హోమ్ › రోజువారీ బైబిల్ పఠనాలు › డిసెంబర్ 2026 › 13 డిసెంబర్
ఆర్థడాక్స్ కాలెండర్ · నవంబర్ 30 (పాత శైలి)
ఆర్థడాక్స్ రోజువారీ పఠనాలు — 13 డిసెంబర్, 2026
ఆదివారం · స్వరం 3
పండుగలు మరియు పరిశుద్ధులు
పెంతెకొస్తు తర్వాత 28వ ఆదివారం
క్రీస్తు జనన ఉపవాసం
చేపలు అనుమతి
ఇది సన్యాస నియమాన్ని అనుసరిస్తుంది. సంఘంలో ఉపవాస పరిమాణాన్ని ఆరోగ్యం, వయస్సు మరియు పరిస్థితుల ప్రకారం తమ ఆత్మీయ గురువుతో కలిసి నిర్ణయిస్తారు.
ఈరోజు పఠనాలు
సాయంకాల ప్రార్థన: పఠనం
1యేసు క్రీస్తు అపొస్తలుడు అయిన పేతురు పొంతు, గలతీయ, కప్పదొకియ, ఆసియ, బితునియ అనే ప్రాంతాల్లో చెదరిపోయి పరదేశులుగా ఉంటున్న ఎంపిక అయిన వారికి శుభమని చెప్పి రాస్తున్న సంగతులు. 2తండ్రి అయిన దేవుని భవిష్యద్ జ్ఞానాన్ని బట్టి, పరిశుద్ధాత్మ వలన పవిత్రీకరణ పొంది, యేసు క్రీస్తుకు విధేయత చూపడానికి ఆయన రక్త ప్రోక్షణకు వచ్చిన మీపై కృప నిలిచి ఉండుగాక. మీకు శాంతిసమాధానం విస్తరించు గాక. 3మన ప్రభు యేసు క్రీస్తు తండ్రి అయిన దేవునికి స్తుతులు కలుగు గాక. యేసు క్రీస్తు చనిపోయిన తరువాత ఆయనను సజీవునిగా లేపడం ద్వారా దేవుడు తన మహా కనికరాన్ని బట్టి మనకు కొత్త జన్మనిచ్చాడు. ఇది మనకు ఒక సజీవమైన ఆశాభావాన్ని కలిగిస్తున్నది. 4దీని మూలంగా మనకు ఒక వారసత్వం లభించింది. ఇది నాశనం కాదు, మరక పడదు, వాడిపోదు, ఇది పరలోకంలో మీకోసం ఎప్పుడూ భద్రంగా ఉండేది. 5ఆఖరి రోజుల్లో వెల్లడి కావడానికి సిద్ధంగా ఉన్న రక్షణ కోసం, విశ్వాసం ద్వారా దేవుని బల ప్రభావాలు మిమ్మల్ని కాపాడుతూ ఉన్నాయి. 6రకరకాల విషమ పరీక్షల వలన ఇప్పుడు మీరు విచారించవలసి వచ్చినా దీన్ని బట్టి మీరు ఆనందిస్తున్నారు. 7నాశనం కాబోయే బంగారం కంటే విశ్వాసం ఎంతో విలువైనది. బంగారాన్ని అగ్నితో శుద్ధి చేస్తారు గదా! దాని కంటే విలువైన మీ విశ్వాసం ఈ పరీక్షల చేత పరీక్షకు నిలిచి, యేసు క్రీస్తు ప్రత్యక్షమయ్యేటప్పుడు మీకు మెప్పునూ మహిమనూ ఘనతనూ తెస్తుంది. 8మీరాయన్ని చూడకపోయినా ఆయన్ని ప్రేమిస్తున్నారు. ఇప్పుడు ఆయన్ని చూడకుండానే విశ్వసిస్తూ మాటల్లో చెప్పలేనంత దివ్య సంతోషంతో ఆనందిస్తున్నారు. 9మీ విశ్వాసానికి ఫలాన్ని అంటే మీ ఆత్మల రక్షణ పొందుతున్నారు. 10మీకు కలిగే ఆ కృపను గురించి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణను గురించి ఎంతో శ్రద్ధతో విచారించి పరిశీలించారు. 