Bible Explorer యాప్ పొందండి

అన్వేషించండి › రాజులు మరియు దినవృత్తాంతాలు పక్కపక్కనే › హిజ్కియా నుండి యోషీయా వరకు

రాజులు మరియు దినవృత్తాంతాలు పక్కపక్కనే · హిజ్కియా నుండి యోషీయా వరకు

బబులోను నుండి రాయబారులు

2 రాజులు 20:12–19 · యెష 39:1–8

2 రాజులు

2 రాజులు 20:12–19

12ఆ కాలంలో బబులోనురాజు, బలదాను కొడుకు అయిన బెరోదక్ బలదాను హిజ్కియా జబ్బుగా ఉన్నాడన్న విషయం తెలిసి, ఉత్తరం రాసి కానుకలు ఇచ్చి రాయబారులను అతని దగ్గరికి పంపాడు.

13వర్తమానికులు వచ్చారన్న మాట హిజ్కియా విని వాళ్ళను లోపలికి రప్పించి, తన రాజనగరంలోనూ, రాజ్యంలోనూ ఉన్న అన్ని వస్తువుల్లో, దేనినీ దాచకుండా, తన వస్తువులు ఉన్న కొట్టూ, వెండి బంగారాలూ, సుగంధ ద్రవ్యాలూ, సువాసన తైలం, ఆయుధశాల, తన వస్తువుల్లో ఉన్నవన్నీ వాళ్లకు చూపించాడు.

14తరువాత ప్రవక్త అయిన యెషయా హిజ్కియా రాజు దగ్గరికి వచ్చి “ఆ మనుషులు ఏమన్నారు? నీ దగ్గరికి ఎక్కడ నుంచి వచ్చారు?” అని అడిగాడు. హిజ్కియా “బబులోను అనే దూరదేశం నుంచి వారు వచ్చారు” అని చెప్పాడు.

15“నీ ఇంట్లో వారు ఏమేమి చూశారు?” అని అతడు అడిగాడు. హిజ్కియా “నా వస్తువుల్లో దేన్నీ దాచకుండా నా ఇంట్లో ఉన్నవన్నీ నేను వాళ్లకు చూపించాను” అన్నాడు.

16అప్పుడు యెషయా హిజ్కియాతో “యెహోవా చెప్పే మాట విను.

17రానున్న రోజుల్లో ఏమీ మిగులకుండా నీ రాజనగరులో ఉన్నవన్నీ, ఈ రోజు వరకూ నీ పూర్వికులు సమకూర్చి దాచిపెట్టినదంతా, వారు బబులోను పట్టణానికి తీసుకుని వెళ్ళిపోతారని యెహోవా చెప్తున్నాడు.

18ఇంకా నీ కడుపున పుట్టిన నీ కొడుకుల సంతతిని వారు బబులోను రాజు నగరానికి తీసుకు వెళ్తారు. అక్కడ వారు నపుంసకులు అవుతారు” అన్నాడు.

19అందుకు హిజ్కియా “నీవు తెలియజేసిన యెహోవా ఆజ్ఞ ప్రకారం జరగడం మంచిదే. నా కాలంలో మాత్రం సమాధానం, స్థిరత్వం ఉంటాయి కదా?” అని యెషయాతో అన్నాడు.

యెషయా

యెష 39:1–8

1ఆ సమయంలో బబులోను రాజు, బలదాను కొడుకు అయిన మెరోదక్ బలదాను హిజ్కియా జబ్బు చేసి బాగుపడ్డాడని విని తన రాయబారులతో ఒక కానుకతోబాటు శుభాకాంక్షల సందేశాన్ని అతనికి పంపించాడు.

2హిజ్కియా వారిని లోపలికి రప్పించి, తన ఇంటిలో, రాజ్యంలో ఉన్న సమస్త వస్తువుల్లో దేనిని దాచిపెట్టకుండా తన సామగ్రి దాచే గదులు, వెండి బంగారాలు, సుగంధద్రవ్యాలు, పరిమళ తైలం, ఆయుధశాల మొదలైన వాటిలో ఉన్న తన పదార్థాలన్నిటినీ వారికి చూపించాడు.

3అప్పుడు యెషయా ప్రవక్త హిజ్కియా దగ్గరికి వచ్చి “ఆ మనుషులు ఏమన్నారు? వారు ఎక్కడ నుండి వచ్చారు?” అని అడిగాడు. హిజ్కియా “వారు బబులోను అనే దూరదేశం నుంచి వచ్చారు” అని చెప్పాడు.

4“వాళ్ళు నీ ఇంటిలో ఏమేమి చూశారు?” అని అడిగినప్పుడు, హిజ్కియా “నా వస్తువుల్లో దేనినీ దాచకుండా నా ఇంటిలో ఉన్న సమస్తాన్నీ నేను వారికి చూపించాను” అన్నాడు.

5అప్పుడు యెషయా హిజ్కియాతో ఇలా అన్నాడు. “యెహోవా చెబుతున్న మాట విను.

6రాబోయే రోజుల్లో ఏమీ మిగలకుండా నీ ఇంటిలో ఉన్న సమస్తాన్నీ, ఈ రోజువరకూ నీ పూర్వికులు పోగుచేసి దాచిపెట్టినదంతా బబులోను పట్టణానికి దోచుకుపోతారని సేనల అధిపతి అయిన యెహోవా సెలవిస్తున్నాడు.

7నీ గర్భంలో పుట్టిన నీ కొడుకులను బబులోను రాజనగరంలో నపుంసకులుగా చేయడానికి వారు తీసుకుపోతారు.”

8అందుకు హిజ్కియా “నువ్వు తెలియజేసిన యెహోవా ఆజ్ఞ ప్రకారం జరగడం మంచిదే. అయితే నా జీవితకాలమంతటిలో నాకు శాంతిభద్రతలు, క్షేమం ఉండు గాక” అని యెషయాతో అన్నాడు.

గుర్తించబడినవి: మీరు చదివే అనువాదంలో ప్రతి వృత్తాంతంలో ఉన్న పదాలు. అత్యంత తరచుగా వచ్చే పదాలు (“మరియు”, “అతడు”) గుర్తించబడవు; వేరే రూపంలోని పదం గుర్తించబడకపోవచ్చు.

మూలాలు: OpenBible.info, CC BY 4.0 · ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు · © 2017, 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings, the editors' parts and stage directions in the Song of Songs and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · మూలాలు మరియు హక్కులు