Bible Explorer యాప్ పొందండి

హోమ్ › రోజువారీ బైబిల్ పఠనాలు › డిసెంబర్ 2026 › 8 డిసెంబర్

ఆర్థడాక్స్ కాలెండర్ · నవంబర్ 25 (పాత శైలి)

ఆర్థడాక్స్ రోజువారీ పఠనాలు — 8 డిసెంబర్, 2026

మంగళవారం · పెంతెకొస్తు తర్వాత 28వ వారం · స్వరం 2

పండుగలు మరియు పరిశుద్ధులు

Apodosis of the Entry of the Theotokos

క్రీస్తు జనన ఉపవాసం

ఉపవాసం: నూనెతో

ఇది సన్యాస నియమాన్ని అనుసరిస్తుంది. సంఘంలో ఉపవాస పరిమాణాన్ని ఆరోగ్యం, వయస్సు మరియు పరిస్థితుల ప్రకారం తమ ఆత్మీయ గురువుతో కలిసి నిర్ణయిస్తారు.

ఈరోజు పఠనాలు

పత్రిక

2 తిమో 3:16–4:4

16దేవుని సేవకుడు సిద్ధపడి ప్రతి మంచి పనినీ జరిగించడానికి పూర్తి సన్నాహంతో ఉండాలి. అందుకోసమే ప్రతి లేఖనం దైవావేశం వలన ఉనికిలోకి వచ్చింది. అది బోధించడానికీ, ఖండించడానికీ, తప్పు దిద్దడానికీ, నీతిలో శిక్షణ ఇవ్వడానికీ తోడ్పడుతుంది. 4:1దేవుని సమక్షంలో, తన ప్రత్యక్షత, తన రాజ్యం వచ్చేటప్పుడు బతికి ఉన్నవారికీ, చనిపోయినవారికీ తీర్పు తీర్చబోయే క్రీస్తు యేసు సమక్షంలో, నేను నిన్ను ఆదేశిస్తున్నాను. 2వాక్యాన్ని బోధించు, అనుకూలమైనా, కాకపోయినా సిద్ధంగా ఉండు. ఖండించినా, గద్దించినా, బుద్ధి చెప్పినా సంపూర్ణమైన సహనంతో ఉపదేశించు. 3ఎందుకంటే మనుషులు మంచి బోధను సహించలేని సమయం రాబోతోంది. దురద చెవులతో తమ స్వంత దురాశలకు అనుగుణంగా బోధించే వారిని పోగుచేసుకుని, 4సత్యం నుండి తొలిగిపోయి కట్టు కథల వైపు మళ్ళుతారు.

పత్రిక (దైవజనని కోసం)

హెబ్రీ 9:1–7

1మొదటి ఒప్పందానికి కూడా భూమి మీద ఒక ఆరాధనా స్థలమూ, ఆరాధనకు సంబంధించిన నియమాలూ ఉన్నాయి. 2ఇది ఎలాగంటే, ప్రత్యక్ష గుడారంలో ఒక గదిని సిద్ధం చేశారు. ఇది వెలుపలి గది. దీనిలో ఒక బల్ల, సన్నిధిలో ఉంచే రొట్టెలు ఉంచారు. దీనినే పరిశుద్ధ స్థలం అని పిలిచారు. 3ఇక రెండవ తెర వెనుక మరో గది ఉంది. దీన్ని అతి పరిశుద్ధ స్థలం అని పిలిచారు. 4అందులో బంగారంతో చేసిన సాంబ్రాణి పళ్ళెం ఉంది. ఇక్కడ ఇంకా, బంగారం తొడుగు ఉన్న నిబంధన మందసం కూడా ఉంది. ఆ పెట్టెలో ఒక బంగారు పాత్ర, ఆ పాత్రలో మన్నా ఉంది. ఇంకా ఆ పెట్టెలో చిగిరించిన అహరోను కర్ర, నిబంధనకు సంబంధించిన రెండు రాతి పలకలు ఉన్నాయి. 5“కరుణా పీఠం” అని పిలిచే మందసం మూతను కప్పుతూ తేజస్సుతో నిండిన కెరూబుల ఆకృతులున్నాయి. వాటిని గూర్చి ఇప్పుడు వివరించడం సాధ్యం కాదు. 6వీటన్నిటినీ సిద్ధం చేశాక యాజకులు క్రమం తప్పకుండా ప్రత్యక్ష గుడారంలోని వెలుపలి గదిలోకి ప్రవేశించి తమ సేవలు చేస్తారు. 7కానీ ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే లోపలి రెండవ గదిలో ప్రవేశిస్తాడు. అయితే అలా ప్రవేశించడానికి ముందు తానూ, తన ప్రజలూ తెలియక చేసిన దోషాల కోసం బలి అర్పించి ఆ రక్తాన్ని చేతబట్టుకోకుండా ప్రవేశించడు.

