హోమ్ › రోజువారీ బైబిల్ పఠనాలు › ఫిబ్రవరి 2027 › 21 ఫిబ్రవరి
కాథలిక్ కాలెండర్
రోజువారీ బైబిల్ పఠనాలు (కాథలిక్) — 21 ఫిబ్రవరి, 2027
ఆదివారం · తపస్సు కాలం రెండవ వారం
పండుగలు మరియు పరిశుద్ధులు
తపస్సు కాలం రెండవ ఆదివారం
ఆదివారం · ఆరాధన రంగు: ఊదా
ఈరోజు పఠనాలు
మొదటి పఠనం
1ఈ సంగతులన్నీ జరిగిన తరువాత దేవుడు అబ్రాహామును పరీక్షించాడు. ఆయన “అబ్రాహామూ” అని పిలిచినప్పుడు అతడు “చిత్తం ప్రభూ” అన్నాడు. 2అప్పుడు ఆయన అబ్రాహాముతో “నువ్వు ప్రేమించే నీ ఒక్కగానొక్క కొడుకు ఇస్సాకును తీసుకుని మోరియా దేశానికి వెళ్ళు. అక్కడ నేను చెప్పబోయే ఒక పర్వతం మీద అతణ్ణి దహనబలిగా అర్పించు” అన్నాడు. 9దేవుడు అబ్రాహాముకు చెప్పిన స్థలానికి వారు చేరుకున్నారు. అక్కడ అబ్రాహాము ఒక బలిపీఠం నిర్మించి దానిపై కట్టెలు పేర్చాడు. ఇస్సాకును తాళ్ళతో బంధించాడు. ఆ బలిపీఠంపై పేర్చిన కట్టెలపై అతణ్ణి పడుకోబెట్టాడు. 10తరువాత అబ్రాహాము తన కుమారుణ్ణి వధించడానికి చెయ్యి చాపి కత్తి పట్టుకున్నాడు. 11అప్పుడు ఆకాశం నుండి యెహోవా దూత “అబ్రాహామూ, అబ్రాహామూ” అని పిలిచాడు. దానికతడు “చిత్తం ప్రభూ” అన్నాడు. 12అప్పుడు ఆయన “ఆ బాలునిపై చెయ్యి వేయకు. అతనికి ఏ హానీ తలపెట్టవద్దు. నీకున్న ఒక్కగానొక్క కొడుకుని నాకివ్వడానికి వెనుకంజ వేయలేదు. అది చూశాక నీకు దేవునిపట్ల భయభక్తులు ఉన్నాయని నాకు తెలిసింది” అన్నాడు. 13అప్పుడు అబ్రాహాము తలెత్తి చూశాడు. ఆశ్చర్యం కలిగించేలా అక్కడ ఉన్న ఒక పొదలో కొమ్ములు చిక్కుకుని ఉన్న ఒక పొట్టేలు అతనికి కనిపించింది. అబ్రాహాము వెళ్ళి ఆ పోట్టేలుని పట్టుకుని తన కొడుక్కి బదులుగా దాన్ని దహనబలిగా అర్పించాడు. 15యెహోవా దూత రెండవసారి ఆకాశం నుండి అబ్రాహామును పిలిచి ఇలా అన్నాడు 16“నువ్వు నీ ఒక్కగానొక్క కొడుకుని ఇవ్వడానికి వెనుకంజ వేయకుండా ఇదంతా చేశావు. అందుకే ప్రమాణం చేస్తున్నాను. 17నేను నిన్ను ఆశీర్వదిస్తాను. నీ వారసులను ఆకాశంలో ఉండే నక్షత్రాల వలే, సముద్ర తీరంలో ఉండే ఇసుక రేణువులవలే అత్యధికంగా విస్తరించేలా చేస్తాను. నీ వారసులు తమ శత్రువుల భూములను స్వాధీనం చేసుకుంటారు. 18నువ్వు నా మాట విన్నావు కనుక నీ సంతానం వల్ల భూమి పైన ఉన్న జాతులన్నిటినీ ఆశీర్వదిస్తాను.”
