Bible Explorer యాప్ పొందండి

హోమ్ › రోజువారీ బైబిల్ పఠనాలు › డిసెంబర్ 2026 › 23 డిసెంబర్

ఆర్థడాక్స్ కాలెండర్ · డిసెంబర్ 10 (పాత శైలి)

ఆర్థడాక్స్ రోజువారీ పఠనాలు — 23 డిసెంబర్, 2026

బుధవారం · పెంతెకొస్తు తర్వాత 30వ వారం · స్వరం 4

పండుగలు మరియు పరిశుద్ధులు

Martyrs Minos, Hermogenes, and Eugraphos of Alexandria († c. 313)

క్రీస్తు జనన ఉపవాసం

ఉపవాసం: నూనె లేకుండా వండిన ఆహారం

ఇది సన్యాస నియమాన్ని అనుసరిస్తుంది. సంఘంలో ఉపవాస పరిమాణాన్ని ఆరోగ్యం, వయస్సు మరియు పరిస్థితుల ప్రకారం తమ ఆత్మీయ గురువుతో కలిసి నిర్ణయిస్తారు.

ఈరోజు పఠనాలు

పత్రిక

హెబ్రీ 10:1–18

1ఎందుకంటే ధర్మశాస్త్రం అనేది భవిష్యత్తులో కలిగే శ్రేష్ఠమైన విషయాలకు ప్రతిబింబంలా ఉంది కానీ అది వాటి నిజ స్వరూపం కాదు. యాజకులు ప్రతి సంవత్సరం అర్పించే ఒకే రకం బలుల ద్వారా ధర్మశాస్త్రం దేవుని దగ్గరికి వచ్చే వారిని పరిపూర్ణులను చేయలేదు. 2ఒకవేళ అలా చేయగలిగితే ఇక ఆ బలులు అర్పించడం మానేస్తారు కదా! ఆరాధించేవారు ఒక సారంటూ శుద్ధులైతే పాపానికి గూర్చిన స్పృహ వారికిక ఉండదు కదా! 3అయితే ఆ బలులు అర్పించడం వల్ల ప్రతి సంవత్సరం పాపాలు గుర్తుకు వస్తూనే ఉంటాయి. 4ఎందుకంటే ఎద్దుల, మేకల రక్తం పాపాన్ని తీసివేయడం అసాధ్యం. 5క్రీస్తు ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఇలా అన్నాడు, “నువ్వు బలులను గానీ కానుకలను గానీ కోరుకోలేదు. కానీ నాకొక దేహాన్ని నువ్వు సిద్ధం చేసావు. 6దహన బలులన్నా పాప పరిహారం కోసం చేసే బలులన్నా నీకు సంతోషం ఉండదు. 7అప్పుడు నేను నీతో ఇలా అన్నాను, ‘చూడు, నా గురించి గ్రంథంలో రాసిన ప్రకారం నీ ఇష్టాన్ని జరిగించడానికి నేనున్నాను.’” 8పైన చెప్పినట్టుగా ఆయన, “నువ్వు బలులను గానీ, కానుకలను గానీ దహన బలులను గానీ పాప పరిహారం కోసం చేసే బలులను గానీ కోరుకోవు, వీటిలో నీకు సంతోషం ఉండదు. ఇవి ధర్మశాస్త్రం ప్రకారం అర్పించబడేవి” అన్నాడు. 9ఆ తరువాత ఆయన, “చూడు, నీ ఇష్ట ప్రకారం చేయడానికి నేనున్నాను” అని చెప్పాడు. రెండవ ప్రక్రియను నెలకొల్పడానికి ఆయన మొదటి ప్రక్రియను పక్కన పెట్టేశాడు. 10ఈ రెండవ ప్రక్రియలో యేసు క్రీస్తు దేహం ఒక్కసారే బలి కావడం చేత దేవుని ఇష్ట ప్రకారం మనకు శుద్ధి జరిగింది. 11నిజంగా ప్రతి యాజకుడూ ప్రతి రోజూ నిలబడి ఒకే విధమైన బలులు అదేపనిగా అర్పిస్తూ సేవ చేస్తూ ఉంటాడు. అవి ఎప్పటికీ పాపాలను తీసివేయలేవు. 12కానీ క్రీస్తు పాపాల కోసం శాశ్వతంగా నిలిచి ఉండే ఒకే బలి అర్పించి దేవుని కుడి పక్కన కూర్చుని ఉన్నాడు. 13తన శత్రువులు అవమానం పొంది తన కాళ్ళ కింద పీటగా మారే సమయం కోసం వేచి చూస్తూ ఉన్నాడు. 14శుద్ధి పొందిన వారిని ఆయన ఒక్క బలి ద్వారా శాశ్వతంగా పరిపూర్ణులుగా చేశాడు. 15దీన్ని గురించి పరిశుద్ధాత్మ కూడా మనకు సాక్షమిస్తున్నాడు. మొదట ఆయన ఇలా అన్నాడు, 16“‘ఆ రోజులు గడిచిన తరువాత నేను వారితో చేసే ఒప్పందం ఇదే’ అని ప్రభువు అంటున్నాడు. ‘నా శాసనాలను వారి హృదయాల్లో ఉంచుతాను. వారి మనసులపై వాటిని రాస్తాను.’” 17తరువాత ఆయన, “వాళ్ళ పాపాలనూ అక్రమాలనూ ఇక మీదట ఎప్పటికీ జ్ఞాపకం చేసుకోను” అన్నాడు. 18ఈ విషయాలకు ఎప్పుడు క్షమాపణ కలుగుతుందో ఇక అప్పటి నుండి పాప పరిహారం కోసం చేసే బలులు ఉండవు.

