హోమ్ › రోజువారీ బైబిల్ పఠనాలు › మార్చి 2027 › 13 మార్చి
కాథలిక్ కాలెండర్
రోజువారీ బైబిల్ పఠనాలు (కాథలిక్) — 13 మార్చి, 2027
శనివారం · తపస్సు కాలం నాల్గవ వారం
పండుగలు మరియు పరిశుద్ధులు
తపస్సు కాలం నాల్గవ వారపు శనివారం
వారపు రోజు · ఆరాధన రంగు: ఊదా
ఈరోజు పఠనాలు
మొదటి పఠనం
18దీనంతటినీ యెహోవా నాకు వెల్లడి చేసినప్పుడు నేను గ్రహించాను. ఆయన వారి పనులను నాకు కనపరిచాడు. 19అయితే నేను వధకు తీసుకుపోయే గొర్రెపిల్లలాగా ఉన్నాను. వారు నాకు వ్యతిరేకంగా చేసిన ఆలోచనలు నేను గ్రహించలేదు. “మనం చెట్టును దాని ఫలంతో సహా కొట్టివేద్దాం రండి, అతని పేరు ఇకపై ఎవరూ జ్ఞాపకం చేసుకోకుండా అతనిని సజీవుల్లో నుండి నిర్మూలం చేద్దాం రండి” అని వారు చెప్పుకున్నారు. 20సేనల ప్రభువైన యెహోవా న్యాయంగా తీర్పు తీరుస్తూ, హృదయాన్నీ, మనస్సునూ పరిశోధిస్తాడు. యెహోవా, నా వ్యాజ్యాన్ని నీ ఎదుట పెట్టాను. వారి మీద నువ్వు చేసే ప్రతీకారం నేను చూస్తాను.
ప్రతిస్పందన కీర్తన
1బెన్యామీనీయుడైన కూషు గురించి యెహోవాకు దావీదు కూర్చిన సంగీతం. యెహోవా నా దేవా, నేను నీలో ఆశ్రయం పొందుతాను. నన్ను తరిమే వాళ్ళ నుంచి నన్ను రక్షించు. నన్ను విడిపించు. 2లేకపోతే, వాళ్ళు సింహంలా నన్ను చీల్చేస్తారు. నాకు క్షేమం కలిగించడం ఎవరివల్లా కానంతగా నన్ను చీల్చివేస్తారు. 8యెహోవా, జాతులకు తీర్పు తీర్చు. నేను ఏ తప్పూ చెయ్యలేదు గనక, నేను న్యాయం జరిగించాను గనక, యెహోవా, మహోన్నతుడా, నా మాట నిజం చెయ్యి. 9దుర్మార్గుల దుష్ట కార్యాలు అంతం అగు గాక. కానీ హృదయాలనూ, మనస్సులనూ పరిశీలించే న్యాయమూర్తివైన దేవా, న్యాయవంతులైన ప్రజలను స్థిరపరుచు. 10హృదయంలో యథార్థంగా ఉన్న వాళ్ళను రక్షించే ఆ దేవుని దగ్గర నుంచే నా డాలు వస్తుంది. 11దేవుడు న్యాయాన్ని బట్టి తీర్పు తీర్చే న్యాయమూర్తి. ఆయన ప్రతిరోజూ ఆగ్రహించే దేవుడు.
సువార్త
40ప్రజల్లో కొందరు ఆ మాట విని, “ఈయన నిజంగా ప్రవక్తే” అన్నారు. 41మరికొందరు, “ఈయన క్రీస్తే” అన్నారు. దానికి జవాబుగా ఇంకా కొందరు, “ఏమిటీ, క్రీస్తు గలిలయ నుండి వస్తాడా? 42క్రీస్తు దావీదు వంశంలో పుడతాడనీ, దావీదు ఊరు బేత్లెహేము అనే గ్రామంలో నుండి వస్తాడనీ లేఖనాల్లో రాసి లేదా?” అన్నారు. 43ఈ విధంగా ప్రజల్లో ఆయనను గురించి భేదాభిప్రాయం కలిగింది. 44వారిలో కొందరు ఆయనను పట్టుకోవాలని అనుకున్నారు కానీ ఎవరూ ఆయనను పట్టుకోలేదు. 45పరిసయ్యులు పంపిన సైనికులు తిరిగి వచ్చారు. ప్రధాన యాజకులూ, పరిసయ్యులూ, “మీరు ఆయనను ఎందుకు తీసుకురాలేదు?” అని అడిగారు. 46దానికి ఆ సైనికులు, “ఆ వ్యక్తి మాట్లాడినట్టు ఇంతకు ముందు ఎవరూ మాట్లాడలేదు” అని జవాబిచ్చారు. 47దానికి పరిసయ్యులు, “మీరు కూడా మోసపోయారా? 48అధికారుల్లో గానీ పరిసయ్యుల్లో గానీ ఎవరైనా ఆయనను నమ్మారా? 49ధర్మశాస్త్రం తెలియని ఈ ప్రజల పైన శాపం ఉంది” అని సైనికులతో అన్నారు. 50అంతకు ముందు యేసు దగ్గరికి వచ్చిన నికోదేము అనే పరిసయ్యుడు, 51“ఒక వ్యక్తి చెప్పే మాట వినకుండా అతడేం చేశాడో తెలుసుకోకుండా మన ధర్మశాస్త్రం అతడికి తీర్పు తీరుస్తుందా?” అన్నాడు. 52దానికి వారు, “నువ్వు కూడా గలిలయుడవేనా? ఆలోచించు, గలిలయలో ఎలాంటి ప్రవక్తా పుట్టడు” అన్నారు. 53ఇక ఎవరి ఇంటికి వారు వెళ్ళారు.
సాధారణ రోమన్ కాలెండర్; ఒక బిషప్‌ల సమావేశం కొన్ని పండుగలను (దివ్యదర్శనం, పరలోకారోహణం, క్రీస్తు శరీర రక్తాల పండుగ) ఒక ఆదివారానికి మార్చవచ్చు లేదా తన సొంత పండుగలను జోడించవచ్చు. పఠన గ్రంథం: ఆదివారపు చక్రం B, వారపు రోజుల సంవత్సరం I.
మూలాలు: ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు · © 2017, 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings, the editors' parts and stage directions in the Song of Songs and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · మూలాలు మరియు హక్కులు