ప్రతిస్పందన కీర్తన
10నేను అలా మాట్లాడి నమ్మకం ఉంచాను. నేను చాలా బాధపడిన వాణ్ణి. 15యెహోవా భక్తుల మరణం ఆయన దృష్టికి విలువ గలది. 16యెహోవా, నేను నిజంగా నీ సేవకుణ్ణి. నీ సేవకుణ్ణి, నీ సేవకురాలి కుమారుణ్ణి. నీవు నా కట్లు విప్పావు. 17నేను నీకు కృతజ్ఞత అర్పణలు అర్పిస్తాను. యెహోవా నామంలో ప్రార్థన చేస్తాను 18ఆయన ప్రజలందరి ఎదుటా యెహోవాకు నా మొక్కుబడులు తీరుస్తాను. 19యెహోవా మందిర ఆవరణాల్లో, యెరూషలేమా, నీ మధ్యనే నేను యెహోవాకు నా మొక్కుబడులు చెల్లిస్తాను. యెహోవాను స్తుతించండి.
రెండవ పఠనం
31వీటిని గురించి మనమేమంటాం? దేవుడు మన పక్షాన ఉండగా మనకు విరోధి ఎవడు? 32తన సొంత కుమారుణ్ణి మనకీయడానికి సంకోచించక మనందరి కోసం ఆయనను అప్పగించిన దేవుడు ఆయనతోబాటు అన్నిటినీ మనకీయకుండా ఉంటాడా? 33దేవుడు ఏర్పరచుకున్న వారి మీద నేరారోపణ చేయగల వాడెవడు? నిర్దోషిగా ప్రకటించేవాడు దేవుడే. 34ఎవరు శిక్ష విధించ గలిగేది? క్రీస్తు యేసా? చనిపోయినవాడు, మరింత ప్రాముఖ్యంగా చనిపోయిన వారిలో నుండి లేచినవాడు, దేవుని కుడి పక్కన కూర్చుని ఉన్నవాడు, మన కోసం విజ్ఞాపన చేసేవాడు కూడా ఆయనే.
సువార్త
2ఆరు రోజుల తరవాత యేసు పేతురు, యాకోబు, యోహానులను తీసుకుని ఏకాంతంగా ఒక ఎతైన కొండ మీదికి వెళ్ళాడు. అక్కడ వారి ముందు యేసు రూపాంతరం చెందాడు. 3ఆయన వస్త్రాలు ధగధగా మెరవసాగాయి. ప్రపంచంలో ఏ చాకలీ ఉతకలేనంత తెల్లగా మారిపోయాయి. 4అప్పుడు ఏలీయా, మోషేలు అక్కడ ప్రత్యక్షమై యేసుతో మాటలాడడం శిష్యులు చూశారు. 5పేతురు యేసుతో, “రబ్బీ! మనం ఇక్కడే ఉండడం మంచిది. మేము మూడు పాకలు వేస్తాం, ఒకటి నీకు, ఒకటి మోషేకి, ఒకటి ఏలీయాకి” అన్నాడు. 6తానేమి అంటున్నాడో అతనికి తెలియలేదు. ఆ శిష్యులంతా తీవ్రమైన భయానికి లోనయ్యారు. 7అప్పుడు ఒక మేఘం వచ్చి వారిని కప్పివేసింది. ఆ మేఘం నుండి ఒక స్వరం ఇలా వినిపించింది. “ఈయన నా ప్రియమైన కుమారుడు, ఈయన మాట వినండి.” 8వెంటనే వారు తమ చుట్టూ చూశారు, యేసు తప్ప మరెవ్వరూ వారికి కనిపించలేదు. 9వారు కొండ దిగి వస్తూ ఉండగా యేసు, “మనుష్య కుమారుడు చనిపోయి తిరిగి బతికే వరకూ మీరు చూసిన ఈ దృశ్యాన్ని ఎవ్వరికీ చెప్పకండి” అని ఆజ్ఞాపించాడు. 10అందువల్ల వారు ఆ విషయం తమలోనే దాచుకుని, “చనిపోయి తిరిగి బ్రతకడం” గురించి తమలో తాము చర్చించుకున్నారు.
ఈరోజు పరిశుద్ధులు
- పునీత పీటర్ డామియన్, పీఠాధిపతి, సంఘ పండితుడు
సాధారణ రోమన్ కాలెండర్; ఒక బిషప్‌ల సమావేశం కొన్ని పండుగలను (దివ్యదర్శనం, పరలోకారోహణం, క్రీస్తు శరీర రక్తాల పండుగ) ఒక ఆదివారానికి మార్చవచ్చు లేదా తన సొంత పండుగలను జోడించవచ్చు. పఠన గ్రంథం: ఆదివారపు చక్రం B, వారపు రోజుల సంవత్సరం I.
మూలాలు: ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు · © 2017, 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings, the editors' parts and stage directions in the Song of Songs and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · మూలాలు మరియు హక్కులు