Bible Explorer యాప్ పొందండి

హోమ్ › రోజువారీ బైబిల్ పఠనాలు › ఫిబ్రవరి 2027 › 13 ఫిబ్రవరి

ఆర్థడాక్స్ కాలెండర్ · జనవరి 31 (పాత శైలి)

ఆర్థడాక్స్ రోజువారీ పఠనాలు — 13 ఫిబ్రవరి, 2027

శనివారం · పెంతెకొస్తు తర్వాత 37వ వారం · స్వరం 3

పండుగలు మరియు పరిశుద్ధులు

Holy Wonderworkers and Unmercenary Martyrs Cyrus and John, and together with them the Martyr Athanasia and her daughters: Theodota, Theoctista and Eudoxia at Canopus in Egypt († 311)

ఉపవాసం

ఉపవాసం లేదు

ఇది సన్యాస నియమాన్ని అనుసరిస్తుంది. సంఘంలో ఉపవాస పరిమాణాన్ని ఆరోగ్యం, వయస్సు మరియు పరిస్థితుల ప్రకారం తమ ఆత్మీయ గురువుతో కలిసి నిర్ణయిస్తారు.

ఈరోజు పఠనాలు

పత్రిక

1 తెస్స 5:14–23

14సోదరులారా, మీకు మా ఉపదేశం ఏమిటంటే, సోమరులను హెచ్చరించండి. ధైర్యం లేక కుంగిపోయిన వారికి ధైర్యం చెప్పండి. బలహీనులకు సహాయం చేయండి. అందరి పట్లా సహనం కలిగి ఉండండి. 15ఎవరూ కీడుకు ప్రతి కీడు ఎవరికీ చేయకుండా చూసుకోండి. మీరు ఒకరి పట్ల మరొకరూ, ఇంకా మనుషులందరి పట్లా ఎప్పుడూ మేలైన దానినే చేయడానికి తీవ్ర ప్రయత్నం చెయ్యండి. 16ఎప్పుడూ సంతోషంగా ఉండండి. 17ఎప్పుడూ ప్రార్థన చేస్తూ ఉండండి. 18ప్రతి విషయంలోనూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఇలా చేయడం యేసు క్రీస్తులో మీ విషయంలో దేవుని ఉద్దేశం. 19దేవుని ఆత్మను ఆర్పవద్దు. 20ప్రవచించడాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. 21అన్నిటినీ పరిశీలించి శ్రేష్ఠమైన దాన్ని పాటించండి. 22ప్రతి విధమైన కీడుకూ దూరంగా ఉండండి. 23శాంతి ప్రదాత అయిన దేవుడు మిమ్మల్ని సంపూర్ణంగా పవిత్ర పరచు గాక! మీ ఆత్మా ప్రాణమూ శరీరమూ మన ప్రభువైన యేసుక్రీస్తు రాకలో నిందారహితంగా సంపూర్ణంగా ఉంటాయి గాక!

పత్రిక (పరిశుద్ధ కైరస్, పరిశుద్ధ యోహాను కోసం)

1 కొరింతీ 12:27–13:8

27మీరు క్రీస్తు శరీరం. మీలో ప్రతి ఒక్కరూ ఆ శరీరానికి చెందిన భాగాలు. 28దేవుడు సంఘంలో మొదటి స్థానంలో అపొస్తలులను, రెండవ స్థానంలో ప్రవక్తలను, మూడవ స్థానంలో ఉపదేశకులను, ఆ తర్వాత అద్భుతాలు చేసేవారిని, ఆ తర్వాత స్వస్థత వరం గలవారిని, ఉపకారాలు చేసేవారిని, కార్యాలు పర్యవేక్షించేవారిని, వివిధ భాషలు మాట్లాడేవారిని నియమించాడు. 29అందరూ అపొస్తలులు కారు, అందరూ ప్రవక్తలు కారు, అందరూ బోధకులు కారు, అందరూ అద్భుతాలు చేయరు. 30అందరికీ స్వస్థత వరం లేదు. అందరూ భాషలతో మాట్లాడరు, అందరూ భాషల అర్థం చెప్పలేరు. 31కృపావరాల్లో శ్రేష్ఠమైన వాటిని ఆసక్తితో కోరుకోండి. అయితే నేను వీటన్నిటికీ మించిన సర్వ శ్రేష్ఠ మార్గాన్ని మీకు చూపిస్తాను. 13:1నేను మనుషుల భాషలతో, దేవదూతల భాషలతో మాట్లాడినా, నాలో ప్రేమ లేకపోతే గణగణలాడే గంటలాగా, మోగే తాళంలాగా ఉంటాను. 2దేవుని మూలంగా ప్రవచించే కృపావరం ఉండి, అన్ని రహస్య సత్యాలూ, సమస్త జ్ఞానమూ నాకు తెలిసి ఉన్నా, కొండలను పెకలించే పరిపూర్ణ విశ్వాసం ఉన్నా, నాలో ప్రేమ లేకపోతే నేను వ్యర్ధమైన వాడినే. 3పేదల కోసం నా ఆస్తి అంతా ధారపోసినా, నా శరీరాన్ని కాల్చడానికి అప్పగించినా, నాలో ప్రేమ లేకపోతే నాకు ప్రయోజనమేమీ ఉండదు. 4ప్రేమలో దీర్ఘశాంతం ఉంది. అది దయ చూపుతుంది. ప్రేమలో అసూయ ఉండదు. అది గొప్పలు చెప్పుకోదు, గర్వంతో మిడిసిపడదు. 5అమర్యాదగా ప్రవర్తించదు. ప్రేమలో స్వార్ధం ఉండదు. అది త్వరగా కోపం తెచ్చుకోదు, ఎవరైనా అపకారం తలపెడితే మనసులో ఉంచుకోదు. 6ఈ ప్రేమ దుర్నీతి విషయంలో సంతోషించదు, సత్యం విషయంలో సంతోషిస్తుంది. 7అది అన్నిటినీ భరిస్తుంది, అన్నిటినీ నమ్ముతుంది, అన్నిటినీ ఆశతో ఎదురు చూస్తుంది, అన్నిటినీ ఓర్చుకుంటుంది. 8ప్రేమకు అంతం లేదు. ప్రవచనాలు వృథా అవుతాయి, భాషలు అంతరిస్తాయి, జ్ఞానం గతించిపోతుంది.

