Bible Explorer యాప్ పొందండి

హోమ్ › రోజువారీ బైబిల్ పఠనాలు › మే 2027 › 21 మే

ఆర్థడాక్స్ కాలెండర్ · మే 8 (పాత శైలి)

ఆర్థడాక్స్ రోజువారీ పఠనాలు — 21 మే, 2027

శుక్రవారం · పాస్కా మూడవ వారం · స్వరం 2

పండుగలు మరియు పరిశుద్ధులు

Holy Apostle and Evangelist John the Theologian († 98-117)

ఉపవాస దినం

చేపలు అనుమతి

ఇది సన్యాస నియమాన్ని అనుసరిస్తుంది. సంఘంలో ఉపవాస పరిమాణాన్ని ఆరోగ్యం, వయస్సు మరియు పరిస్థితుల ప్రకారం తమ ఆత్మీయ గురువుతో కలిసి నిర్ణయిస్తారు.

ఈరోజు పఠనాలు

సాయంకాల ప్రార్థన: పఠనం

1 యోహా 3:21–4:6

21ప్రియులారా, మన హృదయం మనపై నింద మోపకపోతే, దేవుని దగ్గర ధైర్యంగా ఉంటాం. 22అప్పుడు, ఆయన ఆజ్ఞలు పాటిస్తూ, ఆయన దృష్టికి ఇష్టమైనవి చేస్తూ ఉండడం వల్ల, మనం ఏది అడిగినా, అది ఆయన దగ్గర నుండి పొందుతాం. 23ఇదే ఆయన ఆజ్ఞ: ఆయన కుమారుడు యేసు క్రీస్తు నామంలో విశ్వాసం ఉంచాలి. ఆయన ఆజ్ఞ ప్రకారం ఒకరిని ఒకరు ప్రేమించుకోవాలి. 24దేవుని ఆజ్ఞలు పాటించే వాడు ఆయనలో నిలిచి ఉంటాడు. దేవుడు అతనిలో నిలిచి ఉంటాడు. ఆయన మనకిచ్చిన ఆత్మ ద్వారా ఆయన మనలో నిలిచి ఉన్నాడని మనకు తెలుసు. 4:1ప్రియులారా, లోకంలో చాలామంది అబద్ధ ప్రవక్తలు బయలుదేరారు. ప్రతి ఆత్మనూ నమ్మకండి. ఆ ఆత్మలు దేవునికి సంబంధించినవో, కావో, పరీక్షించి చూడండి. 2ఏ ఆత్మైనా దేవునికి చెందినదా లేదా అన్న విషయాన్ని ఈ విధంగా గుర్తించగలుగుతాము. యేసు క్రీస్తు మానవునిగా వచ్చాడు అని అంగీకరించే ప్రతి ఆత్మా దేవునికి చెందినది. 3యేసును అంగీకరించని ప్రతి ఆత్మా దేవుని నుండి వచ్చింది కాదు. అది క్రీస్తు విరోధికి చెందిన ఆత్మ. అది రాబోతున్నదని మీరు విన్నారు. కానీ అది ఇప్పటికే ఈ లోకంలో ఉంది. 4పిల్లలూ, మీరు దేవుని సంబంధులు. మీరు ఆ ఆత్మలను జయించారు. ఎందుకంటే, మీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడికన్నా గొప్పవాడు. 5ఆ ఆత్మలు లోకానికి చెందినవారు కాబట్టి వారు చెప్పేది లోక సంబంధంగా ఉంటుంది. లోకం వారి మాట వింటుంది. 6మనం దేవుని సంబంధులం. దేవుణ్ణి తెలుసుకున్నవాడు మన మాట వింటాడు. దేవుని సంబంధి కానివాడు మన మాట వినడు. దీన్ని బట్టి ఏ ఆత్మ సత్యమైనదో, ఏ ఆత్మ అసత్యమైనదో మనం తెలుసుకుంటాం.

