Bible Explorer యాప్ పొందండి

హోమ్ › రోజువారీ బైబిల్ పఠనాలు › అక్టోబర్ 2027 › 16 అక్టోబర్

ఆర్థడాక్స్ కాలెండర్ · అక్టోబర్ 3 (పాత శైలి)

ఆర్థడాక్స్ రోజువారీ పఠనాలు — 16 అక్టోబర్, 2027

శనివారం · పెంతెకొస్తు తర్వాత 17వ వారం · స్వరం 7

పండుగలు మరియు పరిశుద్ధులు

Hieromartyr Dionysius the Areopagite, Bishop of Athens († 96)

ఉపవాసం

ఉపవాసం లేదు

ఇది సన్యాస నియమాన్ని అనుసరిస్తుంది. సంఘంలో ఉపవాస పరిమాణాన్ని ఆరోగ్యం, వయస్సు మరియు పరిస్థితుల ప్రకారం తమ ఆత్మీయ గురువుతో కలిసి నిర్ణయిస్తారు.

ఈరోజు పఠనాలు

పత్రిక

1 కొరింతీ 14:20–25

20సోదరులారా, ఆలోచనలో చిన్న పిల్లల్లాగా ఉండవద్దు. చెడు విషయంలో పసివారిలాగా ఉండండి గానీ ఆలోచించడంలో పరిణతి చెందినవారుగా ఉండండి. 21ధర్మశాస్త్రంలో ఇలా రాసి ఉంది, “తెలియని భాషలు మాట్లాడే ప్రజల ద్వారా, తెలియని మనుషుల పెదవుల ద్వారా, ఈ ప్రజలతో మాట్లాడతాను. అయినప్పటికీ వారు నా మాట వినరు అని ప్రభువు చెబుతున్నాడు.” 22కాబట్టి భాషలు విశ్వాసులకు కాదు, అవిశ్వాసులకే సూచన. దేవుడిచ్చిన సందేశాన్ని ప్రకటించడం అవిశ్వాసులకు కాదు, విశ్వాసులకే సూచన. 23సంఘమంతా ఒకేసారి తెలియని భాషలతో మాట్లాడుతున్నప్పుడు, బయటి వ్యక్తులు లేక అవిశ్వాసులు లోపలికి వచ్చి చూస్తే మిమ్మల్ని వెర్రివారు అని చెప్పుకొంటారు కదా? 24అయితే అందరూ దేవుడిచ్చిన సందేశాన్ని ప్రకటిస్తూ ఉంటే బయటి వ్యక్తి లేక అవిశ్వాసి లోపలికి వచ్చి చూస్తే మీ అందరి ఉపదేశం వలన తాను పాపినని గ్రహిస్తాడు, అందరి మూలంగా అతనికి ఒప్పుదల కలుగుతుంది. 25అప్పుడతని హృదయ రహస్యాలు బయలుపడతాయి. అప్పుడతడు సాగిలపడి దేవుణ్ణి ఆరాధించి, దేవుడు నిజంగా మీలో ఉన్నాడని ప్రకటిస్తాడు.

పత్రిక (అరియోపగీతు వాడైన పరిశుద్ధ దియొనూసియ కోసం)