11వారు తమలోని క్రీస్తు ఆత్మ ముందుగానే తెలియజేసిన విషయాలు అంటే క్రీస్తు పొందనైయున్న బాధలు, ఆ తరువాత రాబోయే గొప్ప విషయాలు ఎప్పుడు, ఎలా జరగబోతున్నాయి అని తెలుసుకొనేందుకు ఆలోచించి పరిశోధించారు. 12తమ కోసం కాక మీ కోసమే తాము సేవ చేశారనే సంగతి ఆ ప్రవక్తలకు వెల్లడి అయింది. పరలోకం నుంచి దిగివచ్చిన పరిశుద్ధాత్మ ద్వారా మీకు సువార్త ప్రకటించినవారు ఈ విషయాలు మీకిప్పుడు తెలియజేశారు. దేవదూతలు కూడా ఈ సంగతులు తెలుసుకోవాలని ఎంతో ఆశపడుతున్నారు. 13కాబట్టి మీ మనసు అనే నడుము కట్టుకోండి. స్థిర బుద్ధితో, యేసు క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు కలిగే కృపపై సంపూర్ణమైన ఆశాభావం కలిగి ఉండండి. 14విధేయులైన పిల్లలై ఉండండి. మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకున్న దురాశలను అనుసరించి ప్రవర్తించవద్దు. 15మిమ్మల్ని పిలిచినవాడు పరిశుద్ధుడు. అలాగే మీ ప్రవర్తన అంతటిలో పరిశుద్ధులై ఉండండి. 16ఎందుకంటే, “నేను పరిశుద్ధుడను కాబట్టి మీరూ పరిశుద్ధులుగా ఉండండి” అని రాసి ఉంది. 17ప్రతి ఒక్కరి పని గురించి పక్షపాతం లేకుండా తీర్పు తీర్చే దేవుణ్ణి మీరు, “తండ్రీ” అని పిలిచే వారైతే భూమిమీద మీరు జీవించే కాలమంతా భయభక్తులతో గడపండి. 18మీ పూర్వీకుల నుంచి పారంపర్యంగా వచ్చిన వ్యర్ధమైన జీవన విధానం నుంచి దేవుడు మిమ్మల్ని వెల ఇచ్చి విమోచించాడు. వెండి బంగారాల లాంటి అశాశ్వతమైన వస్తువులతో కాదు. 19అమూల్యమైన రక్తంతో, అంటే ఏ లోపం, కళంకం లేని గొర్రెపిల్ల లాంటి క్రీస్తు అమూల్య రక్తం ఇచ్చి, మిమ్మల్ని విమోచించాడు. 20విశ్వం ఉనికిలోకి రాక ముందే దేవుడు క్రీస్తుని నియమించాడు. అయితే ఈ చివరి రోజుల్లోనే దేవుడు ఆయన్ని మీకు ప్రత్యక్ష పరిచాడు. 21ఆయన ద్వారానే మీరు దేవుణ్ణి నమ్ముతున్నారు. దేవుడాయనను చనిపోయిన వారిలో నుంచి సజీవంగా లేపి ఆయనకు మహిమ ఇచ్చాడు. కాబట్టి మీ విశ్వాసం, ఆశాభావం దేవుని మీదే ఉన్నాయి. 22సత్యానికి లోబడడం ద్వారా మీరు మీ మనసులను పవిత్రపరచుకున్నారు. తద్వారా యథార్ధమైన సోదర ప్రేమను పొందారు. అందుచేత ఒకరినొకరు హృదయ పూర్వకంగా, గాఢంగా ప్రేమించుకోండి. 23మీరు నాశనమయ్యే విత్తనం నుంచి కాదు, ఎప్పటికీ ఉండే సజీవ దేవుని వాక్కు ద్వారా, నాశనం కాని విత్తనం నుంచి మళ్ళీ పుట్టారు. 24“ఎందుకంటే మానవులంతా గడ్డిలాంటి వారు. వారి వైభవమంతా గడ్డి పువ్వు లాంటిది. గడ్డి ఎండిపోతుంది. పువ్వు రాలిపోతుంది 25గానీ ప్రభువు వాక్కు ఎప్పటికీ నిలిచి ఉంటుంది.” ఈ సందేశమే మీకు సువార్తగా ప్రకటించడం జరిగింది. 