హోమ్ › రోజువారీ బైబిల్ పఠనాలు › ఆగస్టు 2027 › 30 ఆగస్టు
కాథలిక్ కాలెండర్
రోజువారీ బైబిల్ పఠనాలు (కాథలిక్) — 30 ఆగస్టు, 2027
సోమవారం · సామాన్య కాలం 22వ వారం
పండుగలు మరియు పరిశుద్ధులు
సామాన్య కాలం 22వ వారపు సోమవారం
వారపు రోజు · ఆరాధన రంగు: ఆకుపచ్చ
ఈరోజు పఠనాలు
మొదటి పఠనం
13సోదరులారా, కన్నుమూసిన మన సహ విశ్వాసులకు ఏమి జరుగుతుందో మీరు అపార్థం చేసుకోకూడదని కోరుతున్నాము. మీరు అవిశ్వాసుల్లాగా దుఃఖపడకూడదు. చనిపోయిన వారు తిరిగి బ్రతుకుతారని ఆశాభావం లేనివారు చనిపోయిన వారి గురించి వారు తీవ్ర వేదన పడతారు. 14యేసు చనిపోయి తిరిగి సజీవుడిగా లేచాడని మనం నమ్ముతున్నాం కదా. అలానే యేసులో చనిపోయిన వారిని దేవుడు ఆయనతో కూడా తీసుకుని వస్తాడు. 15మేము ప్రభువు మాట ప్రకారం మీకు చెప్పేదేమిటంటే ప్రభువు తిరిగి వచ్చేంత వరకూ బ్రతికి ఉండే మనం కన్నుమూసిన వారి కంటే ముందే ఆయనను చేరుకోము. 16ఆజ్ఞాపూర్వకమైన పిలుపుతో ప్రధాన దూత చేసే గొప్ప శబ్దంతో దేవుని బాకా ధ్వనితో పరలోకం నుండి ప్రభువు తానే దిగి వస్తాడు. క్రీస్తును నమ్మి చనిపోయిన వారు మొదటగా లేస్తారు. 17ఆ తరవాత బతికి ఉండే మనలను కూడా వారితోబాటు ఆకాశమండలంలో ప్రభువును ఎదుర్కోడానికి మేఘాలపై తీసుకు వెళ్ళడం జరుగుతుంది. ఆ తరువాత మనం నిరంతరం ప్రభువుతో కూడా ఉంటాం.
ప్రతిస్పందన కీర్తన
1యెహోవాకు ఒక కొత్త పాట పాడండి, ప్రపంచమంతా యెహోవాకు పాడండి. 3రాజ్యాల్లో ఆయన గొప్పదనాన్ని తెలియచేయండి, ప్రపంచ దేశాల్లో ఆయన అద్భుతాలను వివరించండి. 4యెహోవా గొప్పవాడు. ఆయన్ని మెండుగా ప్రస్తుతించాలి. దేవుళ్ళందరికంటె ఎక్కువగా ఆయనపై భయభక్తులు నిలపాలి. 5జాతుల దేవుళ్ళంతా వట్టి విగ్రహాలే. అయితే ఆకాశాలను చేసింది యెహోవా. 11యెహోవా రాబోతున్నాడు. ఆకాశం సంతోషించు గాక. భూమి ఆనందించు గాక. సముద్రం, దానిలో ఉన్నదంతా ఆనందంతో ఘోషించు గాక. 12మైదానాలు, వాటిలో ఉన్నదంతా ఆనందించు గాక. అడవి చెట్లన్నీ ఉత్సాహంతో కేకలు వేస్తాయి గాక 13లోకానికి తీర్పు తీర్చడానికి ఆయన వస్తున్నాడు. నీతితో ఆయన లోకానికి తన విశ్వసనీయతతో ప్రజా సమూహాలకు ఆయన తీర్పు తీరుస్తాడు.
