Bible Explorer యాప్ పొందండి

హోమ్ › రోజువారీ బైబిల్ పఠనాలు › మార్చి 2027 › 23 మార్చి

కాథలిక్ కాలెండర్

రోజువారీ బైబిల్ పఠనాలు (కాథలిక్) — 23 మార్చి, 2027

మంగళవారం · పవిత్ర వారం

పండుగలు మరియు పరిశుద్ధులు

పవిత్ర వారపు మంగళవారం

వారపు రోజు · ఆరాధన రంగు: ఊదా

ఈరోజు పఠనాలు

మొదటి పఠనం

యెష 49:1–6

1ద్వీపాల్లారా! నా మాట వినండి. దూరంగా ఉన్న ప్రజలారా! జాగ్రత్తగా వినండి. నేను పుట్టకముందే యెహోవా నన్ను పిలిచాడు. నా తల్లి నన్ను కనినప్పుడే ఆయన నా పేరుతో గుర్తు చేసుకున్నాడు. 2ఆయన నా నోటిని పదునైన కత్తిలాగా చేశాడు. తన చేతి నీడలో నన్ను దాచాడు. ఆయన నన్ను మెరుగుపెట్టిన బాణంలాగా చేశాడు. తన అంబులపొదిలో నన్ను దాచాడు. 3ఆయన నాతో “ఇశ్రాయేలూ, నువ్వు నా సేవకుడివి. నీలో నా ఘనత చూపిస్తాను” అని చెప్పాడు. 4నేను వ్యర్థంగా కష్టపడి, నిష్ఫలంగా నా శక్తినంతా ఖర్చుచేశానని అనుకున్నా, నా న్యాయం యెహోవా దగ్గరే ఉంది. నా బహుమానం నా దేవుని దగ్గరే ఉంది. 5యెహోవా దృష్టికి నేను గౌరవనీయుణ్ణి. నా దేవుడు నాకు బలం. తనకు సేవకుడుగా ఉండడానికి, తన దగ్గరికి యాకోబును మళ్ళీ రప్పించాలనీ ఇశ్రాయేలును ఆయన దగ్గరికి చేర్చేలా నన్ను గర్భంలో రూపొందించాడు. యెహోవా ఇలా చెబుతున్నాడు. 6“నువ్వు యాకోబు గోత్రాలను ఉద్ధరించడానికీ ఇశ్రాయేలులో తప్పించుకున్నవాళ్ళను తీసుకురావడానికీ నా సేవకుడుగా ఉండడం ఎంతో చిన్న విషయం. నువ్వు ప్రపంచమంతా నా రక్షణగా ఉండడానికి నిన్ను యూదేతరులకు వెలుగుగా చేస్తాను.”

ప్రతిస్పందన కీర్తన

కీర్త 71:1–6, 15, 17

1యెహోవా, నేను నీ శరణు వేడుకుంటున్నాను. నన్నెన్నడూ సిగ్గుపడనియ్యకు. 2నన్ను రక్షించు. నీ నీతిని బట్టి నన్ను భద్రపరచు. శ్రద్ధగా ఆలకించి నన్ను రక్షించు. 3నీ ఆశ్రయదుర్గంలో ప్రవేశించేందుకు నాకు అనుమతి ఇవ్వు. నా కాపుదల, నా దుర్గం నువ్వే. నువ్వు నన్ను రక్షించాలని నిర్ణయం చేసుకున్నావు. 4నా దేవా, దుష్టుల చేతిలోనుండి నన్ను రక్షించు. కీడు చేసేవాళ్ళ, క్రూరుల పట్టులోనుండి నన్ను విడిపించు. 5నా ప్రభూ, యెహోవా, నా నిరీక్షణకు ఆధారం నువ్వే. నా బాల్యం నుండి నా ఆశ్రయం నువ్వే. 6నేను గర్భంలో ఉన్నది మొదలు నన్ను పోషించింది నువ్వే. తల్లి గర్భం నుండి నన్ను బయటకు తెచ్చింది నువ్వే. నిన్ను గూర్చి నేను నిత్యమూ స్తుతిగానం చేస్తాను. 15నీ నీతిని, నీ రక్షణను రోజంతా వివరిస్తాను. వాటిని నేను లెక్కించలేను. 17దేవా, నా బాల్యం నుండి నువ్వు నాకు బోధిస్తూ వచ్చావు. ఇప్పటి వరకూ నీ ఆశ్చర్య కార్యాలను నేను తెలియజేస్తూనే ఉన్నాను.