2:1ప్రభువు దయగల వాడని మీరు రుచి చూశారు కాబట్టి 2అన్ని రకాల దుష్టత్వం, మోసం, వేషధారణ, అసూయ, సమస్త దూషణ మాటలను మానండి. 3కొత్తగా పుట్టిన బిడ్డల్లా, స్వచ్ఛమైన ఆత్మ సంబంధమైన పాలను ఆశించండి. దాని ద్వారా మీరు రక్షణలో ఎదుగుతారు. 4మనుషులు తిరస్కరించినా, దేవుడు ఎన్నుకున్నదీ విలువైనదీ, సజీవమైన రాయి అయిన ప్రభువు దగ్గరికి రండి. 5ఆధ్యాత్మిక గృహంగా కట్టడానికి వాడే సజీవమైన రాళ్ల లాగా మీరున్నారు. దాని వలన, యేసు క్రీస్తు ద్వారా దేవునికి అంగీకారమైన ఆత్మ సంబంధమైన బలులు అర్పించడానికి పరిశుద్ధ యాజకులుగా ఉండగలరు. 6ఎందుకంటే లేఖనంలో ఇలా రాసి ఉంది, “నేను సీయోనులో మూల రాయి వేస్తున్నాను. అది విలువైనదీ ఎన్నిక అయినదీ ప్రాముఖ్యమైనదీ. ఆయనను నమ్మేవారెవరూ సిగ్గు పడరు.”
సాయంకాల ప్రార్థన: పఠనం
21దీనికోసమే దేవుడు మిమ్మల్ని పిలిచాడు. క్రీస్తు కూడా మీకోసం బాధపడి, మీరు తన అడుగు జాడల్లో నడవాలని మీకు ఆదర్శాన్ని ఉంచి వెళ్ళి పోయాడు. 22ఆయన ఎలాంటి పాపం చేయలేదు. ఆయన నోటిలో ఎలాంటి కపటమూ కనబడలేదు. 23ఆయనను దూషించినా తిరిగి దూషించ లేదు. ఆయన బాధపడినా తిరిగి బెదిరింపక, న్యాయంగా తీర్పు తీర్చే దేవునికి తనను తాను అప్పగించుకున్నాడు. 24మనకు పాపాల్లో ఇక ఎలాంటి భాగమూ ఉండకుండాా నీతి కోసం బతకడానికి స్వయంగా ఆయనే తన దేహంలో మన పాపాలను మాను మీద భరించాడు. ఆయన పొందిన గాయాల వలన మీరు బాగుపడ్డారు. 25మీరు తప్పిపోయిన గొర్రెల్లాగా తిరుగుతూ ఉన్నారు. అయితే ఇప్పుడు మీ కాపరి, మీ ఆత్మల సంరక్షకుని దగ్గరికి తిరిగి వచ్చారు. 3:1భార్యలుగా ఉన్న మీరు మీ భర్తలకు తప్పకుండా లోబడాలి. అందువలన వారిలో ఎవరైనా వాక్యానికి అవిధేయులయినా సరే, మాటలతో కాకుండా, వారి భార్యల ప్రవర్తనే వారిని ప్రభువు కోసం సంపాదిస్తుంది. 2ఎందుకంటే గౌరవ ప్రదమైన మీ పవిత్ర ప్రవర్తన వారు గమనిస్తారు. 3జడలు అల్లుకోవడం, బంగారు ఆభరణాలు, ఖరీదైన బట్టలు అనే బాహ్య అలంకారాలు మీకు వద్దు. 4వాటికి బదులు హృదయంలో శాంతం, సాత్విక స్వభావం కలిగి ఉండండి. అలాంటి అలంకారం నాశనం కాదు. అది దేవుని దృష్టికి చాలా విలువైనది. 5పూర్వకాలంలో దేవుని మీద నమ్మకం ఉంచిన పవిత్ర స్త్రీలు ఈ విధంగా అలంకరించుకున్నారు. వారు తమ భర్తలకు లోబడి ఉంటూ తమ్మును తాము అలంకరించుకున్నారు. 