సువార్త

లూకా 17:3–10

3మీ వరకూ మీరు జాగ్రత్తగా ఉండండి. అయితే మీ సోదరుడు అపరాధం చేస్తే అతణ్ణి మందలించండి. తన అపరాధం విషయమై అతడు పశ్చాత్తాప పడితే అతణ్ణి క్షమించండి. 4అతడు ఒకే రోజు మీకు వ్యతిరేకంగా ఏడు సార్లు అపరాధం చేసి అదే రోజు ఏడు సార్లు మీ దగ్గరికి వచ్చి, ‘పశ్చాత్తాప పడుతున్నాను’ అంటే మీరు అతణ్ణి క్షమించాలి.” 5అప్పుడు అపొస్తలులు, “ప్రభూ, మా విశ్వాసాన్ని వృద్ధి చెయ్యి” అన్నారు. 6ప్రభువు, “మీరు ఆవగింజంత విశ్వాసం గలవారైతే ఈ మారేడు చెట్టును చూసి, ‘నీవు వేళ్లతో సహా పెళ్లగించుకుని పోయి సముద్రంలో నాటుకు పో’ అంటే అది మీరు చెప్పినట్టు చేస్తుంది. 7“మీలో ఎవరి సేవకుడైనా పొలంలో భూమి దున్నుతూనో, మందను మేపుతూనో ఉండి ఇంటికి వస్తే యజమాని ‘నువ్వు వెంటనే వచ్చి భోజనానికి కూర్చో’ అంటాడా? అనడు. 8పైగా ‘నాకు భోజనం సిద్ధం చెయ్యి. తువ్వాలు కట్టుకుని నేను భోజనం చేసి ముగించే వరకూ నాకు సేవ చెయ్యి. ఆ తరువాత నువ్వు తినవచ్చు’ అంటాడు. 9తాను ఆజ్ఞాపించిన పనులన్నీ ఆ పనివాడు చక్కగా చేశాడని యజమాని ‘నాపై దయ చూపించావు’ అని వాణ్ణి మెచ్చుకుంటాడా? 10అలాగే మీరు కూడా మీకు ఆజ్ఞాపించిన పనులన్నీ చేసిన తరువాత ‘మేము ఏ యోగ్యతా లేని సేవకులం. మేము చేయాల్సిందే చేశాం’ అని చెప్పాలి.”

సువార్త (పరిశుద్ధ కైరస్, పరిశుద్ధ యోహాను కోసం)

మత్తయి 10:1, 5–8

1ఆయన తన పన్నెండు మంది శిష్యులను పిలిచి, అపవిత్రాత్మలను వెళ్ళగొట్టడానికి, అన్నిరకాల రోగాలనూ వ్యాధులనూ బాగుచేయడానికి వారికి అధికారం ఇచ్చాడు. 5యేసు ఆ పన్నెండు మందిని పంపుతూ వారికి ఆజ్ఞాపించింది ఏమిటంటే, “మీరు యూదేతరుల ప్రాంతాల్లోకి వెళ్ళొద్దు. సమరయ ప్రాంతంలోని ఏ ఊరిలోకీ వెళ్ళొద్దు. 6ఇశ్రాయేలు వంశంలో దారి తప్పిన గొర్రెల దగ్గరకే వెళ్ళండి. 7వెళుతూ, ‘పరలోకరాజ్యం దగ్గర్లో ఉంది’ అని ప్రకటించండి. 8రోగులను బాగుచేయండి, చనిపోయిన వారిని లేపండి, కుష్టురోగులను శుద్ధి చెయ్యండి, దయ్యాలను వెళ్ళగొట్టండి. ఉచితంగా పొందారు, ఉచితంగానే ఇవ్వండి.

తేదీలు రష్యన్ సంఘపు జూలియన్ కాలెండర్‌ను అనుసరిస్తాయి (సెర్బియన్, జార్జియన్ సంఘాలు, ఆథోస్ పర్వతం లాగే): సంఘ కాలెండర్‌లోని 31 జనవరి పౌర కాలెండర్‌లో 13 ఫిబ్రవరి. కొత్త కాలెండర్‌ను అనుసరించే సంఘాలు (గ్రీసు, రొమేనియా, బల్గేరియా, ఉక్రెయిన్…) స్థిర పండుగలనూ పరిశుద్ధులనూ పౌర తేదీనే, 13 రోజులు ముందుగా జరుపుకుంటాయి, వాటి కొన్ని పఠనాలు వేరుగా ఉంటాయి; ఈస్టర్, దానిపై ఆధారపడిన రోజులు ఒకటే.

మూలాలు: ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు · © 2017, 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings, the editors' parts and stage directions in the Song of Songs and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · మూలాలు మరియు హక్కులు