హోమ్ › రోజువారీ బైబిల్ పఠనాలు › జనవరి 2027 › 30 జనవరి
కాథలిక్ కాలెండర్
రోజువారీ బైబిల్ పఠనాలు (కాథలిక్) — 30 జనవరి, 2027
శనివారం · సామాన్య కాలం మూడవ వారం
పండుగలు మరియు పరిశుద్ధులు
సామాన్య కాలం మూడవ వారపు శనివారం
ఐచ్ఛిక స్మరణ దినం · ఆరాధన రంగు: ఆకుపచ్చ
శనివారం ధన్య కన్య మరియ స్మరణ దినం · ఐచ్ఛిక స్మరణ దినం
ఈరోజు పఠనాలు
మొదటి పఠనం
1విశ్వాసం అంటే ఒక వ్యక్తి నమ్మకంగా ఎదురు చూసే వాటిని గూర్చిన నిశ్చయత. కంటికి కనిపించని వాటి ఉనికి గూర్చిన నమ్మకం. 2మన పూర్వీకులు తమ విశ్వాసాన్ని బట్టి దేవుని ఆమోదం పొందారు. 8దేవుడు అబ్రాహామును పిలిచినప్పుడు అతడు విశ్వాసాన్ని బట్టి ఆ పిలుపుకు విధేయత చూపాడు. తాను వారసత్వంగా పొందబోయే స్థలానికి ప్రయాణమై వెళ్ళాడు. తాను ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండానే ప్రయాణం అయ్యాడు. 9విశ్వాసాన్ని బట్టి అతడు వాగ్దాన భూమిలో పరదేశిగా నివసించాడు. అతడు తనతోబాటు అదే వాగ్దానానికి వారసులైన ఇస్సాకు, యాకోబు అనే వారితో గుడారాల్లో నివసించాడు. 10ఎందుకంటే ఏ పట్టణానికి, దేవుడే రూప శిల్పిగా నిర్మాణకుడుగా ఉన్నాడో ఆ పునాదులు గల పట్టణం కోసం అబ్రాహాము ఎదురు చూస్తూ ఉన్నాడు. 11విశ్వాసాన్ని బట్టి అబ్రాహామూ, శారా ఎంతో వృద్ధాప్యంలో ఉన్నప్పుడు తమకు కుమారుడు కలుగుతాడని వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడని భావించారు కనుక శారా గర్భం ధరించడానికి శక్తి పొందింది. 12అందుచేత చావుకు దగ్గరైన ఈ వ్యక్తి నుండి లెక్క లేనంత మంది వారసులు పుట్టుకొచ్చారు. వారు ఆకాశంలో నక్షత్రాల్లాగా సముద్ర తీరంలో ఇసుక రేణువుల్లాగా విస్తరించారు. 13వీరంతా వాగ్దానాలు పొందకుండానే విశ్వాసంలో చనిపోయారు. కానీ దూరం నుండి వాటిని వీళ్ళు చూశారు. వాటికి స్వాగతం పలికారు. ఈ భూమి మీద తాము పరదేశులమనీ, అపరిచితులమనీ ఒప్పుకున్నారు. 14ఇలాంటి విషయాలు చెబుతున్న వారు తాము తమ స్వదేశాన్ని వెదుకుతున్నామని స్పష్టం చేస్తున్నారు. 15ఒకవేళ వారు తాము విడిచి వచ్చిన దేశాన్ని గూర్చి ఆలోచిస్తున్నట్టయితే తిరిగి ఆ దేశానికే వెళ్ళడానికి వారికి అవకాశం ఉంది. 16కానీ వారు మరింత శ్రేష్ఠమైన దేశాన్ని అంటే పరలోక సంబంధమైన దేశాన్ని కోరుకుంటున్నారు. వారి కోసం ఒక నగరాన్ని సిద్ధం చేసిన దేవుడు, తాను వారి దేవుడినని చెప్పుకోడానికి సిగ్గు పడడు. 17విశ్వాసాన్ని బట్టి అబ్రాహాము తీవ్ర పరీక్ష ఎదుర్కొని ఇస్సాకును బలిగా అర్పించటానికి సిద్ధం అయ్యాడు. 18“ఇస్సాకు నుండే నీకు వారసులు వస్తారు” అని ఈ ఇస్సాకును గూర్చి దేవుడు చెప్పాడు. 19దేవుడు ఇస్సాకును చనిపోయిన వారిలో నుండి లేపగలిగే సమర్ధుడని అబ్రాహాము భావించాడు. అలంకారికంగా చెప్పాలంటే చనిపోయిన వాణ్ణి తిరిగి పొందాడు.
