హోమ్ › రోజువారీ బైబిల్ పఠనాలు › మార్చి 2027 › 17 మార్చి
కాథలిక్ కాలెండర్
రోజువారీ బైబిల్ పఠనాలు (కాథలిక్) — 17 మార్చి, 2027
బుధవారం · తపస్సు కాలం ఐదవ వారం
పండుగలు మరియు పరిశుద్ధులు
తపస్సు కాలం ఐదవ వారపు బుధవారం
ఐచ్ఛిక స్మరణ దినం · ఆరాధన రంగు: ఊదా
పునీత పాట్రిక్, పీఠాధిపతి · స్మరణ
ఈరోజు పఠనాలు
మొదటి పఠనం
14అప్పుడు నెబుకద్నెజరు వాళ్ళతో “షద్రకూ, మేషాకు, అబేద్నెగో, మీరు నా దేవతలను పూజించడం లేదనీ, నేను నిలబెట్టించిన బంగారు విగ్రహానికి నమస్కరించడం లేదనీ నాకు తెలిసింది. ఇది నిజమేనా? 15బాకాలు, వేణువులు, తీగె వాయిద్యాలు, వీణలు, తంబురలు, సన్నాయిలు ఇంకా అన్ని రకాల సంగీత వాయిద్యాల శబ్దాలు మీకు వినబడినప్పుడు నేను చేయించిన విగ్రహానికి సాష్టాంగపడి దానికి నమస్కరించడానికి సిద్ధంగా ఉండండి. మీరు గనక నమస్కరించని పక్షంలో తక్షణమే మండుతున్న అగ్నిగుండంలో పడవేయిస్తాను. నా చేతిలో నుండి మిమ్మల్ని ఏ దేవుడూ కాపాడలేడు” అన్నాడు. 16షద్రకు, మేషాకు, అబేద్నెగోలు రాజుతో ఇలా చెప్పారు. “నెబుకద్నెజరూ, దీని విషయం నీకు జవాబు చెప్పాల్సిన అవసరం మాకు లేదు. 17మేము పూజిస్తున్న దేవుడు మండుతున్న వేడిమి గల ఈ అగ్నిగుండంలో నుండి మమ్మల్ని తప్పించి రక్షించగల సామర్థ్యం ఉన్నవాడు. నువ్వు విధించే శిక్ష నుండి ఆయన మమ్మల్ని కాపాడతాడు. 18రాజా, ఒకవేళ ఆయన మమ్మల్ని కాపాడకపోయినా నీ దేవుళ్ళను మాత్రం మేము పూజించం అనీ, నువ్వు నిలబెట్టిన బంగారు విగ్రహానికి నమస్కరించం అనీ తెలుసుకో.” 19వాళ్ళ జవాబు విన్న నెబుకద్నెజరు కోపంతో మండిపడ్డాడు. షద్రకు, మేషాకు, అబేద్నెగోల విషయంలో అతని ముఖం వికారంగా మారింది. అగ్ని గుండాన్ని మామూలు కంటే ఏడు రెట్లు వేడిగా చేయమని ఆజ్ఞ ఇచ్చాడు. 20తన సైన్యంలో ఉన్న బలిష్ఠులైన కొందరిని పిలిపించాడు. షద్రకు, మేషాకు, అబేద్నెగోలను బంధించి మండుతున్న ఆ గుండంలో పడవేయమని ఆజ్ఞ ఇచ్చాడు. 24తరువాత జరిగింది చూసిన రాజు నెబుకద్నెజరు ఆశ్చర్యపడి, ఆత్రుతగా లేచి నిలబడ్డాడు. తన మంత్రులతో “మనం ముగ్గురిని బంధించి ఈ అగ్నిగుండంలో వేశాం కదా” అని అడిగాడు. వాళ్ళు “అవును రాజా” అన్నారు. 25అప్పుడు రాజు “నేను నలుగురు మనుషులను చూస్తున్నాను. వాళ్ళు బంధించబడినట్టుగానీ, కాలిపోయినట్టు గానీ లేరు. వాళ్లకి ఎలాంటి ప్రమాదమూ జరగలేదు. వాళ్ళతో ఉన్న నాలుగో వ్యక్తి దైవ కుమారుని లాగా ఉన్నాడు” అని అన్నాడు. 28నెబుకద్నెజరు “షద్రకు, మేషాకు, అబేద్నెగోల దేవుడికి స్తుతి కలుగు గాక. తమ దేవునికి తప్ప మరి ఎవరికీ నమస్కరించమనీ, ఎవరినీ పూజించమనీ చెప్పి రాజు ఆజ్ఞను ధిక్కరించారు. తనను నమ్ముకున్న తన సేవకులను ఆ దేవుడు తన దూతను పంపించి రక్షించాడు.