6ఈ ప్రకారమే శారా అబ్రాహామును యజమాని అని పిలుస్తూ అతనికి లోబడి ఉంది. ఏ భయాలకూ లొంగకుండా, మంచి చేస్తూ ఉంటే మీరు ఆమె పిల్లలు. 7అలాగే భర్తలైన మీరు, జీవమనే బహుమానంలో మీ భార్యలు మీతో కూడా వాటాదారులని గ్రహించి, వారు అబలలని ఎరిగి గౌరవపూర్వకంగా వారితో కాపురం చేయండి. ఇలా చేస్తే మీ ప్రార్థనలకు ఆటంకం కలగదు. 8చివరికి మీరంతా మనసులు కలిసి, కారుణ్యంతో సోదరుల్లా ప్రేమించుకొంటూ, సున్నితమైన మనసుతో వినయంతో ఉండండి. 9కీడుకు బదులుగా కీడు చేయవద్దు. అవమానానికి బదులుగా అవమానించవద్దు. దానికి బదులుగా దీవిస్తూ ఉండండి. ఎందుకంటే మీరు దీవెనకు వారసులు అయ్యేందుకే దేవుడు మిమ్మల్ని పిలిచాడు.
సాయంకాల ప్రార్థన: పఠనం
1క్రీస్తు శరీర హింసలు పొందాడు కాబట్టి, మీరు కూడా అలాంటి మనసునే ఆయుధంగా ధరించుకోండి. శరీర హింసలు పొందిన వాడు పాపం చేయడం మానేస్తాడు. 2ఈ వ్యక్తి తన శేష జీవితాన్ని ఇకమీదట మానవ కోరికలను అనుసరించక, దేవుని ఇష్టం కోసమే జీవిస్తాడు. 3యూదేతరులు చేసినట్టు చేయడానికి గతించిన కాలం చాలు. గతంలో మీరు లైంగిక పరమైన అనైతిక కార్యాలూ, చెడ్డ కోరికలు, మద్యపానం, అల్లరి చిల్లరి వినోదాలూ, విచ్చలవిడి విందులూ, నిషిద్ధమైన విగ్రహ పూజలూ చేశారు. 4వారితోబాటుగా మీరూ ఇలాటి విపరీతమైన తెలివిమాలిన పనులు ఇప్పుడు చేయడం లేదని వారు మిమ్మల్ని వింతగా చూస్తున్నారు. అందుకే వారు మీ గురించి చెడ్డగా చెబుతున్నారు. 5బతికున్న వారికీ చనిపోయిన వారికీ తీర్పు తీర్చడానికి సిద్ధంగా ఉన్నవాడికి వారు లెక్క అప్పజెప్పాలి. 6అందుకే చనిపోయిన వారు మానవ రీతిగా వారి శరీరానికి తీర్పు జరిగినా వారి ఆత్మ దేవునిలో జీవించేలా వారికి కూడా సువార్త ప్రకటించబడింది. 7అన్నిటికీ అంతం సమీపించింది. కాబట్టి మెలకువగా, ప్రార్థనల్లో చైతన్య వంతులుగా ఉండండి. 8అన్నిటి కంటే ప్రధానంగా ఒకరిపట్ల ఒకరు గాఢమైన ప్రేమతో ఉండండి. ప్రేమ ఇతరుల పాపాలను వెతికి పట్టుకోడానికి ప్రయత్నించదు. 9ఏ మాత్రమూ సణుక్కోకుండా ఒకరికొకరు అతిథి సత్కారం చేసుకోండి. 10దేవుని అనేక ఉచిత వరాలకు మంచి నిర్వాహకులుగా ఉంటూ, మీలో ప్రతి ఒక్కడూ కృపావరంగా పొందిన వాటిని ఒకరికొకరికి సేవ చేసుకోడానికి వాడండి. 11ఎవరైనా బోధిస్తే, దైవోక్తుల్లా బోధించాలి. ఎవరైనా సేవ చేస్తే దేవుడు అనుగ్రహించే సామర్ధ్యంతో చేయాలి. దేవునికి యేసు క్రీస్తు ద్వారా అన్నిటిలోనూ మహిమ కలుగుతుంది. మహిమ, ప్రభావం ఎప్పటికీ ఆయనకే చెందుతాయి. ఆమేన్.