సాయంకాల ప్రార్థన: పఠనం

1 యోహా 4:11–16

11ప్రియులారా, దేవుడు మనలను ఇంతగా ప్రేమించాడు కాబట్టి మనం కూడా ఒకరిని ఒకరు ప్రేమించుకోవాలి. 12ఎవ్వరూ, ఎన్నడూ, దేవుణ్ణి చూడలేదు. మనం ఒకరిని ఒకరు ప్రేమించుకుంటే, దేవుడు మనలో నిలిచి ఉంటాడు. ఆయన ప్రేమ మనలో సంపూర్ణం అవుతుంది. 13దీనివలన మనం ఆయనలో నిలిచి ఉన్నామనీ, ఆయన మనలో నిలిచి ఉన్నాడనీ తెలుసుకుంటాము. ఎందుకంటే, ఆయన తన ఆత్మను మనకిచ్చాడు. 14తండ్రి తన కుమారుణ్ణి ఈ లోక రక్షకుడుగా పంపించడం మేము చూశాము. దానికి మేము సాక్షులం. 15యేసు దేవుని కుమారుడని ఎవరు అంగీకరిస్తారో అతనిలో దేవుడు నిలిచి ఉంటాడు. అతడు దేవునిలో నిలిచి ఉంటాడు. 16దేవునికి మనపై ఉన్న ప్రేమను మనం తెలుసుకుని విశ్వసించాము. దేవుడు ప్రేమ. ప్రేమలో నిలిచి ఉన్నవాడు దేవునిలో నిలిచి ఉంటాడు. దేవుడు అతనిలో నిలిచి ఉంటాడు.

సాయంకాల ప్రార్థన: పఠనం

1 యోహా 4:20–5:5

20“నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను” అని చెబుతూ, తన సోదరుణ్ణి ద్వేషిస్తే, అతడు అబద్ధికుడే. కనిపిస్తున్న సోదరుణ్ణి ప్రేమించని వాడు, కనిపించని దేవుణ్ణి ప్రేమించలేడు. 21దేవుణ్ణి ప్రేమించేవాడు తన సోదరుణ్ణి కూడా ప్రేమించాలి, అన్న ఆజ్ఞ ఆయన నుండి మనకు ఉంది. 5:1యేసే క్రీస్తు అని నమ్మినవారంతా దేవుని ద్వారా పుట్టినవాళ్ళే. తండ్రిగా అయిన వాణ్ణి ప్రేమించిన వారంతా ఆయన ద్వారా పుట్టినవాణ్ణి కూడా ప్రేమిస్తారు. 2మనం దేవుణ్ణి ప్రేమిస్తూ, ఆయన ఆజ్ఞలను పాటిస్తూ ఉంటే, దేవుని పిల్లలను ప్రేమిస్తున్నామని దాని వల్ల మనకు తెలుసు. 3ఆయన ఆజ్ఞలను పాటిస్తే మనం దేవుణ్ణి ప్రేమించినట్టే. ఆయన ఆజ్ఞలు భారం కాదు. 4దేవుని ద్వారా పుట్టినవారు అందరూ లోకాన్ని జయిస్తారు. లోకాన్ని జయించింది మన విశ్వాసమే. 5లోకాన్ని జయించేది ఎవరు? యేసు దేవుని కుమారుడు అని నమ్మినవాడే!