అపొ.కా 17:16–34

16పౌలు ఏతెన్సులో వారి కోసం ఎదురుచూస్తున్నాడు. ఆ పట్టణం నిండా ఉన్న విగ్రహాలను గమనించి అతని ఆత్మ పరితపించింది. 17అందుచేత సమాజ మందిరంలో యూదులతోనూ దేవుణ్ణి ఆరాధించే వారితోనూ, వ్యాపార వీధుల్లో ప్రతి రోజూ వచ్చిపోయే వారితోనూ చర్చిస్తూ వచ్చాడు. 18ఎపికూరీయుల స్తోయికుల వర్గానికి చెందిన కొంతమంది తత్వవేత్తలు అతనితో వాదించారు. కొంతమంది, “ఈ వాగుడుకాయ చెప్పేది ఏమిటి” అని చెప్పుకున్నారు. అతడు యేసుని గూర్చీ, చనిపోయిన వారు తిరిగి బ్రతకడం గూర్చీ ప్రకటించాడు కాబట్టి మరి కొంత మంది, “ఇతడు మనకు తెలియని దేవుళ్ళను ప్రచారం చేస్తున్నాడు” అని చెప్పుకున్నారు. 19వారు అతనిని వెంటబెట్టుకుని అరియోపగు అనే సమాఖ్య దగ్గరికి తీసుకుపోయి, “నీవు చెబుతున్న ఈ కొత్త బోధ మేము తెలుసుకోవచ్చా? 20నీవు కొన్ని వింత విషయాలు మాకు వినిపిస్తున్నావు. అందుచేత వీటి అర్థమేంటో మాకు తెలుసుకోవాలని ఉంది” అని చెప్పారు. 21ఏతెన్సు ప్రజలూ, అక్కడ నివసించే విదేశీయులూ ఏదో ఒక కొత్త విషయం చెప్పడంలో, వినడంలో మాత్రమే తమ సమయాన్ని గడిపేవారు. 22పౌలు అరియోపగు సభనుద్దేశించి, “ఏతెన్సు వాసులారా, మీరు అన్ని విషయాల్లో చాలా మతభక్తి గలవారని నేను గమనిస్తున్నాను. 23నేను దారిన పోతుంటే మీరు పూజించే వాటిని చూశాను. అక్కడ ఒక బలిపీఠం నాకు కనబడింది. దాని మీద “తెలియని దేవునికి” అని రాసి ఉంది. కాబట్టి మీరు తెలియకుండా దేనిని ఆరాధిస్తున్నారో దానినే నేను మీకు తెలియజేస్తున్నాను. 24విశ్వాన్నీ, దానిలోని సమస్తాన్నీ చేసిన దేవుడు, తానే ఆకాశానికీ భూమికీ ప్రభువు కాబట్టి చేతులతో చేసిన ఆలయాల్లో నివసించడు. 25ఆయనే అందరికీ జీవాన్నీ ఊపిరినీ తక్కిన అన్నింటినీ దయచేసేవాడు. కాబట్టి తనకు ఏదో అక్కర ఉన్నట్టుగా మనుషులు చేతులతో చేసే సేవలు అందుకోడు. 26ఆయన ఒక్క మనిషి నుండి లోకమంతటిలో నివసించే అన్ని జాతుల మనుషులను చేసి, వారి కోసం కాలాలను నియమించాడు. నివసించే సరిహద్దులను ఏర్పరిచాడు. 27అందుచేత వారు దేవుణ్ణి వెతికి తమకై తాము ఆయనను కనుగొనాలి. వాస్తవానికి ఆయన మనలో ఎవరికీ దూరంగా ఉండేవాడు కాదు. ఎందుకంటే, 28మనం ఆయనలో బతుకుతున్నాం, ఆయనలోనే మన కదలికలూ ఉనికీ ఉన్నాయి. ‘మనమాయన సంతానం,’ అని మీ కవులు కూడా కొందరు చెప్పారు. 29కాబట్టి మనం దేవుని సంతానం గదా, దేవత్వం అనేది మనుషులు తమ ఆలోచనా నైపుణ్యాలతో చెక్కిన బంగారు, వెండి, రాతి బొమ్మలను పోలి ఉంటుందని అనుకోకూడదు. 30ఆ ఆజ్ఞాన కాలాలను దేవుడు చూసీ చూడనట్టుగా ఉన్నాడు. ఇప్పుడైతే మానవులందరూ అంతటా పశ్చాత్తాప పడాలని అందరికీ ఆజ్ఞాపిస్తున్నాడు. 31ఎందుకంటే తాను నియమించిన వ్యక్తితో నీతిని బట్టి లోకానికి తీర్పు తీర్చే ఒక రోజు నిర్ణయించాడు. మృతుల్లో నుండి ఆయనను లేపాడు కాబట్టి దీన్ని నమ్మడానికి అందరికీ ఆధారం కలగజేశాడు.” 32మృతులు చనిపోయి తిరిగి లేవడం గురించి ఎతెన్సు వారు విన్నప్పుడు కొంతమంది ఎగతాళి చేశారు. మరి కొంతమంది దీన్ని గురించి నీవు చెప్పేది మరొకసారి వింటామని చెప్పారు. 33ఆ తరువాత పౌలు వారి దగ్గర నుండి వెళ్ళిపోయాడు. 34అయితే కొంతమంది అతనితో చేరి విశ్వసించారు. వారిలో అరియోపగీతు వాడైన దియొనూసియ, దమరి అనే ఒక స్త్రీ, వీరితోబాటు మరి కొంతమంది కూడా ఉన్నారు.

