Bible Explorer యాప్ పొందండి

హోమ్ › రోజువారీ బైబిల్ పఠనాలు › ఫిబ్రవరి 2027 › 9 ఫిబ్రవరి

కాథలిక్ కాలెండర్

రోజువారీ బైబిల్ పఠనాలు (కాథలిక్) — 9 ఫిబ్రవరి, 2027

మంగళవారం · సామాన్య కాలం ఐదవ వారం

పండుగలు మరియు పరిశుద్ధులు

సామాన్య కాలం ఐదవ వారపు మంగళవారం

వారపు రోజు · ఆరాధన రంగు: ఆకుపచ్చ

ఈరోజు పఠనాలు

మొదటి పఠనం

ఆది 1:20–2:4

20దేవుడు “చలించే ప్రాణులు జలాల్లో కుప్పలు తెప్పలుగా నిండిపోవాలి. భూమిపై ఉన్న ఆకాశవిశాలంలో పక్షులు ఎగరాలి” అన్నాడు. 21దేవుడు బ్రహ్మాండమైన జలచరాలనూ, చలించే ప్రాణులన్నిటినీ వాటి వాటి జాతుల ప్రకారం పుష్కలంగా జలాలను నింపి వేసేలా సృష్టించాడు. ఇంకా వాటి వాటి జాతి ప్రకారం రెక్కలున్న ప్రతి పక్షినీ సృష్టించాడు. అది ఆయనకు మంచిదిగా కనబడింది. 22దేవుడు “మీరు ఫలించి వృద్ధి పొందండి. సముద్ర జలాలను నింపండి. పక్షులు భూమి మీద విస్తరించాలి” అని వాటిని దీవించాడు. 23రాత్రి అయింది. ఉదయం వచ్చింది-ఐదో రోజు. 24దేవుడు “వాటి వాటి జాతుల ప్రకారం ప్రాణం గలవాటిని, అంటే వాటి వాటి జాతి ప్రకారం పశువులను, పురుగులను, అడవి జంతువులను భూమి పుట్టించాలి” అన్నాడు. అలాగే జరిగింది. 25దేవుడు, వాటి వాటి జాతుల ప్రకారం అడవి జంతువులనూ వాటి వాటి జాతుల ప్రకారం పశువులనూ, వాటి వాటి జాతుల ప్రకారం నేలమీద పాకే ప్రతి పురుగునూ చేశాడు. అది ఆయనకు మంచిదిగా కనబడింది. 26దేవుడు ఇలా అన్నాడు. “మన స్వరూపంలో మన పోలికలో మనిషిని చేద్దాం. సముద్రంలో చేపల మీదా ఆకాశంలో పక్షుల మీదా పశువుల మీదా భూమి మీద పాకే ప్రతి జంతువు మీదా భూమి అంతటి మీదా వారికి ఆధిపత్యం ఉండాలి” అన్నాడు. 27దేవుడు తన స్వరూపంలో మనిషిని సృష్టించాడు. దేవుని స్వరూపంలో అతణ్ణి సృష్టించాడు. పురుషుడిగా స్త్రీగా వాళ్ళను సృష్టించాడు. 28దేవుడు వాళ్ళను దీవించి “మీరు ఫలించి, సంఖ్యలో వృద్ధి చెందండి. భూమి అంతటా విస్తరించి, భూమిని నింపి దాన్ని స్వాధీనం చేసుకోండి. సముద్రంలో చేపలనూ ఆకాశంలో పక్షులనూ మీదా భూమి మీద పాకే ప్రతి ప్రాణినీ పరిపాలించండి” అని చెప్పాడు. 29దేవుడు ఇంకా ఇలా అన్నాడు. “చూడండి, భూమిమీద ఉన్న విత్తనాలిచ్చే ప్రతి చెట్టును, విత్తనాలున్న ఫలాలు ఇచ్చే ప్రతి చెట్టును మీకు ఇచ్చాను. అవి మీకు ఆహారం అవుతాయి. 30భూమిమీద ఉండే జంతువులన్నిటికీ ఆకాశ పక్షులన్నిటికీ భూమి మీద పాకే జీవాలన్నిటికీ పచ్చని చెట్లన్నీ ఆహారం అవుతాయి” అన్నాడు. అలాగే జరిగింది. 31దేవుడు తాను చేసిందంతా చూసినప్పుడు అది ఆయనకు ఎంతో మంచిదిగా కనబడింది. రాత్రి అయింది. ఉదయం వచ్చింది-ఆరవ రోజు. 2:1ఆకాశాలు, భూమి, వాటిలో ఉన్నవన్నీపూర్తి అయ్యాయి. 2ఏడవ రోజు దేవుడు తాను చేసిన పని ముగించాడు. కాబట్టి తాను చేసిన పని అంతటి నుంచీ ఏడవ రోజున విశ్రాంతి తీసుకున్నాడు. 3దేవుడు ఆ ఏడవ రోజును ఆశీర్వదించి పవిత్రం చేశాడు. ఆయన తాను చేసిన సృష్టి కార్యం అంతటినుంచీ విశ్రాంతి తీసుకున్న కారణంగా ఆ రోజును పవిత్రపరిచాడు. 4దేవుడైన యెహోవా భూమిని ఆకాశాలను చేసినప్పుడు, ఆకాశాల సంగతి, భూమి సంగతి ఈ విధంగా ఉన్నాయి,

