండేలు చెబుతూ ఇంటింటికి తిరగకూడదు. ఎవరికైనా ప్రాణ హాని కలిగించేది ఏదీ చెయ్యవద్దు. నేను యెహోవాను. 17నీ హృదయంలో నీ సోదరుణ్ణి అసహ్యించుకోకూడదు. నీ పొరుగువాడి పాపం నీ మీదికి రాకుండేలా నీవు తప్పకుండా అతణ్ణి గద్దించాలి. 18పగ సాధించ వద్దు. ఎవరిమీదా కక్ష పెట్టుకోవద్దు. నిన్ను నీవు ప్రేమించుకున్నట్టే నీ సాటి మనిషిని ప్రేమించాలి. నేను యెహోవాను.

ప్రతిస్పందన కీర్తన

కీర్త 19:7–9, 14

7యెహోవా నియమించిన ధర్మశాస్త్రం పరిపూర్ణం, అది ప్రాణం తెప్పరిల్లేలా చేస్తుంది. యెహోవా శాసనాలు నమ్మదగినవి. అవి బుద్ధిహీనులకు జ్ఞానం ఇస్తాయి. 8యెహోవా ఉపదేశాలు న్యాయమైనవి. అవి హృదయాన్ని సంతోషపరుస్తాయి. యెహోవా ఏర్పరచిన నిబంధన శాసనాలు స్వచ్ఛమైనవి. అవి కళ్ళను వెలిగిస్తాయి. 9యెహోవా భయం స్వచ్ఛమైనది. అది నిత్యం నిలుస్తుంది. యెహోవా న్యాయవిధులు సత్యమైనవి, అవి పూర్తిగా న్యాయమైనవి. 14యెహోవా, నా ఆశ్రయశిలా, నా విమోచకా, నా నోటి మాటలు, నా హృదయ ధ్యానాలు నీ దృష్టికి అంగీకారం అవుతాయి గాక.

సువార్త

మత్తయి 25:31–46

31“మనుష్య కుమారుడు తన మహిమతో, తన దేవదూతలందరితో వచ్చేటప్పుడు ఆయన తన మహిమ సింహాసనం మీద కూర్చుని ఉంటాడు. 32మానవులందరినీ పోగుచేసి ఆయన ముందు నిలబెడతారు. అప్పుడు ఒక గొల్లవాడు తన మందలో మేకలను, గొర్రెలను వేరు చేసినట్టు 33ఆయన తన కుడి వైపున ‘గొర్రెలు’ (నీతిపరులు), ఎడమవైపున ‘మేకలు’ (అనీతిపరులు) ఉండేలా వేరు చేసి నిలబెడతాడు. 34తరువాత రాజు తన కుడి వైపున ఉన్నవారిని చూసి, ‘నా తండ్రి ఆశీర్వదించిన వారలారా, రండి. లోకం పునాది వేసినపుడే మీ కోసం సిద్ధపరిచిన రాజ్యాన్ని స్వాధీనం చేసుకోండి. 35ఎందుకంటే నాకు ఆకలి వేసినప్పుడు మీరే నాకు భోజనం పెట్టారు. నేను దాహంతో ఉన్నప్పుడు నాకు దాహం తీర్చారు. పరదేశిగా ఉన్నప్పుడు నాకు ఆశ్రయం ఇచ్చారు. 36బట్టలు లేక దిగంబరిగా ఉన్నప్పుడు నాకు బట్టలిచ్చారు. రోగినైనప్పుడు నన్ను పరామర్శించారు. చెరసాల్లో ఉన్నప్పుడు నా దగ్గరికి వచ్చి పలకరించారు’ అని చెబుతాడు. 37అందుకు నీతిపరులు ‘ప్రభూ, ఎప్పుడు నీకు ఆకలి వేయడం చూసి నీకు భోజనం పెట్టాం? ఎప్పుడు దప్పిగొనడం చూసి దాహం తీర్చాం? 38ఎప్పుడు పరదేశిగా చూసి నీకు ఆశ్రయమిచ్చాం? ఎప్పుడు దిగంబరిగా చూసి బట్టలిచ్చాం? 39ఎప్పుడు రోగివై ఉండటం, చెరసాలలో ఉండడం చూసి నీ దగ్గరికి వచ్చి పరామర్శించాం?’ అని ఆయనను అడుగుతారు. 40అందుకు రాజు, ‘మీతో కచ్చితంగా చెప్పేదేమంటే, దీనులైన ఈ నా సోదరుల్లో ఒకడికి ఇది చేస్తే నాకు కూడా చేసినట్టే’ అని వారికి జవాబిస్తాడు. 41“తరవాత ఆయన ఎడమవైపున ఉన్నవారిని చూసి, ‘శాపగ్రస్తులారా, నన్ను విడిచి వెళ్ళండి! సాతానుకు, వాడి దూతలకు సిద్ధం చేసిన నిత్యాగ్నిలోకి వెళ్ళండి. 42ఎందుకంటే, నాకు ఆకలి వేసినప్పుడు మీరు నాకు భోజనం పెట్టలేదు. నేను దాహంతో ఉన్నప్పుడు నాకు దాహం తీర్చలేదు. 43పరదేశిగా ఉన్నప్పుడు నాకు ఆశ్రయం ఇవ్వలేదు, వస్త్రాలు లేక దిగంబరిగా ఉన్నప్పుడు నాకు బట్టలివ్వలేదు. రోగినైనప్పుడు నన్ను పరామర్శించలేదు. చెరసాలలో ఉన్నప్పుడు నా దగ్గరికి వచ్చి పలకరించలేదు’ అని చెబుతాడు. 44అందుకు వారు కూడా, ‘ప్రభూ, మేమెప్పుడు నీవు ఆకలిగా ఉండటం, దాహంతో ఉండటం, పరదేశిగా ఉండటం, దిగంబరివై ఉండటం, రోగివై ఉండడం చూసి నీకు సహాయం చేయలేదు?’ అని అడుగుతారు. 45అందుకు రాజు, ‘మీతో కచ్చితంగా చెప్పేదేమంటే, మీరు దీనులైన నా ఈ సోదరులలో ఒకరికి ఈ విధంగా చేయలేదు కాబట్టి నాకు కూడా చేయనట్టే’ అని వారికి జవాబిస్తాడు. 46వీరు శాశ్వత శిక్షలోకీ, నీతిపరులు శాశ్వత జీవంలోకీ ప్రవేశిస్తారు.”

సాధారణ రోమన్ కాలెండర్; ఒక బిషప్‌ల సమావేశం కొన్ని పండుగలను (దివ్యదర్శనం, పరలోకారోహణం, క్రీస్తు శరీర రక్తాల పండుగ) ఒక ఆదివారానికి మార్చవచ్చు లేదా తన సొంత పండుగలను జోడించవచ్చు. పఠన గ్రంథం: ఆదివారపు చక్రం B, వారపు రోజుల సంవత్సరం I.

మూలాలు: ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు · © 2017, 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings, the editors' parts and stage directions in the Song of Songs and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · మూలాలు మరియు హక్కులు