ఉదయ ప్రార్థన ఆరవ సువార్త
36వారు ఇలా మాట్లాడుకుంటూ ఉండగా యేసే వారి మధ్య నిలబడి, “మీకు శాంతి కలుగు గాక” అన్నాడు. 37అయితే వారు తమకేదో ఆత్మ కనిపించిందనుకుని భయంతో హడలిపోయారు. 38అప్పుడాయన, “మీరు ఎందుకు భయపడుతున్నారు? మీ హృదయాల్లో ఎందుకు సందేహపడుతున్నారు? 39నేనే ఆయనను అనడానికి రుజువుగా నా చేతులూ, నా పాదాలూ చూడండి. నన్ను ముట్టుకుని చూడండి. నాకు ఉన్నట్టుగా ఆత్మకు ఎముకలూ మాంసమూ ఉండవు” అని చెప్పాడు. 40అలా చెప్పి తన చేతులనూ, కాళ్ళనూ వారికి చూపించాడు. 41అయితే వారు సంతోషంతో తబ్బిబ్బులై పోతూ ఇంకా నమ్మకుండా ఆశ్చర్యపోతూ ఉన్నారు. అప్పుడు ఆయన, “మీ దగ్గర ఏదైనా ఆహారం ఉందా?” అని అడిగాడు. 42వారు కాల్చిన చేప ముక్కను ఆయనకు ఇచ్చారు. 43ఆయన దాన్ని తీసుకుని వారి కళ్ళ ముందే తిన్నాడు. 44తరువాత ఆయన, “మోషే ధర్మశాస్త్రంలోనూ, ప్రవక్తల గ్రంథాల్లోనూ, కీర్తనల్లోనూ నా గురించి రాసినవన్నీ నెరవేరాలని నేను మీతో ఉన్నప్పుడు చెప్పాను గదా” అన్నాడు. 45అప్పుడు లేఖనాలను గ్రహించగలిగేలా ఆయన వారి మనసులను తెరిచాడు. 46“క్రీస్తు హింసల పాలై చనిపోయి మూడవ రోజున చనిపోయిన వారిలో నుండి లేస్తాడనీ, 47యెరూషలేములో ప్రారంభమై సమస్త జాతులకూ ఆయన పేర పశ్చాత్తాపం, పాప క్షమాపణ ప్రకటన జరుగుతుందనీ రాసి ఉంది. 48మీరు ఈ విషయాలన్నిటికీ సాక్షులు. 49“వినండి, నా తండ్రి చేసిన వాగ్దానాన్ని మీ మీదికి పంపుతున్నాను. మీరు పైనుండి శక్తి పొందే వరకూ పట్టణంలోనే ఉండండి” అని వారికి చెప్పాడు. 50ఆయన బేతనియ వరకూ వారిని తీసుకు పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించాడు. 51అలా వారిని ఆశీర్వదిస్తూ ఉండగానే ఆయన వారిలో నుండి వేరై పరలోకానికి ఆరోహణం అయ్యాడు. 52వారు ఆయనను ఆరాధించి గొప్ప ఆనందంతో యెరూషలేముకు తిరిగి వెళ్ళారు. 53దేవాలయంలో నిరంతరం ఉంటూ దేవుణ్ణి కీర్తిస్తూ, ఆరాధిస్తూ ఉన్నారు.