ఉదయ ప్రార్థన: సువార్త

యోహా 21:15–25

15వారంతా భోజనం చేసిన తరువాత యేసు సీమోను పేతురును చూసి, “యోహాను కొడుకువైన సీమోనూ, వీళ్ళకంటే నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా?” అని ప్రశ్నించాడు. అతడు, “అవును ప్రభూ, నేను నిన్ను ప్రేమిస్తున్నానని నీకే తెలుసు” అన్నాడు. దానికి యేసు, “నా గొర్రెలను మేపు” అని అతనితో చెప్పాడు. 16మరోసారి ఆయన, “యోహాను కొడుకువైన సీమోనూ, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా?” అని అతణ్ణి అడిగాడు. అతడు, “అవును ప్రభూ, నేను నిన్ను ప్రేమిస్తున్నానని నీకే తెలుసు” అన్నాడు. దానికి యేసు, “నా గొర్రెలకు కాపరిగా ఉండు” అన్నాడు. 17ఆయన మూడోసారి, “యోహాను కొడుకువైన సీమోనూ, నన్ను ప్రేమిస్తున్నావా?” అని అడిగాడు. ఇలా ‘నన్ను ప్రేమిస్తున్నావా’ అని మూడోసారి తనను అడిగినందుకు పేతురు ఇబ్బంది పడి, “ప్రభూ నీకు అన్నీ తెలుసు. నిన్ను ప్రేమిస్తున్నానని నీకు బాగా తెలుసు” అన్నాడు. అప్పుడు యేసు, “నా గొర్రెలను మేపు. 18నువ్వు యువకుడిగా ఉన్నప్పుడు నీ అంతట నువ్వే నీ నడుం కట్టుకుని నీకిష్టమైన స్థలాలకు తిరిగే వాడివి. కచ్చితంగా నీకు చెబుతున్నాను. నువ్వు ముసలి వాడివి అయినప్పుడు నువ్వు నీ చేతులు చాపుతావు. వేరొకడు నీ నడుము కట్టి నీకిష్టం లేని చోటికి నిన్ను మోసుకు పోతాడు” అని అతనితో చెప్పాడు. 19దేవుని మహిమ కోసం అతడు ఎలాంటి మరణం పొందుతాడో దాన్ని సూచిస్తూ ఆయన ఈ మాటలు చెప్పాడు. ఇలా చెప్పి ఆయన, “నన్ను అనుసరించు” అని అతనితో అన్నాడు. 20పేతురు వెనక్కి తిరిగి యేసు ప్రేమించిన వాడూ, పస్కా పండగ సందర్భంలో భోజన సమయంలో ఆయన పక్కనే కూర్చుని ఆయన ఛాతీని ఆనుకుంటూ, “ప్రభూ నిన్ను పట్టిచ్చేది ఎవరు” అని అడిగిన శిష్యుడు తమ వెనకే రావడం చూశాడు. 21పేతురు అతణ్ణి చూసి, “ప్రభూ, మరి ఇతడి విషయం ఏమవుతుంది?” అని ఆయనను అడిగాడు. 22దానికి యేసు, “నేను వచ్చే వరకూ అతడు జీవించి ఉండడం నాకిష్టమైతే నీకేమిటి? నువ్వు నన్ను అనుసరించు” అన్నాడు. 23దాంతో ఆ శిష్యుడు మరణించడు అనే మాట శిష్యుల్లో పాకి పోయింది. అయితే అతడు మరణించడు అని యేసు చెప్పలేదు గానీ నేను వచ్చే వరకూ అతడు ఉండడం నాకిష్టమైతే నీకేంటి, అని మాత్రమే అన్నాడు. 24ఈ సంగతులను గురించి సాక్షమిస్తూ ఇవన్నీ రాసింది ఈ శిష్యుడే. ఇతని సాక్ష్యం సత్యమని మనకు తెలుసు. 25యేసు చేసిన పనులు ఇంకా చాలా ఉన్నాయి. అవన్నీ వివరించి రాసే గ్రంథాలకు ఈ భూలోకం సరిపోదని నాకు అనిపిస్తుంది.

