హోమ్ › రోజువారీ బైబిల్ పఠనాలు › ఆగస్టు 2027 › 22 ఆగస్టు
కాథలిక్ కాలెండర్
రోజువారీ బైబిల్ పఠనాలు (కాథలిక్) — 22 ఆగస్టు, 2027
ఆదివారం · సామాన్య కాలం 21వ వారం
పండుగలు మరియు పరిశుద్ధులు
సామాన్య కాలం 21వ ఆదివారం
ఆదివారం · ఆరాధన రంగు: ఆకుపచ్చ
ఈరోజు పఠనాలు
మొదటి పఠనం
1యెహోషువ ఇశ్రాయేలీయుల గోత్రాలన్నిటినీ షెకెంలో పోగుచేసి, వారి పెద్దలనూ అధికారులనూ న్యాయాధిపతులనూ నాయకులనూ పిలిపించినపుడు వారు దేవుని సన్నిధిలో హాజరయ్యారు. 2యెహోషువ ప్రజలందరితో ఇలా అన్నాడు “ఇశ్రాయేలీయుల దేవుడు యెహోవా ఇలా చెబుతున్నాడు, మునుపు మీ పూర్వీకులు, అబ్రాహాము నాహోరుల తండ్రి తెరహు, యూఫ్రటీసు నది అవతల నివసించి, ఇతర దేవుళ్ళను పూజించేవారు. 15యెహోవాను సేవించడం మీ దృష్టికి చెడుగా ఉంటే మీరు ఎవర్ని సేవిస్తారో, నది అవతల మీ పూర్వీకులు సేవించిన దేవుళ్ళను సేవిస్తారో, మీరు నివసిస్తున్నఅమోరీయుల ఈ దేశంలోని దేవుళ్ళను సేవిస్తారో ఈ రోజే కోరుకోండి. నేనూ నా ఇంటివాళ్ళూ యెహోవానే సేవిస్తాం” అన్నాడు. 16అందుకు ప్రజలు ఇలా జవాబిచ్చారు. “యెహోవాను విసర్జించి ఇతర దేవుళ్ళను ఎన్నడూ సేవించం. 17ఐగుప్తుదేశం నుండి, బానిసత్వపు ఇంట్లో నుండి మమ్మల్ని, మా పూర్వీకులను రప్పించి, మా కళ్ళముందు ఆ గొప్ప సూచక క్రియలను చేసి, మేము చేసిన ప్రయాణమంతా, మేము వచ్చిన ప్రాంతాల ప్రజలందరి మధ్య మమ్మల్ని కాపాడిన యెహోవాయే మా దేవుడు. 18యెహోవా యీ దేశంలో నివసించిన అమోరీయులూ మిగతా ప్రజలందరినీ మా దగ్గరనుండి వెళ్ళగొట్టాడు. ఆయనే మా దేవుడు కాబట్టి మేము కూడా యెహోవానే సేవిస్తాం.”
ప్రతిస్పందన కీర్తన
1అబీమెలెకు సమక్షంలో పిచ్చివాడిలాగా నటించినప్పుడు అతడు దావీదును వెళ్ళగొట్టగా దావీదు రాసిన కీర్తన. అన్ని సమయాల్లో నేను యెహోవాను స్తుతిస్తాను. నా నోట్లో నిత్యమూ ఆయన స్తుతి ఉంటుంది. 2నేను యెహోవాను స్తుతిస్తాను. అణచివేతకు గురైన వాళ్ళు అది విని సంతోషిస్తారు గాక! 15యెహోవా కంటి చూపు ధర్మాత్ములపై ఉంది. ఆయన చెవులు వాళ్ళ ప్రార్థనలను వింటూ ఉన్నాయి. 16చెడు కార్యాలు చేసే వాళ్ళ జ్ఞాపకం భూమిపై ఉండకుండా చేయడానికి యెహోవా వాళ్లకు విరోధంగా ఉన్నాడు. 17ధర్మాత్ములు ప్రార్థించినప్పుడు యెహోవా వింటాడు. అన్ని సమస్యల నుండి వాళ్ళను విడిపిస్తాడు. 18విరిగిన హృదయం గల వాళ్లకు యెహోవా సమీపంగా ఉన్నాడు. నలిగిపోయిన మనస్సు గల వాళ్లను ఆయన రక్షిస్తాడు. 19ధర్మాత్ముడికి ఎన్నో ఆపదలు కలుగుతాయి. కానీ యెహోవా వాటన్నిటి పైనా అతనికి విజయం ఇస్తాడు. 20ఆయన అతని ఎముకలన్నిటినీ కాపాడుతాడు. వాటిలో ఒక్కటి కూడా విరిగి పోదు. 21చెడుతనం దుర్మార్గులను హతం చేస్తుంది. ధర్మాత్ముణ్ణి అసహ్యించుకునే వాడు శిక్ష పొందుతాడు. 22యెహోవా తన సేవకుల ప్రాణాలను విడుదల చేస్తాడు. ఆయన శరణు వేడిన వాడికి శిక్ష ఉండదు.