పత్రిక
12వెలుగు నివాసులుగా తనకోసం ప్రత్యేకించబడిన వారి వారసత్వంలో భాగం పంచుకోడానికి మనలను అర్హులుగా చేసిన తండ్రికి మీరు సంతోషంతో కృతజ్ఞతలు చెల్లించాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాం. 13ఆయన మనలను చీకటి రాజ్యపు ఆధిపత్యం నుండి విడుదల చేసి తన ప్రియ కుమారుడి రాజ్యంలోకి తరలించాడు. 14ఆ కుమారుడిలోనే మనకు పాప క్షమాపణా విమోచనా ఉన్నాయి. 15కుమారుడు అదృశ్య దేవుని స్వరూపం. సర్వసృష్టికీ ఆయన ప్రముఖుడు. 16ఎందుకంటే కంటికి కనిపించేదైనా కనిపించనిదైనా ఆకాశంలోనూ, భూమిపైనా ఉన్న అన్నిటి సృష్టీ ఆయన ద్వారానే జరిగింది. సింహాసనాలైనా, ఆధిపత్యాలైనా, ప్రభుత్వాలైనా, అధికారులైనా, సర్వమూ ఆయన ద్వారా కలిగాయి, ఆయన కోసమే కలిగాయి. 17ఆయన అన్నిటికీ పూర్వం ఉన్నవాడు. ఆయనలోనే అన్నీ ఒకదానితో మరొకటి కలిసి స్థిరంగా ఉంటాయి. 18సంఘం అనే శరీరానికి ఆయనే తల. సర్వాధికారానికీ మూలకేంద్రం ఆయనే. అన్నిటిలో ఆయనకు ప్రథమ స్థానం కలిగేటందుకు చనిపోయిన వారిలో నుండి సజీవుడిగా లేవడంలో ఆయన ప్రథముడు.
పత్రిక (పరిశుద్ధ అంద్రెయ కోసం)
9దేవుడు క్రీస్తు అపొస్తలులమైన మమ్మల్ని ఊరేగింపులో చివరి వరసలో ఉంచి మరణశిక్ష పొందిన వారిలా ఉంచాడని నాకనిపిస్తున్నది. మేము లోకమంతటికీ, అంటే దేవదూతలకూ మనుషులకూ ఒక వింత ప్రదర్శనలాగా ఉన్నాం. 10క్రీస్తు కోసం మేము బుద్ధిహీనులం, మీరు తెలివైనవారు! మేము బలం లేని వాళ్ళం, మీరు బలమైనవారు, ఘనత పొందినవారు! మేమైతే అవమానం పాలైన వాళ్ళం. 11ఈ గంట వరకూ మేము ఆకలిదప్పులతో అలమటిస్తున్నాం, సరైన బట్టలు లేవు. క్రూరంగా దెబ్బలు తింటున్నాం, నిలువ నీడ లేని వాళ్ళం. 12మా చేతులతో కష్టపడి పని చేసుకుంటున్నాం. ప్రజలు మమ్మల్ని నిందించినా ప్రతిగా దీవిస్తున్నాం. ఎన్ని బాధలు పెట్టినా ఓర్చుకుంటున్నాం. 13మమ్మల్ని తిట్టిన వారితో దయగానే మాట్లాడుతున్నాం. ఇప్పటికీ మమ్మల్ని అందరూ ఈ లోకంలోని మురికిగా, పారేసిన కసువులాగా ఎంచుతున్నారు. 14నేను ఈ మాటలు రాస్తున్నది మీరు నా ప్రియమైన పిల్లలని మీకు బుద్ధి చెప్పడానికే గానీ మిమ్మల్ని సిగ్గు పరచాలని కాదు. 15ఎందుకంటే క్రీస్తులో మీకు సంరక్షకులు పదివేల మంది ఉన్నా, అనేకమంది తండ్రులు లేరు. క్రీస్తు యేసులో సువార్త ద్వారా నేను మిమ్మల్ని కన్నాను. కాబట్టి నన్ను పోలి నడుచుకోమని మిమ్మల్ని వేడుకుంటున్నాను.
