Bible Explorer యాప్ పొందండి

హోమ్ › రోజువారీ బైబిల్ పఠనాలు › నవంబర్ 2026 › 3 నవంబర్

ఆర్థడాక్స్ కాలెండర్ · అక్టోబర్ 21 (పాత శైలి)

ఆర్థడాక్స్ రోజువారీ పఠనాలు — 3 నవంబర్, 2026

మంగళవారం · పెంతెకొస్తు తర్వాత 23వ వారం · స్వరం 5

పండుగలు మరియు పరిశుద్ధులు

Venerable Hilarion the Great († 371-372)

ఉపవాసం

ఉపవాసం లేదు

ఇది సన్యాస నియమాన్ని అనుసరిస్తుంది. సంఘంలో ఉపవాస పరిమాణాన్ని ఆరోగ్యం, వయస్సు మరియు పరిస్థితుల ప్రకారం తమ ఆత్మీయ గురువుతో కలిసి నిర్ణయిస్తారు.

ఈరోజు పఠనాలు

పత్రిక

1 తెస్స 1:6–10

6మీరు మమ్మల్నీ, ప్రభువునీ అనుకరించారు. అనేక తీవ్ర హింసలు కలిగినా పరిశుద్ధాత్మ వలన కలిగే ఆనందంతో వాక్యాన్ని అంగీకరించారు. 7కాబట్టి మాసిదోనియలో, అకయలో ఉన్న విశ్వాసులందరికీ మీరు ఆదర్శప్రాయులయ్యారు. 8మీ దగ్గర నుండే ప్రభువు వాక్కు మాసిదోనియలో అకయలో వినిపించింది. అంతమాత్రమే కాకుండా ప్రతి స్థలంలో దేవుని పట్ల మీకున్న విశ్వాసం వెల్లడి అయింది కాబట్టి మేము ఏమీ చెప్పాల్సిన అవసరం లేదు. 9అక్కడి వారు మా విషయమై మీరు మమ్మల్ని ఎలా స్వీకరించారో విగ్రహాలను వదిలి నిజ దేవునికి సేవ చేయడానికి మీరు ఎలా తిరిగారో, 10పరలోకం నుండి వస్తున్న ఆయన కుమారుని కోసం ఎలా వేచి ఉన్నారో చెబుతున్నారు. ఈ యేసును దేవుడు చనిపోయిన వారిలో నుండి సజీవంగా లేపాడు. ఈయన రానున్న ఉగ్రత నుండి మనలను తప్పిస్తున్నాడు.

పత్రిక (బుధవారం కోసం)

1 తెస్స 2:1–8

1సోదరులారా, మీ దగ్గరికి మేము రావడం వ్యర్థం కాలేదని మీకు తెలుసు. 2మేము ఫిలిప్పీలో ముందుగా హింసనూ అవమానాన్నీ అనుభవించాం అని కూడా మీకు తెలుసు. పోరాటాల మధ్య దేవునిలో ధైర్యం తెచ్చుకుని దేవుని సువార్తను మీకు ఉపదేశించాము. 3ఎందుకంటే మా ఉపదేశం తప్పు దారి పట్టించేదీ అపవిత్రమైనదీ ద్రోహపూరితమైనదీ కాదు. 4దేవుడు మమ్మల్ని యోగ్యులుగా ఎంచి సువార్తను మాకు అప్పగించాడు. కాబట్టి మేము మనుషులను సంతోషపరచడానికి కాకుండా హృదయాలను పరిశీలించే దేవుణ్ణి సంతోషపరచడానికే మాట్లాడుతున్నాము. 5మేము ముఖస్తుతి మాటలు ఏనాడూ పలకలేదని మీకు తెలుసు. అలాగే అత్యాశను కప్పిపెట్టే వేషాన్ని ఎప్పుడూ వేసుకోలేదు. దీనికి దేవుడే సాక్షి. 6ఇంకా మేము యేసుక్రీస్తు అపొస్తలులం కాబట్టి ఆధిక్యతలు ప్రదర్శించడానికి అవకాశం ఉన్నా మీ వల్ల కానీ, ఇతరుల వల్ల కానీ, మనుషుల వల్ల కలిగే ఏ ఘనతనూ మేము ఆశించలేదు. 7పాలిచ్చే తల్లి తన పసిపిల్లలను సాకినట్టు మేము మీతో మృదువుగా వ్యవహరించాం. 8మీరు మాకు ఎంతో ఇష్టమైనవారు కాబట్టి మీ పట్ల ప్రీతితో దేవుని సువార్త మాత్రమే కాదు, మీ కోసం మా ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నాం.

పత్రిక (పరిశుద్ధ మహా హిలారియోన్ కోసం)

