హోమ్ › రోజువారీ బైబిల్ పఠనాలు › డిసెంబర్ 2027 › 6 డిసెంబర్
కాథలిక్ కాలెండర్
రోజువారీ బైబిల్ పఠనాలు (కాథలిక్) — 6 డిసెంబర్, 2027
సోమవారం · ఆగమన కాలం రెండవ వారం
పండుగలు మరియు పరిశుద్ధులు
ఆగమన కాలం రెండవ వారపు సోమవారం
ఐచ్ఛిక స్మరణ దినం · ఆరాధన రంగు: ఊదా
పునీత నికోలస్, పీఠాధిపతి · ఐచ్ఛిక స్మరణ దినం
ఈరోజు పఠనాలు
మొదటి పఠనం
1అడవులు, ఎండిన భూములు సంతోషిస్తాయి. ఎడారి సంతోషంతో గులాబీ పువ్వులాగా పూస్తుంది. 2అది బాగా విచ్చుకుని, ఉల్లాసంతో పాటలు పాడుతుంది. దానికి లెబానోను లాంటి అందం కలుగుతుంది. దానికి కర్మెలు షారోనులకున్నంత సొగసు కలుగుతుంది. అవి యెహోవా మహిమను మన దేవుని తేజస్సును చూస్తాయి. 3బలహీనమైన చేతులను బలపరచండి. వణుకుతున్న మోకాళ్లను దృఢపరచండి. 4బెదిరిన హృదయాలు గలవారితో ఇలా చెప్పండి. “భయపడకుండా ధైర్యంగా ఉండండి. ప్రతిదండన చేయడానికి మీ దేవుడు వస్తున్నాడు. చేయాల్సిన ప్రతీకారం ఆయన చేస్తాడు. ఆయన వచ్చి మిమ్మల్ని రక్షిస్తాడు.” 5గుడ్డివారి కళ్ళు తెరుచుకుంటాయి. చెవిటివారి చెవులు వినిపిస్తాయి. 6కుంటివాడు దుప్పిలాగా గంతులు వేస్తాడు. మూగవాడి నాలుక పాటలు పాడుతుంది. అరణ్యంలో నీళ్లు ఉబుకుతాయి, అడవిలో కాలవలు పారతాయి. 7ఎండమావులు నీటి మడుగులు అవుతాయి. ఎండిన భూమిలో నీటిబుగ్గలు పుడతాయి. నక్కలు పండుకొనే నివాసాల్లో జమ్ము, తుంగగడ్డి, మేత పుడతాయి. 8పరిశుద్ధ మార్గం అని పిలిచే ఒక రాజమార్గం అక్కడ ఏర్పడుతుంది. దానిలోకి అపవిత్రులు వెళ్ళకూడదు. దేవునికి అంగీకారమైన వారికోసం అది ఏర్పడింది. మూర్ఖులు దానిలో నడవరు. 9అక్కడ సింహం ఉండదు, క్రూర జంతువులు దానిలో కాలు మోపవు. అవి అక్కడ కనబడవు. విమోచన పొందినవారు మాత్రమే అక్కడ నడుస్తారు. యెహోవా విమోచించినవారు పాటలు పాడుతూ తిరిగి సీయోనుకు వస్తారు. 10నిత్యమైన సంతోషం వారిని ఆవరించి ఉంటుంది. వారు ఆనంద సంతోషాలు కలిగి ఉంటారు. వారి దుఃఖం, నిట్టూర్పు తొలగిపోతాయి.