సువార్త

లూకా 5:17–26

17ఒక రోజు ఆయన బోధిస్తున్నపుడు గలిలయ, యూదయ ప్రాంతాల్లోని చాలా ఊళ్ళ నుండీ యెరూషలేము నుండీ వచ్చిన పరిసయ్యులూ ధర్మశాస్త్రోపదేశకులూ అక్కడ కూర్చుని ఉన్నారు. స్వస్థపరచే ప్రభువు శక్తి ఆయనలో ఉంది. 18కొందరు మనుషులు పక్షవాత రోగిని పరుపు మీద మోసుకు వచ్చారు. అతణ్ణి లోపలికి తెచ్చి, ఆయన ముందు ఉంచాలని చూశారు గాని 19ప్రజలు కిక్కిరిసి ఉండడం చేత అతణ్ణి లోపలికి తేవడానికి వీలు కాలేదు. కాబట్టి, వారు ఇంటికప్పు మీదికెక్కి పెంకులు తీసి పరుపుతో పాటు రోగిని సరిగ్గా యేసు ముందే దింపారు. 20యేసు వారి విశ్వాసం చూసి, “అయ్యా, నీ పాపాలకు క్షమాపణ దొరికింది” అన్నాడు. 21శాస్త్రులూ పరిసయ్యులూ, “దేవదూషణ చేస్తున్న ఇతడు ఎవడు? దేవుడు తప్ప పాపాలు ఎవరు క్షమించగలరు?” అనుకున్నారు 22యేసు వారి ఆలోచన గ్రహించి, “మీరు మీ హృదయాల్లో అలా ఎందుకు ఆలోచిస్తున్నారు? 23ఏది సులభమంటారు? ‘నీ పాపాలు క్షమిస్తున్నాను’ అనడమా, ‘లేచి నడువు’ అనడమా? 24అయితే మనుష్యకుమారుడికి భూమి మీద పాపాలు క్షమించే అధికారం ఉందని మీరు తెలుసుకోవాలి” అన్నాడు. తరువాత పక్షవాత రోగిని చూసి, “లేచి, నీ పరుపు తీసుకుని ఇంటికి వెళ్ళు” అన్నాడు. 25వెంటనే వాడు వారి ముందే లేచి నిలబడి, తాను పడుకున్న పరుపు ఎత్తుకుని, దేవుణ్ణి స్తుతిస్తూ తన ఇంటికి వెళ్ళాడు. 26అందరూ విస్మయం చెంది, “ఈ రోజు విచిత్రమైన విషయాలు చూశాం” అని దేవుణ్ణి స్తుతిస్తూ భయంతో నిండిపోయారు.

తేదీలు రష్యన్ సంఘపు జూలియన్ కాలెండర్‌ను అనుసరిస్తాయి (సెర్బియన్, జార్జియన్ సంఘాలు, ఆథోస్ పర్వతం లాగే): సంఘ కాలెండర్‌లోని 3 అక్టోబర్ పౌర కాలెండర్‌లో 16 అక్టోబర్. కొత్త కాలెండర్‌ను అనుసరించే సంఘాలు (గ్రీసు, రొమేనియా, బల్గేరియా, ఉక్రెయిన్…) స్థిర పండుగలనూ పరిశుద్ధులనూ పౌర తేదీనే, 13 రోజులు ముందుగా జరుపుకుంటాయి, వాటి కొన్ని పఠనాలు వేరుగా ఉంటాయి; ఈస్టర్, దానిపై ఆధారపడిన రోజులు ఒకటే.

మూలాలు: ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు · © 2017, 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings, the editors' parts and stage directions in the Song of Songs and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · మూలాలు మరియు హక్కులు