Bible Explorer యాప్ పొందండి

హోమ్ › రోజువారీ బైబిల్ పఠనాలు › అక్టోబర్ 2027 › 14 అక్టోబర్

ఆర్థడాక్స్ కాలెండర్ · అక్టోబర్ 1 (పాత శైలి)

ఆర్థడాక్స్ రోజువారీ పఠనాలు — 14 అక్టోబర్, 2027

గురువారం · పెంతెకొస్తు తర్వాత 17వ వారం · స్వరం 7

పండుగలు మరియు పరిశుద్ధులు

Protection of Our Most Holy Lady Theotokos and Ever-Virgin Mary

ఉపవాసం

ఉపవాసం లేదు

ఇది సన్యాస నియమాన్ని అనుసరిస్తుంది. సంఘంలో ఉపవాస పరిమాణాన్ని ఆరోగ్యం, వయస్సు మరియు పరిస్థితుల ప్రకారం తమ ఆత్మీయ గురువుతో కలిసి నిర్ణయిస్తారు.

ఈరోజు పఠనాలు

సాయంకాల ప్రార్థన: పఠనం

ఆది 28:10–17

10యాకోబు బెయేర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెళ్తూ 11ఒకచోట పొద్దుగుంకడంతో అక్కడ ఆ రాత్రి ఆగిపోయి, అక్కడి రాళ్ళలో ఒక దాన్ని తనకు తలగడగా చేసుకుని, పడుకున్నాడు. 12అప్పుడతనికి ఒక కల వచ్చింది. అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలిపి ఉంది. దాని కొన ఆకాశాన్ని అంటింది. దానిమీద దేవుని దూతలు ఎక్కుతూ దిగుతూ ఉన్నారు. 13యెహోవా దానికి పైగా నిలబడి “నేను నీ తండ్రి అయిన అబ్రాహాము దేవుడు, ఇస్సాకు దేవుడు అయిన యెహోవాని. నువ్వు పండుకున్న ఈ భూమిని నీకూ నీ సంతానానికీ ఇస్తాను. 14నీ సంతానం భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల్లాగా అసంఖ్యాకంగా పెరిగిపోతుంది. నువ్వు పడమర, తూర్పు, ఉత్తరం, దక్షిణం దిక్కులకు వ్యాపిస్తావు. భూమి మీద వంశాలన్నీ నీ మూలంగా, నీ సంతానం మూలంగా ఆశీర్వాదం పొందుతాయి. 15ఇదిగో నేను నీకు తోడై ఉండి, నువ్వు వెళ్ళే ప్రతి చోటా నిన్ను కాపాడి ఈ దేశానికి నిన్ను మళ్ళీ రప్పిస్తాను. నేను నీతో చెప్పింది నెరవేర్చే వరకూ నిన్ను విడిచిపెట్టను” అని చెప్పాడు. 16యాకోబు నిద్ర మేలుకుని “నిశ్చయంగా యెహోవా ఈ స్థలం లో ఉన్నాడు. అది నాకు తెలియలేదు” అనుకున్నాడు. 17అతడు భయపడి “ఈ స్థలం ఎంతో భయం గొలిపేది. ఇది దేవుని మందిరమే గాని వేరొకటి కాదు.

సాయంకాల ప్రార్థన: పఠనం

యెహె 43:27–44:4

27ఆ రోజులు అయిన తరవాత ఎనిమిదో రోజు నుండి యాజకులు బలిపీఠం మీద మీ దహనబలులు, సమాధానబలులు అర్పించినప్పుడు నేను మిమ్మల్ని అంగీకరిస్తాను.” ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. 44:1ఆ మనిషి నన్ను తూర్పువైపు తిరిగి ఉన్న పరిశుద్ధ స్థలం బయటి ప్రవేశద్వారానికి తీసుకువచ్చాడు. ఆ గుమ్మం మూసి ఉంది. 2అప్పుడు యెహోవా నాతో ఈ మాట చెప్పాడు. “ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా ఈ గుమ్మంలో నుండి లోపలికి ప్రవేశించాడు కాబట్టి ఏ మనిషీ ప్రవేశింపకుండేలా అది గట్టిగా మూసి ఉంది. ఇక అది ఎన్నటికీ తీయకూడదు. 3ఇశ్రాయేలు పాలకుడు ఆహారం భుజించేటప్పుడు యెహోవా సన్నిధిలో అక్కడ కూర్చుంటాడు. అయితే అతడు ఈ ద్వారం వసారాగుండా ప్రవేశించి వసారా గుండా బయటికి వెళ్ళాలి.” 4తరవాత అతడు నన్ను ఉత్తర ప్రవేశద్వారం గుండా మందిరం ముందు భాగానికి తీసుకు వచ్చాడు. అంతలో మందిరం యెహోవా మహిమ తేజస్సుతో నిండి ఉండడం చూసి నేను సాగిలపడ్డాను.