సువార్త
10ఒక విశ్రాంతి దినం ఆయన ఒక సమాజ మందిరంలో బోధిస్తున్నాడు. 11బలహీనపరచే దయ్యం పట్టిన ఒక స్త్రీ పద్దెనిమిది ఏళ్ళుగా అక్కడ ఉంది. ఆమె నడుం వంగిపోయి ఎంత మాత్రమూ సరిగ్గా నిలబడలేక పోతూ ఉంది. 12యేసు ఆమెను చూసి, తన దగ్గరికి రమ్మని పిలిచి, “అమ్మా, నీ బలహీనత నుండి విడుదల పొందావు” అని ఆమెతో చెప్పి 13ఆమె మీద చేతులుంచాడు. వెంటనే ఆమె చక్కగా నిలబడి దేవుణ్ణి మహిమ పరిచింది. 14యేసు విశ్రాంతి దినాన స్వస్థపరచాడని ఆ సమాజ మందిరం అధికారి మండిపడ్డాడు. అతడు జనసమూహాన్ని చూసి, “పని చేయడానికి ఆరు రోజులున్నాయి కదా, ఆ రోజుల్లోనే వచ్చి స్వస్థత పొందండి. విశ్రాంతి దినం మాత్రం రావద్దు” అని చెప్పాడు. 15అందుకు ప్రభువు, “కపటులారా, మీలో ప్రతివాడూ విశ్రాంతిదినాన తన ఎద్దునైనా గాడిద నైనా గాడి దగ్గరనుంచి విప్పి, తోలుకుపోయి నీళ్ళు పెడతాడా లేదా. 16ఇదిగో, పద్దెనిమిది ఏళ్ళ నుండి సాతాను బంధించిన అబ్రాహాము కుమార్తె అయిన ఈమెను విశ్రాంతి దినాన ఈ బంధకాల నుండి విడిపించకూడదా?” అన్నాడు. 17ఆయన ఈ మాటలు అన్నప్పుడు ఆయనను ఎదిరించిన వారంతా సిగ్గుపడ్డారు. అయితే జనసమూహమంతా ఆయన చేసిన గొప్ప కార్యాలను చూసి సంతోషించారు.
సువార్త (పరిశుద్ధ అంద్రెయ కోసం)
35మరుసటి రోజు యోహాను తన శిష్యులు ఇద్దరితో నిలబడి ఉన్నాడు. 36అప్పుడు యేసు అక్కడ నడిచి వెళ్తుంటే యోహాను ఆయన వైపు చూసి, “ఇదిగో, చూడండి, దేవుని గొర్రెపిల్ల” అన్నాడు. 37అతడు చెప్పిన మాట విని ఆ యిద్దరు శిష్యులు యేసు వెనకే వెళ్ళారు. 38యేసు వెనక్కి తిరిగి, వారు తన వెనకాలే రావడం చూసి, “మీకేం కావాలి?” అని అడిగాడు. వారు, “రబ్బీ, (రబ్బీ అనే మాటకు బోధకుడు అని అర్థం) నువ్వు ఎక్కడ ఉంటున్నావ్?” అని అడిగారు. 39ఆయన, “వచ్చి చూడండి” అన్నాడు. వారు వచ్చి ఆయన ఉంటున్న స్థలం చూశారు. అప్పటికి సాయంత్రం నాలుగు గంటలైంది. దాంతో వారు ఆ రోజుకి ఆయనతో ఉండిపోయారు. 40యోహాను మాట విని ఆయన వెనకాల వెళ్ళిన ఇద్దరిలో ఒకరు అంద్రెయ. ఇతడు సీమోను పేతురు సోదరుడు. 41ఇతడు అన్నిటికంటే ముందు తన సోదరుడైన సీమోనును వెతికి పట్టుకుని, అతనితో, “మేము మెస్సీయను (మెస్సీయ అంటే క్రీస్తు అని అర్థం) కనుక్కున్నాం” అని చెప్పాడు. 