రెండవ పఠనం
21క్రీస్తుపై ఉన్న భక్తి కొద్దీ ఒకరికొకరు లోబడి ఉండండి. 22స్త్రీలు ప్రభువుకు లోబడినట్టే తమ భర్తలకు లోబడాలి. 23క్రీస్తు సంఘానికి ఏ విధంగా తలగా ఉన్నాడో అలాగే భర్త తన భార్యకు తలగా ఉన్నాడు. క్రీస్తే సంఘమనే శరీరానికి రక్షకుడు. 24సంఘం క్రీస్తుకు లోబడిన విధంగానే భార్యలు కూడా ప్రతి విషయంలో తమ భర్తలకు లోబడాలి. 25పురుషులారా, మీరు కూడా సంఘాన్ని క్రీస్తు ప్రేమించిన విధంగానే మీ భార్యలను ప్రేమించాలి. 26సంఘాన్ని వాక్యమనే నీటి స్నానంతో శుద్ధిచేసి, పవిత్రపరచడానికి, 27దాన్ని కళంకంగానీ, మడతలుగానీ అలాటిది మరేదీ లేకుండా పవిత్రంగా నిర్దోషంగా మహిమగలదిగా తన ఎదుట నిలబెట్టుకోవాలని, దానికోసం తనను తాను సమర్పించుకున్నాడు. 28అలాగే పురుషులకు కూడా తమ సొంత శరీరాల్లాగానే తమ భార్యలను ప్రేమించవలసిన బాధ్యత ఉంది. తన భార్యను ప్రేమించేవాడు తనను ప్రేమించుకొన్నట్టే. 29ఎవడూ తన శరీరాన్ని ద్వేషించడు, ప్రతి ఒక్కడూ దాన్ని పోషించి సంరక్షించుకుంటాడు. 30మనం సంఘమనే క్రీస్తు శరీరంలో అవయవాలుగా ఉన్నాం కాబట్టి క్రీస్తు కూడా తన సంఘాన్ని పోషించి సంరక్షిస్తున్నాడు. 31“ఇందువలన పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకుంటాడు, వారిద్దరూ ఒక్క శరీరమవుతారు” 32ఈ మాటల అర్థం గ్రహించడం కష్టం. అయితే నేను క్రీస్తును గూర్చీ సంఘం గూర్చీ చెబుతున్నాను.
సువార్త
60ఆయన శిష్యుల్లో అనేకమంది ఈ మాటలు విన్నప్పుడు, “ఇది చాలా కష్టమైన బోధ. దీన్ని ఎవరు అంగీకరిస్తారు” అని చెప్పుకున్నారు. 61తన శిష్యులు ఇలా సణుక్కుంటున్నారని యేసుకు తెలిసింది. ఆయన వారితో ఇలా అన్నాడు, “ఈ మాటలు మీకు అభ్యంతరంగా ఉన్నాయా? 62మనుష్య కుమారుడు ఇంతకు ముందు ఉన్న చోటికే ఆరోహణం కావడం చూస్తే మీరు ఏమంటారు? 63జీవాన్ని ఇచ్చేది ఆత్మ. శరీరం వల్ల ప్రయోజనం లేదు. నేను మీతో చెప్పిన మాటలే ఆత్మ. అవే జీవం. 64కానీ మీలో విశ్వసించని వారు కొందరు ఉన్నారు.” తన మీద నమ్మకం ఉంచని వారెవరో, తనను పట్టి ఇచ్చేదెవరో యేసుకు మొదటి నుంచీ తెలుసు. 65ఆయన, “నా తండ్రి ఇస్తే తప్ప ఎవరూ నా దగ్గరికి రాలేరని ఈ కారణం బట్టే చెప్పాను” అన్నాడు. 66ఆ తరువాత ఆయన శిష్యుల్లో చాలామంది వెనక్కి వెళ్ళిపోయారు. వారు ఆయనను ఇక ఎప్పుడూ అనుసరించలేదు. 67అప్పుడు యేసు, “మీరు కూడా వెళ్ళాలనుకుంటున్నారా?” అని తనతో ఉన్న పన్నెండుమంది శిష్యులను అడిగాడు. 68సీమోను పేతురు ఆయనతో, “ప్రభూ, మేము ఇక ఎవరి దగ్గరికి వెళ్ళాలి? నీదగ్గర మాత్రమే నిత్య జీవపు మాటలు ఉన్నాయి. 69నువ్వు దేవుని పరిశుద్ధుడివి అని మేము విశ్వసించాం, తెలుసుకున్నాం” అని చెప్పాడు.
సాధారణ రోమన్ కాలెండర్; ఒక బిషప్‌ల సమావేశం కొన్ని పండుగలను (దివ్యదర్శనం, పరలోకారోహణం, క్రీస్తు శరీర రక్తాల పండుగ) ఒక ఆదివారానికి మార్చవచ్చు లేదా తన సొంత పండుగలను జోడించవచ్చు. పఠన గ్రంథం: ఆదివారపు చక్రం B, వారపు రోజుల సంవత్సరం I.
మూలాలు: ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు · © 2017, 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings, the editors' parts and stage directions in the Song of Songs and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · మూలాలు మరియు హక్కులు