ప్రతిస్పందన కీర్తన

కీర్త 8:3–8

3నీ చేతి వేళ్ళు తయారు చేసిన నీ ఆకాశాలనూ, వాటి తావులలో నీవుంచిన చంద్రనక్షత్రాలనూ నేను చూసినప్పుడు, 4నువ్వు పట్టించుకోవడానికి మానవజాతి ఏ పాటిది? నువ్వు మానవాళి పట్ల శ్రద్ధ చూపడానికి వారు ఎంతటివాళ్ళు? 5అయినా, నువ్వు వాళ్ళను స్వర్గలోక ప్రాణులకన్నా కొంచెం మాత్రమే తక్కువగా చేశావు. వాళ్లకు మహిమా ప్రభావాల కిరీటం పెట్టావు. 6నీ చేతిపనుల మీద అతనికి పరిపాలన ఇచ్చావు. అతడి పాదాల కింద సమస్తమును ఉంచావు. 7గొర్రెలను, ఎడ్లను, అడవి మృగాలను సైతం, 8ఆకాశ పక్షులను, సముద్ర ప్రాణులను, సముద్ర ప్రవాహాల్లో తిరిగే వాటిని నువ్వు అతని పాదాల కింద ఉంచావు.

సువార్త

మార్కు 7:1–13

1యెరూషలేము నుండి వచ్చిన కొందరు పరిసయ్యులూ ధర్మశాస్త్ర పండితులూ యేసు చుట్టూ గుమికూడారు. 2వారు ఆయన శిష్యుల్లో కొందరు అశుద్ధమైన చేతులతో, అంటే ఆచార నియమం ప్రకారం చేతులు కడుక్కోకుండా భోజనం చేయడం గమనించారు. 3పరిసయ్యులే కాక యూదులందరూ పెద్దల సంప్రదాయం ప్రకారం తమ చేతులను ఆచారరీతిగా కడుక్కోకుండా భోజనం చేయరు. 4వారు బయట నుండి వచ్చినపుడు స్నానం చేయకుండా భోజనం చేయరు. గిన్నెలు, కుండలు, ఇతర ఇత్తడి పాత్రలు, భోజనపు బల్లలు సహా శుద్ధి చేయడం అనే అనేకమైన ఆచారాలను వారు కచ్చితంగా పాటిస్తారు. 5పరిసయ్యులు, ధర్మశాస్త్ర పండితులు యేసుతో, “మీ శిష్యులు పెద్దల సంప్రదాయాన్ని పాటించకుండా అశుద్ధమైన చేతులతో ఎందుకు భోజనం చేస్తున్నారు?” అని యేసును అడిగారు. 6యేసు వారితో, “‘ఈ ప్రజలు మాటలతో నన్ను గౌరవిస్తారు కాని, వారి హృదయం నాకు చాలా దూరంగా ఉంది. 7వారు మానవ కల్పితమైన నియమాలను దేవుని ఉపదేశంగా బోధిస్తారు కాబట్టి వారి ఆరాధన వ్యర్థం,’ అని కపట వేషధారులైన మిమ్మల్ని గురించి యెషయా ప్రవక్త ముందుగా పలికింది సరైనదే! 8మీరు దేవుని ఆజ్ఞలను తోసిపుచ్చి మనుషుల సంప్రదాయాలకు కట్టుబడుతున్నారు. 9మీ సంప్రదాయాలను పాటించడం కోసం దేవుని ఆజ్ఞలను మీరడంలో మీరు సిద్ధహస్తులు. 10మోషే, ‘మీ తల్లిదండ్రులను గౌరవించమనీ, తల్లిని, తండ్రిని దూషించిన వారికి శిక్ష మరణదండన’ అనీ నియమించాడు. 11కానీ మీరైతే, ఒక వ్యక్తి తన తల్లితో, తండ్రితో ‘నా వల్ల మీరు పొందదగిన సహాయమంతా ‘కొర్బాన్’ (అంటే దైవార్పితం)’ అని చెబితే 12ఇంక ఆ వ్యక్తి తన తల్లిదండ్రుల కోసం ఏమీ చేయనక్కర లేదని చెబుతారు. 13మీరు మీ పెద్దల సంప్రదాయాలను పాటించే నెపంతో దేవుని ఆజ్ఞ మీరుతున్నారు. ఇలాంటివి మరెన్నో మీరు చేస్తున్నారు.

సాధారణ రోమన్ కాలెండర్; ఒక బిషప్‌ల సమావేశం కొన్ని పండుగలను (దివ్యదర్శనం, పరలోకారోహణం, క్రీస్తు శరీర రక్తాల పండుగ) ఒక ఆదివారానికి మార్చవచ్చు లేదా తన సొంత పండుగలను జోడించవచ్చు. పఠన గ్రంథం: ఆదివారపు చక్రం B, వారపు రోజుల సంవత్సరం I.

మూలాలు: ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు · © 2017, 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings, the editors' parts and stage directions in the Song of Songs and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · మూలాలు మరియు హక్కులు