సువార్త

లూకా 21:5–7, 10–11, 20–24

5దేవాలయాన్ని అందమైన రాళ్ళతోనూ, కానుకలతోనూ అలంకరించారని కొందరు మాట్లాడుకుంటూ ఉన్నారు. 6అప్పుడు ఆయన, “ఈ కట్టడాలను మీరు చూస్తున్నారు గదా, వీటిలో రాయి మీద రాయి నిలవకుండా పడదోసే రోజు వస్తుంది” అన్నాడు. 7అప్పుడు వారు, “బోధకా, ఇవి ఎప్పుడు జరుగుతాయి. ఇవి జరిగే ముందు ఏ సూచన కనిపిస్తుంది?” అని ఆయనను అడిగారు. 10ఆయన వారితో ఇంకా ఇలా అన్నాడు, “ఒక జాతి పైకి మరో జాతీ ఒక రాజ్యం పైకి మరో రాజ్యమూ దాడి చేస్తుంది. 11కొన్ని చోట్ల గొప్ప భూకంపాలూ కరువులూ ఈతిబాధలూ కలుగుతాయి. ఆకాశంలో భయంకరమైన ఉత్పాతాలూ గొప్ప సూచనలూ కనిపిస్తాయి. 20యెరూషలేమును సైన్యాలు ముట్టడించడం మీరు చూసినప్పుడు దాని నాశనం దగ్గర పడిందని తెలుసుకోండి. 21అప్పుడు యూదయలో ఉన్న వారు కొండలకు పారిపోవాలి. పట్టణంలో ఉన్నవారు బయటకు పోవాలి. గ్రామవాసులు దానిలో ప్రవేశించ కూడదు. 22ఎందుకంటే అవి పగ తీర్చుకునే రోజులు. రాసి ఉన్నవన్నీ నెరవేరేలా ఆ రోజులు వస్తాయి. 23ఆ రోజుల్లో గర్భవతులకూ బాలింతలకూ ఎంతో యాతన కలుగుతుంది. దేశంలో చాలా దురవస్థ కలుగుతుంది. ఈ ప్రజల పైకి ఉగ్రత దిగి వస్తుంది. 24వారు కత్తిపాలై చనిపోతారు. శత్రువులు వారిని చెరపట్టి యూదులు కాని అన్యజనాల్లోకి తీసుకువెళ్తారు. యూదేతర జాతులు తమ కాలాలు పూర్తి అయ్యేవరకూ యెరూషలేమును కాళ్ళ కింద తొక్కుతారు.

తేదీలు రష్యన్ సంఘపు జూలియన్ కాలెండర్‌ను అనుసరిస్తాయి (సెర్బియన్, జార్జియన్ సంఘాలు, ఆథోస్ పర్వతం లాగే): సంఘ కాలెండర్‌లోని 10 డిసెంబర్ పౌర కాలెండర్‌లో 23 డిసెంబర్. కొత్త కాలెండర్‌ను అనుసరించే సంఘాలు (గ్రీసు, రొమేనియా, బల్గేరియా, ఉక్రెయిన్…) స్థిర పండుగలనూ పరిశుద్ధులనూ పౌర తేదీనే, 13 రోజులు ముందుగా జరుపుకుంటాయి, వాటి కొన్ని పఠనాలు వేరుగా ఉంటాయి; ఈస్టర్, దానిపై ఆధారపడిన రోజులు ఒకటే.

మూలాలు: ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు · © 2017, 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings, the editors' parts and stage directions in the Song of Songs and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · మూలాలు మరియు హక్కులు