Bible Explorer యాప్ పొందండి

హోమ్ › రోజువారీ బైబిల్ పఠనాలు › జనవరి 2027 › 20 జనవరి

ఆర్థడాక్స్ కాలెండర్ · జనవరి 7 (పాత శైలి)

ఆర్థడాక్స్ రోజువారీ పఠనాలు — 20 జనవరి, 2027

బుధవారం · పెంతెకొస్తు తర్వాత 34వ వారం · స్వరం 8

పండుగలు మరియు పరిశుద్ధులు

Afterfeast of the Theophany

ఉపవాస దినం

చేపలు అనుమతి

ఇది సన్యాస నియమాన్ని అనుసరిస్తుంది. సంఘంలో ఉపవాస పరిమాణాన్ని ఆరోగ్యం, వయస్సు మరియు పరిస్థితుల ప్రకారం తమ ఆత్మీయ గురువుతో కలిసి నిర్ణయిస్తారు.

ఈరోజు పఠనాలు

పత్రిక (ముందుగా వచ్చినవాని కోసం)

అపొ.కా 19:1–8

1అపొల్లో కొరింథులో ఉన్నప్పుడు జరిగిందేమంటే, పౌలు మన్య ప్రాంతాల్లో సంచరించి ఎఫెసుకు వచ్చినప్పుడు కొందరు శిష్యులు అతనికి కనిపించారు. వారిని, “మీరు నమ్ముకున్నప్పుడు పరిశుద్ధాత్మను పొందారా?” అని అడిగాడు. 2వారు, “అసలు పరిశుద్ధాత్మను గురించి మేము వినలేదు” అని చెప్పారు. 3అప్పుడు పౌలు, “అలాగైతే మీరు ఎలాంటి బాప్తిసం పొందారు?” అని అడగ్గా, వారు, “యోహాను బాప్తిసం” అని చెప్పారు. 4అందుకు పౌలు, “యోహాను తన వెనక వచ్చే వాడిలో, అంటే యేసులో విశ్వాసముంచాలని ప్రజలతో చెబుతూ, పశ్చాత్తాపం విషయమైన బాప్తిసమిచ్చాడు” అని చెప్పాడు. 5వారు ఆ మాటలు విని ప్రభువైన యేసు నామంలో బాప్తిసం పొందారు. 6తరువాత పౌలు వారి మీద చేతులుంచినపుడు పరిశుద్ధాత్మ వారి మీదికి వచ్చాడు. అప్పుడు వారు భాషలతో మాటలాడటం, ప్రవచించడం మొదలుపెట్టారు. 7వారందరూ సుమారు పన్నెండు మంది పురుషులు. 8తరువాత పౌలు సమాజ మందిరంలోకి వెళ్ళి ప్రసంగిస్తూ, దేవుని రాజ్యం గూర్చి తర్కిస్తూ, ఒప్పిస్తూ, ధైర్యంగా మాట్లాడుతూ మూడు నెలలు గడిపాడు.

పత్రిక

హెబ్రీ 5:11–6:8

11దీన్ని గురించి చెప్పాల్సింది ఎంతో ఉంది. అయితే వినడంలో మందకొడిగా ఉంటారు గనక మీకు వివరించడం కష్టం. 12ఈపాటికల్లా మీరు బోధకులుగా ఉండవలసింది కానీ దేవుని మాటల్లోని ప్రాథమిక సూత్రాలను మరొకడు ఇంకా మీకు బోధించాల్సి వస్తున్నది. మీరింకా పాలు తాగే దశలోనే ఉన్నారు కానీ బలమైన ఆహారం తినే శక్తి మీకు లేదు. 13కేవలం పాలు మాత్రమే తాగే ప్రతివాడూ పసివాడే కాబట్టి నీతికి సంబంధించిన విషయాల్లో అనుభవం లేని వాడుగా ఉన్నాడు. 14దీనికి భిన్నంగా, వయస్సు వచ్చిన పెద్దవారు తమ సాధకం చేత మంచి ఏదో, చెడు ఏదో వివేచించ గలిగి, మంచీ చెడూ తేడా తెలుసుకోవడంలో శిక్షణ పొంది ఉంటారు. అలాంటి వారికి పుష్టికరమైన ఆహారం కావాలి. 6:1కాబట్టి క్రీస్తు సందేశం గురించి ప్రారంభంలో మనం విన్న అంశాలను వదలి, మరింత పరిణతి సాధించే దిశగా సాగిపోదాం. నిర్జీవ క్రియల కోసం పశ్చాత్తాప పడటమూ, దేవునిపై విశ్వాసమూ, 2బాప్తీసాలూ, తలపై చేతులుంచడమూ, చనిపోయినవారు పునర్జీవితులు కావడమూ, నిత్య శిక్షా వంటి ప్రాథమిక అంశాలపై మళ్ళీ పునాది వేయకుండా ముందుకు సాగుదాం. 3ఒకవేళ దేవుడు అనుమతిస్తే అలా చేస్తాం. 4తమ జీవితాల్లో ఒకసారి వెలుగును పొందిన వారు, పరలోక వరాన్ని అనుభవించినవారు, పరిశుద్ధాత్మలో భాగం పొందినవారు దేవుని శుభవాక్కునూ, రాబోయే కాలం తాలూకు శక్తులనూ రుచి చూసిన వారు ఒకవేళ మార్గం విడిచి తప్పిపోతే వారిని తిరిగి పశ్చాత్తాప పడేలా చేయడం అసాధ్యం. 6ఎందుకంటే దేవుని కుమారుణ్ణి వారే మళ్ళీ సిలువ వేస్తూ ఆయనను బహిరంగంగా అపహాస్యం చేస్తున్నారు. 7ఇది ఎలాగంటే, నేల తరచుగా తనపై కురిసే వాన నీటిలో తడిసి తనను దున్నిన రైతులకు ప్రయోజనకరమైన పంటలనిస్తూ దేవుని దీవెనలు పొందుతుంది. 8అయితే ముళ్ళూ, ముళ్ళ పొదలూ ఆ నేలపై మొలిస్తే అది పనికిరానిదై శాపానికి గురి అవుతుంది. తగలబడిపోవడంతో అది అంతం అవుతుంది.