పత్రిక

అపొ.కా 8:40–9:19

40అయితే ఫిలిప్పు అజోతు అనే ఊళ్ళో కనిపించాడు. అతడు ఆ ప్రాంతం గుండా వెళ్తూ కైసరయ వరకూ అన్ని ఊళ్లలో సువార్త ప్రకటించాడు. 9:1ప్రభువు శిష్యులను హతమారుస్తానని సౌలు యింకా బెదిరింపు మాటలు పలుకుతూ ప్రధాన యాజకుని దగ్గరికి వెళ్ళి 2యేసు మార్గాన్ని అనుసరించే పురుషులు గానీ స్త్రీలు గానీ తనకు దొరికితే, వారిని బంధించి యెరూషలేముకు తీసికొచ్చేలా దమస్కు ఊరి సమాజ మందిరాల వారికి ఉత్తరాలు రాసి ఇమ్మని అడిగాడు. 3అతడు ప్రయాణం చేస్తూ దమస్కు సమీపించే సరికి, అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించింది. 4అప్పుడతడు నేల మీద పడిపోయాడు. “సౌలూ, సౌలూ, నీవెందుకు నన్ను హింసిస్తున్నావు?” అనే ఒక శబ్దం విన్నాడు. 5“ప్రభూ, నీవెవరివి?” అని అతడు అడిగినప్పుడు, ప్రభువు, “నువ్వు హింసిస్తున్న యేసుని. 6లేచి పట్టణంలోకి వెళ్ళు, అక్కడ నీవేం చేయాలో అది నీకు తెలుస్తుంది” అని చెప్పాడు. 7అతనితో కూడా ప్రయాణించే వారు ఆ శబ్దం విన్నారు గాని మాటల్లేక నిలబడిపోయారు. వారికి ఏమీ కనబడలేదు. 8సౌలు నేలమీద నుండి లేచి కళ్ళు తెరచినా ఏమీ చూడలేకపోయాడు కాబట్టి వారతని చెయ్యి పట్టుకుని దమస్కులోకి నడిపించారు. 9అతడు మూడు రోజులు చూపు లేకుండా ఉన్నాడు. ఏమీ తినలేదు, తాగలేదు. 10దమస్కులో అననీయ అనే ఒక శిష్యుడున్నాడు. ప్రభువు దర్శనంలో, “అననీయా!” అని అతనిని పిలిచాడు. 11అతడు, “చిత్తం” అన్నాడు. అందుకు ప్రభువు, “నువ్వు లేచి, ‘తిన్ననిది’ అనే పేరున్న వీధికి వెళ్ళు. అక్కడ యూదా అనే అతని ఇంట్లో తార్సు ఊరి వాడైన సౌలు అనే మనిషి కోసం అడుగు. అతడు ప్రార్థన చేసుకుంటున్నాడు. 12దర్శనంలో అతడు అననీయ అనే వ్యక్తి లోపలికి వచ్చి అతడు చూపు పొందేలా తల మీద చేతులుంచడం చూశాడు” అని చెప్పాడు. 13అయితే అననీయ, “ప్రభూ, ఈ వ్యక్తి యెరూషలేములోని నీ ప్రజలకు ఎంతో కీడు చేశాడని అతని గురించి చాలామంది చెప్పారు. 14ఇక్కడ కూడా నీ నామంలో ప్రార్థన చేసే వారిందరినీ బంధించడానికి అతడు ప్రధాన యాజకుల నుండి అధికారం పొందాడు” అని జవాబిచ్చాడు. 15అందుకు ప్రభువు, “నీవు వెళ్ళు, యూదేతరుల ముందూ, రాజుల ముందూ, ఇశ్రాయేలీయుల ముందూ నా నామం భరించడానికి ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనం. 16ఇతడు నా నామం కోసం ఎన్ని బాధలు అనుభవించాలో నేనతనికి చూపిస్తాను” అని అతనితో చెప్పాడు. 17అననీయ వెళ్ళి ఆ ఇంట్లో ప్రవేశించి, అతని మీద చేతులుంచి, “సౌలా, సోదరా, నీవు వచ్చిన దారిలో నీకు కనబడిన ప్రభు యేసు, నీవు చూపు పొంది, పరిశుద్ధాత్మతో నిండేలా నన్ను నీ దగ్గరకి పంపాడు” అని చెప్పాడు. 18వెంటనే అతని కళ్ళ నుండి పొరల్లాంటివి రాలిపోగా అతడు చూపు పొంది, లేచి బాప్తిసం పొందాడు. తరువాత భోజనం చేసి బలం పుంజుకున్నాడు. 19అతడు దమస్కులో ఉన్న శిష్యులతో చాలా రోజులు గడిపాడు.

పత్రిక (పరిశుద్ధ యోహాను కోసం)

1 యోహా 1:1–7

1ఆది నుండి ఉన్న జీవ వాక్కును గురించి మేము విన్నదీ, మా కళ్ళతో చూసిందీ, దగ్గరగా గమనించిందీ, మా చేతులతో తాకిందీ మీకు ప్రకటిస్తున్నాం. 2ఆ జీవం వెల్లడైంది. తండ్రితో ఉండి ఇప్పుడు బయటకు కనిపించిన ఆ శాశ్వత జీవాన్ని మేము చూశాం కాబట్టి మీకు సాక్షమిస్తూ దాన్ని మీకు ప్రకటిస్తున్నాం. 3మీరు కూడా మాతో సహవాసం కలిగి ఉండాలని మేము చూసిందీ, విన్నదీ మీకు ప్రకటిస్తున్నాం. నిజానికి మన సహవాసం తండ్రితోను, ఆయన కుమారుడు యేసు క్రీస్తుతోను ఉంది. 4మీ ఆనందం సంపూర్తి కావాలని ఈ సంగతులు మీకు రాస్తున్నాం. 5దేవుడు వెలుగు. ఆయనలో చీకటి లేనే లేదు. దీన్ని మేము ఆయన దగ్గర విని మీకు ప్రకటిస్తున్నాం. 6మనకు ఆయనతో సహవాసం ఉందని చెప్పుకుంటూ, చీకటి మార్గంలో ఉంటే మనం అబద్ధం ఆడుతున్నట్టే. సత్యాన్ని ఆచరిస్తున్నట్టు కాదు. 7అయితే, ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనం వెలుగులో నడిస్తే, మనకు ఒకరితో ఒకరికి అన్యోన్యసహవాసం ఉంటుంది. అప్పుడు ఆయన కుమారుడు యేసు క్రీస్తు రక్తం మనలను ప్రతి పాపం నుండి శుద్ధి చేస్తుంది.

