హోమ్ › రోజువారీ బైబిల్ పఠనాలు › జనవరి 2027 › 31 జనవరి
ఆర్థడాక్స్ కాలెండర్ · జనవరి 18 (పాత శైలి)
ఆర్థడాక్స్ రోజువారీ పఠనాలు — 31 జనవరి, 2027
ఆదివారం · స్వరం 2
పండుగలు మరియు పరిశుద్ధులు
పెంతెకొస్తు తర్వాత 35వ ఆదివారం
ఉపవాసం
ఉపవాసం లేదు
ఇది సన్యాస నియమాన్ని అనుసరిస్తుంది. సంఘంలో ఉపవాస పరిమాణాన్ని ఆరోగ్యం, వయస్సు మరియు పరిస్థితుల ప్రకారం తమ ఆత్మీయ గురువుతో కలిసి నిర్ణయిస్తారు.
ఈరోజు పఠనాలు
ఉదయ ప్రార్థన రెండవ సువార్త
1విశ్రాంతి దినం అయిపోగానే, మగ్దలేనే మరియ, యాకోబు తల్లి మరియ, సలోమి కలిసి వెళ్ళి యేసు దేహానికి పూయడానికి సుగంధ ద్రవ్యాలు కొన్నారు. 2ఆదివారం ఉదయం తెల్లవారుతూ ఉండగా వారు యేసు సమాధి దగ్గరికి వస్తూ, 3“మన కోసం సమాధిని మూసిన ఆ రాయిని ఎవరు దొర్లిస్తారు?” అని ఒకరితో ఒకరు చెప్పుకున్నారు. 4వారు వచ్చి సమాధికేసి చూడగా ఆ పెద్ద రాయి పక్కకి దొర్లించి ఉంది. 5వారు ఆ సమాధిలోకి వెళ్ళి తెల్లటి దుస్తులు ధరించిన ఒక యువకుడు కుడి పక్కన కూర్చుని ఉండడం చూశారు. అది చూసి వారు నిర్ఘాంతపోయారు. 6అతడు వారితో ఇలా అన్నాడు, “భయపడకండి! మీరు వెతుకుతున్నది సిలువ మరణం పొందిన నజరేతువాడైన యేసును. ఆయన తిరిగి బతికాడు. ఇక్కడ లేడు. ఇదిగో ఆయనను ఉంచిన స్థలం ఇదే. 7మీరు వెళ్ళి ఆయన శిష్యులతో, పేతురుతో ఇలా చెప్పండి. “యేసు మీకంటే ముందుగా గలిలయకి వెళ్తున్నాడు. ఆయన ముందుగానే చెప్పినట్టు మీరు ఆయనను అక్కడ చూస్తారు.” 8ఆ స్త్రీలు భయపడుతూ, వణుకుతూ, ఆ సమాధి నుండి పరుగెత్తి వెళ్ళిపోయారు. వారు భయం వల్ల తమలో తాము ఏమీ మాట్లాడుకోలేదు.
పత్రిక
12కాబట్టి దేవుడు ఏర్పరచుకున్న వారూ పరిశుద్ధులూ ప్రియమైన వారుగా, మీరు కనికర హృదయాన్నీ దయనూ దీనత్వాన్నీ సాత్వికతనూ సహనాన్నీ ధరించుకోండి. 13ఒకరినొకరు సహించుకోండి. ఇతరుల పట్ల కృప కలిగి ఉండండి. ఎవరి మీదైనా ఫిర్యాదు ఉంటే ప్రభువు మిమ్మల్ని క్షమించినట్టే మీరూ క్షమించండి. 14వీటన్నిటికి పైగా ప్రేమను కలిగి ఉండండి. ప్రేమ ఐక్యతకు పరిపూర్ణ రూపం ఇస్తుంది. 15క్రీస్తు ప్రసాదించే శాంతి మీ హృదయాల్లో పరిపాలించనివ్వండి. ఈ శాంతి కోసమే మిమ్మల్ని ఒకే శరీరంగా దేవుడు పిలిచాడు. ఇంకా కృతజ్ఞులై ఉండండి. 16క్రీస్తు వాక్కు మీలో సమృద్ధిగా నివసించనివ్వండి. సంపూర్ణ జ్ఞానంతో ఒకరికొకరు బోధించుకోండి, బుద్ది చెప్పుకోండి. మీ హృదయాల్లో కృతజ్ఞత కలిగి కీర్తనలతోనూ భజనలతోనూ ఆత్మ సంబంధమైన గానాలతోనూ దేవునికి పాటలు పాడండి.