సువార్త

యోహా 13:21–33, 36–38

21యేసు ఈ మాటలు చెప్పిన తరువాత ఆత్మలో కలవరం చెంది, “మీలో ఒకడు నాకు ద్రోహం చేస్తాడని మీతో కచ్చితంగా చెబుతున్నాను” అన్నాడు. 22ఆయన ఎవరి గురించి ఇలా చెబుతున్నాడో తెలియక శిష్యులు ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. 23భోజనం బల్ల దగ్గర, ఆయన శిష్యుల్లో ఒకడైన యేసు ప్రేమించిన శిష్యుడు, యేసు రొమ్మున ఆనుకుని ఉన్నాడు. 24సీమోను పేతురు ఆ శిష్యుడికి, “యేసు ఎవరి గురించి అలా అన్నాడన్న విషయాన్ని ఆయన్ని అడిగి తెలుసుకో” అని సైగ చేశాడు. 25ఆ శిష్యుడు యేసు రొమ్మున ఆనుకుని ఆయనతో, “ప్రభూ, ఆ వ్యక్తి ఎవరు?” అని అడిగాడు. 26అప్పుడు యేసు జవాబిస్తూ, “ఈ రొట్టె ముక్క ఎవరికి ముంచి ఇస్తానో, అతడే” అన్నాడు. తరువాత ఆయన రొట్టె ముంచి ఇస్కరియోతు సీమోను కొడుకు యూదాకు ఇచ్చాడు. 27అతడు ఆ ముక్క తీసుకోగానే, సాతాను అతనిలో ప్రవేశించాడు. అప్పుడు యేసు అతనితో, “నువ్వు చెయ్యబోయేది త్వరగా చెయ్యి” అన్నాడు. 28ఆయన అతనితో ఇలా ఎందుకు చెప్పాడో, బల్ల దగ్గర ఉన్నవాళ్ళకు తెలియలేదు. 29డబ్బు సంచి యూదా దగ్గర ఉంది కాబట్టి యేసు అతనితో, “పండగకు కావలసినవి కొను” అని గాని, పేదవాళ్ళకు ఇమ్మని గాని చెప్పాడని వారిలో కొంతమంది అనుకున్నారు. 30అది రాత్రి సమయం. అతడు ఆ రొట్టె ముక్క తీసుకుని వెంటనే బయటకు వెళ్ళిపోయాడు. 31యూదా వెళ్ళిపోయిన తరువాత, యేసు, “ఇప్పుడు మనుష్య కుమారుడు మహిమ పొందాడు. దేవుడు ఆయనలో మహిమ పొందుతున్నాడు” అన్నాడు. 32దేవుడు ఆయనలో మహిమ పరచబడినట్టయితే, తనలో ఆయనను మహిమ పరుస్తాడు. వెంటనే ఆయనను మహిమ పరుస్తాడు. 33పిల్లలూ, ఇంకా కొంత కాలం నేను మీతో ఉంటాను. మీరు నా కోసం వెదుకుతారు. కాని, నేను యూదులకు చెప్పినట్టు మీతో కూడా చెబుతున్నాను, ‘నేను వెళ్ళే స్థలానికి మీరు రాలేరు.’ 36సీమోను పేతురు ఆయనతో, “ప్రభూ, నువ్వెక్కడికి వెళ్తున్నావు?” అన్నాడు. యేసు జవాబిస్తూ, “నేను వెళ్ళే స్థలానికి ఇప్పుడు నువ్వు నా వెంట రాలేవు, కాని తరవాత వస్తావు” అన్నాడు. 37అందుకు పేతురు, “ప్రభూ, నేను ఇప్పుడే నీ వెంట ఎందుకు రాలేను? నీకోసం నా ప్రాణం పెడతాను” అన్నాడు. 38యేసు జవాబిస్తూ, “నా కోసం ప్రాణం పెడతావా? నేను నీతో కచ్చితంగా చెబుతున్నాను, నేనెవరో తెలియదని నువ్వు మూడు సార్లు చెప్పక ముందు కోడి కూయదు” అన్నాడు.

ఈరోజు పరిశుద్ధులు

సాధారణ రోమన్ కాలెండర్; ఒక బిషప్‌ల సమావేశం కొన్ని పండుగలను (దివ్యదర్శనం, పరలోకారోహణం, క్రీస్తు శరీర రక్తాల పండుగ) ఒక ఆదివారానికి మార్చవచ్చు లేదా తన సొంత పండుగలను జోడించవచ్చు. పఠన గ్రంథం: ఆదివారపు చక్రం B, వారపు రోజుల సంవత్సరం I.

మూలాలు: ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు · © 2017, 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings, the editors' parts and stage directions in the Song of Songs and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · మూలాలు మరియు హక్కులు