సువార్త (ముందుగా వచ్చినవాని కోసం)

యోహా 1:29–34

29మరుసటిరోజు యేసు యోహాను దగ్గరికి వచ్చాడు. ఆయనను చూసి యోహాను ఇలా అన్నాడు, “చూడండి, లోకపాపాన్ని తీసివేసే దేవుని గొర్రెపిల్ల! 30‘నా వెనక వచ్చేవాడు నాకు ముందే ఉన్నవాడు కాబట్టి ఆయన నాకంటే గొప్పవాడు’ అంటూ నేను ఎవరి గురించి చెప్పానో ఆయనే ఈయన. 31నేను ఆయనను గుర్తించలేదు, కానీ ఆయన ఇశ్రాయేలు ప్రజలకు వెల్లడి కావాలని నేను నీళ్ళలో బాప్తిసం ఇస్తూ వచ్చాను.” 32యోహాను ఇంకా సాక్షమిస్తూ, “ఆత్మ ఒక పావురంలా ఆకాశం నుండి దిగి వచ్చి ఆయనపై నిలిచి పోవడం చూశాను. 33నేను ఆయనను గుర్తు పట్టలేదు. కాని ‘ఎవరి మీద ఆత్మ దిగివచ్చి నిలిచిపోవడం చూస్తావో ఆయనే పరిశుద్ధాత్మలో బాప్తిసం ఇచ్చేవాడు’ అని నీళ్ళలో బాప్తిసం ఇవ్వడానికి నన్ను పంపినవాడు నాకు చెప్పాడు. 34ఈయనే దేవుని కుమారుడని నేను తెలుసుకున్నాను, సాక్షం ఇచ్చాను.”

సువార్త

లూకా 21:5–7, 10–11, 20–24

5దేవాలయాన్ని అందమైన రాళ్ళతోనూ, కానుకలతోనూ అలంకరించారని కొందరు మాట్లాడుకుంటూ ఉన్నారు. 6అప్పుడు ఆయన, “ఈ కట్టడాలను మీరు చూస్తున్నారు గదా, వీటిలో రాయి మీద రాయి నిలవకుండా పడదోసే రోజు వస్తుంది” అన్నాడు. 7అప్పుడు వారు, “బోధకా, ఇవి ఎప్పుడు జరుగుతాయి. ఇవి జరిగే ముందు ఏ సూచన కనిపిస్తుంది?” అని ఆయనను అడిగారు. 10ఆయన వారితో ఇంకా ఇలా అన్నాడు, “ఒక జాతి పైకి మరో జాతీ ఒక రాజ్యం పైకి మరో రాజ్యమూ దాడి చేస్తుంది. 11కొన్ని చోట్ల గొప్ప భూకంపాలూ కరువులూ ఈతిబాధలూ కలుగుతాయి. ఆకాశంలో భయంకరమైన ఉత్పాతాలూ గొప్ప సూచనలూ కనిపిస్తాయి. 20యెరూషలేమును సైన్యాలు ముట్టడించడం మీరు చూసినప్పుడు దాని నాశనం దగ్గర పడిందని తెలుసుకోండి. 21అప్పుడు యూదయలో ఉన్న వారు కొండలకు పారిపోవాలి. పట్టణంలో ఉన్నవారు బయటకు పోవాలి. గ్రామవాసులు దానిలో ప్రవేశించ కూడదు. 22ఎందుకంటే అవి పగ తీర్చుకునే రోజులు. రాసి ఉన్నవన్నీ నెరవేరేలా ఆ రోజులు వస్తాయి. 23ఆ రోజుల్లో గర్భవతులకూ బాలింతలకూ ఎంతో యాతన కలుగుతుంది. దేశంలో చాలా దురవస్థ కలుగుతుంది. ఈ ప్రజల పైకి ఉగ్రత దిగి వస్తుంది. 24వారు కత్తిపాలై చనిపోతారు. శత్రువులు వారిని చెరపట్టి యూదులు కాని అన్యజనాల్లోకి తీసుకువెళ్తారు. యూదేతర జాతులు తమ కాలాలు పూర్తి అయ్యేవరకూ యెరూషలేమును కాళ్ళ కింద తొక్కుతారు.

తేదీలు రష్యన్ సంఘపు జూలియన్ కాలెండర్‌ను అనుసరిస్తాయి (సెర్బియన్, జార్జియన్ సంఘాలు, ఆథోస్ పర్వతం లాగే): సంఘ కాలెండర్‌లోని 7 జనవరి పౌర కాలెండర్‌లో 20 జనవరి. కొత్త కాలెండర్‌ను అనుసరించే సంఘాలు (గ్రీసు, రొమేనియా, బల్గేరియా, ఉక్రెయిన్…) స్థిర పండుగలనూ పరిశుద్ధులనూ పౌర తేదీనే, 13 రోజులు ముందుగా జరుపుకుంటాయి, వాటి కొన్ని పఠనాలు వేరుగా ఉంటాయి; ఈస్టర్, దానిపై ఆధారపడిన రోజులు ఒకటే.

మూలాలు: ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు · © 2017, 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings, the editors' parts and stage directions in the Song of Songs and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · మూలాలు మరియు హక్కులు