పత్రిక (పరిశుద్ధ అథనాసియస్, పరిశుద్ధ సిరిల్ కోసం)
7మీకు దేవుని మాటలు చెప్పిన వారిని మిమ్మల్ని నడిపించిన వారిని తలపోస్తూ వారి ప్రవర్తన ఫలితాన్ని గురించి ఆలోచించండి. వారి విశ్వాసాన్ని అనుకరించండి. 8యేసు క్రీస్తు నిన్న, నేడు ఒకే విధంగా ఉన్నాడు. ఎప్పటికీ ఒకేలా ఉంటాడు. 9అనేక రకాలైన కొత్త బోధలకు తిరిగిపోకండి. దైవకృపతో మన హృదయాలు శక్తి పొందాలి గాని ఆహారనియమాలతో కాదు. వాటి ప్రకారం ప్రవర్తించిన వారికి వాటివల్ల ఏ ప్రయోజనం కలగదు. 10మనకు ఒక బలిపీఠం ఉంది. గుడారంలో సేవ చేసే వారికి దానిపై నుండి ఏదీ తినడానికి అధికారం లేదు. 11ఎందుకంటే పాప పరిహార బలి అయిన జంతువుల రక్తం మాత్రమే ప్రధాన యాజకుడి ద్వారా పరిశుద్ధ స్థలానికి వస్తుంది. వాటి కళేబరాలను శిబిరం బయట కాల్చివేస్తారు. 12కాబట్టి యేసు కూడా ప్రజలను తన రక్తం ద్వారా శుద్ధీకరించడానికి నగరద్వారం బయట హింసలు పొందాడు. 13కాబట్టి మనం ఆయన అపనిందను భరిస్తూ శిబిరం బయటకు ఆయన దగ్గరికి వెళ్దాం. 14ఎలాంటి నిత్యమైన పట్టణమూ ఇక్కడ మనకు లేదు. మనం రాబోయే పట్టణం కోసం ఎదురు చూస్తున్నాం. 15యేసు ద్వారా మనం నిరంతరం దేవునికి స్తుతులు యాగంగా అర్పిస్తూ ఉండాలి. స్తుతులు అంటే మన పెదవుల ద్వారా ఆయన పేరును అంగీకరిస్తూ మనం ఆయనకు అర్పించే ఫలం. 16ఒకరికొకరు ఉపకారం చేసుకోవడం, ఒకరికొకరు మేలు చేసుకోవడం మర్చిపోవద్దు. అలాంటి బలులు దేవునికి ఇష్టం.
