Bible Explorer యాప్ పొందండి

హోమ్ › రోజువారీ బైబిల్ పఠనాలు › అక్టోబర్ 2026 › 29 అక్టోబర్

ఆర్థడాక్స్ కాలెండర్ · అక్టోబర్ 16 (పాత శైలి)

ఆర్థడాక్స్ రోజువారీ పఠనాలు — 29 అక్టోబర్, 2026

గురువారం · పెంతెకొస్తు తర్వాత 22వ వారం · స్వరం 4

పండుగలు మరియు పరిశుద్ధులు

Martyr Longinus the Centurion, who stood at the Cross of the Lord and with him 2 other Martyrs (1st C)

ఉపవాసం

ఉపవాసం లేదు

ఇది సన్యాస నియమాన్ని అనుసరిస్తుంది. సంఘంలో ఉపవాస పరిమాణాన్ని ఆరోగ్యం, వయస్సు మరియు పరిస్థితుల ప్రకారం తమ ఆత్మీయ గురువుతో కలిసి నిర్ణయిస్తారు.

ఈరోజు పఠనాలు

పత్రిక

కొలస్స 4:2–9

2ప్రార్థనలో నిలిచి ఉండండి. కృతజ్ఞతలు చెల్లిస్తూ మెలకువగా ఉండండి. 3దేవుని వాక్కు అయిన క్రీస్తు మర్మాన్ని బోధించడానికి దేవుడు నాకు పరిస్థితులను అనుకూలపరచాలని ప్రార్ధించండి. ఈ వాక్కు కారణంగానే నేను సంకెళ్ళ పాలయ్యాను. 4నేను బోధించాల్సిన విధంగా, స్పష్టంగా బోధించాలని నా కోసం ప్రార్ధించండి. 5సంఘానికి బయట ఉన్నవారి విషయంలో జ్ఞానంతో మెలగండి. సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. 6మీ మాటలు ఎప్పుడూ కృపాసహితంగా ఉండాలి. మీ సంభాషణ ఉప్పు వేసినట్టు రుచిగా ఉండేలా చూసుకోండి. ఆ విధంగా మీరు ఎవరికి ఎలా జవాబివ్వాలో తెలుసుకోగలుగుతారు. 7ప్రియమైన సోదరుడూ నమ్మకమైన సేవకుడూ ప్రభువులో నా సహదాసుడూ అయిన తుకికు నా సంగతులన్నీ మీకు చెబుతాడు. 8ప్రత్యేకించి మీకు మా విషయాలు తెలియజేయడానికీ మీ హృదయాలను ప్రోత్సహించడానికీ ఇతణ్ణి పంపిస్తున్నాను. 9ఇతనితో కూడా మీ ఊరివాడు, నమ్మకమైన ప్రియ సోదరుడు ఒనేసిమును మీ దగ్గరికి పంపుతున్నాను. వీరు ఇక్కడి సంగతులన్నీ మీకు తెలియపరుస్తారు.

సువార్త

లూకా 9:7–11

7జరుగుతున్నవన్నీ రాష్ట్రపాలకుడు హేరోదు విని కలవరపడ్డాడు. ఎందుకంటే ఆయన గురించి కొందరు ‘యోహాను చనిపోయి లేచాడు’ అనీ, 8మరి కొందరు ‘ఏలీయా కనిపించాడు’ అనీ, ఇంకొంతమంది ‘పూర్వకాలంలో నివసించిన ప్రవక్త ఒకరు లేచాడు’ అనీ చెప్పుకుంటూ ఉన్నారు. 9అప్పుడు హేరోదు ‘నేను యోహాను తల తీయించాను కదా. మరి ఎవరిని గురించి ఈ సంగతులు అంటున్నారో’ అనుకుని ఆయనను చూడాలనుకున్నాడు. 10అపొస్తలులు తిరిగి వచ్చి, తాము చేసినవన్నీ ఆయనకు తెలియజేశారు. అప్పుడు ఆయన వారిని వెంట బెట్టుకుని బేత్సయిదా అనే ఊరికి ఏకాంతంగా వెళ్ళాడు. 11జన సమూహాలు అది తెలుసుకుని ఆయనను అనుసరించారు. ఆయన వారిని రానిచ్చి, దేవుని రాజ్యం గురించి వారికి బోధిస్తూ రోగులను బాగుచేశాడు.

