Bible Explorer యాప్ పొందండి

అన్వేషించండి › రాజులు మరియు దినవృత్తాంతాలు పక్కపక్కనే › యూదా రాజులు

రాజులు మరియు దినవృత్తాంతాలు పక్కపక్కనే · యూదా రాజులు

ఆసా, బయెషా

1 రాజులు 15:16–22 · 2 దిన 16:1–6

1 రాజులు

1 రాజులు 15:16–22

16ఆసాకు, ఇశ్రాయేలు రాజు బయెషాకు వారు బతికిన రోజులన్నీ యుద్ధం జరుగుతూ ఉండేది.

17ఇశ్రాయేలు రాజు బయెషా యూదా వారికి విరోధిగా ఉండి, యూదా రాజు ఆసా దగ్గరనుండి ఎవరూ రాకుండా అతని దగ్గరికి ఎవరూ పోకుండా రమా పట్టణాన్ని కట్టించాడు.

18కాబట్టి ఆసా యెహోవా మందిరపు ఖజానాలోనూ రాజభవనపు ఖజానాలోనూ మిగిలిన వెండి బంగారమంతా తీసి తన సేవకులకు ఇచ్చి, దమస్కులో నివసిస్తున్న సిరియా రాజు బెన్హదదుకు పంపించాడు. బెన్హదదు హెజ్యోనుకు పుట్టిన టబ్రిమ్మోను కొడుకు. ఆసా ఇలా మనవి చేశాడు.

19“మీ నాన్నకూ మా నాన్నకూ ఒప్పందం ఉన్నట్టుగా నీకూ నాకూ ఒప్పందం ఉండాలి. వెండి బంగారాలను నీకు కానుకగా పంపిస్తున్నాను. నీవు వచ్చి ఇశ్రాయేలు రాజు బయెషా నా దగ్గర నుండి వెళ్ళిపోయేలా అతనితో నీకున్న పొత్తు రద్దు చేసుకో.”

20కాబట్టి బెన్హదదు ఆసా రాజు చెప్పిన మాటకు సమ్మతించి తన సైన్యాధిపతులను ఇశ్రాయేలు పట్టణాల మీదికి పంపి, ఈయోను, దాను, ఆబేల్బేత్మయకా, కిన్నెరెతు ప్రాంతాలనూ నఫ్తాలి దేశాన్నీ కొల్లగొట్టాడు.

21బయెషాకు అది తెలిసి, రమా పట్టణం కట్టడం మాని తిర్సాకు వెళ్లి అక్కడే నివసించాడు.

22అప్పుడు ఆసా రాజు ఎవరినీ మినహాయించకుండా యూదా దేశం వారంతా రావాలని ప్రకటన చేశాడు. వారు సమకూడి వచ్చి బయెషా కట్టిస్తున్న రమా పట్టణం రాళ్లనూ కర్రలనూ ప్రజలు తీసుకొచ్చేశారు. ఆసా రాజు వాటిని బెన్యామీను ప్రాంతంలో గెబ, మిస్పా కట్టించడానికి ఉపయోగించాడు.

2 దినవృత్తాంతాలు

2 దిన 16:1–6

1ఆసా పరిపాలనలో 36 వ సంవత్సరంలో ఇశ్రాయేలు రాజు బయెషా యూదావారి మీద దండెత్తి వచ్చి యూదా రాజు ఆసా దగ్గరికి రాకపోకలు జరగకుండేలా రమా పట్టణాన్ని కట్టించాడు.

2ఆసా యెహోవా మందిరంలో, రాజనగరంలో ఉన్న ఖజానాల్లోని వెండి బంగారాలను తీసి, దమస్కులో నివసించే ఆరాము రాజు బెన్హదదు దగ్గరకి దూతల చేత పంపించాడు.

3“నా తండ్రికీ నీ తండ్రికీ ఉన్నట్టు నాకూ నీకూ సంధి ఉంది. వెండిని, బంగారాన్ని నీకు పంపించాను. ఇశ్రాయేలు రాజు బయెషా నన్ను విడిచి వెళ్ళిపోయేలా నువ్వు అతనితో చేసుకున్న సంధిని రద్దు చేసుకో” అని అడిగాడు.

4బెన్హదదు రాజైన ఆసా మాట అంగీకరించి, తన సైన్యాల అధిపతులను ఇశ్రాయేలు వారి పట్టణాల మీదికి పంపాడు. వారు ఈయోను, దాను, ఆబేల్మాయీము పట్టణాలపై, నఫ్తాలి ప్రాంతానికి చేరిన పట్టణాల్లోని కొట్లపై దాడి చేశారు.

5బయెషా అది విని రమా ప్రాకారాలను కట్టించడం మానేసి ఆ పని చాలించాడు.

6అప్పుడు రాజైన ఆసా యూదా వారినందరినీ సమకూర్చాడు. వెళ్లి బయెషా కట్టిస్తున్న రమా పట్టణపు రాళ్లను, దూలాలను తీసుకువచ్చారు. ఆసా వాటిని గెబ, మిస్పా పట్టణాలను ప్రాకార కట్టించడానికి వినియోగించాడు.

గుర్తించబడినవి: మీరు చదివే అనువాదంలో ప్రతి వృత్తాంతంలో ఉన్న పదాలు. అత్యంత తరచుగా వచ్చే పదాలు (“మరియు”, “అతడు”) గుర్తించబడవు; వేరే రూపంలోని పదం గుర్తించబడకపోవచ్చు.

మూలాలు: OpenBible.info, CC BY 4.0 · ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు · © 2017, 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings, the editors' parts and stage directions in the Song of Songs and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · మూలాలు మరియు హక్కులు