సువార్త
18ఒక అధికారి ఆయనను చూసి, “మంచి ఉపదేశకా, నిత్య జీవానికి వారసుణ్ణి కావాలంటే నేనేం చేయాలి?” అని అడిగాడు. 19అందుకు యేసు, “నన్ను మంచివాడని ఎందుకంటున్నావు? దేవుడు తప్పించి ఇంకెవరూ మంచి వారు కారు. 20వ్యభిచారం చేయవద్దు, హత్య చేయవద్దు, దొంగతనం చేయవద్దు, అబద్ధ సాక్ష్యం చెప్పవద్దు, నీ తండ్రినీ, తల్లినీ గౌరవించు అనే ఆజ్ఞలు నీకు తెలుసు కదా” అని అతనితో అన్నాడు. 21దానికి జవాబుగా అతడు, “వీటిని చిన్నప్పటి నుండి పాటిస్తూనే ఉన్నాను” అన్నాడు. 22యేసు అతని మాట విని ఇలా అన్నాడు, “నీకు ఇంకా ఒక్కటి కొదువగా ఉంది. నీ ఆస్తులన్నీ అమ్మి నిరుపేదలకివ్వు. అప్పుడు పరలోకంలో నీకు సంపదలు కలుగుతాయి. ఆపైన నువ్వు వచ్చి నన్ను అనుసరించు” అన్నాడు. 23అయితే అతడు ఎంతో ధనవంతుడు కాబట్టి ఈ మాటలు విని చాలా విచారపడ్డాడు. 24యేసు అతన్ని చూసి, “ఆస్తిపాస్తులున్న వారు దేవుని రాజ్యంలో ప్రవేశించడం ఎంతో కష్టం. 25ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించడం కంటే ఒక ఒంటె సూది రంధ్రం గుండా వెళ్ళడం తేలిక” అన్నాడు. 26ఇది విన్న వారు, “అలాగైతే ఎవరు రక్షణ పొందగలరు?” అని అడిగారు 27అందుకు ఆయన, “మనుష్యులకు అసాధ్యమైనవి దేవునికి సాధ్యమే” అని చెప్పాడు.
సువార్త (పరిశుద్ధ అథనాసియస్, పరిశుద్ధ సిరిల్ కోసం)
14ప్రపంచానికి మీరు వెలుగుగా ఉన్నారు. కొండ మీద ఉండే ఊరు కనబడకుండా ఉండదు. 15ఎవరూ దీపం వెలిగించి బుట్ట కింద పెట్టరు. దీపస్తంభం మీదే పెడతారు. అప్పుడు ఆ దీపం ఇంట్లో అందరికీ వెలుగు ఇస్తుంది. 16మీ వెలుగు మనుషుల ముందు ప్రకాశించనీయండి. అప్పుడు వారు మీ మంచి పనులు చూసి పరలోకంలో ఉన్న మీ తండ్రిని కీర్తిస్తారు. 17“నేను ధర్మశాస్త్రాన్ని గానీ ప్రవక్తల మాటలను గానీ రద్దు చేయడానికి వచ్చాననుకోవద్దు. వాటిని నెరవేర్చడానికే వచ్చాను గానీ రద్దు చేయడానికి కాదు. 18నేను కచ్చితంగా చెబుతున్నాను. ఆకాశం, భూమి నశించే వరకూ ధర్మశాస్త్రమంతా నెరవేరే వరకూ ధర్మశాస్త్రం నుంచి ఒక్క పొల్లు అయినా, ఒక సున్నా అయినా తప్పిపోదు. 19కాబట్టి ఈ ఆజ్ఞల్లో ఎంత చిన్న దానినైనా సరే అతిక్రమించి, ఇతరులకు కూడా అలా చేయమని బోధించేవాణ్ణి పరలోకరాజ్యంలో అతి తక్కువ వాడుగా ఎంచుతారు. కానీ ఈ ఆజ్ఞల ప్రకారం చేస్తూ, వాటిని బోధించేవాణ్ణి పరలోక రాజ్యంలో గొప్పవాడుగా లెక్కిస్తారు.
తేదీలు రష్యన్ సంఘపు జూలియన్ కాలెండర్ను అనుసరిస్తాయి (సెర్బియన్, జార్జియన్ సంఘాలు, ఆథోస్ పర్వతం లాగే): సంఘ కాలెండర్లోని 18 జనవరి పౌర కాలెండర్లో 31 జనవరి. కొత్త కాలెండర్ను అనుసరించే సంఘాలు (గ్రీసు, రొమేనియా, బల్గేరియా, ఉక్రెయిన్…) స్థిర పండుగలనూ పరిశుద్ధులనూ పౌర తేదీనే, 13 రోజులు ముందుగా జరుపుకుంటాయి, వాటి కొన్ని పఠనాలు వేరుగా ఉంటాయి; ఈస్టర్, దానిపై ఆధారపడిన రోజులు ఒకటే.
మూలాలు: ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు · © 2017, 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings, the editors' parts and stage directions in the Song of Songs and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · మూలాలు మరియు హక్కులు