Bible Explorer యాప్ పొందండి

హోమ్ › రోజువారీ బైబిల్ పఠనాలు › డిసెంబర్ 2026 › 5 డిసెంబర్

కాథలిక్ కాలెండర్

రోజువారీ బైబిల్ పఠనాలు (కాథలిక్) — 5 డిసెంబర్, 2026

శనివారం · ఆగమన కాలం మొదటి వారం

పండుగలు మరియు పరిశుద్ధులు

ఆగమన కాలం మొదటి వారపు శనివారం

వారపు రోజు · ఆరాధన రంగు: ఊదా

ఈరోజు పఠనాలు

మొదటి పఠనం

యెష 30:19–21, 23–26

19ఎందుకంటే యెరూషలేములోనే సీయోనులోనే ఒక జనం నివాసముంటారు. వాళ్లికపై ఏడవరు. నీ రోదన ధ్వనికి ఆయన కచ్చితంగా నిన్ను కరుణిస్తాడు. నువ్వు మొర్ర పెట్టినప్పుడు ఆయన నీకు జవాబు ఇస్తాడు. 20యెహోవా నీకు వైరాన్ని ఆహారంగా, వేదనను పానీయంగా ఇచ్చాడు. అయినా నీ బోధకులు నీకు ఇక మరుగై ఉండరు. నీకు ఉపదేశం చేసే వాళ్ళని నువ్వు చూస్తావు. 21మీరు కుడి వైపు గానీ ఎడమ వైపు గానీ తిరిగినప్పుడు “ఇదే మార్గం. దీనిలోనే నడవండి” అని వెనుక నుండి ఒక శబ్దాన్ని మీరు వింటారు. 23నువ్వు విత్తనాన్ని భూమిలో నాటినప్పుడు దానికి కావలసిన వర్షాన్ని ఆయన కురిపిస్తాడు. భూసారమైన ఆహారాన్ని విస్తారంగా నీకిస్తాడు. నీ పంటలు విస్తారంగా పండుతాయి. ఆ రోజున నీ పశువులు విశాలమైన పచ్చిక మైదానాల్లో మేస్తాయి. 24భూమిని సేద్యం చేయడానికి సహాయం చేసే ఎద్దులూ, గాడిదలూ పార, జల్లెడలతో చెరిగిన ధాన్యాన్ని మేతగా తింటాయి. 25గోపురాలు కూలి పోయే ఆ మహా సంహారం జరిగే రోజున ఎత్తయిన ప్రతి పర్వతం పైనా, ఎత్తయిన ప్రతి కొండ పైనా వాగులూ, జలధారలూ ప్రవహిస్తాయి. 26చంద్రుడి కాంతి సూర్య కాంతితో సమానంగా ఉంటుంది. సూర్య కాంతి ఏడు రెట్లు అధికంగా ప్రకాశిస్తుంది. యెహోవా తన ప్రజల గాయాలకి కట్లు కడతాడు. తాను చేసిన గాయాలను ఆయన బాగు చేస్తాడు.

ప్రతిస్పందన కీర్తన

కీర్త 147:1–6

1యెహోవాను స్తుతించండి. మన దేవుడైన యెహోవాను కీర్తిస్తూ గానం చేయడం మంచిది. అది మనోహరం. స్తోత్రగానం చేయడం ఎంతైనా తగినది. 2యెరూషలేమును కట్టేవాడు యెహోవాయే. చెదరిపోయిన ఇశ్రాయేలు ప్రజలను తిరిగి సమకూర్చేవాడు ఆయనే. 3గుండె చెదరిన వారిని బాగు చేసేవాడు, వాళ్ళ గాయాలు నయం చేసేవాడు ఆయనే. 4ఆకాశంలో నక్షత్రాలను వాటి స్థానంలో ఆయనే నియమించాడు. వాటిన్నిటికీ పేర్లు పెట్టింది ఆయనే. 5మన ప్రభువు గొప్పవాడు. ఆయన గొప్ప శక్తి సామర్ధ్యాలు గలవాడు. ఆయన జ్ఞానం అమితమైనది. 6యెహోవా దీన స్థితిలో ఉన్నవారిని ఆదరిస్తాడు. ఆయన దుష్టులను నేలమట్టం చేస్తాడు.

సువార్త

మత్తయి 9:35–10:1, 6–8

35యేసు వారి సమాజ మందిరాల్లో బోధిస్తూ రాజ్య సువార్త ప్రకటిస్తూ, అన్ని రకాల రోగాలనూ వ్యాధులనూ బాగుచేస్తూ అన్ని పట్టణాల్లో గ్రామాల్లో సంచారం చేశాడు. 36ఆయన ప్రజాసమూహాలను చూసి వారి మీద జాలి పడ్డాడు. ఎందుకంటే వారు కాపరి లేని గొర్రెల్లాగా నిస్పృహగా, చెదరిపోయి ఉన్నారు. 37ఆయన తన శిష్యులతో, “కోత చాలా ఎక్కువగా ఉంది. కానీ పని వారు తక్కువగా ఉన్నారు. 38కాబట్టి తన కోతకు కూలి వారిని పంపమని కోత యజమానిని బ్రతిమాలండి” అని తన శిష్యులతో చెప్పాడు. 10:1ఆయన తన పన్నెండు మంది శిష్యులను పిలిచి, అపవిత్రాత్మలను వెళ్ళగొట్టడానికి, అన్నిరకాల రోగాలనూ వ్యాధులనూ బాగుచేయడానికి వారికి అధికారం ఇచ్చాడు. 6ఇశ్రాయేలు వంశంలో దారి తప్పిన గొర్రెల దగ్గరకే వెళ్ళండి. 7వెళుతూ, ‘పరలోకరాజ్యం దగ్గర్లో ఉంది’ అని ప్రకటించండి. 8రోగులను బాగుచేయండి, చనిపోయిన వారిని లేపండి, కుష్టురోగులను శుద్ధి చెయ్యండి, దయ్యాలను వెళ్ళగొట్టండి. ఉచితంగా పొందారు, ఉచితంగానే ఇవ్వండి.

సాధారణ రోమన్ కాలెండర్; ఒక బిషప్‌ల సమావేశం కొన్ని పండుగలను (దివ్యదర్శనం, పరలోకారోహణం, క్రీస్తు శరీర రక్తాల పండుగ) ఒక ఆదివారానికి మార్చవచ్చు లేదా తన సొంత పండుగలను జోడించవచ్చు. పఠన గ్రంథం: ఆదివారపు చక్రం B, వారపు రోజుల సంవత్సరం I.

మూలాలు: ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు · © 2017, 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings, the editors' parts and stage directions in the Song of Songs and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · మూలాలు మరియు హక్కులు