Bible Explorer యాప్ పొందండి

హోమ్ › రోజువారీ బైబిల్ పఠనాలు › నవంబర్ 2026 › 15 నవంబర్

కాథలిక్ కాలెండర్

రోజువారీ బైబిల్ పఠనాలు (కాథలిక్) — 15 నవంబర్, 2026

ఆదివారం · సామాన్య కాలం 33వ వారం

పండుగలు మరియు పరిశుద్ధులు

సామాన్య కాలం 33వ ఆదివారం

ఆదివారం · ఆరాధన రంగు: ఆకుపచ్చ

ఈరోజు పఠనాలు

మొదటి పఠనం

సామె 31:10–13, 19–20, 30–31

10సమర్థురాలైన భార్య ఎవరికి దొరుకుతుంది? అలాటిది బంగారు ఆభరణాల కంటే అమూల్యమైనది. 11ఆమె భర్త ఆమెపై నమ్మకం పెట్టుకుంటాడు. అతడు పేదవాడు కావడం అంటూ ఉండదు. 12ఆమె తన జీవిత కాలమంతా అతనికి మేలే చేస్తుంది గాని కీడేమీ చేయదు. 13ఆమె గొర్రె బొచ్చును అవిసెనారను సేకరిస్తుంది. తన చేతులారా వాటితో పని చేస్తుంది. 19ఆమె నేత కదురును చేతబట్టుకుంటుంది. తన వ్రేళ్లతో కదురు పట్టుకుని వడుకుతుంది. 20దీనులకు తన చెయ్యి చాపుతుంది. అవసరంలో ఉన్న వారిని ఆదుకుంటుంది. 30చక్కదనం మోసకరం. సౌందర్యం వ్యర్థం. యెహోవా పట్ల భయభక్తులు గల స్త్రీని అందరూ ప్రశంసిస్తారు. 31ఆమె చేసిన పనుల ప్రతిఫలం ఆమెకు ఇవ్వండి. ఊరి ద్వారం దగ్గర ఆమె పనులు ఆమెను కొనియాడతాయి.

ప్రతిస్పందన కీర్తన

కీర్త 128:1–5

1యాత్రల కీర్తన. యెహోవా అంటే భయభక్తులు కలిగి, ఆయన విధానాల్లో నడుచుకునే వాళ్ళు ధన్యులు. 2నువ్వు కష్టపడి సంపాదించినది తప్పకుండా అనుభవిస్తావు. నీకు అంతా శుభం కలుగుతుంది, నువ్వు వర్ధిల్లుతావు. 3నీ ఇంట్లో నీ భార్య ఫలవంతమైన ద్రాక్షాతీగెలాగా ఉంటుంది. నీ పిల్లలు నీ బల్ల చుట్టూ ఒలీవ మొక్కల్లాగా ఉంటారు. 4యెహోవాను గౌరవించేవాడు ఈ విధంగా ఆశీర్వాదాలు పొందుతాడు. 5సీయోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించు గాక. నువ్వు జీవిత కాలమంతా యెరూషలేము సుసంపన్నం కావడం చూస్తావు.

రెండవ పఠనం

1 తెస్స 5:1–6

1సోదరులారా, కాలాలను సమయాలను గూర్చి నేను మీకు రాయనక్కరలేదు. 2రాత్రి పూట దొంగ ఎలా వస్తాడో ప్రభువు దినం కూడా అలానే వస్తుందని మీకు బాగా తెలుసు. 3ప్రజలు “అంతా ప్రశాంతంగా భద్రంగా ఉంది. భయమేమీ లేదు,” అని చెప్పుకుంటూ ఉన్నప్పుడు గర్భవతికి నొప్పులు వచ్చినట్టుగా వారి మీదికి నాశనం అకస్మాత్తుగా వస్తుంది కనుక వారు ఏ విధంగానూ తప్పించుకోలేరు. 4సోదరులారా, ఆ రోజు దొంగలాగా మీ మీదికి రావడానికి మీరేమీ చీకటిలో ఉన్నవారు కాదు. 5మీరంతా వెలుగు సంతానం, పగటి సంతానం. మనం రాత్రి సంతానం కాదు. చీకటి సంతానమూ కాదు. 6కాబట్టి ఇతరుల్లాగా నిద్ర పోకుండా, అప్రమత్తంగా, మెలకువగా ఉందాం.