ప్రతిస్పందన కీర్తన
8యెహోవా దేవుడు తెలియచేసే మాట నేను వింటాను, ఆయన తన ప్రజలతో తన నమ్మకమైన అనుచరులతో శాంతితో మసలుతాడు. అయితే వాళ్ళు మళ్ళీ మూర్ఖులు కాకూడదు. 9ఆయన పట్ల భయభక్తులున్న వారికి ఆయన రక్షణ అతి సమీపంగా ఉంది. అప్పుడు మన దేశంలో మహిమ నిలిచి ఉంటుంది. 10నిబంధన విశ్వసనీయత, నమ్మకత్వం కలుసుకున్నాయి, నీతిన్యాయాలు, శాంతిసమాధానాలు ఒకదానినొకటి ముద్దు పెట్టుకున్నాయి. 11భూమిలోనుంచి విశ్వాస్యత మొలుస్తుంది. ఆకాశం నుంచి విజయం తొంగిచూస్తుంది. 12యెహోవా తన మంచి దీవెనలనిస్తాడు. మన భూమి దాని పంటనిస్తుంది. 13నీతి ఆయనకు ముందుగా నడుస్తుంది. ఆయన అడుగుజాడలకు దారి ఏర్పరస్తుంది.
సువార్త
17ఒక రోజు ఆయన బోధిస్తున్నపుడు గలిలయ, యూదయ ప్రాంతాల్లోని చాలా ఊళ్ళ నుండీ యెరూషలేము నుండీ వచ్చిన పరిసయ్యులూ ధర్మశాస్త్రోపదేశకులూ అక్కడ కూర్చుని ఉన్నారు. స్వస్థపరచే ప్రభువు శక్తి ఆయనలో ఉంది. 18కొందరు మనుషులు పక్షవాత రోగిని పరుపు మీద మోసుకు వచ్చారు. అతణ్ణి లోపలికి తెచ్చి, ఆయన ముందు ఉంచాలని చూశారు గాని 19ప్రజలు కిక్కిరిసి ఉండడం చేత అతణ్ణి లోపలికి తేవడానికి వీలు కాలేదు. కాబట్టి, వారు ఇంటికప్పు మీదికెక్కి పెంకులు తీసి పరుపుతో పాటు రోగిని సరిగ్గా యేసు ముందే దింపారు. 20యేసు వారి విశ్వాసం చూసి, “అయ్యా, నీ పాపాలకు క్షమాపణ దొరికింది” అన్నాడు. 21శాస్త్రులూ పరిసయ్యులూ, “దేవదూషణ చేస్తున్న ఇతడు ఎవడు? దేవుడు తప్ప పాపాలు ఎవరు క్షమించగలరు?” అనుకున్నారు 22యేసు వారి ఆలోచన గ్రహించి, “మీరు మీ హృదయాల్లో అలా ఎందుకు ఆలోచిస్తున్నారు? 23ఏది సులభమంటారు? ‘నీ పాపాలు క్షమిస్తున్నాను’ అనడమా, ‘లేచి నడువు’ అనడమా? 24అయితే మనుష్యకుమారుడికి భూమి మీద పాపాలు క్షమించే అధికారం ఉందని మీరు తెలుసుకోవాలి” అన్నాడు. తరువాత పక్షవాత రోగిని చూసి, “లేచి, నీ పరుపు తీసుకుని ఇంటికి వెళ్ళు” అన్నాడు. 25వెంటనే వాడు వారి ముందే లేచి నిలబడి, తాను పడుకున్న పరుపు ఎత్తుకుని, దేవుణ్ణి స్తుతిస్తూ తన ఇంటికి వెళ్ళాడు. 26అందరూ విస్మయం చెంది, “ఈ రోజు విచిత్రమైన విషయాలు చూశాం” అని దేవుణ్ణి స్తుతిస్తూ భయంతో నిండిపోయారు.
ఈరోజు పరిశుద్ధులు
- పునీత నికోలస్, పీఠాధిపతి
సాధారణ రోమన్ కాలెండర్; ఒక బిషప్‌ల సమావేశం కొన్ని పండుగలను (దివ్యదర్శనం, పరలోకారోహణం, క్రీస్తు శరీర రక్తాల పండుగ) ఒక ఆదివారానికి మార్చవచ్చు లేదా తన సొంత పండుగలను జోడించవచ్చు. పఠన గ్రంథం: ఆదివారపు చక్రం C, వారపు రోజుల సంవత్సరం II.
మూలాలు: ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు · © 2017, 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings, the editors' parts and stage directions in the Song of Songs and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · మూలాలు మరియు హక్కులు