సువార్త (శతాధిపతి పరిశుద్ధ లోంగినస్ కోసం)

మత్తయి 27:33–54

33వారు, “కపాల స్థలం” అని అర్థమిచ్చే ‘గొల్గొతా’ అనే చోటికి వచ్చారు. 34అక్కడ చేదు కలిపిన ద్రాక్షారసాన్ని తాగడానికి ఆయనకు అందించారు గాని ఆయన దాన్ని రుచి చూసి తాగలేక నిరాకరించాడు. 35వారు ఆయనను సిలువ వేసిన తరవాత చీట్లు వేసి ఆయన బట్టలు పంచుకున్నారు. 36అక్కడే ఆయనకు కావలిగా కూర్చున్నారు. 37“ఇతడు యూదుల రాజైన యేసు’’ అని ఆయన మీద మోపిన నేరం రాసి ఉన్న ప్రకటన ఒకటి ఆయన తలకు పైన ఉంచారు. 38ఆయన కుడి వైపున ఒకడు, ఎడమ వైపున ఒకడు ఇద్దరు బందిపోటు దొంగలను కూడా సిలువవేశారు. 39ఆ దారిన వెళ్ళేవారు తలలూపుతూ, 40“దేవాలయాన్ని పడగొట్టి మూడు రోజుల్లో కట్టేవాడా, నిన్ను నీవే రక్షించుకో. నీవు దేవుని కుమారుడివైతే సిలువ మీద నుండి దిగిరా!” అంటూ ఆయనను తిట్టారు. 41అలాగే ధర్మశాస్త్ర పండితులూ, పెద్దలూ, ప్రధాన యాజకులూ ఆయనను వెక్కిరిస్తూ, 42“ఇతడు ఇతరులను రక్షించాడు గానీ తనను రక్షించుకోలేడు. ఇశ్రాయేలు రాజు గదా, అతడిప్పుడు సిలువ మీద నుండి దిగి వస్తే అతణ్ణి నమ్ముతాం. 43ఇతడు దేవునిలో విశ్వాసం ఉన్నవాడు గదా, తాను దేవుని కుమారుణ్ణి అని చెప్పాడు గదా. కాబట్టి ఆయనకిష్టమైతే దేవుడే ఇతన్ని తప్పిస్తాడు” అని హేళనగా మాట్లాడారు. 44ఆయనతోబాటు సిలువ వేసిన దోపిడీ దొంగలు కూడా ఆయనను అలాగే నిందించారు. 45మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి మూడు గంటల వరకూ దేశమంతా చీకటి కమ్మింది. 46సుమారు మూడు గంటలప్పుడు యేసు, “ఏలీ, ఏలీ, లామా సబక్తానీ” అని పెద్దగా కేక వేశాడు. ఆ మాటకు, “నా దేవా, నా దేవా, నా చెయ్యి ఎందుకు విడిచిపెట్టావు?” అని అర్థం. 47అక్కడ నిలబడిన వారిలో కొందరు ఆ మాట విని, “అతడు ఏలీయాను పిలుస్తున్నాడు” అన్నారు. 48వెంటనే వారిలో ఒకడు పరిగెత్తుకుంటూ వెళ్ళి, స్పాంజ్ తెచ్చి పులిసిన ద్రాక్షరసంలో ముంచి, రెల్లు కర్రకు తగిలించి ఆయనకు తాగడానికి అందించాడు. 49మిగిలిన వారు, “ఉండండి, ఏలీయా వచ్చి ఇతణ్ణి రక్షిస్తాడేమో చూద్దాం” అన్నారు. 50యేసు మళ్ళీ పెద్దగా కేక వేసి ప్రాణం విడిచాడు. 51అప్పుడు దేవాలయంలోని తెర పైనుండి కింది వరకూ రెండుగా చినిగింది. భూమి కంపించింది, బండలు బద్దలయ్యాయి. 52సమాధులు తెరుచుకున్నాయి. కన్ను మూసిన అనేక మంది పరిశుద్ధుల శరీరాలు సజీవంగా లేచాయి. 53వారు సమాధుల్లో నుండి బయటికి వచ్చి ఆయన పునరుత్థానం చెందిన తరువాత పవిత్ర నగరంలో ప్రవేశించి చాలామందికి కనిపించారు. 54రోమా శతాధిపతి, అతనితో యేసుకు కావలి ఉన్నవారు, భూకంపాన్ని, జరిగిన సంఘటనలను చూసి చాలా భయపడ్డారు. “ఈయన నిజంగా దేవుని కుమారుడే” అని వారు చెప్పుకున్నారు.

తేదీలు రష్యన్ సంఘపు జూలియన్ కాలెండర్‌ను అనుసరిస్తాయి (సెర్బియన్, జార్జియన్ సంఘాలు, ఆథోస్ పర్వతం లాగే): సంఘ కాలెండర్‌లోని 16 అక్టోబర్ పౌర కాలెండర్‌లో 29 అక్టోబర్. కొత్త కాలెండర్‌ను అనుసరించే సంఘాలు (గ్రీసు, రొమేనియా, బల్గేరియా, ఉక్రెయిన్…) స్థిర పండుగలనూ పరిశుద్ధులనూ పౌర తేదీనే, 13 రోజులు ముందుగా జరుపుకుంటాయి, వాటి కొన్ని పఠనాలు వేరుగా ఉంటాయి; ఈస్టర్, దానిపై ఆధారపడిన రోజులు ఒకటే.

మూలాలు: ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు · © 2017, 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings, the editors' parts and stage directions in the Song of Songs and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · మూలాలు మరియు హక్కులు