Bible Explorer యాప్ పొందండి

హోమ్ › రోజువారీ బైబిల్ పఠనాలు › డిసెంబర్ 2027 › 8 డిసెంబర్

ఆర్థడాక్స్ కాలెండర్ · నవంబర్ 25 (పాత శైలి)

ఆర్థడాక్స్ రోజువారీ పఠనాలు — 8 డిసెంబర్, 2027

బుధవారం · పెంతెకొస్తు తర్వాత 25వ వారం · స్వరం 7

పండుగలు మరియు పరిశుద్ధులు

Apodosis of the Entry of the Theotokos

క్రీస్తు జనన ఉపవాసం

ఉపవాసం: నూనె లేకుండా వండిన ఆహారం

ఇది సన్యాస నియమాన్ని అనుసరిస్తుంది. సంఘంలో ఉపవాస పరిమాణాన్ని ఆరోగ్యం, వయస్సు మరియు పరిస్థితుల ప్రకారం తమ ఆత్మీయ గురువుతో కలిసి నిర్ణయిస్తారు.

ఈరోజు పఠనాలు

పత్రిక

2 తెస్స 2:1–12

1సోదరులారా, ఇకపోతే ప్రసాదించే కృప మూలంగా మన ప్రభువైన యేసు క్రీస్తు రాక గురించీ, మనమంతా ఆయన దగ్గర సమకూడడం గురించీ ఒక విన్నపం. 2క్రీస్తు రాక జరిగిపోయిందని ఎవరైనా తనకు ఆత్మ వెల్లడించాడని గానీ, ఒక మనిషి మాట చేత గానీ, లేదా మేము రాసినట్టుగా ఏదైనా ఉత్తరం చేత గానీ మీకు తెలిస్తే తొందరపడి యేసు ప్రభువు వచ్చేశాడని నమ్మి మీ మనసుల్లో కలవరపడవద్దని మిమ్మల్ని బతిమాలుతున్నాను. 3ఏ విధంగానూ ఎవరూ మిమ్మల్ని మోసం చేయకుండా చూసుకోండి. మొదట అనేకమంది దేవునిపై తిరుగుబాటు చెయ్యాలి. వారు దేవునికి వ్యతిరేకంగా ఘోర పాపం జరిగించే ఒకణ్ణి అంగీకరించి వాడికి లోబడతారు. వీడే నాశన పుత్రుడు. వీడు బయట పడేంతవరకూ ఆ రోజు రాదు. 4వీడు దేవుడు అనబడే ప్రతి దానినీ, లేక పూజలందుకునే ప్రతి దానినీ ధిక్కరిస్తాడు. దానంతటికీ పైగా తనను హెచ్చించుకుంటాడు. తానే దేవుడినని చూపించుకుంటూ దేవుని ఆలయంలో తిష్ట వేస్తాడు. 5మీ దగ్గర నేను ఉన్నప్పుడు ఈ విషయాలను గూర్చి మీకు చెప్పింది జ్ఞాపకం లేదా? 6వాడు సరైన సమయంలో బయట పడతాడు. వాడిని ఇప్పుడు బయట పడకుండా అడ్డగిస్తున్నది ఏదో మీకు తెలుసు. 7అక్రమ పురుషుడి మర్మం ఇప్పటికే పని చేస్తూ ఉంది. ఇప్పటి వరకూ దాన్ని అడ్డుకొనే వాణ్ణి దేవుడు తొలగించే వరకే అడ్డగిస్తాడు. 8అప్పుడు ఆ అక్రమ పురుషుడు బయటపడతాడు. ప్రభు యేసు తన నోటి శ్వాస చేత వాణ్ణి సంహరిస్తాడు. తన ఆగమన తేజస్సుతో నాశనం చేస్తాడు. 9సాతాను సమస్త శక్తీ, వాడి కపట సూచక క్రియల, అద్భుతాల ద్వారా అక్రమ పురుషుడు బయట పడతాడు. నశిస్తున్న వారి మధ్య నీతి రాహిత్యమైన అన్ని మోసాలతో వాడు తనను వెల్లడి చేసుకుంటాడు. 10ఎందుకంటే వారు రక్షణ పొందేలా సత్యాన్ని ప్రేమించలేదు, అంగీకరించలేదు. 11ఈ కారణం చేత సత్యాన్ని నమ్మకుండా అక్రమంలోనే సంతోషించే వారిని శిక్షించడానికి 12అబద్ధాన్ని నమ్మేలా భ్రమింపజేసే దాన్ని దేవుడు వారి మధ్యకు పంపిస్తున్నాడు.