2 కొరింతీ 9:6–11

6“కొద్దిగా చల్లేవాడు కొద్ది పంట కోస్తాడు. విస్తారంగా చల్లేవాడు విస్తారమైన పంట కోస్తాడు” అని దీని గురించి చెప్పవచ్చు. 7సణుక్కోకుండా బలవంతం లేకుండా తన హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారం ప్రతి ఒక్కరూ ఇవ్వాలి. ఎందుకంటే, దేవుడు ఉత్సాహంగా ఇచ్చే వ్యక్తిని ప్రేమిస్తాడు. 8అన్నిటిలో మీకు చాలినంతగా ఎప్పుడూ ఉండేలా, ప్రతి మంచి పని కోసమూ మీకు సమృద్ధి ఉండేలా దేవుడు మీలో తన కృపను అధికం చేయగలడు. 9దీని గురించి “అతడు తన సంపద దరిద్రులకు పంచి ఇచ్చాడు. అతని నీతి ఎప్పటికీ నిలిచి ఉంటుంది” అని లేఖనంలో రాసి ఉంది. 10విత్తనాలు చల్లేవారికి విత్తనాన్నీ తినడానికి ఆహారాన్నీ దయచేసే దేవుడు మీకు విత్తనాన్ని దయచేసి వృద్ధి చేస్తాడు. మీ నీతి ఫలాన్ని అధికం చేస్తాడు. 11ఎప్పుడూ ఉదారంగా ఇవ్వడానికి మీకు సర్వ సమృద్ధి కలుగుతుంది. దాన్ని బట్టి మా ద్వారా దేవునికి కృతజ్ఞత తెలియజేసే కారణం దొరుకుతుంది.

సువార్త

లూకా 9:23–27

23ఆయన ఇంకా ఇలా అన్నాడు, “ఎవరైనా నన్ను అనుసరించాలంటే తనను తాను నిరాకరించుకోవాలి. ప్రతిదినం తన సిలువను మోసుకుని నా వెనకే రావాలి, 24తన ప్రాణాన్ని కాపాడుకోవాలి అనుకునేవాడు దాన్ని పోగొట్టుకొంటాడు. నాకోసం తన ప్రాణాన్ని పోగొట్టుకొనే వాడు దాన్ని కాపాడుకుంటాడు. 25ఒకడు లోకాన్నంతా సంపాదించుకుని తనను తాను పోగొట్టుకొంటే వాడికేం లాభం? 26నన్ను గూర్చీ నా మాటలను గూర్చీ ఇక్కడ ఎవడు సిగ్గుపడతాడో వాణ్ణి గురించి మనుష్య కుమారుడు తన తేజస్సుతోనూ, తన తండ్రి తేజస్సుతోనూ ఆయన దూతల తేజస్సుతోనూ వచ్చినప్పుడు సిగ్గుపడతాడు. 27అయితే ఇక్కడ ఉన్నవారిలో కొందరు దేవుని రాజ్యాన్ని చూసే వరకూ మరణించరని మీతో కచ్చితంగా చెబుతున్నాను” అన్నాడు.

సువార్త (బుధవారం కోసం)

లూకా 9:44–50

44ఆయన చేసిన కార్యాలను చూసి అందరూ ఆశ్చర్యపోతూ ఉండగా ఆయన తన శిష్యులతో ఇలా అన్నాడు, “ఈ మాటలు మీ చెవుల్లో నాటుకోనివ్వండి. మనుష్య కుమారుణ్ణి మనుషుల స్వాధీనం చేయబోతూ ఉన్నారు” 45అయితే వారు ఆ మాటను అర్థం చేసుకోలేదు. అది వారికి రహస్యంగానే ఉండిపోయింది. కాబట్టి వారు దాన్ని తెలుసుకోలేక పోయారు. అదీగాక ఆ మాట ప్రభువును అడిగేందుకు వారు భయంతో సంశయించారు. 46తమలో ఎవరు గొప్పవాడు అనే వాదం వారిలో పుట్టింది. 47యేసు వారి హృదయాల్లోని ఆలోచనలను తెలుసుకుని ఒక చిన్న బిడ్డను తన దగ్గర నిలబెట్టుకుని, 48“ఇలాంటి చిన్న బిడ్డను నా పేర ఎవరైనా స్వీకరిస్తే అతడు నన్ను స్వీకరిస్తున్నాడు. నన్ను స్వీకరించేవాడు నన్ను పంపిన దేవుణ్ణి స్వీకరిస్తున్నాడు. మీలో ఎవరు అందరి కంటే చిన్నవాడిగా ఉంటాడో వాడే గొప్పవాడు.” 49అప్పుడు యోహాను, “ప్రభూ, ఎవరో ఒక వ్యక్తి నీ పేర దయ్యాలను వెళ్ళగొడుతున్నాడు. వాడు మనలను అనుసరించేవాడు కాదు కాబట్టి వాణ్ణి అడ్డుకున్నాం” అని యేసుతో చెప్పాడు. 50అందుకు యేసు, “మీరు వాణ్ణి అడ్డుకోవద్దు. మీకు విరోధి కాని వాడు మీ వైపు ఉన్నవాడే” అని చెప్పాడు.

తేదీలు రష్యన్ సంఘపు జూలియన్ కాలెండర్‌ను అనుసరిస్తాయి (సెర్బియన్, జార్జియన్ సంఘాలు, ఆథోస్ పర్వతం లాగే): సంఘ కాలెండర్‌లోని 21 అక్టోబర్ పౌర కాలెండర్‌లో 3 నవంబర్. కొత్త కాలెండర్‌ను అనుసరించే సంఘాలు (గ్రీసు, రొమేనియా, బల్గేరియా, ఉక్రెయిన్…) స్థిర పండుగలనూ పరిశుద్ధులనూ పౌర తేదీనే, 13 రోజులు ముందుగా జరుపుకుంటాయి, వాటి కొన్ని పఠనాలు వేరుగా ఉంటాయి; ఈస్టర్, దానిపై ఆధారపడిన రోజులు ఒకటే.

మూలాలు: ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు · © 2017, 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings, the editors' parts and stage directions in the Song of Songs and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · మూలాలు మరియు హక్కులు