హోమ్ › రోజువారీ బైబిల్ పఠనాలు › నవంబర్ 2027 › 14 నవంబర్
కాథలిక్ కాలెండర్
రోజువారీ బైబిల్ పఠనాలు (కాథలిక్) — 14 నవంబర్, 2027
ఆదివారం · సామాన్య కాలం 33వ వారం
పండుగలు మరియు పరిశుద్ధులు
సామాన్య కాలం 33వ ఆదివారం
ఆదివారం · ఆరాధన రంగు: ఆకుపచ్చ
ఈరోజు పఠనాలు
మొదటి పఠనం
1“ఆ కాలంలో నీ ప్రజల పక్షాన నిలిచే మహా అధిపతి మిఖాయేలు వస్తాడు. అప్పుడు నీ ప్రజలు రాజ్యంగా కూడిన కాలం మొదలుకుని ఈ కాలం వరకూ ఎప్పుడూ కలగనంత ఆపద కలుగుతుంది. అయితే నీ ప్రజల్లో గ్రంథంలో పేరున్న వారు తప్పించుకుంటారు. 2సమాధుల్లో నిద్రించే చాలా మంది మేలుకుంటారు. కొందరు నిత్యజీవం అనుభవించడానికి, కొందరు నిందపాలు కావడానికి నిత్యంగా అసహ్యులై పోవడానికి మేలుకుంటారు. 3బుద్ధిమంతులైతే ఆకాశమండలం లోని జ్యోతులను పోలి ప్రకాశిస్తారు. నీతిమార్గం అనుసరించి నడుచుకొనేలా ఎవరు అనేకమందిని తిప్పుతారో వారు నక్షత్రాల వలె నిరంతరం ప్రకాశిస్తారు.
ప్రతిస్పందన కీర్తన
5యెహోవా, నాకు వారసత్వంగా వచ్చిన వాటా నువ్వే. నువ్వే నా గిన్నె. నా అంతిమ గమ్యం నీ చేతుల్లోనే ఉంది. 8అన్నివేళలా యెహోవా వైపు నేను చూస్తూ ఉంటాను, ఆయన కుడిచేతిలోనుంచి నేను కదిలిపోను! 9అందువల్ల నా హృదయం సంతోషంగా ఉంది. నా పూర్ణ హృదయం ఆయనను పొగడుతూ ఉంది. కచ్చితంగా నేను సురక్షితంగా ఉంటాను. 10ఎందుకంటే నువ్వు నా ఆత్మను పాతాళంలో విడిచి పెట్టవు. నిబంధన నమ్మకత్వం ఉన్నవాణ్ణి చావు చూడనివ్వవు. 11జీవమార్గం నువ్వు నాకు తెలియజేస్తావు. నీ సన్నిధిలో మహానందం ఉంది. నీ కుడిచేతిలో నిత్యానందం ఉంది.
రెండవ పఠనం
11నిజంగా ప్రతి యాజకుడూ ప్రతి రోజూ నిలబడి ఒకే విధమైన బలులు అదేపనిగా అర్పిస్తూ సేవ చేస్తూ ఉంటాడు. అవి ఎప్పటికీ పాపాలను తీసివేయలేవు. 12కానీ క్రీస్తు పాపాల కోసం శాశ్వతంగా నిలిచి ఉండే ఒకే బలి అర్పించి దేవుని కుడి పక్కన కూర్చుని ఉన్నాడు. 13తన శత్రువులు అవమానం పొంది తన కాళ్ళ కింద పీటగా మారే సమయం కోసం వేచి చూస్తూ ఉన్నాడు. 14శుద్ధి పొందిన వారిని ఆయన ఒక్క బలి ద్వారా శాశ్వతంగా పరిపూర్ణులుగా చేశాడు. 18ఈ విషయాలకు ఎప్పుడు క్షమాపణ కలుగుతుందో ఇక అప్పటి నుండి పాప పరిహారం కోసం చేసే బలులు ఉండవు.
సువార్త
24“ఆ కష్టకాలం గడచిన తరువాతి రోజుల్లో, సూర్యుడు చీకటైపోతాడు. చంద్రుడు కాంతినివ్వడు. 25ఆకాశ నక్షత్రాలు రాలిపోతాయి. ఆకాశంలో ఉన్న శక్తులన్నీ కదిలిపోతాయి. 26అప్పుడు మనుష్య కుమారుడు గొప్ప శక్తితో ప్రభావంతో మేఘాల మీద రావడం మనుషులు చూస్తారు. 27అప్పుడాయన భూమి నలువైపుల నుండి ఆకాశం నలువైపుల దాకా తన దూతలను పంపి ఆయన ఎన్నుకున్న ప్రజలను పోగుచేయిస్తాడు.” 28“అంజూరు చెట్టును చూసి ఈ ఉపమానం నేర్చుకోండి. దాని కొమ్మలు చిగురించడం చూసి వసంతకాలం వస్తున్నదని మీరు గ్రహిస్తారు. 29అదే విధంగా ఈ సంగతులు జరగడం మీరు చూసినప్పుడు ఆయన దగ్గరలోనే ఉన్నాడనీ, త్వరలో రాబోతున్నాడనీ తెలుసుకోండి. 30నేను కచ్చితంగా చెప్పేదేమంటే, ఈ తరం వారు బతికి ఉండగానే ఇవన్నీ జరుగుతాయి. 31ఆకాశం, భూమి గతించిపోతాయి. కాని నా మాటలు ఎన్నటికీ గతించవు. 32అయితే ఆ రోజు, ఆ గంట ఎప్పుడు వస్తుందో పరలోకంలోని దేవదూతలకు గాని, కుమారుడికి గానీ, మరెవ్వరికీ తెలియదు. తండ్రికి మాత్రమే తెలుసు.
సాధారణ రోమన్ కాలెండర్; ఒక బిషప్‌ల సమావేశం కొన్ని పండుగలను (దివ్యదర్శనం, పరలోకారోహణం, క్రీస్తు శరీర రక్తాల పండుగ) ఒక ఆదివారానికి మార్చవచ్చు లేదా తన సొంత పండుగలను జోడించవచ్చు. పఠన గ్రంథం: ఆదివారపు చక్రం B, వారపు రోజుల సంవత్సరం I.
మూలాలు: ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు · © 2017, 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings, the editors' parts and stage directions in the Song of Songs and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · మూలాలు మరియు హక్కులు