సాయంకాల ప్రార్థన: పఠనం

సామె 9:1–11

1జ్ఞానం ఏడు స్తంభాలు చెక్కుకుని దానిపై తన నివాసం కట్టుకున్నది. 2పశువులను వధించి మాంసం, ద్రాక్షారసం, భోజన పదార్థాలు సిద్ధం చేసింది. 3తన దాసీల చేత మనుషులకు కబురంపింది. పట్టణంలోని ఉన్నత స్థలంపై నిలబడింది. 4“జ్ఞానం లేని వాళ్ళంతా ఇక్కడికి రండి” అని పిలుస్తున్నది. 5తెలివితక్కువ వాళ్ళతో ఇలా చెబుతుంది “రండి, వచ్చి నేను సిద్దం చేసిన ఆహారం తినండి. నేను కలిపి ఉంచిన ద్రాక్షారసం తాగండి. 6ఇకనుంచి జ్ఞానం కలిగి జీవించండి. తెలివి కలిగించే బాటలో సవ్యంగా నడవండి.” 7ఎగతాళి చేసేవాళ్ళకు బుద్ధి చెప్పేవాడు తన మీదకే నింద తెచ్చుకుంటాడు. దుష్టులను గద్దించే వాడికి అవమానం కలుగుతుంది. 8ఎగతాళి చేసేవాణ్ణి గద్దించవద్దు. వాణ్ణి గద్దిస్తే ఒకవేళ వాడు నీపై ద్వేషం పెంచుకుంటాడేమో. జ్ఞానం గలవాడికి హితవాక్కులు బోధిస్తే వాడు నిన్ను ప్రేమిస్తాడు. 9జ్ఞానం గలవాడికి బుద్ధి చెప్పినప్పుడు మరింత జ్ఞానం పొందుతాడు. న్యాయం జరిగించే వాడికి నీతి వాక్కులు బోధిస్తే వాడు తన జ్ఞానాన్ని వృద్ధి చేసుకుంటాడు. 10జ్ఞానం కలిగి ఉండడానికి మూలాధారం యెహోవా పట్ల భయభక్తులు కలిగి ఉండడమే. వివేకానికి ఆధారం పరిశుద్ధుడైన దేవుణ్ణి గూర్చిన తెలివి కలిగి ఉండడమే. 11నా మూలంగానే నువ్వు జీవించే కాలం పెరుగుతుంది. నువ్వు బతికే సంవత్సరాలు ఎక్కువ అవుతాయి.

ఉదయ ప్రార్థన: సువార్త

లూకా 1:39–49, 56

39ఇది జరిగిన కొద్దికాలానికే మరియ లేచి యూదయ మన్యంలో జెకర్యా ఉండే ఊరికి త్వరగా చేరుకుని ఇంట్లోకి పోయి ఎలీసబెతుకు వందనం చేసింది. 41ఎలీసబెతు ఆ అభివందనం వినగానే, ఆమె గర్భంలో బిడ్డ ఉల్లాసంగా కదిలాడు. అప్పుడు ఎలీసబెతు పరిశుద్ధాత్మతో నిండి గొంతెత్తి ఇలా అంది. 42“స్త్రీలలో నీవు ధన్యురాలివి. నీ గర్భఫలం దీవెన పొందినది. 43నా ప్రభువు తల్లి నా ఇంటికి రావడం నాకెంత భాగ్యం! 44నీ అభివందనం నా చెవిని పడగానే నా గర్భంలోని బిడ్డ ఆనందంగా గంతులు వేశాడు. 45ప్రభువు ఆమెకు వెల్లడి చేసినది తప్పక జరుగుతుందని నమ్మిన ఆమె ధన్యురాలు” అంది. 46అప్పుడు మరియ ఇలా అంది, “నా ఆత్మ ప్రభువును కీర్తిస్తున్నది. 47ఆయన తన దాసి దీనస్థితిని చూసి దయ చూపించాడు. 48నా ఆత్మ నా రక్షకుడైన దేవునిలో హర్షిస్తున్నది. సర్వశక్తిశాలి నాకు గొప్ప మేళ్ళు చేశాడు, కాబట్టి ఇది మొదలు అన్ని తరాలవారూ నన్ను ధన్యురాలు అంటారు. ఆయన నామం పవిత్రం. 56మరియ దాదాపు మూడు నెలలు ఆమెతో ఉండి, ఆ పైన తన ఇంటికి వెళ్ళిపోయింది.