42యేసు దగ్గరికి అతణ్ణి తీసుకుని వచ్చాడు. యేసు అతణ్ణి చూసి, “నువ్వు యోహాను కొడుకువి, నీ పేరు సీమోను. నిన్ను ఇక కేఫా అని పిలుస్తారు” అన్నాడు (కేఫా అనే మాటకి పేతురు (రాయి) అని అర్థం). 43మర్నాడు యేసు గలిలయకు వెళ్ళాలని బయలుదేరినప్పుడు ఫిలిప్పును చూశాడు. ఫిలిప్పుతో, “నా వెనకే రా” అన్నాడు. 44ఫిలిప్పు సొంత ఊరు బేత్సయిదా. అంద్రెయ, పేతురుల సొంత ఊరు కూడా అదే. 45ఫిలిప్పు నతనయేలును చూసి, “ధర్మశాస్త్రంలో మోషే, ప్రవక్తలూ ఎవరి గురించి రాశారో ఆ వ్యక్తిని మేము చూశాం. ఆయన నజరేతు వాడూ, యోసేపు కుమారుడూ అయిన యేసు” అని చెప్పాడు. 46దానికి నతనయేలు, “నజరేతులో నుండి మంచిదేమన్నా రాగలదా?” అన్నాడు. ఫిలిప్పు, “నువ్వే వచ్చి చూడు” అన్నాడు. 47నతనయేలు తన దగ్గరికి రావడం యేసు చూసి, “చూడండి. ఇతడు నిజమైన ఇశ్రాయేలీయుడు. ఇతనిలో ఎలాంటి కపటమూ లేదు” అన్నాడు. 48అప్పుడు నతనయేలు, “నేను నీకెలా తెలుసు?” అన్నాడు. అందుకు యేసు, “ఫిలిప్పు నిన్ను పిలవక ముందు ఆ అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే నేను నిన్ను చూశాను” అన్నాడు. 49దానికి నతనయేలు, “బోధకా, నువ్వు దేవుని కుమారుడివి! ఇశ్రాయేలు రాజువి నువ్వే” అని ఆయనకు బదులిచ్చాడు. 50అందుకు యేసు, “ఆ అంజూరు చెట్టు కింద నిన్ను చూశానని చెప్పినందుకే నువ్వు నమ్మేస్తున్నావా? దీని కంటే గొప్ప విషయాలు చూస్తావు” అన్నాడు. 51తరువాత యేసు ఇలా అన్నాడు, “నేను కచ్చితంగా చెప్పేదేమంటే, ఆకాశం తెరుచుకోవడం, దేవుని దూతలు మనుష్య కుమారుడి మీదుగా ఎక్కడం, దిగడం చేస్తూ ఉండడం మీరు చూస్తారు.”
తేదీలు రష్యన్ సంఘపు జూలియన్ కాలెండర్ను అనుసరిస్తాయి (సెర్బియన్, జార్జియన్ సంఘాలు, ఆథోస్ పర్వతం లాగే): సంఘ కాలెండర్లోని 30 నవంబర్ పౌర కాలెండర్లో 13 డిసెంబర్. కొత్త కాలెండర్ను అనుసరించే సంఘాలు (గ్రీసు, రొమేనియా, బల్గేరియా, ఉక్రెయిన్…) స్థిర పండుగలనూ పరిశుద్ధులనూ పౌర తేదీనే, 13 రోజులు ముందుగా జరుపుకుంటాయి, వాటి కొన్ని పఠనాలు వేరుగా ఉంటాయి; ఈస్టర్, దానిపై ఆధారపడిన రోజులు ఒకటే.
మూలాలు: ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు · © 2017, 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings, the editors' parts and stage directions in the Song of Songs and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · మూలాలు మరియు హక్కులు