ప్రతిస్పందన కీర్తన
69తన సేవకుడైన దావీదు వంశంలోనుంచి మన కోసం శక్తి గల రక్షకుణ్ణి తీసుకువచ్చాడు. 70మన శత్రువులబారి నుండీ మనలను ద్వేషించే వారందరి చేతినుండీ తప్పించి రక్షణ నిచ్చాడు. దీన్ని గురించి ఆయన ఆదినుంచి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికిస్తూ వచ్చాడు. ఆయన మన పూర్వీకులను కరుణించడానికీ తన పవిత్ర ఒడంబడికను, అంటే మన తండ్రి అయిన అబ్రాహాముకు తాను ఇచ్చిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకోవడానికీ ఈ విధంగా జరిగించాడు. 74మనం మన శత్రువుల చేతిలోనుంచి విడుదల పొంది, పరిశుద్ధంగా బతికినన్నాళ్ళు ఆయన సన్నిధానంలో, పవిత్రతతోను న్యాయప్రవర్తనతోను ఉంటూ, భయం లేకుండా ఆయనకు సేవ చేస్తాము అన్నదే, మన పూర్వీకుడైన అబ్రాహాముకు ఆయన చేసిన ప్రమాణం.
సువార్త
35ఆ రోజు సాయంత్రం ఆయన తన శిష్యులతో, “సరస్సు అవతలి ఒడ్డుకు వెళ్దాం పదండి” అన్నాడు. 36శిష్యులు జనసమూహాలను విడిచి యేసుతో పడవలో బయలుదేరారు. మరి కొన్ని పడవలు కూడా వారివెంట వచ్చాయి. 37అప్పుడు పెద్ద తుఫాను వచ్చింది. అలలు లేచి పడవను నీళ్ళతో నింపేశాయి. 38పడవ వెనుక భాగంలో యేసు తలకింద దిండు పెట్టుకుని నిద్రపోతూ ఉన్నాడు. శిష్యులు ఆయనను నిద్ర లేపి ఆయనతో, “బోధకా! మేము మునిగిపోతుంటే నీకేమీ పట్టదా?” అని అన్నారు. 39ఆయన లేచి గాలిని, సముద్రాన్ని గద్దిస్తూ, “శాంతించు! ఆగిపో!” అని ఆజ్ఞాపించాడు. వెంటనే గాలి ఆగిపోయింది. అంతా ప్రశాంతంగా మారింది. 40అప్పుడాయన శిష్యులతో, “మీరెందుకు భయపడుతున్నారు? మీలో ఇంకా విశ్వాసం కలగలేదా?” అని అన్నాడు. 41వారికి చాలా భయమేసింది. ఒకరితో ఒకరు, “ఎవరీయన? గాలి, సముద్రం సహా ఈయన మాటకు లోబడుతున్నాయే!” అని చెప్పుకుని ఆశ్చర్యపడ్డారు.
సాధారణ రోమన్ కాలెండర్; ఒక బిషప్‌ల సమావేశం కొన్ని పండుగలను (దివ్యదర్శనం, పరలోకారోహణం, క్రీస్తు శరీర రక్తాల పండుగ) ఒక ఆదివారానికి మార్చవచ్చు లేదా తన సొంత పండుగలను జోడించవచ్చు. పఠన గ్రంథం: ఆదివారపు చక్రం B, వారపు రోజుల సంవత్సరం I.
మూలాలు: ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు · © 2017, 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings, the editors' parts and stage directions in the Song of Songs and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · మూలాలు మరియు హక్కులు