హోమ్ › రోజువారీ బైబిల్ పఠనాలు › నవంబర్ 2026 › 10 నవంబర్
కాథలిక్ కాలెండర్
రోజువారీ బైబిల్ పఠనాలు (కాథలిక్) — 10 నవంబర్, 2026
మంగళవారం · సామాన్య కాలం 32వ వారం
పండుగలు మరియు పరిశుద్ధులు
సామాన్య కాలం 32వ వారపు మంగళవారం
స్మరణ దినం · ఆరాధన రంగు: తెలుపు
పునీత మహా లియో, పోప్, సంఘ పండితుడు · స్మరణ దినం
ఈరోజు పఠనాలు
మొదటి పఠనం
1అయితే నీవు ఆరోగ్యకరమైన ఉపదేశానికి అనుకూలమైన సంగతులను బోధించు. 2వృద్ధులు నిగ్రహం కలిగి, గౌరవపూర్వకంగా, వివేకంతో మెలుగుతూ విశ్వాసం, ప్రేమ, సహనంలో శుద్ధంగా ఉండాలి. 3అలాగే వృద్ధ స్త్రీలు గౌరవప్రదంగా, పుకార్లు పుట్టించేవారుగా కాకుండా ఉండాలి. అస్తమానం మద్యపానంలో మునిగి తేలుతూ ఉండకూడదు. నడవడిలో భయభక్తులు గలిగి మంచి విషయాలు నేర్పుతూ ఉండాలి. 4దేవుని వాక్యానికి చెడ్డ పేరు రాకుండేలా తమ భర్తలను, పిల్లలను ప్రేమతో చూసుకోవాలని యువతులను ప్రోత్సహిస్తూ, మనసును అదుపులో ఉంచుకుంటూ, శీలవతులుగా, తమ ఇంటిని శ్రద్ధగా చక్కబెట్టుకొనేవారుగా, తమ భర్తలకు లోబడుతూ ఉండాలని వృద్ధ స్త్రీలు వారికి బోధించాలి. 6అలానే మనసు అదుపులో ఉంచుకోవాలని యువకులను హెచ్చరించు. 7నిన్ను వ్యతిరేకించేవాడు నీ గురించి చెడ్డ మాటలేవీ చెప్పలేక సిగ్గుపడే విధంగా అన్ని మంచి పనుల విషయంలో నిన్ను నీవే ఆదర్శంగా కనపరచుకో. 8నీ ఉపదేశం యథార్థంగా, మర్యాదపూర్వకంగా, విమర్శకు చోటియ్యనిదిగా ఉండాలి. 11చూడు, ఎందుకంటే మానవాళికి రక్షణ కారకమైన దేవుని కృప వెల్లడి అయింది. 12మంగళకరమైన నిరీక్షణ నిమిత్తం మహా దేవుడు, రక్షకుడు అయిన యేసు క్రీస్తు మహిమ ప్రత్యక్షత కోసం ఎదురు చూస్తూ భక్తిహీనతనూ, ఈ లోక సంబంధమైన దురాశలనూ వీడి, ఈ యుగంలో నీతితో, భక్తితో జీవించమని అది మనకు నేర్పుతుంది. 14ఆయన సమస్తమైన విచ్చలవిడి పనుల నుండి మనలను విమోచించి, మంచి పనులు చేయడంలో ఆసక్తిగల ప్రజలుగా పవిత్రపరచి తన సొత్తుగా చేసుకోడానికి తనను తానే మన కోసం అర్పించుకున్నాడు.
ప్రతిస్పందన కీర్తన
3యెహోవాలో నమ్మకం ఉంచు. ఏది మంచిదో దాన్నే చెయ్యి. దేశంలో స్థిరపడి విశ్వసనీయతను ఆచరించు. 4తర్వాత యెహోవాలో ఆనందించు. నీ హృదయంలోని ఆశలన్నిటినీ ఆయన తీరుస్తాడు. 18యెహోవా నిందారహితులను ప్రతిరోజూ కనిపెట్టుకుని ఉంటాడు. వాళ్ళ వారసత్వం నిత్యమూ ఉంటుంది. 23దేవుని దృష్టిలో ఏ వ్యక్తి మార్గం కొనియాడదగ్గదిగా ఉందో ఆ వ్యక్తి నడతను యెహోవా స్థిరపరుస్తాడు. 27చెడు నుండి మళ్ళుకో. ఏది మంచిదో దాన్ని చెయ్యి. అప్పుడు నువ్వు కలకాలం సురక్షితంగా ఉంటావు. 29నీతిమంతులు భూమిని స్వాధీనం చేసుకుంటారు. అక్కడ వాళ్ళు కలకాలం జీవిస్తారు.
సువార్త
7“మీలో ఎవరి సేవకుడైనా పొలంలో భూమి దున్నుతూనో, మందను మేపుతూనో ఉండి ఇంటికి వస్తే యజమాని ‘నువ్వు వెంటనే వచ్చి భోజనానికి కూర్చో’ అంటాడా? అనడు. 8పైగా ‘నాకు భోజనం సిద్ధం చెయ్యి. తువ్వాలు కట్టుకుని నేను భోజనం చేసి ముగించే వరకూ నాకు సేవ చెయ్యి. ఆ తరువాత నువ్వు తినవచ్చు’ అంటాడు. 9తాను ఆజ్ఞాపించిన పనులన్నీ ఆ పనివాడు చక్కగా చేశాడని యజమాని ‘నాపై దయ చూపించావు’ అని వాణ్ణి మెచ్చుకుంటాడా? 10అలాగే మీరు కూడా మీకు ఆజ్ఞాపించిన పనులన్నీ చేసిన తరువాత ‘మేము ఏ యోగ్యతా లేని సేవకులం. మేము చేయాల్సిందే చేశాం’ అని చెప్పాలి.”
ఈరోజు పరిశుద్ధులు
- పునీత మహా లియో, పోప్, సంఘ పండితుడు
సాధారణ రోమన్ కాలెండర్; ఒక బిషప్‌ల సమావేశం కొన్ని పండుగలను (దివ్యదర్శనం, పరలోకారోహణం, క్రీస్తు శరీర రక్తాల పండుగ) ఒక ఆదివారానికి మార్చవచ్చు లేదా తన సొంత పండుగలను జోడించవచ్చు. పఠన గ్రంథం: ఆదివారపు చక్రం A, వారపు రోజుల సంవత్సరం II.
మూలాలు: ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు · © 2017, 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings, the editors' parts and stage directions in the Song of Songs and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · మూలాలు మరియు హక్కులు