ప్రతిస్పందన కీర్తన
ఈ అనువాదంలో లేదు
సువార్త
31కాబట్టి యేసు, తనలో నమ్మకముంచిన యూదులతో, “మీరు నా వాక్కులో స్థిరంగా ఉంటే నిజంగా నాకు శిష్యులౌతారు. 32సత్యాన్ని గ్రహిస్తారు. అప్పుడు ఆ సత్యమే మిమ్మల్ని విడుదల చేస్తుంది” అన్నాడు. 33అప్పుడు వారు, “మేము అబ్రాహాము వారసులం. మేము ఎప్పుడూ ఎవరికీ బానిసలుగా ఉండలేదే. ‘మీరు విడుదల పొందుతారు’ అని ఎలా అంటున్నావు?” అన్నారు. 34దానికి యేసు, “మీకు కచ్చితంగా చెబుతున్నాను, పాపం చేసే ప్రతివాడూ పాపానికి బానిసే. 35బానిస ఎప్పుడూ ఇంట్లో ఉండడు. కానీ కుమారుడు ఎప్పుడూ ఇంట్లోనే నివాసం ఉంటాడు. 36కుమారుడు మిమ్మల్ని విడుదల చేస్తే మీరు నిజంగా స్వతంత్రులై ఉంటారు. 37మీరు అబ్రాహాము వారసులని నాకు తెలుసు. అయినా మీలో నా వాక్కుకు చోటు లేదు. కాబట్టే నన్ను చంపడానికి ప్రయత్నిస్తున్నారు. 38నేను ఉపదేశించేదంతా నా తండ్రి దగ్గర నేను చూసినదే. అలాగే మీరు మీ తండ్రి దగ్గర విన్న సంగతుల ప్రకారమే పనులు చేస్తున్నారు” అని చెప్పాడు. 39దానికి వారు, “మా తండ్రి అబ్రాహాము” అన్నారు. అప్పుడు యేసు, “మీరు అబ్రాహాము పిల్లలైతే అబ్రాహాము చేసిన పనులే చేసేవారు. 40దేవుని దగ్గర నేను విన్న సత్యాన్ని మీకు చెప్పినందుకు నన్ను చంపాలని ప్రయత్నిస్తున్నారుగా. అయితే అబ్రాహాము అలా చేయలేదు. 41మీరు మీ తండ్రి పనులే చేస్తున్నారు” అని వారితో చెప్పాడు. దానికి వారు, “మేము వ్యభిచారం వల్ల పుట్టినవారం కాదు. మాకు ఒక్కడే తండ్రి. ఆయన దేవుడు” అన్నారు. 42యేసు వారితో ఇలా అన్నాడు, “దేవుడు మీ తండ్రి అయితే మీరు నన్ను ప్రేమించి ఉండేవారు. నేను వచ్చింది దేవుని దగ్గర్నుంచే. నా అంతట నేను రాలేదు. ఆయనే నన్ను పంపించాడు.
ఈరోజు పరిశుద్ధులు
- పునీత పాట్రిక్, పీఠాధిపతి
సాధారణ రోమన్ కాలెండర్; ఒక బిషప్‌ల సమావేశం కొన్ని పండుగలను (దివ్యదర్శనం, పరలోకారోహణం, క్రీస్తు శరీర రక్తాల పండుగ) ఒక ఆదివారానికి మార్చవచ్చు లేదా తన సొంత పండుగలను జోడించవచ్చు. పఠన గ్రంథం: ఆదివారపు చక్రం B, వారపు రోజుల సంవత్సరం I.
మూలాలు: ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు · © 2017, 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings, the editors' parts and stage directions in the Song of Songs and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · మూలాలు మరియు హక్కులు