సువార్త

మత్తయి 25:14–30

14“పరలోక రాజ్యం ఇలా ఉంటుంది, ఒక మనిషి దూరదేశానికి ప్రయాణమై తన పనివారిని పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించాడు. 15వారి వారి సామర్ధ్యం ప్రకారం ఒకడికి ఐదు తలాంతులూ ఇంకొకడికి రెండు తలాంతులూ మరొకడికి ఒక్క తలాంతూ ఇచ్చి, వెంటనే ప్రయాణమై వెళ్ళాడు. 16ఐదు తలాంతులు తీసుకున్న వాడు వాటితో వ్యాపారం చేసి, ఇంకో ఐదు తలాంతులు సంపాదించాడు. 17అదే విధంగా రెండు తలాంతులు తీసుకున్న వాడు ఇంకో రెండు సంపాదించాడు. 18అయితే ఒక తలాంతు తీసుకున్న వాడు వెళ్ళి, గుంట తవ్వి తన యజమాని డబ్బు దాచిపెట్టాడు. 19“చాలా కాలం తరువాత ఆ యజమాని తిరిగి వచ్చి తన పనివారి దగ్గర లెక్కలు చూసుకున్నాడు. 20అప్పుడు ఐదు తలాంతులు తీసుకున్న వాడు మరో ఐదు తలాంతులు తెచ్చి ‘అయ్యగారూ, మీరు నాకు ఐదు తలాంతులు ఇచ్చారు కదా, అవి గాక నేను ఇంకో ఐదు తలాంతులు సంపాదించాను’ అని చెప్పాడు. 21అతని యజమాని, ‘ఆహా! నీవు నమ్మకమైన మంచి పనివాడివి! నీవు ఈ చిన్నపాటి విషయంలో నమ్మకంగా ఉన్నావు. కాబట్టి నిన్ను ఎక్కువ పనుల మీద నియమిస్తాను. నీ యజమాని సంతోషంలో నీవు కూడా భాగం పంచుకో’ అన్నాడు. 22అలాగే రెండు తలాంతులు తీసుకున్న వాడు వచ్చి, ‘అయ్యగారూ, మీరు నాకు రెండు తలాంతులు ఇచ్చారు కదా, అవి గాక నేను ఇంకో రెండు తలాంతులు సంపాదించాను’ అని చెప్పాడు. 23యజమాని, ‘ఆహా! నీవు ఈ చిన్నపాటి విషయంలో నమ్మకంగా ఉన్నావు. కాబట్టి నిన్ను ఎక్కువ పనుల మీద నియమిస్తాను. నీ యజమాని సంతోషంలో నీవు కూడా భాగం పంచుకో’ అన్నాడు. 24తరువాత ఒక్క తలాంతు తీసుకున్నవాడు వచ్చాడు. అతడన్నాడు, ‘అయ్యగారూ, మీరు విత్తనాలు నాటని చోట పంట కోయడానికీ, వెదజల్లని చోట పంట పోగుచేసుకోడానికీ చూసే కఠినాత్ములని నాకు తెలుసు. 25కాబట్టి నాకు భయం వేసి, మీరిచ్చిన తలాంతును భూమిలో దాచిపెట్టాను. ఇదిగో, తీసుకోండి’ అన్నాడు. 26అందుకు ఆ యజమాని అతనితో, ‘నీవు సోమరివాడివి! చెడ్డ దాసుడివి. నేను విత్తని చోట కోసేవాడిని, వెదజల్లని చోట పంట పోగుచేసుకో జూసేవాడిని అని నీకు తెలుసు గదా! 27అలాంటప్పుడు నీవు నా డబ్బును వడ్డీ వ్యాపారుల దగ్గర ఉంచాల్సింది. అప్పుడు నేను వచ్చి దాన్ని వడ్డీతో కలిపి తీసుకుని ఉండేవాణ్ణి’ అని చెప్పి, 28‘ఆ తలాంతును వాడి దగ్గర నుండి తీసుకుని పది తలాంతులు ఉన్నవాడికి ఇవ్వండి. 29ఉన్న ప్రతివాడికీ మరింత ఇవ్వడం జరుగుతుంది, అతడు సమృద్ధి కలిగి ఉంటాడు. లేని వాడి దగ్గర నుండి వాడికి ఉన్నది కూడా తీసివేయడం జరుగుతుంది. 30పనికిమాలిన ఆ దాసుణ్ణి బయట ఉన్న చీకటిలోకి తోసివేయండి. అక్కడ ఏడుపు, పండ్లు కొరుక్కోవడం ఉంటాయి.

ఈరోజు పరిశుద్ధులు

సాధారణ రోమన్ కాలెండర్; ఒక బిషప్‌ల సమావేశం కొన్ని పండుగలను (దివ్యదర్శనం, పరలోకారోహణం, క్రీస్తు శరీర రక్తాల పండుగ) ఒక ఆదివారానికి మార్చవచ్చు లేదా తన సొంత పండుగలను జోడించవచ్చు. పఠన గ్రంథం: ఆదివారపు చక్రం A, వారపు రోజుల సంవత్సరం II.

మూలాలు: ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు · © 2017, 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings, the editors' parts and stage directions in the Song of Songs and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · మూలాలు మరియు హక్కులు