సువార్త
16ఒక రోజు తాను పెరిగిన నజరేతుకు ఆయన వచ్చాడు. తన అలవాటు ప్రకారం విశ్రాంతి దినాన సమాజ మందిరానికి వెళ్ళి చదవడానికి నిలబడ్డాడు. 17యెషయా ప్రవక్త గ్రంథం వారు ఆయనకు అందించారు. ఆయన గ్రంథం విప్పితే, 18“ప్రభువు ఆత్మ నా మీద ఉన్నాడు. పేదలకు సువార్త ప్రకటించడానికి ఆయన నన్ను అభిషేకించాడు. చెరలో ఉన్న వారికి స్వేచ్ఛ, గుడ్డివారికి చూపు వస్తుందని ప్రకటించడానికీ అణగారిన వారిని విడిపించడానికీ, 19ప్రభువు అనుగ్రహ సంవత్సరం ప్రకటించడానికీ ఆయన నన్ను పంపాడు” అని రాసిన చోటు ఆయనకు దొరికింది. 20ఆయన గ్రంథం మూసి సమాజ మందిర పరిచారకునికి ఇచ్చి కూర్చున్నాడు. 21సమాజ మందిరంలో ఉన్న వారంతా ఆయనను తేరి చూశారు. “మీరు వింటూ ఉండగానే ఈ లేఖనం నెరవేరింది” అని ఆయన వారితో అన్నాడు. 22అందరూ ఆయనను గురించి గొప్పగా చెప్పుకున్నారు. ఆయన నోటి నుంచి వచ్చే దయాపూరితమైన మాటలకు ఆశ్చర్యపడ్డారు. “ఈయన యోసేపు కొడుకు గదా?” అని చెప్పుకున్నారు. 23ఆయన వారితో, “వైద్యుడా, నిన్ను నీవే బాగు చేసుకో” అనే సామెత నాకు చెప్పి, కపెర్నహూములో నీవు చేసిన వాటన్నిటినీ మేము విన్నాం, వాటిని ఈ నీ సొంత ఊరులో కూడా చేయమని మీరు తప్పకుండా నాతో అంటారు” అన్నాడు. 24ఆయన ఇంకా ఇలా అన్నాడు, “ఏ ప్రవక్తనూ తన సొంత ఊరి వారు అంగీకరించరు. 25ఏలీయా ప్రవక్త రోజుల్లో ఇశ్రాయేలు దేశంలో చాలామంది వితంతువులు ఉన్నారు. మూడున్నర సంవత్సరాలు ఆకాశం మూసుకుపోయి దేశమంతా తీవ్రమైన కరువు రాగా, 26దేవుడు ఏలీయాను ఎవరి దగ్గరకీ పంపలేదు. సీదోను ప్రాంతంలో సారెపతు అనే ఊరిలో ఉన్న ఒక వితంతువు దగ్గరకే పంపాడు. 27ఎలీషా ప్రవక్త కాలంలో ఇశ్రాయేలులో ఎందరో కుష్టురోగులున్నా, సిరియా వాడైన నయమాను తప్ప ఎవరూ బాగుపడలేదు.” 28సమాజ మందిరంలో ఉన్నవారంతా ఆ మాటలు విని 29ఆగ్రహంతో నిండిపోయి, లేచి ఆయనను ఊరి బయటకు తోసుకుపోయి కొండ కొమ్ము వరకూ తీసికెళ్ళారు. వారి ఊరు కొండ పైన ఉంది. ఆయనను అక్కడ నుండి పడదోయాలనుకున్నారు. 30అయితే ఆయన వారి మధ్యనుంచి తప్పుకుని తన దారిన వెళ్ళిపోయాడు.
సాధారణ రోమన్ కాలెండర్; ఒక బిషప్‌ల సమావేశం కొన్ని పండుగలను (దివ్యదర్శనం, పరలోకారోహణం, క్రీస్తు శరీర రక్తాల పండుగ) ఒక ఆదివారానికి మార్చవచ్చు లేదా తన సొంత పండుగలను జోడించవచ్చు. పఠన గ్రంథం: ఆదివారపు చక్రం B, వారపు రోజుల సంవత్సరం I.
మూలాలు: ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు · © 2017, 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings, the editors' parts and stage directions in the Song of Songs and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · మూలాలు మరియు హక్కులు