పత్రిక (దైవజనని సంరక్షణ కోసం)

హెబ్రీ 9:1–7

1మొదటి ఒప్పందానికి కూడా భూమి మీద ఒక ఆరాధనా స్థలమూ, ఆరాధనకు సంబంధించిన నియమాలూ ఉన్నాయి. 2ఇది ఎలాగంటే, ప్రత్యక్ష గుడారంలో ఒక గదిని సిద్ధం చేశారు. ఇది వెలుపలి గది. దీనిలో ఒక బల్ల, సన్నిధిలో ఉంచే రొట్టెలు ఉంచారు. దీనినే పరిశుద్ధ స్థలం అని పిలిచారు. 3ఇక రెండవ తెర వెనుక మరో గది ఉంది. దీన్ని అతి పరిశుద్ధ స్థలం అని పిలిచారు. 4అందులో బంగారంతో చేసిన సాంబ్రాణి పళ్ళెం ఉంది. ఇక్కడ ఇంకా, బంగారం తొడుగు ఉన్న నిబంధన మందసం కూడా ఉంది. ఆ పెట్టెలో ఒక బంగారు పాత్ర, ఆ పాత్రలో మన్నా ఉంది. ఇంకా ఆ పెట్టెలో చిగిరించిన అహరోను కర్ర, నిబంధనకు సంబంధించిన రెండు రాతి పలకలు ఉన్నాయి. 5“కరుణా పీఠం” అని పిలిచే మందసం మూతను కప్పుతూ తేజస్సుతో నిండిన కెరూబుల ఆకృతులున్నాయి. వాటిని గూర్చి ఇప్పుడు వివరించడం సాధ్యం కాదు. 6వీటన్నిటినీ సిద్ధం చేశాక యాజకులు క్రమం తప్పకుండా ప్రత్యక్ష గుడారంలోని వెలుపలి గదిలోకి ప్రవేశించి తమ సేవలు చేస్తారు. 7కానీ ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే లోపలి రెండవ గదిలో ప్రవేశిస్తాడు. అయితే అలా ప్రవేశించడానికి ముందు తానూ, తన ప్రజలూ తెలియక చేసిన దోషాల కోసం బలి అర్పించి ఆ రక్తాన్ని చేతబట్టుకోకుండా ప్రవేశించడు.

సువార్త (దైవజనని సంరక్షణ కోసం)

లూకా 10:38–42; 11:27–28

38వారు ప్రయాణమై వెళ్తూ ఉన్నప్పుడు ఆయన ఒక గ్రామంలో ప్రవేశించాడు. అక్కడ మార్త అనే ఒక స్త్రీ ఆయనను తన ఇంట్లోకి ఆహ్వానించింది. 39ఆమెకు మరియ అనే సోదరి ఉంది. ఈమె యేసు పాదాల దగ్గర కూర్చుని ఆయన ఉపదేశం వింటూ ఉంది. 40మార్త ఎన్నో పనులు పెట్టుకుని తొందరపడుతూ ఆయన దగ్గరికి వచ్చి, “ప్రభూ, నా సోదరి నన్ను విడిచి ఇక్కడ కూర్చుంది, ఒక్కదాన్నే పనులన్నీ చేసుకోవలసి వస్తున్నది. నీకేం పట్టదా? వచ్చి నాకు సాయం చేయమని ఆమెకు చెప్పు” అంది. 41అందుకు ప్రభువు, “మార్తా, మార్తా, నువ్వు బోలెడన్ని పనులను గురించి తొందర పడుతున్నావు. కానీ అవసరమైంది ఒక్కటే. 42మరియ ఉత్తమమైన దాన్ని ఎంచుకుంది. దాన్ని ఆమె దగ్గరనుంచి తీసివేయడం జరగదు” అని ఆమెతో చెప్పాడు. 11:27ఆయన ఈ మాటలు చెబుతూ ఉండగా ఆ జన సమూహంలో ఉన్న ఒక స్త్రీ ఆయనను చూసి బిగ్గరగా, “నిన్ను మోసిన గర్భం, నువ్వు పాలు తాగిన స్తనాలూ ధన్యం” అని కేకలు వేసి చెప్పింది. 28దానికి ఆయన, “అది నిజమే కానీ దేవుని మాట విని దాని ప్రకారం జీవించేవారు ఇంకా ధన్యులు” అని చెప్పాడు.

తేదీలు రష్యన్ సంఘపు జూలియన్ కాలెండర్‌ను అనుసరిస్తాయి (సెర్బియన్, జార్జియన్ సంఘాలు, ఆథోస్ పర్వతం లాగే): సంఘ కాలెండర్‌లోని 1 అక్టోబర్ పౌర కాలెండర్‌లో 14 అక్టోబర్. కొత్త కాలెండర్‌ను అనుసరించే సంఘాలు (గ్రీసు, రొమేనియా, బల్గేరియా, ఉక్రెయిన్…) స్థిర పండుగలనూ పరిశుద్ధులనూ పౌర తేదీనే, 13 రోజులు ముందుగా జరుపుకుంటాయి, వాటి కొన్ని పఠనాలు వేరుగా ఉంటాయి; ఈస్టర్, దానిపై ఆధారపడిన రోజులు ఒకటే.

మూలాలు: ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు · © 2017, 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings, the editors' parts and stage directions in the Song of Songs and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · మూలాలు మరియు హక్కులు