సువార్త

యోహా 6:48–54

48జీవాహారం నేనే. 49మీ పూర్వీకులు అరణ్యంలో మన్నాను తిన్నారు. అయినా చనిపోయారు. 50పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం ఇదే. దీన్ని తిన్నవాడు చనిపోడు. 51పరలోకం నుండి దిగి వచ్చిన జీవాన్నిచ్చే ఆహారం నేనే. ఈ ఆహారం ఎవరైనా తింటే వాడు కలకాలం జీవిస్తాడు. లోకానికి జీవాన్నిచ్చే ఈ ఆహారం నా శరీరమే.” 52యూదులకు కోపం వచ్చింది. “ఈయన తన శరీరాన్ని ఎలా తిననిస్తాడు” అంటూ తమలో తాము వాదించుకున్నారు. 53అప్పుడు యేసు వారితో ఇలా చెప్పాడు, “మీకు కచ్చితంగా చెబుతున్నాను. మీరు మనుష్య కుమారుడి శరీరాన్ని తిని ఆయన రక్తాన్ని తాగకపోతే మీలో మీకు జీవం ఉండదు. 54నా శరీరాన్ని తిని నా రక్తాన్ని తాగేవాడే నిత్యజీవం ఉన్నవాడు. అంత్యదినాన నేను అతణ్ణి లేపుతాను.

సువార్త (పరిశుద్ధ యోహాను కోసం)

యోహా 19:25–27; 21:24–25

25యేసు తల్లి, ఆయన తల్లి సోదరి, క్లోపా భార్య మరియ, మగ్దలేనే మరియ, యేసు సిలువ దగ్గర నిలుచుని ఉన్నారు. 26ఆయన తల్లి, ఆయన ప్రేమించిన శిష్యుడు దగ్గరలో నిలుచుని ఉండడం చూసి, యేసు తన తల్లితో, “అమ్మా, ఇదిగో నీ కొడుకు” అన్నాడు. 27తరువాత ఆ శిష్యునితో, “ఇదిగో నీ తల్లి” అన్నాడు. ఆ సమయంనుంచి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట్లో చేర్చుకున్నాడు. 21:24ఈ సంగతులను గురించి సాక్షమిస్తూ ఇవన్నీ రాసింది ఈ శిష్యుడే. ఇతని సాక్ష్యం సత్యమని మనకు తెలుసు. 25యేసు చేసిన పనులు ఇంకా చాలా ఉన్నాయి. అవన్నీ వివరించి రాసే గ్రంథాలకు ఈ భూలోకం సరిపోదని నాకు అనిపిస్తుంది.

తేదీలు రష్యన్ సంఘపు జూలియన్ కాలెండర్‌ను అనుసరిస్తాయి (సెర్బియన్, జార్జియన్ సంఘాలు, ఆథోస్ పర్వతం లాగే): సంఘ కాలెండర్‌లోని 8 మే పౌర కాలెండర్‌లో 21 మే. కొత్త కాలెండర్‌ను అనుసరించే సంఘాలు (గ్రీసు, రొమేనియా, బల్గేరియా, ఉక్రెయిన్…) స్థిర పండుగలనూ పరిశుద్ధులనూ పౌర తేదీనే, 13 రోజులు ముందుగా జరుపుకుంటాయి, వాటి కొన్ని పఠనాలు వేరుగా ఉంటాయి; ఈస్టర్, దానిపై ఆధారపడిన రోజులు ఒకటే.

మూలాలు: ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు · © 2017, 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings, the editors' parts and stage directions in the Song of Songs and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · మూలాలు మరియు హక్కులు