సువార్త

లూకా 17:26–37

26“నోవహు రోజుల్లో జరిగినట్టు గానే మనుష్య కుమారుడి రోజుల్లో కూడా జరుగుతుంది. 27నోవహు ఓడలోకి వెళ్ళిన రోజు వరకూ ప్రజలు తినడం తాగడం పెళ్ళిళ్ళకు ఇవ్వడం పుచ్చుకోవడం చేస్తూ ఉన్నారు. అప్పుడు జలప్రళయం వచ్చి అందర్నీ నాశనం చేసింది. 28లోతు రోజుల్లో జరిగినట్టుగా కూడా జరుగుతుంది. అప్పుడైతే ప్రజలు తింటూ తాగుతూ కొంటూ అమ్ముతూ నాట్లు వేస్తూ ఇళ్ళు కట్టుకుంటూ ఉన్నారు. 29అయితే లోతు సొదొమ విడిచి వెళ్ళిన రోజునే ఆకాశం నుండి అగ్ని గంధకాలు కురిసి అందరూ నాశనం అయ్యారు. 30“అలాగే మనుష్య కుమారుడు ప్రత్యక్షమయ్యే రోజున కూడా జరుగుతుంది. 31ఆ రోజున మేడ మీద ఉండేవాడు ఇంట్లో సామాను తీసుకుపోవడం కోసం కిందకు దిగకూడదు. అలాగే పొలంలో పని చేస్తున్న వాడు ఇంటికి తిరిగి రాకూడదు. 32లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి. 33తన ప్రాణాన్ని రక్షించుకోవాలనుకునేవాడు దాన్ని పోగొట్టుకుంటాడు. కానీ తన ప్రాణాన్ని పోగొట్టుకునేవాడు దాన్ని రక్షించుకుంటాడు. 34నేను చెప్పేదేమిటంటే ఆ రాత్రి ఒక మంచం మీద ఇద్దరు ఉంటే వారిలో ఒకరిని తీసుకుపోవడం, మరొకరిని విడిచి పెట్టడం జరుగుతుంది. 35ఇద్దరు స్త్రీలు తిరగలి విసరుతూ ఉంటారు. వారిలో ఒకామె వెళ్ళిపోవడం, మరొకామె ఉండిపోవడం జరుగుతుంది. ఇద్దరు పొలంలో పని చేస్తూ ఉంటారు. వారిలో ఒకడు వెళ్ళిపోతాడు. మరొకడు ఉండిపోతాడు.” 36అప్పుడు శిష్యులు, “ప్రభూ, ఇదంతా ఎక్కడ జరుగుతుంది” అని అడిగారు. 37దానికి జవాబుగా ఆయన, “శవం ఎక్కడ ఉంటే రాబందులు అక్కడ పోగవుతాయి” అన్నాడు.

సువార్త (దైవజనని కోసం)

లూకా 10:38–42; 11:27–28

38వారు ప్రయాణమై వెళ్తూ ఉన్నప్పుడు ఆయన ఒక గ్రామంలో ప్రవేశించాడు. అక్కడ మార్త అనే ఒక స్త్రీ ఆయనను తన ఇంట్లోకి ఆహ్వానించింది. 39ఆమెకు మరియ అనే సోదరి ఉంది. ఈమె యేసు పాదాల దగ్గర కూర్చుని ఆయన ఉపదేశం వింటూ ఉంది. 40మార్త ఎన్నో పనులు పెట్టుకుని తొందరపడుతూ ఆయన దగ్గరికి వచ్చి, “ప్రభూ, నా సోదరి నన్ను విడిచి ఇక్కడ కూర్చుంది, ఒక్కదాన్నే పనులన్నీ చేసుకోవలసి వస్తున్నది. నీకేం పట్టదా? వచ్చి నాకు సాయం చేయమని ఆమెకు చెప్పు” అంది. 41అందుకు ప్రభువు, “మార్తా, మార్తా, నువ్వు బోలెడన్ని పనులను గురించి తొందర పడుతున్నావు. కానీ అవసరమైంది ఒక్కటే. 42మరియ ఉత్తమమైన దాన్ని ఎంచుకుంది. దాన్ని ఆమె దగ్గరనుంచి తీసివేయడం జరగదు” అని ఆమెతో చెప్పాడు. 11:27ఆయన ఈ మాటలు చెబుతూ ఉండగా ఆ జన సమూహంలో ఉన్న ఒక స్త్రీ ఆయనను చూసి బిగ్గరగా, “నిన్ను మోసిన గర్భం, నువ్వు పాలు తాగిన స్తనాలూ ధన్యం” అని కేకలు వేసి చెప్పింది. 28దానికి ఆయన, “అది నిజమే కానీ దేవుని మాట విని దాని ప్రకారం జీవించేవారు ఇంకా ధన్యులు” అని చెప్పాడు.

తేదీలు రష్యన్ సంఘపు జూలియన్ కాలెండర్‌ను అనుసరిస్తాయి (సెర్బియన్, జార్జియన్ సంఘాలు, ఆథోస్ పర్వతం లాగే): సంఘ కాలెండర్‌లోని 25 నవంబర్ పౌర కాలెండర్‌లో 8 డిసెంబర్. కొత్త కాలెండర్‌ను అనుసరించే సంఘాలు (గ్రీసు, రొమేనియా, బల్గేరియా, ఉక్రెయిన్…) స్థిర పండుగలనూ పరిశుద్ధులనూ పౌర తేదీనే, 13 రోజులు ముందుగా జరుపుకుంటాయి, వాటి కొన్ని పఠనాలు వేరుగా ఉంటాయి; ఈస్టర్, దానిపై ఆధారపడిన రోజులు ఒకటే.

మూలాలు: ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు · © 2017, 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings, the editors' parts and stage directions in the Song of Songs and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · మూలాలు మరియు హక్కులు