పత్రిక (దైవజనని కోసం)

హెబ్రీ 9:1–7

1మొదటి ఒప్పందానికి కూడా భూమి మీద ఒక ఆరాధనా స్థలమూ, ఆరాధనకు సంబంధించిన నియమాలూ ఉన్నాయి. 2ఇది ఎలాగంటే, ప్రత్యక్ష గుడారంలో ఒక గదిని సిద్ధం చేశారు. ఇది వెలుపలి గది. దీనిలో ఒక బల్ల, సన్నిధిలో ఉంచే రొట్టెలు ఉంచారు. దీనినే పరిశుద్ధ స్థలం అని పిలిచారు. 3ఇక రెండవ తెర వెనుక మరో గది ఉంది. దీన్ని అతి పరిశుద్ధ స్థలం అని పిలిచారు. 4అందులో బంగారంతో చేసిన సాంబ్రాణి పళ్ళెం ఉంది. ఇక్కడ ఇంకా, బంగారం తొడుగు ఉన్న నిబంధన మందసం కూడా ఉంది. ఆ పెట్టెలో ఒక బంగారు పాత్ర, ఆ పాత్రలో మన్నా ఉంది. ఇంకా ఆ పెట్టెలో చిగిరించిన అహరోను కర్ర, నిబంధనకు సంబంధించిన రెండు రాతి పలకలు ఉన్నాయి. 5“కరుణా పీఠం” అని పిలిచే మందసం మూతను కప్పుతూ తేజస్సుతో నిండిన కెరూబుల ఆకృతులున్నాయి. వాటిని గూర్చి ఇప్పుడు వివరించడం సాధ్యం కాదు. 6వీటన్నిటినీ సిద్ధం చేశాక యాజకులు క్రమం తప్పకుండా ప్రత్యక్ష గుడారంలోని వెలుపలి గదిలోకి ప్రవేశించి తమ సేవలు చేస్తారు. 7కానీ ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే లోపలి రెండవ గదిలో ప్రవేశిస్తాడు. అయితే అలా ప్రవేశించడానికి ముందు తానూ, తన ప్రజలూ తెలియక చేసిన దోషాల కోసం బలి అర్పించి ఆ రక్తాన్ని చేతబట్టుకోకుండా ప్రవేశించడు.

సువార్త

లూకా 18:15–17, 26–30

15తమ పసి పాపల మీద యేసు తన చేతులుంచాలని కొందరు వారిని ఆయన దగ్గరికి తీసుకువచ్చారు. ఆయన శిష్యులు అది చూసి ఆ తీసుకువచ్చిన వారిని అదిలించారు. 16అయితే యేసు వారిని తన దగ్గరికి పిలిపించాడు. “పిల్లలను నా దగ్గరికి రానివ్వండి. వారిని ఆటంకపెట్టవద్దు. ఎందుకంటే దేవుని రాజ్యం ఇలాటి వారిదే. 17చిన్న పిల్లల్లాగా దేవుని రాజ్యాన్ని స్వీకరించని వాడు దానిలో ఎంత మాత్రమూ ప్రవేశించడని మీతో కచ్చితంగా చెబుతున్నాను” అన్నాడు. 26ఇది విన్న వారు, “అలాగైతే ఎవరు రక్షణ పొందగలరు?” అని అడిగారు 27అందుకు ఆయన, “మనుష్యులకు అసాధ్యమైనవి దేవునికి సాధ్యమే” అని చెప్పాడు. 28అప్పుడు పేతురు ఇలా అన్నాడు, “చూడు, మేము అన్నీ వదులుకుని నిన్ను అనుసరించాం.” 29అందుకు ఆయన, “దేవుని రాజ్యం కోసం ఎవరైనా తన ఇంటినైనా, భార్య నైనా, అన్నదమ్ములనైనా, తల్లిదండ్రులనైనా, పిల్లలనైనా వదులుకుంటే అతనికి, 30ఈ లోకంలో ఎన్నో రెట్లు, రాబోయే లోకంలో నిత్య జీవం కలుగుతాయని మీకు కచ్చితంగా చెబుతున్నాను” అన్నాడు.

సువార్త (దైవజనని కోసం)

లూకా 10:38–42; 11:27–28

38వారు ప్రయాణమై వెళ్తూ ఉన్నప్పుడు ఆయన ఒక గ్రామంలో ప్రవేశించాడు. అక్కడ మార్త అనే ఒక స్త్రీ ఆయనను తన ఇంట్లోకి ఆహ్వానించింది. 39ఆమెకు మరియ అనే సోదరి ఉంది. ఈమె యేసు పాదాల దగ్గర కూర్చుని ఆయన ఉపదేశం వింటూ ఉంది. 40మార్త ఎన్నో పనులు పెట్టుకుని తొందరపడుతూ ఆయన దగ్గరికి వచ్చి, “ప్రభూ, నా సోదరి నన్ను విడిచి ఇక్కడ కూర్చుంది, ఒక్కదాన్నే పనులన్నీ చేసుకోవలసి వస్తున్నది. నీకేం పట్టదా? వచ్చి నాకు సాయం చేయమని ఆమెకు చెప్పు” అంది. 41అందుకు ప్రభువు, “మార్తా, మార్తా, నువ్వు బోలెడన్ని పనులను గురించి తొందర పడుతున్నావు. కానీ అవసరమైంది ఒక్కటే. 42మరియ ఉత్తమమైన దాన్ని ఎంచుకుంది. దాన్ని ఆమె దగ్గరనుంచి తీసివేయడం జరగదు” అని ఆమెతో చెప్పాడు. 11:27ఆయన ఈ మాటలు చెబుతూ ఉండగా ఆ జన సమూహంలో ఉన్న ఒక స్త్రీ ఆయనను చూసి బిగ్గరగా, “నిన్ను మోసిన గర్భం, నువ్వు పాలు తాగిన స్తనాలూ ధన్యం” అని కేకలు వేసి చెప్పింది. 28దానికి ఆయన, “అది నిజమే కానీ దేవుని మాట విని దాని ప్రకారం జీవించేవారు ఇంకా ధన్యులు” అని చెప్పాడు.

తేదీలు రష్యన్ సంఘపు జూలియన్ కాలెండర్‌ను అనుసరిస్తాయి (సెర్బియన్, జార్జియన్ సంఘాలు, ఆథోస్ పర్వతం లాగే): సంఘ కాలెండర్‌లోని 25 నవంబర్ పౌర కాలెండర్‌లో 8 డిసెంబర్. కొత్త కాలెండర్‌ను అనుసరించే సంఘాలు (గ్రీసు, రొమేనియా, బల్గేరియా, ఉక్రెయిన్…) స్థిర పండుగలనూ పరిశుద్ధులనూ పౌర తేదీనే, 13 రోజులు ముందుగా జరుపుకుంటాయి, వాటి కొన్ని పఠనాలు వేరుగా ఉంటాయి; ఈస్టర్, దానిపై ఆధారపడిన రోజులు ఒకటే.

మూలాలు: ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు · © 2017, 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings, the editors' parts and stage directions in the Song of Songs and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · మూలాలు మరియు హక్కులు